12_001 తో. లే. పి. – జయ పీసపాటి

 

                       జయ కి భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అపారమయిన భక్తి, గౌరవం, ఆప్యాయత పుట్టుకతోనే సంక్రమించాయి. ఎలాగంటే, చిన్ననాటి నుండి, తను పెరిగిన వాతావరణం అందుకు సహకరించి, ప్రోత్సహిస్తూ తన వ్యక్తిత్వాన్ని ఆ విధం గా మలచినదని చెప్పవచ్చును. కాగా, వాటిని తన జీవితానికి అన్వయించుకుని, కాపాడుకుంటూ తదనుగుణంగా నడచుకోవడం ఆ అమ్మాయి లోని ప్రత్యేకత గా నేను భావిస్తున్నాను. జయ చాలాకాలం క్రిందటే సకుటుంబం గా హాంగ్‌కాంగ్ లో నివాసం ఏర్పరచుకుని స్థిరపడింది. జయ దంపతులకు సంతానం కుమారుడు, కుమార్తె. భర్త మెరైన్ ఇంజినీర్ — వీరి కుమారుడు హాంగ్‌కాంగ్ యూనివర్సిటీ లో ఉద్యోగం, అమ్మాయి చదువు సాగిస్తున్నారు. తాను తెలుగు భాష ను అక్కడ ఉన్న భారతీయులకు, తదితర దేశస్తులకు నేర్పుతూ ఆ భాషా సంస్కృతి, సాంప్రదాయ పరిరక్షణకు తన వంతు కృషి చేయడమే తన వృత్తి, ప్రవృత్తులుగా నిర్ణయించుకుంది. అంతే కాదు..  TORI తెలుగు రేడియో లో Radio Jockey ( RJ ) గా ఉంటూ జయభేరి, జై కిసాన్ వంటి కొన్ని తెలుగు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నది.  

 

జయ తో నాకు పరోక్షంగా పరిచయం ఏర్పడడానికి సూత్రధారులు మిత్రులు శిరాకదంబం అంతర్జాల పత్రిక వ్యవస్థాపకులు, సంపాదకులు అయిన శ్రీ శిష్ట్లా రామచంద్రరావు గారు, ఇంకా శిరాకదంబం పత్రిక లో జయ వ్యాసాలు. రామచంద్రరావు గారి పుణ్యమా అని వారిచ్చిన అవకాశంతో నేనూ చాలా కాలంగా ఈ పత్రికలో కొన్ని రచనలను చేయడం జరుగుతూ ఉంది. నిజానికి ఆ పత్రిక అనేక తెలుగు భాషాభిమానులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దగ్గర అవడానికి ఎంతగానో దోహదం చేస్తోంది. వీరిలో అనేకమంది రచయితలూ, రచయిత్రులు, చిత్రకారులు, సంగీతకారులు తదితర రంగాలకు చెందిన వారుండడం గమనార్హం. 

 

మా మధ్యన పరిచయం బలపడడానికి ముఖ్య కారణం మా అభిరుచులలో సామ్యం ఉండడం. తరువాత దీని ఆధారంగా ఫోను సంభాషణలు, సమావేశాలు జరుగుతూ ఉండడం. ఒకసారి.. చాలా ఏళ్ళ క్రిందట విజయవాడలోని శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు ప్రభుత్వ సంగీత కళాశాలలో జరిగిన కూచిపూడి నాట్య ప్రదర్శనను చూడడానికి నన్ను రామచంద్రరావు గారు తన స్కూటర్ మీద వెంటబెట్టుకుని వెళ్లారు. ఆనాడు ఆ కార్యక్రమంలో ప్రత్యేక అతిధి గా పాల్గొన్న జయమ్మ ఆ నాట్య సంస్థ కు పెద్ద మొత్తం లో విరాళాన్ని ప్రకటించి తన కళాభిమానాన్ని చాటుకున్నారు. ఆ కార్యక్రమ అనంతరం తొలిసారి గా నేను, జయమ్మ ని వేదిక పైన ప్రత్యక్షం గా కలవడం జరిగింది. మరి ఆ ముహూర్త  ప్రభావమో, మరేమిటో తెలియదు గాని – తదనంతరం మేము అప్పుడపుడు పలకరించుకోవడం కొనసాగుతూ వచ్చింది. 

 

ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒక పర్యాయం తాను సకుటుంబం గా విజయవాడ ఇంద్రకీలాద్రి పైన శ్రీ దుర్గామల్లీశ్వర స్వామి వారల దర్శనార్ధం రావడం జరిగింది. అప్పుడు శ్రమ అని భావించకుండా ఎంతో అభిమానం తో జయమ్మ, కుటుంబం బెంజ్ సర్కిల్ సమీపాన ఉన్న మా ఇంటికి వచ్చి కాసేపు ఆనందం గా గడపటం మా అందరికీ మరపురాని, మరువలేని తీపి జ్ఞాపకం.  మాట మనసులను కలుపుతుంది.. కలిపి ముడి వేస్తుంది.. అది నిజానికి భగవద్దత్తమయిన అమూల్య వరం. ఆ వర ప్రసాదాన్ని కాపాడుకుంటూ ఉండడం అందరి కర్తవ్యం !

 

ప్రస్తుతం అమెరికా లో ఉంటున్న నేను రెండు రోజుల క్రితమే హాంగ్‌కాంగ్ కి ఫోను చేసి అడిగాను జయమ్మని. ” అమ్మాయి.. ఈసారి తోక లేని పిట్ట ని ముస్తాబు చేసి పంపడం నీ కర్తవ్యం ” అంటూ….. 

తాను ఎంత పని భారం లో ఉన్నా నా మాటకు కాదనకుండా వెంటనే సానుకూలంగా స్పందిస్తూ ప్రత్యుత్తరం ఇచ్చింది తాను. ఎంతో అభిమానంతో, ఎంతో కాలం గా నేను మా అమ్మాయి గా భావించి తనని ” అమ్మాయి ” అని పిలవడం తానూ, నన్ను ” బాబాయి గారు ” అంటూ ఎంతో వాత్సల్యం గా పలకరిస్తూ ఉండడం, మెసేజ్ లను పంపుతూ ఉండడం – ఇవి మాకు ఒక అలవాటు గా మారాయి.    

 

మరి ఈనాడు శుభం పలకబోయే ముందుగా మీ ముందు ఈ తాజా తోక లేని పిట్ట ని పంజరం నుండి విడుదల చేసి ఉంచుతున్నాను. దయచేసి చిత్తగించండి….

 

                          <><><>*** ధన్యవాదము లు ~  నమస్కారములు ***<><><>

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾