12_003 ఆనందవిహారి

కూచిపూడి నాట్య విశిష్టత

కూచిపూడి నాట్య కళాకారులు నాట్యం ద్వారా సాంఘిక ప్రయోజనాలను సాధించారని డా. సి. ఉదయశ్రీ పేర్కొన్నారు. “కూచిపూడి నాట్య విశిష్టత” పేరిట ఆమె ప్రసంగాన్ని అమరజీవిపొట్టి శ్రీరాములు స్మారక సమితి సెప్టెంబర్ 10 వ తేదీ శనివారం సాయంత్రం అంతర్జాలం ద్వారా ప్రసారం చేసింది. నగరానికి చెందిన డా. గుమ్మడి రామలక్ష్మి కార్యక్రమానికి స్వాగతం పలికి వక్తను పరిచయం చేశారు. ఉదయశ్రీ మాట్లాడుతూ… ప్రకృతి అంతా దైవికమని, సృష్టి అంతా కళాత్మకమేనని అంటూ… మానవుడు సంతోషాన్ని కోరుకున్నప్పుడే కళ మొదలైందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రకృతిలోని జీవరాశుల నుంచే సంగీతం పుట్టిందని అమరకోశం పేర్కొన్నదన్నారు. 64 కళలలోని నాట్యం విషయానికొస్తే గీతం, నృత్యం, వాద్యం మూడు కలిస్తేనే నాట్యం అవుతుందన్నారు. నాట్యం అన్నా నాటకం అన్నా ప్రయోగానికి ఉద్దేశించిన రూపకమని నాట్యశాస్త్రకర్త భరతుడు పేర్కొన్నాడని చెప్పారు. నాటకం నాట్యంగా రూపుదిద్దుకున్న వైనం నుంచి బ్రహ్మ నాట్యమనే పంచమ వేదాన్ని సృష్టించడం వరకు పురాణాల ఆధారంగా వివరించారు. పలురకాల నాట్యాలు, వాటి ఉద్దేశ్యాలను గురించి చెప్పారు. భరతుడి నాట్యశాస్త్రానికి అన్ని విధాలా లక్ష్యమైన కూచిపూడి నాట్యం అత్యంత పురాతనమైనదని తెలిపే చారిత్రక ఆధారాలు ఉన్నాయని అంటూ…. ఆంధ్ర దేశంలో కూచిపూడి భాగవతులు, ఇతర భాగవతులని రెండు విధాల నాట్యమేళాల గురించి వక్త తెలిపారు. కలాపాలు, నృత్య నాటికల ఉదాహరణలిచ్చారు. కూచిపూడి అగ్రహారానికి చెందిన వంశాలను పేర్కొని, వాళ్ళు నాట్యం ద్వారా సాంఘిక ప్రయోజనాలను సాధించారని వెల్లడించారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూచిపూడి కళాకారులు సత్కరింపబడినట్లు దాన శాసనం ఉందన్నారు. కృష్ణదేవరాయలు స్వయంగా ఈ నాట్యాన్ని తిలకించినట్టు ఆయన రచించిన ఆముక్తమాల్యద ద్వారా తెలుస్తోందన్నారు. కూచిపూడి నాట్యంలోని నాటకీయత, అందులో వచ్చిన క్రమానుగత మార్పులను, అనేక నృత్యాంశాలను  అభినయ దర్పణం, ఆంధ్ర యాక్షగాన వాఙ్మయమ్ వంటి గ్రంథాల ఆధారంగా వివరించారు. తమ స్వర, సాహిత్య, నృత్య రచనలతో ఈ కళను పరిపుష్టం చేసిన సిద్ధేంద్ర యోగి తదితర మహానుభావులను పేర్కొన్నారు. 

వక్త ప్రసంగానికి ముందు, తరువాత కూడా ఆమె  వివిధ ప్రదేశాలలో చేసిన నాట్య ప్రదర్శనలోని కొన్ని భాగాలను ప్రదర్శించారు. 

ఈ కార్యక్రమ వీడియో ఈ క్రింద ….

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾