12_003 మాతృభాష

 

తే. గీ.     “ నే నెఱింగినభాష లన్నిటిలోన

            ఏది నా మాతృభాషయోయెఱుగు డనుచు

            క్రొత్తవా డొక్క డొకరాజుకొలువులోని

            పండితులవంక చూచి సవాలు చేసె !

 

 

ఆ. వె.     అన్నిభాషలందు అతనిపాండిత్య

            మొక్కరీతి మెఱయుచున్నకతన

            పచ్చివెలగకాయ వచ్చి గొంతున పడ్డ

            యట్టు లయ్యె పండితాళి కెల్ల !

 

 

ఆ. వె.     వారిలోనియుక్తిపరు డొక్క డెటులైన

            ఈరహస్య మెఱుగ నెంచినాడు !

            కడుపు నిండ మెక్కి గాఢ మౌనిద్రలో

            సోలుక్రొత్తవాని చూచినాడు !

 

 

తే. గీ.     రెండు పిల్లులు కాట్లాడు చుండినట్లు

            గుఱ్ఱు పెట్టుచు నున్నాడు క్రొత్తవాడు !

            కస్సునన్ డుస్సికొన వానికాలిలోన

            ఒక్కముల్లును గ్రుచ్చె నా యుక్తిపరుడు !

 

 

కం.        “ అమ్మయ్యో ! ౘచ్చితి‌_” నని

            అమ్మంౘము డిగ్గి యెగిరె నాపండితుడున్ ;

            “ అమ్మయ్యా ! తెలిసిన_” దని

            సమ్మదమున యుక్తిపరుడు ౘల్లగ నరిగెన్ !

 

 

తే. గీ.     ఎన్ని దేశాలు తిరిగిన – ఎన్ని భాష

            లేఱిగినను తల్లిభాషయే హృదయమునకు

            మఱియు దగ్గరిభాష ఆమాతృభాష

            నరు డనెడువాడు కలనైన మఱువలేడు !!

  

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾