12_003 ఆలస్యం..అమృతం..

 

నేస్తం!

ఎన్నాళ్లయిందో!

నీతో ఎప్పుడో చేసిన చెలిమి..

అవిశ్రాంతం గా దొర్లుతున్న.. కాలచక్రాల క్రింద నలిగిపోయింది.

జీవితపు విలువలు ఆలస్యంగా..

గుర్తిస్తున్న వేళ..

తలపులో మెదిలావు.

ఎక్కడున్నావ్?

 

నిత్యజీవన కర్మాగారంలో …

ఓ యంత్రాన్నై…

నీ వద్దకు రావడానికి…

నిన్ను కలవడానికి…

తీరిక లేక…

కాస్త విరామ సమయం కోసం..

ఎదురు చూస్తున్నా.

ఎక్కడున్నావ్?

 

ఒక్కసారి..

చిరపరిచితమైన ఆ చిరునవ్వును..

మళ్ళీ పలకరించాలి.

గాఢపరిష్వంగంలో..

స్నేహించడమే తెలిసున్న

ఆ మనసును హత్తుకోవాలి.

కలిసున్నప్పటి  జ్ఞాపకాల్ని తవ్వుకోవాలి.

వెనక్కు వెళ్ళి..

తిరిగి యవ్వనులమై..

ఆ నవ్వుల సవ్వడిలో..

తేలిపోవాలి.

వీలు చూసుకొని…

నిన్నోసారి కలవాలి.

ఎక్కడున్నావ్?

 

తెలిసింది నేస్తం!

తెలిసింది!

ఇన్ని వత్సరాల తరువాత

వెనక్కి చూసుకొని…

వీధీ, వాడా తిరిగాక..

వాడినీ… వీడినీ అడిగాక..

తెలిసింది నేస్తం…

నువ్వెక్కడున్నావో!

 

కాలం వేసిన కాటుకి…

కళ్ళు మూసి…

నిరాశాశ్రిత వ్యధలో నన్నొదిలావని  తెలిసింది !

తెలిసింది నేస్తం!

చూడాలంటే వెంటనే చూడాలని..

కలవాలంటే వెంటనే కలవాలని..

దానికి..

మీన మేషాలు లెక్కించకూడదనీ..

తెలిసింది!

 

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾