12_003 కన్యాశుల్కం – ఒక పరిశీలన 02

 

గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం – ఒక పరిశీలన ( 2 వ భాగం ).

 

నాటకం ఇతివృత్తం వరకూ వస్తే, అది రచన కు ముందే నిర్ణయం చేయబడింది కనక రచయిత కి ఎక్కువ స్వాతంత్ర్యం లేదు. కన్యాశుల్క దురాచార ఖండన ఇతివృత్తం అని చెప్పుకుంటూనే “హాస్య రస ప్రధాన మగు నాటకము” అనీ ఉప శీర్షిక పెట్టడం కొన్ని సందేహాలని రేకెత్తిస్తుంది. మొత్తం గా చూస్తే, నాటకం లో కన్యాశుల్కం, వయో వృద్ధులతో బాలికల కు వివాహం జరిపించడం అనే విషయాలని సౌజన్యా రావు వకీలు తప్ప విడిచి వేరెవరూ ఖండించరు. మిగతా పాత్రలకి కన్యాశుల్కం అసలు విషయమే కాదు. ముగింపు అర్ధాంతరం గా ఉంది అని మనకి ముందు అనిపించినా, అదే తార్కికమైన, సహజమైన ముగింపు అని మనకే అనిపిస్తుంది. రచయిత కి ఇంకో దారి ఉండదు. ముగింపు విషయం లో రచయిత ఆశక్తత పాఠకుల సానుభూతి ని సంపాదించుకుంటుంది. సందేశాత్మక నాటకాల లో లాగ సందేశం ప్రస్పుఠం గా ప్రస్తావన చేయబడదు. ముగింపు విషయం లోని ఈ బలహీనత వలన నాటక ప్రయోక్తలు తమ సౌకర్యార్ధం ముగింపు లో ప్రదర్శనానుకూలార్థం తమకు తోచిన మార్పులు చేసుకున్నారు.

నాటకం లో కధా పరిచయం స్టూలం గా….

* కృష్ణారాయపుర అగ్రహారం కాపురస్థుడూ, జటాంత స్వాధ్యాయి, వేదం 84 పన్నాలూ ఒక్క దమ్మిడీ ఖర్చు లేకుండా చదువుకున్న, “ఈ రెయుళ్ళూ, గియుళ్ళూ, యావత్తూ మన వేదాల్లో ఉన్నాయష” అనే విషయాన్ని బలం గా నమ్మిన నులక అగ్నిహోత్రావధానులు గారి కి బుచ్చమ్మ, సుబ్బి, అనే ఇద్దరు కుమార్తెలు, వేంకటేశం అనే కుమారుడు, అనుకూలవతి అయిన భార్య వెంకమ్మా, నాటకాలు వేసే కరటక శాస్త్రి అనే బావమరిది, అతని శిష్యుడు ఉంటారు.

* పెద్ద కుమార్తె బుచ్చమ్మ కి కన్యాశుల్కం తీసుకుని ఒక వయోవృద్ధుడి తో వివాహం జరిపించగా ఆమె చిన్న వయసులోనే వైదవ్యం పొంది పుట్టింటికి చేరుతుంది. కొడుకు వెంకటేశం ఇంగ్లీష్ చదువు నిమిత్తం, విజయనగరం లో గిరీశం పంతులు గారి దగ్గర హయ్యర్ ఫారం పరీక్ష లకి తర్ఫీద్ అవుతూ ఉంటాడు. గిరీశం పంతులు గారు అప్పటికే తన అర కొర చదవూ, బొట్లేరు ఇంగ్లీషూ, బతకడానికి అట్టే పనికి రావని గ్రహించి, వైదవ్యం పొందిన పూటకూళ్ళమ్మింట్లో దప్పిక్కి చేరి ఆవిడకి అరవ చాకిరీ చేస్తూ, వేంకటేశం లాంటి వారికి చదువు చెప్పే మిష తో డబ్బు దండుకుంటూ, మధుర వాణి అనే వేశ్య ని ఇంగ్లీషు చదువు నేర్పే నెపం తో తన ఇలాఖా లో పెట్టుకుంటాడు. గిరీశానికి, మధురవాణి తో ఉన్న సంబంధం పూటకూళ్ళమ్మకి నచ్చదు.

* గిరీశం ఆర్ధిక పరిస్థితి ని గమనించిన మధురవాణి రామప్పంతులు ఇలాఖా లోకి మారే ప్రయత్నం లో ఉంటుంది. రామప్పంతులు రామాపురం ప్రాంతానికి చెందిన లౌక్యుడు ఆస్తి అంతా సున్నా చుట్టేసి ఊళ్ళో వాళ్ళ జుట్లు ముడి వేస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఇతను గిరీశం పెద తల్లి కొడుకు. అదే గ్రామ కాపురస్తుడు లుబ్దావద్దాన్లు అనే ఆయనకి పుత్ర సంతానం లేదు. కూతురు మీనాక్షి వయసులోనే వైదవ్యం పొందింది. రామప్పంతుల దృష్టి అవధాని ఆస్తి మీద, మీనాక్షి మీద ఉంటుంది. మీనాక్షి వశం అవుతుంది. గిరీశం కూడా బంధుత్వం ఉంది కనక తనని దత్తత చేసుకొమ్మని అవధానిని కోరుతు వుంటాడు. వీళ్లందర్నీ అవధాన్లు దూరం గా పెడుతూ ఉంటాడు. ఆసిరి గాడు వీరి ఇంటి నవుకరు.

* వీరు కాక, వకీలు సౌజన్యా రావు పంతులు, పూజారి గవరయ్య, సిద్ధాంతి, హెడ్డు, ఇనస్పెక్టరు, సుబ్బిశెట్టి, పోలిగాడు, సిపాయి, సారా వ్యాపారి, హఠ యోగీ, జోగినీ, నాయుడు వకీలు, మునిసిఫ్ జడ్జి మొదలైన వారు ప్రధాన పాత్ర ధారులు గా కధ లో ఉంటారు.

* ఊళ్ళో గొడవలూ, బాకీలూ లావై ఇహ ఆబోరు దక్కక పోవడం, వెంకు పంతులు గారి కోడలికి లౌ లెటర్ రాసి పట్టుబడడం, పూటకూళ్ళమ్మకి, మధురవాణి విషయం లో అనుమానాలు రావడం మొదలైన కారణాల తో శిష్యుడు అయిన వేంకటేశానికి కిసిమిస్ సెలవుల్లో చదువు చెప్పే మిష తో గిరీశం, విజయనగరం నుంచి కృష్ణరాయపుర అగ్రహారానికి బిచాణా ఎత్తేయడం తో కధ మొదలవుతుంది. విజయనగరం వదిలే ముందు ఆఖరిసారి గా మధురవాణిని కలవడానికి వెళ్లిన గిరీశం, ఆమె తో మాట్లాడు తుండగా అతన్ని వెతుక్కుంటూ అక్కడకి చీపురు కట్ట తో పూటకూళ్లమ్మ రావడం తో మధుర వాణి సలహా మేరకు మంచం క్రింద దూరి అక్కడ ఆమె, అప్పటికే దాచి ఉంచిన రామప్పంతుల్ని చూసి, విషయం గ్రహించి, అతని నెత్తి న చరచి, పూట కూళ్ళమ్మ బారి నుంచి నేర్పుగా తప్పించుకుని పారిపోయి శిష్యుడు వేంకటేశం తో కృష్ణ రాయపురం అగ్రహారానికి ప్రయాణం కడతాడు. ఇక్కడి దాకా కధ విజయనగరం లోని బొంకుల దిబ్బ, అయ్యకోనేరు ప్రాంతాలలో జరుగుతుంది.

* గురుశిష్యులు కృష్ణరాయపురం ఇంటికి చేరుకునే సరికి అక్కడ వెంకటేశం తండ్రి అగ్ని హోత్రావధాని, కొడుకు చదువు కోసం చాలా ధనం వ్యయం చేశాననీ, ఇహ పై దమ్మిడీ కూడా ఇవ్వననీ, వేంకటేశం పెళ్ళి ఖర్చులు తట్టుకోవడానికి, చిన్న కుమార్తె సుబ్బిని రామాపురం కాపురస్తుడు అయిన లుబ్దావదాన్లు గారికి ఇచ్చి వివాహం చేస్తాను అనీ చెప్పగా, అతని భార్య కంట నీరు పెట్టుకుని తనతో చెప్పకుండానా? అని అనగా “ఆడ ముండల తో నా ఆలోచన? ఈ సంబంధం చేయక పోతే నేను బారిక రావుణ్ణే “అని శపధం చేసి సముదాయించ బోయిన గిరీశం పంతుల్ని తిట్టుకుంటూ అగ్నిహోత్రావధానులు ఇంటి లోపలికి వెడతాడు. కంట నీరు చిందిస్తూ “అన్నయ్యా నువ్వే ఎలాగైనా ఈ సంబంధం తప్పించాలి, లేకపోతే నేను నూతి లోకి దూకుతాను,” అన్న చెల్లిని, అన్న కరటక శాస్త్రి ఊరడిస్తాడు. ఇదీ కధా ప్రారంభం.

* చెల్లెల్ని ఊరడించిన కరటక శాస్త్రి తన నాటక రంగ అనుభవాన్ని నమ్ముకుని, తన శిష్యుడికి ఆడపిల్ల వేషం వేసి తాను కత్తెర మీసం, గడ్డం పెట్టుకుని, గుంటూరు ప్రాంతపు శాస్త్రి గా అవతారం ఎత్తి, తన పాత స్నేహితురాలైన మధురవాణి సహాయం తో, (రామప్పంతులనీ, హెడ్డు నీ, సిద్దాంతి నీ, గవరయ్యనీ మచ్చిక చేసుకుని) ఆడపిల్ల వేషంలో ఉన్న శిష్యుడిని, అగ్నిహోత్రావధానుల గారి సుబ్బి కన్నా తక్కువ కన్యాశుల్కానికి అంట గట్టి, పెళ్ళి ఐన నాలుగు రోజులకి వేషాలు మార్చి పారిపోవచ్చని, ఈ గొడవల మూలంగా సుబ్బి పెళ్ళి తప్పి పోతుంది అని ఆలోచించి పధకం వేస్తాడు.    

తరువాయి వచ్చే సంచికలో….

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾