ఓ మానవులారా! ఒక్కసారి శ్రీకృష్ణనామాన్ని ఔషధంగా సేవించండి. అది అమృతత్వాన్ని పొందిస్తుంది. రెండక్షరముల ఈ చిన్నిమాట అంతటి భవరోగాన్ని పోగొట్టగలదా! అని సందేహిస్తున్నారా! అబ్బే దాని శక్తి అమేయం. స్వప్రకాశమూ, జ్ఞానానంద స్వరూపమూ అయిన భగవానుడే అ నామం. అందుకే నిత్యం తనలో చేర్చి ఉంచుకుంటుంది. మహాయోగులైన యాజ్ఞవల్క్యాది మహామునులు కనిపెట్టి సేవించి తరించిన మందు ఈ కృష్ణాఖ్యమనే మందు.
శరీరం రోగగ్రస్థమైతే ఒక్కమందు చాలకపోవచ్చు. కానీ భవరోగం పోగొట్టుకోవడానికి మాత్రం రెండక్షరాల ‘‘కృష్ణ’’ నామం చాలు. కొండంత దూది మేటినైనా భస్మం చెయ్యడానికి చిన్నఅగ్గికణం చాలుకదా! అలాగే అనేక జన్మ పరంపరల నుండి వెన్నాడి వస్తున్న అవిద్యను పోగొట్టే కృష్ణనామము ‘‘స్వప్రకాశము’’ జ్ఞానానందరూపము. సాక్షాత్తూ అది భగవానుని నామమే! ఓ జనులారా! ఒక్కసారి (ఒక్కమోతాదు) ఆ నామరసాయనాన్ని వాడి చూడండి! శాశ్వతానందాన్ని పొందగలరు. అంటారు కులశేఖరులు.
ఈ విషయం తెలిసిన అన్నమయ్య అంటారు.
అన్నిటికీ పరమౌషధము
వెన్నుని నామమువిమలౌషధము
ఇంకా..
ఇలనిదియే భజియింపగ పుణ్యులు చెలగి తలప సంజీవనియాయె ॥
అని అన్నమయ్య అంటే` రామదాసు ఈ మందు గురించి…
కమాస్ రాగం ` ఏకతాళం
ప॥ రామజోగి మందు కొనరే ` ఓ జనులారా ॥
అ.ప. రామ జోగి మందు మీరు ` ప్రేమతో భజించరయ్యా
కామక్రోధలోభములెల్ల కడకు పారద్రోలే మందు ॥
చ. కాటుకకొండల వంటి కర్మము లెడబాపే మందు
సాటిలేని భాగవతులు స్మరణ చేసి తలచే మందు ॥ రామ ॥
మేమంతా ఈ నామామృతమనే ఔషధసేవనం వల్లనే పరమాత్మను పొంద గలిగాం! మీరూ సేవించండి, మీరూ తరించండి అంటారు ఈ భాగవతోత్తములంతా.
‘‘ పిబరే రామరసం రసనే పిబరే రామరసం ॥
జనన మరణ భయశోకవిదూరం శుకశౌనకకౌశిక ముఖపీతం ॥
ఇది మందేకాదు. అమృతం కూడా అంటారు సదాశివబ్రహ్మేంద. దీనిని సేవించడం వల్ల భగవరోగము శాశ్వతముగా తొలగిపోగలదు. ఆ మందు ప్రకాశవంతము. అద్వితీయమూ కూడా! ఆ కృష్ణామృతం, ఆ ఔషధం ‘‘శ్రీహరి పాద తీర్ధమే!’’
శ్రీహరి పాదతీర్ధంబే చెడని మందు
మోహపాశాలగోసీ మోక్షమిచ్చే మందు
కారమై కంటగించనీ కడు చల్లని మందు
నూరని కాచని యట్టి నున్నని మందు
పంకజాక్ష వేంకట రమణ ప్రసన్నుని మందు
శంకించక తన దాసుల చేపట్టే మందూ ॥ శ్రీహరి ॥
కృష్ణా అంటూ మనసారా భావించి, నోరారా ఉచ్ఛరించగానే మనదైన భవరోగం పటాపంచలుకాగలదు. అందుకే ఏమరక సేవించండి అని నొక్కి మరీ చెబుతున్నారు మహారాజు. ప్రసూతి మరణవ్యాధికి కృష్ణాఖ్యమనే మందు చెప్పి, తన ప్రజలకు ఈ సంసార సాగరం తరించడానికి ఉపాయం చెబుతాను వినండి అంటూ హితం పలుకున్నారు.
ఇప్పటివరకూ భక్తికి ప్రతిబంధకాలయిన వాటిని గురించి చెప్పి వాటి నుండి రక్షణ కోరుకుని, బలవత్తరమైన ఇంద్రియాలకు నచ్చజెప్పి భగవదున్ముఖం చేయమని కోరి, ఆ పై ప్రసూతి మరణవ్యాధికి కృష్ణామృతమనే మందును సేవించమని చెప్పి, ఓ జనులారా వినండీ మీకు పరమహితమైన విషయం చెబుతానంటూ అష్టాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశించారు.
ఓ పుండరీకాక్షా! మా జీవితమంతా నీ చరణ ద్వంద్వములందు ఏకాగ్ర చిత్తులమై ధ్యానానందాన్ని అనుభవిస్తూనే గడిచిపోయేలా అనుగ్రహించు తండ్రీ!
హేమర్త్యాః పరమం హితం
శ్రుణుత వోవక్ష్యామి సంక్షేపతః
సంసారార్ణవ మాపదూర్మిబహుళం
సమ్యక్ప్రవిశ్య స్థితాః
నానాజ్ఞాన మపాస్య చేతసి
నమో నారాయణాయే త్యముం
మంత్రం సప్రణవం ప్రణామసహితం
ప్రావర్త యధ్వం ముహుః
మరణశీలురైన ఓ మానవులారా! ఆపదలనే కెరటాలతో నిండిన సంసారం అనే సముద్రంలో మునిగియున్న ఓ జనులారా! దీని నుండి తరించడానికి ఒక సులభమైన ఉపాయం చెబుతాను వినండి. ముందు తన స్వరూపమేమిటి ? తాను దేనిని పొందాలి? ఈ జన్మపరంపరలను వారించుకోవడానికి ఉపాయమేది? అనే విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. ‘నారములు’ అంటే నిత్యమైన పదార్ధములు అని అర్ధం. జ్ఞానానంద అమలత్వాదులూ, జ్ఞానశక్త్యాదులూ, వాత్సల్య సౌశీల్యాదులు మొదలగునవి నిత్యములు. వీనికి ఆశ్రయమగువాడు నారాయణుడు. కేవలం మరణించడాని కోసం పుట్టడం లేదు మనం. అందులోనూ దుర్లభమైన మానవజన్మ! విచక్షణా జ్ఞానం కల్గిన మానవజన్మ కేవలం జరామరణరూపం మాత్రమే కారాదు. ఈ మానవజన్మ ద్వారా పరమాత్మను పొందగలం ప్రయత్నిస్తే అందుకు ఏది ఉపాయం అని చింతిస్తున్నారా? దిగులు వద్దు. కర్మా? భక్త్యా? జ్ఞానమా? ఏది సులభం? ఏది ఆచరణీయం? అనుకుంటూ కాలయాపన వద్దు. ఇదుగో ఈ మంత్రాన్ని జపించండి మరవకుండా. ఈ విశ్వంలో సర్వపదార్థాలూ బ్రహ్మాత్మకాలే! చేతనం కలిగిన, అచేతనములైన, పదార్ధాలన్నింటిలోనూ కూడా ఆ పరమాత్మే ఉన్నాడు. అటువంటి పరబ్రహ్మకు ‘‘నారాయణ’’ అని పేరు.
చెప్పదగిన విషయం హితము, ప్రియము అని రెండు విధాలు. తాత్కాలికముగా మనసుకు నచ్చినా, శాశ్వతంగా, స్ధిరంగా మేలు ‘‘కల్గించనిది’’ ప్రియము. ‘‘స్థిరమైన మేలు కల్గించేది హితం’’. మహారాజు ప్రజల మేలు కోరి ‘‘పరమ హితం’’ వక్ష్యామి = చెబుతాను, శృణుత = వినండి. అంటూ…
నారాయణుని కన్న భిన్నమైన పదార్ధం ఈ సృష్టిలో మరొక్కటి లేదు. ‘‘ఏకమేవా ద్వితీయం బ్రహ్మ’’. ఆ విషయం తెలిసీ, ఆ పరతత్వాన్ని భావించడానికి ఈ శరీరం సాధనంగా, ఆ స్వామికి ఈ శరీరం నిలయమని గుర్తించి` ఓం నమో నారాయణాయ’’ అనే మంత్రాన్ని జపిస్తూ, పరమాత్మ సర్వవ్యాపకత్వాన్ని మనసా భావిస్తూ, శరీరంతో నమస్కరిస్తూ, మరలా మరలా ఉచ్ఛరించండి. అది మీకు పరమహితకారిణి కాగలదు. అంటారు శ్రీకులశేఖరులు అందుకే …
ప॥ నారాయణా నిన్ననామదస్మరణయ సారావృత వెన్న నాలికెబరలి
అ.ప. కష్టదల్లిరది ఉత్తిష్టదల్లిరది హెష్టాదరుమదికెట్టువరలి
కృష్ణాకృష్ణా యంభో ఇష్టరుహేళువ అష్టాక్షర మహామంత్రదనామవ
నారాయణా! అమృతతుల్యమైన నీ నామాన్ని నా నాలుక అనుక్షణం జపించి రుచి చూచును గాక! సుఖాలలోనూ, కష్టాలలోనూ కూడా కృష్ణా అనే నీ నామాన్ని ఇష్టంతో జపించుకునే అదృష్టం నాకు కల్గనీ దేవా! అంటారు పురంధరదాసుల వారు.
ఈ సర్వ ప్రపంచంలోనూ ప్రతి అణువులోనూ ఉన్నది ఆ నారాయణుడే నన్న నిజం తెలిసీ, ఆ స్వామికి ప్రణామమర్పిస్తూ, ‘‘ఓం నమో నారాయణాయ’’ అనే అష్టాక్షరీ మంత్రాన్ని మనసులో అర్ధాన్ని భావిస్తూ, శరీరంతో నమస్కరిస్తూ, నోటితో మరల మరలా ఉచ్ఛరించడం మీకు పరమహితాన్ని చేకూరుస్తుంది సుమా! అంటారు.
ఏ స్థితిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా మానవుని రక్షించేది.
ఆర్తా విషణ్ణాశ్శిధిలాశ్చ భీతాః ఘోరేషుచ వ్యాధిషు వర్తమానాః
సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాస్సుఖినోభవంతి ॥
నారాయణ నామోచ్ఛారణే అన్ని దుఃఖాలనూ పోగొట్టి సుఖాన్నివ్వగలదు సుమా! అని విష్ణుసహస్రనామ ఫలం చెబుతోంది.
అపురూపమైన ఈ శరీరాన్నిచ్చిన సర్వేశ్వరుని మనోవాక్కాయకర్మలా ఏవిధంగా సేవించుకోవాలో చెప్పి మందు తెలియక బాధపడే సంసార వ్యాధిగ్రస్తులకు శ్రీకృష్ణ దివ్యౌషధాన్ని గురించి తెలిపారు. ఆపై పరమాత్మ ప్రాప్తికి ఓంకార సహిత అష్టాక్షరీ మంత్రానుష్టాన్ని సూచించారు. ఆ మంత్రాన్ని జపించుకునే టప్పుడు, పరమాత్మ సర్వవ్యాపకత్వాన్ని భావిస్తూ, మరీ జపించమన్నారు కదా! అలా భావించాలీ అంటే ఆ దేవదేవుని వైశిష్ట్యం తెలిసి ఉండాలి కదా! ఆ పరబ్రహ్మ యొక్క విశిష్టతనూ, నిరతిశయ విభూతినీ గురించి కూడా తానే తెలియజేస్తున్నారిలా సాధకుల సౌలభ్యం కోసం.
పృథ్వీరేణు రణుః పయాంసి కణికాః
ఫల్గుస్ఫులిం గోనలః
తేజో నిశ్శ్వసనం మరుత్తనుతరం
రంధ్రం సుసూక్ష్మం నభః
క్షుద్రా రుద్ర పితామహ ప్రభృతయః
కీటాః సమస్తాస్సురాః
దృష్టే యత్ర స తావకో విజయతే
భూమావధూతావధిః
‘‘తేనేదంపూర్ణం పురుషేనసర్వమ్’’ ఈ గోచరించే విశ్వాన్నంతటినీ, మనకు గోచరించక మిగిలి ఉన్న విశ్వాన్నంతటినీ కూడా పూరించి ఉన్నవాడు పురుషుడు అని వేదం తెలియజేస్తోంది. ‘‘సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులమ్’’ అని పురుషసూక్తం, అతడు ఈ విశ్వమంతా వ్యాపించి, ఇంకా పది అంగుళాలు అధిగమించి ఉన్నాడు అంటూ వర్ణిస్తుంది. ఇంతకీ ఆ పరమపురుషుడు ఎవరనీ? ‘‘పురుషోహవై నారాయణః’’ ఆ పరమ పురుషుడు నారాయణుడే! ఆ పరమ పురుషుని భావించి దర్శించగల్గిననాడు ఈ పృథ్వి అంతా ఒక చిన్నరేణువు. భూమికి మూడిరతలున్న జలమంతా ఒక చిన్న నీటి తుంపర. అంతకు పదిరెట్లున్న అగ్ని ఒక చిన్న నిప్పురవ్వ. అంతకెన్నో రెట్లున్న వాయువు ఒక నిట్టూర్పు. తాను లేని చోటే లేనట్లు. సర్వత్రా వ్యాపించి ఉన్న ఆకాశం కూడా ఆ పరబ్రహ్మలో ఒక చిన్న రంధ్రం మాత్రమే. సృష్టిలయాలను నిర్వహించే బ్రహ్మ రుద్రాది దేవతలు ఆ పరమాత్మ మహిమ ముందు కీటక సమానులు. బ్రహ్మేంద్రాది దేవతలే శ్రీకృష్ణ మహిమను తెలియలేక తబ్బిబ్బయ్యారు వత్సాపహార, గోవర్థనోద్ధార సమయాల్లో!
సర్వజగత్తూ తన చిన్నినోట దర్శింపజేశాడు కదా యశోదకు ఆ స్వామి? వైభవం దర్శించనంతవరకూ, నూతిలో కప్పకు చెరువే సముద్రం అన్నట్లు, బ్రహ్మాది దేవతలదే నిరతిశయమహత్వమేమో అనిపిస్తుంది. కానీ పరమాత్ముని మహత్వాన్ని దర్శించిన నాడు తెలుస్తుంది. తక్కినవన్నీ ఎంత అల్పములో!
శ్లో॥1 ప శ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తధా భూతవిశేషసంఘాన్
బ్రహ్మాణ మీశంకమలాసనస్థం
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ ॥
శ్లో॥2 అనేక బాహూదర వక్త్రనేత్రం
పశ్యామిత్వాం సర్వతోనన్త రూపం
నాతం స మధ్యం న పునస్త వాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప!
శ్లో॥3 కిరీటినం గదినం చక్రిణంచ
తేజోరాసిం సర్వతో దీప్తిమంతం
పశ్యామిత్వాం దుర్నిరీక్ష్యం సమంతా
ద్దీప్తానలార్క ద్యుతిమప్రమేయమ్ ॥
శ్లో॥4 ద్యావాపృధివ్యో రిద మంతరం హి
వ్యాప్తం త్వjైుకేన దిశశ్చ సర్వాః
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్ ॥
తరువాయి వచ్చే సంచికలో……
👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾