12_005 ఆనందవిహారి

 

 

జగమునేలిన తెలుగు

 

 

 

వృత్తి పాత్రియేకత అయినా, ప్రవృత్తి అయిన అన్వేషణ తనను ఆగ్నేయాసియాలోని తెలుగు మూలలను శోధించేలా చేసిందని ప్రముఖ పాత్రికేయురాలు, చరిత్ర పరిశోధకురాలు, రచయిత్రి డి. పి. అనురాధ వెల్లడించారు. శ్రీలంక, బర్మా, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, నేపాల్ దేశాలలో ఇప్పటికీ ఉన్న తెలుగువారి 2000 ఏళ్ళ చరిత్రను అధ్యయనం చేసి “జగమునేలిన తెలుగు (గోదావరి నుంచి జావా దాకా”) అనే రచనతో సంచలనం సృష్టించిన ఆమెతో చెన్నైకి చెందిన అమరజీవిపొట్టి శ్రీరాములు స్మారక సమితి ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించింది. “నెల నెలా వెన్నెల” నెట్టింటి సమావేశం కార్యక్రమంలో భాగంగా  శనివారం ప్రసారమైన ఈ కార్యక్రమానికి ఆ పుస్తకం పేరే శీర్షిక కాగా, మరొక పాత్రికేయుడు, రచయిత అయిన కె. ఏ మునిపల్లె సురేష్ పిళ్ళే ముఖాముఖిని నిర్వహించారు. ఆయన వేసిన పలురకాల ప్రశ్నలకు అనురాధ అనేక ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు.

 

ముందుగా తన చదువు గురించి మాట్లాడుతూ….. న్యాయశాస్త్రాన్ని అభ్యసించిన తరువాత “ఈనాడు” జర్నలిజం స్కూలు నుంచి డిప్లొమా సాధించానని, ఈనాడు, టీవీ 9 తదితర ప్రతిష్టాత్మక సంస్థలలో పనిచేసి ప్రస్తుతం ఆంధ్రజ్యోతిలో పాత్రికేయురాలిగా పని చేస్తున్నానని వివరించారు. టీవీ 9లో ఉండగా అప్పటి సీఈఓ రవిప్రకాష్ ఇచ్చిన అసైన్మెంట్ ఆధారంగా… ఉభయ తెలుగు రాష్ట్రాలకూ అతి ముఖ్యమైన గోదావరి తీరాల నుంచి మొదలై ఆగ్నేయ ఆసియా అంతటా విస్తరించిన తెలుగుజాతి వేర్లను కనుగొనే అవకాశం కలిగిందని అనురాధ చెప్పారు. వందేళ్ళ క్రితమే చరిత్ర పరిశోధకుడు భావరాజు వేంకట కృష్ణారావు ఆగ్నేయ ఆసియాలోని తెలుగువారి గురించి కొంత రాశారని, తను ఇంకొంచెం ముందుకు వెళ్ళి మరింత సమాచారం సేకరించానని తెలియజేశారు. 

 

ముందుగా శ్రీలంక వెళ్ళి అక్కడి తెలుగువారి గురించి తెలుసుకోవడంతో అన్వేషకురాలిగా తన ప్రస్థానానికి శ్రీకారం చుట్టానని పేర్కొన్నారు. మొదట అక్కడి ఒక హోటల్లో భోజనం చేస్తుండగా, శ్రీలంక చివరి రాణి అయిన నాయక రాజుల వంశానికి చెందిన వేంకట రంగమ్మ చిత్రపటం కనిపించిందని, వివరాలలోకి వెళ్తే… అక్కడి బొడబొక్కలవారు మాత్రమే తెలుగువారు కాదని, నిజానికి అక్కడి మొట్టమొదటి చక్రవర్తి…. శ్రీకాకుళం నుంచి బహిష్కరింపబడిన, తెలుగువాడైన విజయుడని వెల్లడించారు. విజయుడితోపాటు మరికొందరు కూడా పడవల గుండా ప్రయాణం చేసి శ్రీలంకలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారని వివరించారు. క్రికెట్ స్టేడియం సహా అక్కడి పురాతన కట్టడాలన్నీ విజయుడు నిర్మింపజేసినవేనని అనురాధ తెలియజేశారు. అక్కడ ఒక తెలుగువారి రాజకీయ పార్టీ ఉందన్నారు. తమిళులుగా చలామణి అవుతున్న 20 లక్షల మందిలో 8 లక్షలు తెలుగువారేనని చెప్పారు. 

 

ఇక బర్మా ప్రాంతంలో “మో” అనబడే జాతివారు తెలుగువారని, వారు పాడే జోలపాటలో తాము తెలంగాణ ప్రాంతం నుంచి అక్కడికి తరలివెళ్ళినవారమని ఉందని వివరించి అనురాధ ఆశ్చర్యపరిచారు. అంటే, 5వ శతాబ్దంలో అక్కడ మనవాళ్ళు రాజ్యమేలినా, అంతకుముందు కనీసం రెండుమూడుశతాబ్దాల క్రితమే “తెలంగాణ” అన్న పదం ఉండి ఉండాలని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ నుంచి వచ్చినట్టు తెలుపగా వారు ఎంతో సంతోషించి తనను ఆత్మీయురాలిగా భావించారని ఆనందం వ్యక్తం చేశారు. తాను చేపట్టిన పరిశోధన వల్ల మ్యాన్మార్ తనకు రెండో ఇల్లు అయిపోయిందని, ఇప్పటివరకు 7 సార్లు సందర్శించానని తెలిపారు. టీవీ 9 అసైన్మెంట్ ద్వారా శ్రీలంక, బర్మా, మలేషియా, థాయిలాండ్, నేపాల్ దేశాలు పర్యటించానని, ఇండోనేషియా, బర్మా వంటి ఇతర దేశాలను వ్యక్తిగత ఆసక్తికొద్దీ సొంత ఖర్చుతో పర్యటించినట్టు వెల్లడించారు. ఫక్తు జానపద చలనచిత్రానికి తగ్గని రోమాంచకమైన తన పర్యటనలు, పరిశోధనల వివరాలను, “జగమునేలిన తెలుగు” నవల రూపుదిద్దుకున్న వైనాన్ని వెల్లడించి ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేశారు. 

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న

‘ Leave a reply ‘ box లో తెలియజేయండి. 👇🏾