12_005  చేతికొచ్చిన పుస్తకం 08

 

చేతికొచ్చిన పుస్తకం-36:

కళింగ ప్రాంత రాజకీయ దిగ్గజంహనుమంతు అప్పయ దొర

 

ముస్లిం మహిళల విడాకులు గురించి మొదట మాట్లాడిన పార్లమెంటు సభ్యులు ఎవరు ?

1986 మే 6న భారత పార్లమెంటు లో షాబానో బేగం కేసు నేపథ్యంలో మధ్యాహ్నం 2 గం నుండి 3. 45 గం దాక చర్చ ప్రారంభించిన హనుమంతు అప్పయ దొర ప్రసంగించారు. ఆ రోజు 18 గంటలపాటు ఏకధాటిగా యాభై మంది భాగస్వామ్యంతో ఈ చర్చ సాగడం విశేషం. అప్పయ దొర ప్రసంగం ముగించగానే ఇంద్రజిత్ గుప్త, ఎన్ జి రంగా, మధు దండవతే, సోమనాథ్ చటర్జీ వంటి వారు ఎంతగానో అభినందించారు.

ఆ ఆంగ్ల ప్రసంగం, దాని తెలుగు క్లుప్త సారాంశంతో పాటు హనుమంతు అప్పయ దొర జీవిత విశేషాలతో డా వి దుర్గారావు 2017 లో 128 పుటలతో ఈ పుస్తకాన్ని వెలువరించారు. శ్రీకాకుళం జిల్లా లో 1935 ఫిబ్రవరి 8 న జన్మించిన అప్పయ దొర 1967-72 కాలంలో నక్సలైట్ న్యాయవాది అని పేరుగాంచారు. ఎన్టీఆర్ ప్రోద్బలంతో 1985 లో టిడిపి తరఫున పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

ఆసక్తి ఉన్న వారు రచయితను +919866686823 మొబైల్ ఫోన్లో సంప్రదించవచ్చు.

 

చేతికొచ్చిన పుస్తకం-37:

మంకు శ్రీను మూడు శతకాలు & శ్రీధర్ కొమ్మోజు మరో శతకం

 

ఆకాశవాణి వివిధ కేంద్రాలలో సమస్యాపూరణానికి పద్యాలు, ఇంకా కార్యక్రమాలపై స్పందనగా ఉత్తరాలు విరివిగా రాసే రచయితగా మంకు శ్రీను పేరు పాతికేళ్ళుగా సుపరిచితం. మరీ ముఖ్యంగా ఇంటిపేరు ప్రత్యేకంగా ఉండటంతో గుర్తు పెట్టుకోవడం సులువు.

తొలినుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నా మంకు శ్రీను పట్టువిడవకుండా శ్రమిస్తున్న విషయం ఇటివలే తెలిసింది. టీచరుగా పనిచేస్తూ అక్షరాన్ని పద్యాలు గా, పుస్తకాలుగా అర్చిస్తూ అందులో భాగంగా ఈ శతకాలను వెలువరించారు. ఎంతో అభిమానంతో ఈ మూడు శతకాలు వారు పంపగా నా చేతికొచ్చాయి.

ఈ మూడింటి తోపాటు మంకు శ్రీను మిత్రుడైన శ్రీధర్ కమ్మోజు ( Sreedhar Kommoju ) రచించిన ఈశ్వరమ్మ శతకం కూడా అందింది.

ఈ కొప్పర్రు, మల్లవరం కవులకు అభినందనలు.

 

చేతికొచ్చిన పుస్తకం:38

గాంధీ అండ్ అంబేద్కర్ – అండర్ స్టాండింగ్ దెయిర్ రిలేషన్స్

గాంధీ, అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా ఆలోచనలు ఆకళింపు చేసుకున్న లోహియా అనుయాయి, సహాయకుడు రఘు ఠాకూర్ ఇటీవల రాసిన హింది పుస్తకానికి గురుప్రీత్ సింగ్ ఆంగ్లానువాదం ఈ రచన!

గాంధీజీ హత్య జరిగి ముప్పావు శతాబ్దం జరిగినా ఎప్పటికప్పుడు ఆయనను విమర్శించడానికి కొత్త మార్గాలు, కొత్త ఆయుధాలు తయారవుతున్నాయని గమనించిన రఘు ఠాకూర్ దీనిని రచించక తప్పలేదని పుస్తకనేపథ్యంలో వివరించారు.

లోహియా 112 జయంతి సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమానికి వెళ్ళగానే నేను ఈ 172 పేజీల పుస్తకాన్ని 250 రూపాయలకు కొనుక్కున్నాను. గంట పైన ఆలస్యంగా మొదలైన ఈ సభలో ప్రకటించిన వక్తలలో చాలామంది గైర్హాజరు కాగా, సభ ఎక్కువ భాగం హిందిలో నడవడం మరో సమస్య. దాంతో అర్ధాంతరంగా వచ్చేశాం.

ఈ పుస్తకం విలువైనదే!

గాంధీ విమర్శకుల ధోరణి; గాంధీ-అంబేద్కర్ మధ్య వారధిగా లోహియా; మేధావుల ఉభయ చరత్వమూ, గాంధీ పట్ల అసంతృప్తి; గాంధీ తర్వాత విమర్శలకు గురయ్యేదెవరు; అంబేద్కర్, కమ్యూనిస్టులు; గాంధీ- అస్పృశ్యత, పూనా పాక్ట్; అరుంధతి రాయ్ పుస్తకం; గాంధేయవాదపు మన్నిక మొదలైన విషయాలు ఇందులో చర్చించబడ్డాయి.

2014 బిజేపి విజయం, 150 జయంతి సంవత్సరం, కామన్ సిటిజన్ షిప్ యాక్ట్, కరోనా, ఢిల్లీ పొలిమేరల్లో రైతుల ఆందోళనా విధానాలు …ఇలా చాలా సందర్భాల్లో గాంధీజీ తరచూ చర్చింపబడుతున్నారు.

ఆసక్తి ఉన్న వారికి ఆలోచనా ఔషధం ఈ పుస్తకం!

ఆకార్ బుక్స్ ఢిల్లీ www.akarbooks.com ప్రచురణ

 

చేతికొచ్చిన పుస్తకం 39:

శైలకుమార్ కవిత్వం నువ్వేనేను

ఒకప్పుడు విరివిగా రాసిన రాయలసీమ ప్రాంతపు పాపులర్ నవలా రచయిత… తర్వాత టిటిడి ‘సప్తగిరి’ పత్రికా సంపాదకుడు… పిమ్మట తిరుపతిలో భాషా బ్రహ్మోత్సవాల తెరవెనుక సూత్రధారి…ఇలా ఇంత మాత్రమే ( వివిధ సందర్భాలలో) నాకు డా శైల కుమార్ గురించి తెలుసు!

తిరుపతిలో ఆకాశవాణి ఉద్యోగం చేసిన కాలంలో ఒకే ఒకసారి ‘చిత్తూరు జిల్లా జీవన చిత్రం’ రేడియో ప్రోగ్రాం గురించి వారిని ఆహ్వానించినపుడు ముఖాముఖిగా మాట్లాడినప్పుడు బోధపడిన విషయం… వారి పుస్తక పఠనాభిలాష, మృదువైన మాటతీరు, స్నేహశీలం. ఇప్పుడు ఫేస్బుక్ లో నిరంతరం టచ్ లో ఉండే మిత్రులలో ఒకరు.

నలభై పాపులర్ నవలలు రాసిన వీరు ప్రింట్, టెలివిజన్ మీడియాలో బోలెడు కృషి చేశారు.

యాభయ్యారు కవితల, 82 పేజీల సంపుటి ‘నువ్వే నేను’ వంద రూపాయలు.

ప్రతులకు: మానసశ్రీ ప్రచురణలు 9912328869

 

 

చేతికొచ్చిన పుస్తకం-40:

సైన్స్ ఫిక్షన్ డా. చిత్తరువు మధు పుస్తకషట్కం

 

సర్జికల్ నైఫ్ సైన్స్ కలంగా మారి, ఆధునిక శాస్త్ర సాంకేతిక ప్రగతి సాధించిన అద్భుతాలను ఫిక్షన్ చిత్తరువు గా మారిన విషయాన్ని మొన్న చేతికొచ్చిన పుస్తకసంచయం మరోసారి గుర్తు చేసింది!

డా చిత్తర్వు మధు గారిని రచయితగా తొలుత పత్రికలు పరిచయం చేస్తే, ఆయనే మెడికల్ ఎక్స్పర్ట్ అని కూడా ముఖాముఖి కలిపింది హైదరాబాద్ ఆకాశవాణి ఓ పుష్కరం క్రిందట. అంతే కాదు సంగీతవాయిద్యాలను వీనులవిందుగా స్పృశించగలరని ఫేస్బుక్ కరోనా సమయంలో తెలియజేసింది. కనుక మరో మాధ్యమాన్ని తడిమితే మరో ప్రతిభా చిత్తరువు పలకరిస్తుందేమో వేచి చూడాలి!

ఈ ఆరు సైన్స్ ఫిక్షన్ పుస్తకాలలో ఐదు నవలు కాగా, ‘Z సైన్స్ ఫిక్షన్’ అనేది 2019 లో వెలువడిన 19 సైఫై కథల సంపుటి.

ఔనా, ఐ.సి.సి.యు అనేవి రెండు విడి నవలలు కాగా; కుజుడికోసం(2012), నీలి-ఆకుపచ్చ(2015) , భూమి నుంచి ప్లూటో దాకా…(2019) అనేవి ట్రియోలజి.

ఈ ఆరు కాకుండా మరో మూడు (ప్రియాలజీ, బై బై పొలోనియం, ఎపిడెమిక్ ) పుస్తకాలను వారు గతంలో ఇచ్చారు.

ఇంత పరిమాణంలో సైన్స్ ఫిక్షన్ రాసిన వారు గానీ, ఇన్ని సైన్స్ ఫిక్షన్ నవలలు రాసిన వారు మరొకరు తెలుగు లో లేరేమో! డా సైన్స్ చిత్తరువు మధు గారికి అభినందనలు తెలియజేస్తూ వారు మరింత కృషి చేయాలని సైన్స్ మిత్రుడిగా వాంఛిస్తున్నాను!

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾