12_005 కన్యాశుల్కం – ఒక పరిశీలన

 

కరటక శాస్త్రి శిష్యుడి కి వివరం బోధపరచి ” పట్టుబడకుండా పని చేస్తి వాయనా నా పిల్ల నిచ్చి పెళ్ళి చేసి ఇల్లరికం ఉంచుకుంటా “నని హామీ ఇచ్చి, వేషాలు మార్చుకుని రామప్పంతులు లేని సమయంలో మధురవాణి ని కలుస్తారు. మధుర వాణి కి, కరటక శాస్త్రి కీ పూర్వ స్నేహం అతని మీద ఆమె కు సదభిప్రాయం ఉన్నాయి, విషయం గ్రహించి, సాధ్యా సాధ్యాలు బేరీజు వేసిన మధురవాణి, స్నేహితుడి అక్కగారి కూతురి కి వచ్చిన ఆపద తప్పించడానికి నిర్ణయించుకుని, ” నాటకం లో హాస్యం బాగానే వుంటుందనీ అది నటన లోకి తెస్తే మూడుతుందని “, గురు శిష్యుల ని హెచ్చరిక చేసి పధకం రచిస్తుంది.

 

ఆ ప్రకారం కరటక శాస్త్రి రామప్పంతుల్ని కలుసుకుని, తనది కృష్ణా తీరమనీ, పిల్ల కి పెళ్ళి సంభంధాలు వెతుకుతున్నాననీ, నిదానం గా ఉంటే పద్దెనిమిది వందలు కన్యాశుల్కం పలుకుతుందనీ, తనకు ఋణాల భాధ లావు కావడం చేతా, పిల్ల కట్టు తప్పడం చేతా తొందరగా ఉందనీ, రామప్పంతులు సహాయం చేసి గట్టెక్కించాలని ఆర్ధిస్తాడు, ముందు గా కొంత బెట్టు చేసినా, రామప్పంతులు, కన్యాశుల్కం లో తనకి సగ భాగం వాటా గా ఇవ్వాలనీ, ప్రతి ఫలంగా, అమ్మాయి కి సంభందం కుదిర్చి పెళ్ళి చేసి, కరటక శాస్త్రి ఋణాలు కోర్టు కేసుల ద్వారా మాఫీ చేయిస్తా ననీ చెప్పగా కరటక శాస్త్రి అంగీకరిస్తాడు.

 

వేంకటేశం ఇంట మకాం పెట్టిన గిరీశం పంతులు అక్కడి వాతావరణం గ్రహించి, కోర్టు కాయితాలు తర్జుమా చేసీ, ఇంటి పనుల్లో సాయం చేసీ, సుబ్బి పెళ్ళి విషయం లో నూతిలో దూకిన వెంకమ్మ ని బయటకు తీసి రక్షించీ, అందరి కీ తనపై సదభిప్రాయాన్ని కలిగించుకుంటాడు. అప్పుడప్పుడు ” ఖగపతి అమృతము తేగా, భుగ భుగ మని చుక్క భూమిని చేరెన్, (అది) పొగ చెట్టయి జన్మించెన్, పొగతాగని వాడు దున్న పోతై పుట్టున్ ” అని పొగ చుట్టల ప్రాశస్థ్యం, ” She wakes up at AM four…..” అనే పొడుగు పద్యం ద్వారా వైదవ్యం పొందిన స్త్రీ ల అవస్థల గురించీ శిష్యుడు వెంకటేశాని కీ, వదిన గారని తాను వరస కలిపిన బుచ్చమ్మ కీ జ్ఞానం బోధిస్తూ ఉంటాడు.

 

బుచ్చమ్మ పట్లా, ఆమె ఆస్తి పట్లా ఆకర్షితుడు ఐన గిరీశం, ” డెబిట్, క్రెడిట్ “లని బేరీజు వేసుకొని, ఆమె ను పెళ్ళి చేసుకొని ఆర్ధికంగా లాభ పడటం తో పాటు ” చుక్కల వలె కర్పూరపు ముక్కల వలె, నీదు కీర్తి ముల్లోకములన్, కిక్కిరిసి పిక్కటిల్లును ” అని ప్రోత్సాహం చేసుకొని, బుచ్చమ్మ ను ఒప్పించి, బుచ్చమ్మ కోరిక ప్రకారం సుబ్బి కి కుదిరిన వృద్ధ లుబ్దావధానుల సంభందం తప్పించడం కోసం నిశ్చయించుకుని అతనికి ఒక ఉత్తరం రాస్తాడు.


” సుబ్బికి జాతకం ప్రకారం మారకం ఉంద నీ, అది వైదవ్య హేతువనీ, అగ్నిహోత్రావధానులు దుబారా ఖర్చు మనిషి అవడం చేత పెళ్ళికి ఏనుగులు, గుర్రాలతో తరలి వస్తున్నారనీ, పెళ్ళి వంకతో రామప్పంతులు, సుబ్బిశెట్టి తో కలసి లుబ్దావధానుల్ని, దోచేసే ప్రయత్నం లో ఉన్నారు కనక జాగ్రత్త పడవలసింది అని లుబ్దావదానులకి గిరీశం రాసిన ఉత్తరం సారాంశం.

 

ఇక్కడ రామాపురం లో లుబ్దావధానుల పెళ్ళికి పెద్ద గా వ్యవహారం చేస్తున్న రామప్పంతులు పధకం ప్రకారం అతని దగ్గర డబ్బు దండుకుంటూ ఉంటాడు. అసలు లుబ్దావధానుల తలలో పెళ్లి ఆలోచన ఎక్కించింది రామప్పంతులే. ఇతనికి సిద్ధాంతి, గవరయ్య, సుబ్బిశెట్టి, పండా మొదలైన వారు సహాయం చేస్తారు. రామప్పంతులు లుబ్దావధానులకి ఒక ఆకాశరామన్న ఉత్తరం కూడా రాస్తాడు.

 

గిరీశం రాసిన ఉత్తరం అందిన అవధాన్లు, రామప్పంతుల ఇంటికి రాగా, పంతులు మధురవాణి కలసి, ఈ సంభందం వద్దని ఒప్పిస్తారు. ఇప్పటికిప్పుడు ఇంకో సంభందం ఎలా కుదురుతుందా? అని బెంగ పడుతున్న అవధాన్లకి, గుంటూరు శాస్త్రి చవగ్గా పిల్లని అమ్ముకునే ప్రయత్నం లో తన సహాయాన్ని కోరాడనీ, పిల్ల మంచి జాతకురాలనీ అవధాన్లని, పంతులు ఆశ పెట్టీ, తొందర పెట్టీ, పదమూడు వందల కన్యాశుల్కానికీ, మెడ లో ఒక హారానికీ ఒప్పిస్తాడు. నగ పెట్టనని భీష్మించుకున్న అవధానిని, మధురవాణి వద్ద ఒక బంగారు కంటె అరువు తీసుకుని, పిల్లకి పెళ్ళి సమయంలో పెట్టి, పెళ్ళి అవగానే తిరిగి మధురవాణి కి ఇచ్ఛేయవచ్చని సలహా చెప్పి ఒప్పించి, రామప్పంతులు గుంటూరు శాస్త్రి కూతురి తో లుబ్దావధానులకి పెళ్ళి సంభందం కుదురుస్తాడు.

( తరువాయి వచ్చే సంచికలో… )

👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾