చేతికొచ్చిన పుస్తకం-41:
ఉమ్మడి అనంతపురం జిల్లా రచయిత్రుల కథల తొలిసంపుటి
‘ముంగారు మొలకలు‘
1953లో పదుకొండు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, తర్వాత ప్రకాశం, విజయనగరం రాకతో 13 అయ్యాయి. 2022 ఏప్రిల్ 4 న ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లాల సంఖ్య రెట్టింపు అంటే 26 కు పెరిగింది. అనంతపురం జిల్లా నుంచి సత్యసాయి జిల్లా ఏర్పడింది. ఒక వారం క్రితం ఇప్పటి అనంతపురం, సత్యసాయి జిల్లా రచయిత్రుల కథా సంకలనం ‘ముంగారు మొలకలు’ విడుదలైంది.
యం ప్రగతి, జి నిర్మలా రాణి ఇంకా బి హేమమాలిని గార్ల ఉమ్మడి సంపాదకత్వంలో వెలువడిన ఈ ప్రయత్నానికి ముందు డా హరికిషన్ వెలువరించిన ‘రాయలసీమ రచయిత్రుల కథలసంపుటి ‘ ఒకటే ఆ ప్రాంతంలో ఇటువంటి వర్క్ కనుబడుతోంది. నాలుగు తరాలకు చెందిన పాతికమంది రచయిత్రుల కథలు ఈ సంపుటి ముంగారులో మొలకలెత్తాయి.
సహజంగానే మొదట కలిగే సందేహం ‘అనంతపురం రచయిత్రి’ అనే మాటకు వివరణ ఏమిటని! సాధ్యమైనంత విస్తృతంగా నిర్ణయించుకోవడం అభినందనీయం! ప్రాంతీయ మూర్తిమత్వాన్ని ఎలా చిత్రిక పట్ఠారని …వస్తువు ఎంపిక, భావవ్యక్తీకరణ, వాదనా వైఖరి వంటి వాటిని లోతుగా పరిశీలిస్తే గాని చెప్పలేము!
ఈ సంపుటికి నేతృత్వం వహించిన సంపాదకత్రయం నాకు సుపరిచితులు కావడమూ , వారు వినూత్న ప్రయోగం చేయడము ముదావహం.
ఈ పుస్తకం కావాల్సిన వారు ₹ 250 ఈ మొబైల్ ఫోన్ +91 94407 98008 కాంటాక్ట్ చేసి పొందగలరు.
చేతికొచ్చిన పుస్తకం-42:
‘జిడ్డు కృష్ణమూర్తి జీవితం‘
వర్తమాన సమాజానికి హేతుబద్ధత అవసరం
ప్రయాణం, బంధువులు, మరికొన్ని ఇతర పనుల వల్ల చేతికొచ్చిన పుస్తకం సిరీస్ లో అంతరాయాల నిడివి పెరుగుతోంది. ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ కలం కదులుతోంది ఇటువైపు!
ఆదరంతో జిడ్డు కృష్ణమూర్తి సంబంధించి ఐదు తెలుగు పుస్తకాలు, రెండు ఇంగ్లీష్ పుస్తకాలు ఈ రోజు మధ్యాహ్నం పంపారు.చేతిలో ఉన్న పనిని పూర్తి చేసి, వాటిని తిరగేస్తూ నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ గారి 48 పేజీల పుస్తకం ‘జిడ్డు కృష్ణమూర్తి జీవితం’ ఉన్నపళంగా చదివేశాను.
1997లో మొదటి సారి, 2007 లో రెండో సారి ఈ పుస్తకాన్ని జిడ్డు కృష్ణమూర్తి సెంటర్, హైదరాబాద్ ప్రచురించింది. అర్థరహితమైన, అహేతుకమైన పోకడలు పెరిగిన వర్తమాన సమాజానికి కృష్ణమూర్తి ఆలోచనలు ఎంతో అవసరమనిపిస్తోంది!
చేతికొచ్చిన పుస్తకం –43:
Dr Y Nayudamma Essays, Speeches, Notes and Others
సిసలైన సామాజికదృష్టి గల శాస్త్రవేత్త నాయుడమ్మ
మూడున్నర దశాబ్దాల క్రితం హెచ్ నరసింహయ్య ఎడిట్ చేసిన పుస్తకం లో డా వై నాయుడమ్మ గారు సైన్సూ సూపర్ స్టిషన్ అంటూ రాసిన వ్యాసం చదివింది మొదలు నేను ఆయన అభిమానినై పోయా! నాయుడమ్మ వ్యాసాలు, ప్రసంగాలు కలిపిన ఒక సంపుటి ఒక దశాబ్దమున్నర క్రితం ఎడారిలో ఒయాసిస్సులా నా చేతికొచ్చింది.
2022 ఏప్రిల్ 18న ఈనాడు దినపత్రిక లో ఉపరాష్ట్రపతి గౌ ఎం వెంకయ్య నాయుడు గారు నాయుడమ్మ గురించి రాయడానికి కారణం- K Chandrahas and K Seshagiri Rao ఎడిట్ చేసిన Dr Y Nayudamma Essays, Speeches, Notes and Others పుస్తకావిష్కరణయే.
పద్నాలుగు వ్యాసాలు, ఆరు ఇతర అంశాలతో కూడిన రెండు వందల పుటల ఆంగ్ల గ్రంధాన్ని నాయుడమ్మ ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NFERD) ప్రచురించింది.వివరాలకు 8341378169
నాయుడమ్మ (1922-1985) శతజయంతి సంవత్సరంలో ఇలా ఓ పుస్తకం రావడం అర్థవంతమైన నివాళి!
చేతికొచ్చిన పుస్తకం-44:
ఆశ్రమమూ ఆధునికత!
అవును, శీర్షికే ఆసక్తి కలిగిస్తోంది… దానికి తోడు ఆలోచనాత్మకమైన కవర్ పేజి అలంకరణ! రచయిత అవధానం రఘుకుమార్ పంపిన తాజా పుస్తకం ఈ ఉదయమే అందింది.
గాంధీజీ గురించిన అధ్యయనశీలిగా నాకు మూడు నాలుగేళ్ళుగా డా అవధానం రఘుకుమార్ పరిచయం.నిజానికి వారు తొలుత మార్క్సిజాన్ని బాగా ఇష్టపడే ముందుకు సాగి, తర్వాత దశలో గాంధీజీ, రామమనోహర లోహియాల గురించి అధ్యయనం చేసి రచనలు చేసిన వారు. టెలికాం శాఖలో ఉద్యోగం చేస్తూ లా చదివి, ఉద్యోగం వదిలి కొన్నేళ్ల క్రితం అడ్వకేట్ గా మారారు.
ప్రస్తుత పుస్తకం ‘ఆశ్రమమూ ఆధునికత’ వైయుక్తమైన మథనం, కనుకనే ఒక సాంప్రదాయ కుటుంబ సంఘర్షణల జీవన చిత్రం అని ఫ్రంట్ కవర్ మీద కనబడుతుంది. అయితే మనమెందుకు దీన్ని చదవాలి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే అసలు జీవిత చరిత్రలు, స్యీయ చరిత్రలు ఎందుకో బోధపడతాయి!
అలజడి ఏమిటి.. అక్షర రూపం ఎందుకు అంటూ మొదలై అనలవేదిక ముందు అశ్రునైవేద్యం, మోహనరాగం, అద్వైతామృతవర్షిణి, అన్ని అందంగా వేళ్ళు… కొన్ని నీలినీడలు, పాక్ పశ్చిమాల సంఘర్షణ ..వంటి ఆకర్షణీయమైన శీర్షికలతో 35 అధ్యాయాలుగా 170 పేజీలు సాగుతాయి!
చేతికొచ్చిన పుస్తకం-45 :
అమ్మిన శ్రీనివాసరాజు అక్షరాభిషేకం
నాకు పరిచయమైన మిత్రులు తొలుత రచనల ద్వారా, పిమ్మట ఆ మితృత్వం రేడియో సాంగత్యంతో పటిష్టమయ్యింది! కొందరి విషయంలో అదేపని అటువైపు నుంచి మొదలై ఉండవచ్చు!! శ్రీనివాసరాజు తన వ్యాసానికి పాతికేళ్ళు అంటున్నారు, మరోరకంగా ఆయన నాకు విజయవాడలో ఆకాశవాణి శ్రోతగా పరిచయమయ్యి కూడా దాదాపు అంతే కాలమైంది!! ఇప్పటికీ ఖమ్మం ప్రాంతం అమ్మిన శ్రీనివాసరాజుకు నా రచనలంటే బోలెడు ఇష్టం కూడా!
విజయవాడ మిత్రులు డా గుమ్మా సాంబశివ రావు వద్ద తాను పి హెచ్ డి చేశారన్న విషయం ఈ పుస్తకం ద్వారానే తెలిసింది. చాలా పత్రికల్లో కనబడే అమ్మిన శ్రీనివాసరాజు రచనలు కొన్ని ఇలా తొలిసారి పుస్తకంగా రావడం అభినందనీయం. శుభాకాంక్షలు!
ప్రవృత్తి రీత్యా శాస్త్రాభివేశంగల సాహిత్య జీవి, వృత్తి రీత్యా ఉపాధ్యాయులు. బడి, తెలుగు బోధన, కూచిపూడి, ఉగాది, మన్నెసీమ, కిన్నెరసాని, శ్రీశ్రీ, మాభూమి, పాకుడురాళ్ళు, విశ్వంభర, అమరావతి కథలు… ఇలాంటి విషయాలపై ఇరవై వ్యాసాలతో 136 పుటల పుస్తకం ఈ ‘అక్షరాభిషేకం’! ఆసక్తి ఉన్న వారు రచయితను 9441317694 ను సంప్రదించవచ్చు.
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
—— ( 0 ) ———
Please visit this page