12_006 మధుర గాయకునితో ఒక జ్ఞాపకం

 

1961 సంవత్సరం –

 కాకినాడ లోని గవర్నమెంట్ ఇంజినీరింగ్ కళాశాలలో 5 – సంవత్సరాల  B .E., డిగ్రీ కోర్సు లో మూడవ సంవత్సరం  చదువుతున్నాను. అప్పట్లో ఈ కోర్స్ లో చేరి చదివే విద్యార్ధినుల సంఖ్య చాలా తక్కువగా – అంటే నామమాత్రం ఉండేది. మా విద్యార్ధులు అందరినీ ఒక రెండు వారాల పాటు దక్షిణ భారత దేశ యాత్ర ( వైజ్ఞానిక – వినోద యాత్ర ) లో భాగంగా  మైసూరు, హంపి, బెంగళూరు, మద్రాసు నగరాలకు తీసుకువెళ్ళి, అవి చూడడం పూర్తి అయ్యాకా, మా అందరికీ మద్రాసు లోనే వీడ్కోలు చెప్పి, అక్కడ నుండి 4, 5 రోజులలో ఎవరికి వారుగా కాకినాడ చేరుకోమని – మా కూడా వచ్చిన ఉపాధ్యాయ బృందం  చెప్పారు.. మేమంతా కలిసి షుమారు పాతిక మంది  దాకా ఉన్నాము. మాకు మద్రాసు లో ఉండేందుకు నుంగంబాకం లోని లయోలా కళాశాల  హాస్టల్ భవనం లో ఉచిత వసతి ని కల్పించారు.

సరే ! మాలో ఎవరి అభిరుచులు వారివి కదా !

నా మటుకు నాకు యా రోజుల్లో ప్రత్యేకించి బ్లాక్ & వైట్ తెలుగు – హిందీ సినిమా పంచ ప్రాణాలు. సినిమా కళాకారులంటే  వల్లమాలిన ఇష్టం – భక్తి – గౌరవం – ఇంకా ఇలా ఎన్నో… ఎన్నో! వాళ్ళ  అడ్రెసులు సేకరించి వాళ్ళకి ఉత్తరాలు వ్రాసి – వారి  నుండి ప్రత్యుత్తరాలు, ఫోటోలు వస్తే – పొంగి పోతూ – వాటిని భద్రం గా దాచుకోవడం నాకు పరిపాటి.

చూడవలసిన ప్రదేశాలు అన్నిటినీ చూడడం అయిపొయింది కనుక – ఇక మిగిలిందల్లా, నేను చూడాలనుకున్న వ్యక్తులు – నా దృష్టి లో ముఖ్యం గా నేను అభిమానించే వారు ‘ముగ్గురు’

ఆ ముగ్గురిలో ఒకరు : సుప్రసిద్ధ నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు.

మద్రాసు మహానగరము లో ఆ రోజులలో ఆటో లు అరుదు. అద్దె టాక్సీలు మాత్రం తిరిగేవి. మనకు ఎక్కువగా అందుబాటు లో ఉండేవి సిటీ బస్సులు, లోకల్ రైళ్ళు .. ఇంకా APG II – నటరాజా సర్వీస్ అనే వాళ్ళం.- రెండు కాళ్ళ నడక. కాళ్ళల్లో చక్రాలు తిరగాలంటే వాటికి ఇంధనం అక్కర లేదు గానీ – కడుపు నిండా తిండి వుంటే చాలు. అప్పుడు అడుగు తడబడకుండా  ముందడుగు పడుతుంది.

మాంబళం స్టేషన్ లో ఎలక్ట్రిక్ ట్రైన్ దిగి టి. నగర్, ఉస్మాన్ రోడ్ పట్టుకుని కాలి నడక న వెడుతూ, ఇంటి నెంబర్లు వెతుక్కుంటూ  వెళ్లి – చివరకు 35 నెంబరు ఇంటిదగ్గర ఆగి చూసాను. ముందు గేటు, ప్రక్కన ప్రహరీ గోడలో బిగించిన బోర్డు మీద ” ఘంటసాల ” అన్న అక్షరాలు.! ఆ అక్షరాలను చూస్తుంటే సాక్షాత్తూ ఆయన దర్శనం కలిగినంత ఆనందం కలిగింది. మెల్లగా గేటు తోసి – లోపలకి అడుగు పెట్టాను. పెద్దాయనను చూడబోతున్నామన్న ఆనందాన్ని కప్పి వేస్తూ – ఒక పక్క భయం – ఇంకొక పక్క తడబాటు – వేరొక పక్క ఉత్కంఠ ! ముందు గది లో చాలామందే కూర్చుని ఎదురుగా వేరొక కుర్చీ లో కూర్చున్న “ఆయన” తో మాట్లాడుతున్నారు. ఆ ” ఆయనే ” మన ఘంటసాల గారని – అంతకు ముందే ఫోటో లో చూచి ఉన్న కారణంగా – వెంటనే గుర్తుపట్టగలిగాను. ఆయనతో అప్పటి వరకు ఉన్న వ్యక్తులు ఒకరొకరే ఆయన వద్ద శెలవు తీసుకుని వెళ్ళిపోగా – ఇక చివరికి – ఆయనా – నేను – ఇద్దరమే మిగిలాము అక్కడ. ఆయన కు నమస్కరించి – నన్ను పరిచయం చేసుకున్నాకా , ఆయన చిరు నవ్వుతో వేసిన ప్రశ్న ను మాత్రం ఈనాటికీ మరువలేను.

” బాబూ! నువ్వు పాడతావా ? ” అని-

” లేదండీ ” అని ఆయనకు కాస్త బెరుకు గా సమాధానం చెప్పి — నా కూడా తెచ్చుకున్న పుస్తకం లో ఆయన ఆటోగ్రాఫ్  తీసుకుని – ఆయన కు ధన్యవాదాలు చెప్పి బయటకు వచ్చాను. శ్రీ ఘంటసాల గారిని కలిసిన సందర్భం మొదటిది – చివరిదీ కూడా అదే !

అటు తరువాత ఆయన 1974 లో కాలం చేసే పర్యంతం ఆ మహానుభావునితో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిపేవాడిని. నా ఉత్తరాలను ఆయనకు స్వయంగా చదివి వినిపించేదానినని ఆయన సతీమణి సావిత్రమ్మ గారు నాతో తరచూ అంటూ వుంటారు. ఆమె మాటలు నాకు తేనె పలుకులు లా తోస్తాయి.

అమెరికా ప్రభుత్వం, ఇతర తెలుగు సంస్థల ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఆయన తన బృందం తో కలిసి అమెరికా లోని అనేక ప్రముఖ నగరాలలో పాట కచేరీ లను చేసి ఎంతోమంది శ్రోతలను అలరించారు. తన ఈ పర్యటనను దిగ్విజయం గా పూర్తి చేసుకుని ఆయన స్వదేశం చేరుకుంటున్న సందర్భం గా మిత్రులు సంగీత – సాహిత్య – నృత్య కళాకారులు – విమర్శకులు – శ్రీ వి. ఏ. కె. రంగారావు గారు ఊహా ఎంటర్ ప్రైజెస్ తరఫున ” శ్రీ ఘంటసాల ” గారి గురించిన వ్యాసాలు, ఆయన పాడిన లలిత గీతాలతో కూర్చిన ఒక పుస్తకాన్ని శ్రీ బాపు గారు వేసిన ముఖచిత్రం తో వెలువరించారు. శ్రీ ఘంటసాల గారి సంతకం తో  అపురూపమయిన కానుక గా ఆ పుస్తకాన్ని నేను అందుకున్నాను. ఆయన అన్నా, ఆయన గాత్రం అన్నా ఉన్న అభిమానం ఈ పరిచయంతో పదింతలయింది.

 

ఓలేటి వెంకట సుబ్బారావు గారి మాటల్లో…. ఈ క్రింద వీడియో లో…..

 

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——— ( 0 ) ———-

Please visit this page