అన్నమయ్య
పాట అనే ప్రక్రియ స్వరూపాన్ని నిర్దేశించిన తొలి తెలుగు వాగ్గయకారుడిగా, పద కవితా పితామహుడిగా ఖ్యాతి గాంచిన అన్నమాచార్య… కవి, భక్తుడు మాత్రమే కాక కర్మయోగి, జ్ఞానయోగి, దార్శనికుడు, మానవతా వాది కూడా అని సింగపూర్ కి చెందిన ప్రముఖ రచయిత్రి రాధికా మంగిపూడి వ్యాఖ్యానించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి నెలకొకసారి సమర్పించే “నెల నెలా వెన్నెల” నెట్టింటి కార్యక్రమంలో ధనుర్మాసం సందర్భంగా “అన్నమయ్య” పేరిట ఆమె ప్రసంగాన్ని ఏర్పాటు చేసింది. సంస్థ తరఫున సీనియర్ పాత్రకేయురాలు కనకదుర్గ వడ్లమాని కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రారంభంలో వక్తను పరిచయం చేస్తూ… ఆమె “గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం” వ్యవస్థాపక అధ్యక్షురాలు, శ్రీ సాంస్కృతిక కళా సారథి (సింగపూర్)” కమిటీ సభ్యురాలు అని వెల్లడించారు.
అనంతరం… అత్యంత కోమలమైన స్వరంతో ఆద్యంతం శాంతంగా నవ్వుతూ ప్రసంగించిన రాధిక… అన్నమాచార్య రచనా శైలిని, కీర్తనలలో ఆయన వెల్లడించిన వేంకటేశ్వర భక్తి తత్వాన్ని, సామాజిక స్పృహను విశ్లేషించారు. అచంచలమైన భక్తికి మారుపేరు అయిన ఆయన అనితర సాధ్యమైనటువంటి 32 వేల సంకీర్తనలను రచించారని గుర్తు చేశారు. ఇటు అచ్చ తెలుగులోను, అటు సంస్కృతంలోనూ రచనలు చేసిన ఆయన కవి, భక్తుడు మాత్రమే కాక కర్మయోగి, జ్ఞానయోగి, దార్శనికుడు, మానవతా వాది కూడా అంటూ… ఆయనలోని ఆయా లక్షణాలను తెలిపే పలు సంకీర్తనలను ఉదహరించారు.
అన్నమయ్య రచనా శైలిని వివరిస్తూ… తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక అంశాన్ని ప్రతిపాదన చేసి తరువాత అనేక ఉదాహరణలతో దాన్ని వివరించినట్టుగా ఉండే “బోధన” పద్ధతి అన్నమాచార్య సంకీర్తనలలోని ప్రధాన లక్షణమని రాధిక అభిప్రాయపడ్డారు. పల్లవిలో అంశాన్ని ప్రతిపాదించి చరణాలలో దాన్ని వివరించారని చెప్పారు. సులువుగా జన బాహుళ్యానికి చేరేలా పలు అంశాలను సంకీర్తనా మార్గంలో బోధించారని, ఇది… కేవలం నామ జపంతో భగవంతుణ్ణి చేరే కలి యుగానికి సంబంధించిన విధానమని వివరించారు. అప్పట్లోనే సమాజంలో ఉన్న వివిధ కుల, మత, వర్గాలను ఒక్క తాటిపై నడిపించే ప్రయత్నం చేయడానికై ఉవ్వెత్తున ఎగసి దేశమంతటా విస్తరించిన “భక్తి ఉద్యమా”నికి చెందిన సంకీర్తనాకారులలో అన్నమయ్య ఒకరని చెప్తూ చరిత్రకు సంబంధంచిన విషయాలను స్పృశించారు.
అన్నమయ్య కీర్తనలు ఆథ్యాత్మికతనే కాక జీవిత విలువలకు కూడా చెప్తాయని, అందుకని అవి నేటికీ వర్తిస్తాయని చెప్పారు. ఒకవైపు తన సాహిత్య, సంగీత పటిమతో తన భక్తిని చాటుకుంటూనే మరొకవైపు ప్రజలలో భక్తిని ప్రేరేపించారన్నారు. భక్తి అంటే పైకి వెల్లడించే డంభాచారాలు కాదని, దేవుడి పట్ల ప్రేమ, నమ్మకం కలిగి శరణాగతి చెయ్యడమేనని తెలియజెప్పారని వివరించారు.
అన్నమాచార్య దృష్టిలో తన, మన అంటూ ఎవ్వరూ వేరువేరుగా లేరని, అందరినీ ఆయన భగవత్ స్వరూపులుగానే భావించారని ఒక కీర్తన విశ్లేషణ సందర్భంగా వక్త వ్యాఖ్యానించారు. పైగా, ఒక కీర్తనలో, “నువ్వే నా నాలుకపై ఉండి నిన్ను నువ్వు పొగిడించుకున్నావు” అంటూ కేర్తినంతా కూడా స్వామికే ఆపాదించడం ఆయన శరణాగతి తత్వాన్ని వెల్లడి చేస్తుందని అన్నారు. తను చేసిన బోధనలకు తనే సాక్షీభూతంగా నిలుస్తూ ఒక జ్ఞానిగా వెలిగిన అన్నమయ్య మానవాళికి ఎల్లప్పుడూ పూజ్యుడు, అజరామరుడు అంటూ రాధిక ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమ వీడియో …………
***********************************************
కాకినాడలోని ప్రజా విద్యాలయం లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటీవల ‘ సంక్రాంతి సంబరాలు ‘ నిర్వహించారు. ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ముఖ్య అతిథి గా విచ్చేశారు. ప్రజా విద్యాలయం విద్యార్థులు సంక్రాంతి సంప్రదాయం ఉట్టి పడే విధంగా వేసిన ముగ్గులతో బాటు గొబ్బిళ్ళ పాటలు, కోలాటాలు వంటి నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. చాగంటి వారు విద్యార్థుల ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఆ కార్యక్రమాల చిత్రకదంబం…..
Please visit this page