12_007 గ్రామ దేవతల పూజలు – కోడి పందేలు

ఉత్సవాలు, పండుగల సందర్భములలో కోడి పందెములు కూడా ఒక వేడుకగా, గ్రామములలో జానపదుల వినోదముగా వింటూనే ఉంటాము. పూర్వము ఈ కోడి పందెములు విస్తారంగా జరిగేవి. అనేకమైన చారిత్రక రణములకు ఈ కోడి పందెము ప్రధాన కారణంగా చరిత్రలో చదివే ఉన్నాము. ప్రభుత్వము దీనిని నిషేధించినా మారుమూల గ్రామ సీమలలో ఈ వేడుక జనపదులకు ఆనందమే.

అయ్యలరాజు నారాయణామాత్యుడు తన ‘ హంస వింశతిలో ’ కోడి పందెములను ఈ క్రింది పద్యములలో వర్ణించాడు.

కందపద్యం :          అంతటని తాంతహర్ష

                        స్వాంతయుత ద్యూత జనవరక్షుభిత హరి

                        ద్ధంతి శ్రుతియైనగర

                        ప్రాంతంబున కోడి పదువు పందెము సాగేన్   

( హంస వింశతి 3అ – 211 పద్యం )

కోడి పందేలు జరిగే చోట పందెం కాసేవారు, ఆట చూసేవారు ఒకచోట పోగయ్యారు. జనం అధిక సంఖ్యలో వచ్చారు. చాలా ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. వారి అరుపులు, కేకలకు దిగ్గజముల చెవులకు బాధ కలిగినదని అతి శయోక్తిలో వర్ణనమిది. అంత అధికమైన కోలాహల వాతావరణం నెలకొందని పద్యమునకు తాత్పర్యం.

తేటగీతి :            కావి ప్రాతలు దారాలు కట్టుముళ్ళు

                        ముష్టులును నీళ్ళ ముంతలు మూలికలును

                        కత్తుల పొదుళ్లు మంత్రముల్కట్టు పసరు

                        లెనయ వచ్చిరి పందెగాళ్ళేవు రేగి             

( హంస వింశతి 3అ – 212 పద్యం )

కోళ్ళు అనేక లక్షణాలతో ఉంటాయి. ముఖ్యంగా పందానికి పెంచబడుతున్న కోళ్ళకి చాలా చరిత్ర ఉంటుంది. డేగవన్నె, పింగళి వన్నె, కోడివన్నె, డేగకాకి వన్నె ఇలా సాముద్రిక చిహ్నాలను బట్టి 5 జాతులు ఉంటాయి. వీటిలో ఏ పుంజు ఎప్పుడు గెలుస్తుందో, ఏ జాతి పుంజుకు భోజన సమయమెప్పుడో, నిద్రా సమయమెప్పుడో, ఆ పుంజుతో ప్రయాణం ఎప్పుడు చేయవచ్చో, దాని మరణ కాలమెప్పుడో – ఈ వివరాలన్నీ తెలిసికొని వాని ఉపజాతులు జాతకాలు పరిశీలించి పందెమునకు తగిన వనుకొన్న పుంజులను నిర్థారించి వానిని తీసికొని పందెములు జరిపే ఆట స్థలమునకు పందెగాళ్ళు వచ్చారు.

గిరిగీసి వృత్తాకారపు గీత లోపల పుంజులను వదలిపెడతారు. బరిలో నిలబడి ఉన్న కోళ్ళను చిటికె వేసి యుద్ధమును ప్రారంభించమని బయటకు తప్పుకుంటారు. పుంజులు పెడీ పెడీ తన్నడం మొదలు పెడతాయి. అదొక కురుక్షేత్రం మాదిరి కోలాహలం.

కోడిపుంజులకు పందెంగాళ్ళు పెట్టిన పేర్లు ఈ సీసపద్యంలో వర్ణించబడింది.

సీసపద్యం :          పట్టేజుట్టుది మైలపుట్టజట్టుది గూబ

                                    చిలుక జుట్టుది మూగ చిల్లకోడి

                        పట్టుమార్పుది యరజుట్టుది బోరది

                                    బూడిద వన్నెది పొడది చిల్ల

                        కాలుది గుజ్జుది గాజుల కాలుది

                                    కలది పండె ఱ్ఱదిగద్దెకాలు     

                        దెఱ్ఱని దురగది నీకెలకాలిది

                                    నల్లది కొప్పది త్లెయురగ

తేటగీతి :            పిల్ల వేళ్ళది మొద్దుది నల్లయురగ

                        లనగ దగుకత్తి కాట్టంజులందులోన

                        ఓసపు పావళ్ళు కాలందెలెసగునట్లు

                        రావిరేకలు బిరుదలు – ఠీవిగలుగు           

( హంస వింశతి 3అ – 214 పద్యం )

వాటి ఆకార విశేషాలను బట్టి వాటిని పిలుస్తారు. ఎక్కువగా కూత పెట్టని పుంజు “ మూగ ” అనీ బూడిదరంగులో ఉన్నదానిని బూడిద వన్నెది అని పేరెట్టారు. పుంజులకు పసుపు గుడ్డ పీలికలు చుట్టి రక్షణ కోసం రావిరేకలు కట్టారు. అంటే రావి ఆకు ఆకారంలో ఉండే వెండి రేకులు అని అర్థం ఇలా అలంకరింపబడిన పుంజులు చాలా ఠీవిగా ఉన్నాయి.

సీసపద్యం :          గరుడుండు శరభంబు కంచుడమారము

                                    రణభేరి కార్చిచ్చు ఱాతిబొమ్మ

                        రాముబాణముమిత్తి రాహుత్తి పిడుగుహం

                                    వీరుండు పుంజుల వేరువిత్తు

                        గండకత్తెర గుండె గాలంబు మాస్టీడు

                                    పట్టభద్రుడు జెట్టి భైరవుండు

                        కత్తులపొది సింహగాలి భేతాళుండు

                                    పసులపాతర పాదరసము చిలుకు

తేటగీతి :            టమ్ము సుడిగాలి చక్రంబు నలజడదరి

                        శూలము ఫిరంగి వెలినక్క సాలువంబు

                        కాలరాత్ర్యంతకుడు పందెగాండ్ర మెచ్చు

                        లనెడు పేరుల పుంజుల గొని మొగించి     

( హంస వింశతి 3అ – 215 పద్యం )    

ఇవి అన్నీ పందెపు పుంజుల పేర్లే, కోడి పుంజులు పందెంలో ఏ విధంగా పౌరుషం ప్రదర్శిస్తాయో ప్రత్యర్థులైన పుంజులను ఓడిస్తాయో చూసి వాని స్వభావానికి అనుగుణంగా పెట్టిన పేర్లు ఇవి. కార్చిచ్చు ఒక జాతి పుంజు పేరు. కార్చిచ్చు అంటే అడివిని కాల్చేస్తూ వ్యాపిస్తున్న అగ్ని. అదీ ఇటువంటి పరాక్రమం కలది అని అర్థం అన్నమాట. అలాగే మరోపుంజు పేరు ‘ రాతిబొమ్మ ’. బరిలోకి దిగితే ధైర్యంగా స్థిరంగా నిలబడుతుంది. పారిపోదు అని భావం. మస్టీడు – అంటే ఏనుగును నడిపేవాడు. అంతటి పరాక్రమంగల పుంజు అని అర్థం. సింహగాలి – సింహంలా గాల్లోకి ఎగురుతుంది అని బహుశ అలా చెప్పి ఉంటారు. నలజదడి – నల్లని ఈకలు ధరించినది. అరిశూలము – కాళరాత్రి లాంటి సంస్కృత సమాసాలు కూడా వీటికి నామధేయాలే. కవిత్వం కూడా మన జానపదుల జీవితంలో అంతర్భాగం.

మిగిలిన పేర్లన్నీ సులభంగా అర్థమవుతాయి.

ఈ విధంగా జానపద సాహిత్యంలో స్పష్టంగా ప్రాచీనమైన ఆచారాలు, నమ్మకాలు గుబాళీస్తూ చదువరులను అలరిస్తూనే ఉంటాయి. దీనిలోని సాంఘిక చరిత్ర, వైభవము తెలుగుజాతి చరిత్ర సంస్కృతులతో రంగరించి ఆహ్లాదాన్ని కలిగిస్తూ తెలుగు వారి హృదయాలపై చెరగని ముద్ర వేసింది జానపద సాహిత్యం.

 

——- ( 0 ) ——-

 

Please visit this page