12_007 ముకుందమాల – భక్తితత్వం

నారాయణాంకితంకాక ఎంత గొప్ప కర్మైనా ఫలితాన్నివ్వలేదు. నారాయణ భక్తి పూర్వకంగా కాక కేవలం వేదాలు వల్లె వేసినందువలన అరణ్యరోదనమే తప్ప  మేలు కలుగదు. వేదోక్త కర్మలు పాటించడం కూడా, కండలు కరగడానికి చేసే కసరత్తు లాంటిది కాకూడదు. యజ్ఞాదికర్మలు కూడా భక్తిహీనమైననాడు బూడిద పాలే. అందుకే కఠోపనిషత్తులోనూ, ముండోపనిషత్తులోనూ కూడా.

            శ్లో॥       నాయమాత్మాప్రవచనేన లభ్యః నమేధయా నబహునాశృతేన

                      యమే వైషవృణుతే తేన లభ్యః తస్యైషత్మా వివృణుతే తనూంస్వామ్‌॥

            కేవలప్రవచనాలు పదేపదే విన్నంతమాత్రాన, శాస్త్ర పాండిత్యం సంపా దించడం వలన మాత్రం చేత, ఆ పరమాత్మ లభించేవాడు కాడు. పరమాత్మ ప్రాప్తికి ఆత్మస్వరూపుడైన పరమాత్మ అనుగ్రహమే ఉపాయం అని చెప్పబడిరది. అందుకు నారాయణ స్మరణ పూర్వక భక్తి ఒక్కటే ఉపాయం అంటారు పెద్దలు.

            శ్లో॥       నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా

                      శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా

            వేదాధ్యయనం కాని, తపస్సు కాని, యాగం కాని, చివరకు దానం కానీ, ఎన్ని చేసినా భక్తిలేని వానికి భగవత్ప్రాప్తి కలుగదు. అని భగవానుడే భగవద్గీతలో చెప్పియున్నాడు కదా! అందుకే ఏ కార్యం తలపెట్టినా, వేదాధ్యయనం ప్రారంభించే ముందు, భక్తి పూర్వకంగా ‘‘హరిః ఓం’’ అని మొదలుపెట్టి ‘‘హరిః ఓం’’ అని పూర్తి చేయమని విధించింది మన సాంప్రదాయం. వేదాధ్యయనం కాదు ఫలితాన్నిచ్చేది. భక్తిపూర్వకంగా చేసిననాడు మాత్రమే నారాయణుడు ఆ అధ్యయనానికి సంతుష్టుడై, ఫలితాన్నిస్తాడు. ధర్మకార్యాలు ఎన్ని చేసినా, నారాయణార్పితం కాకుంటే బూడిదలో హోమం చేసినట్లే. పవిత్రతీరాల్లో స్నానం మాత్రం శుద్ధి నివ్వదు. మనం చేసే భక్తి పూర్వక నారాయణ స్మరణే శుద్ధినిచ్చేది.

            ప.         మనసు నిల్పశక్తి లేకపోతే

                       మధుర ఘంటవిరుల పూజేమిసేయు    ॥ మనసు ॥

            అ.ప.     ఘనదుర్మదుడై తా మునిగితె

                       కావేరి మందాకిని ఎటు బ్రోచు             ॥ మనసు ॥

            చ          కామక్రోధుడు తపంబొనర్చితె

                        కా(శి)చి రక్షించునో త్యాగరాజనుతా     ॥ మనసు ॥        

అంటారు త్యాగరాజుల వారు.

 

            ఏనుగు కొలనులో దిగి శుభ్రంగా స్నానం చేస్తుంది. తిరిగి బైటికి రాగానే దుమ్ముని మీద చిమ్ముకుంటుంది! మరింత దుమ్ము అంటుకోవడానికే కానీ, స్నానం వలన ప్రయోజనమేమీ ఉండదు. అందుకే భక్తిహీనకార్యాన్ని గజస్నానంతో పోలుస్తారు?

           సంక్రాంతి ముగ్గు 01

          అందుకే తీర్థయాత్రల్లో స్నానం చేశాము అనుకోవడం రాజసం పెరగడానికి కాక, రజస్తమస్సులు తొలగి సత్వగుణం పెరిగి, భగవత్ప్రాప్తిని కల్గించడానికి ఉపయోగపడాలి. శ్రీమన్నారాయణ చరణ స్మరణ పూర్వకంగా చేసిన నాడు అలా ఫలప్రాప్తిని పొందవచ్చు భగవదనుగ్రహంతో. అందుకే మన పెద్దలు ఏ కార్యానికైనా భగవంతుని స్మరించడం అనే సత్సాంప్రదాయాన్ని ఏర్పరిచారు. భక్తిపూర్వక స్మరణ ప్రతిఫలాసక్తి రహితం కావాలి కూడా! మనం చేసిన కార్యానికి ప్రతిఫలం మనం అనుకున్నట్లుగా పొందగల్గితే ‘‘ఇదంతా నా స్వప్రయోజనమే’’ నన్న అహంకారం పెరిగిపోతుంది. అనుకున్న ఫలితం రాకపోతే కుంగిపోవడం జరుగుతుంది. అలాకాక ప్రతిఫలం గురించి ఆలోచించకుండా దైవార్పణంగా కార్యం చేసిననాడు ఫలితమేదైనా తట్టుకోగలిగే శక్తి ‘‘భగవద్భక్తి’’ ఇస్తుంది. అందుకూ! ఏ కార్యమైనా భక్తిపూర్వకంగా చేయడం!! ‘‘ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు’’ అంటూ చేసిన కార్యానికి లభించిన ఫలం పరమేశ్వరునికి అర్పించే సాంప్రదాయం కూడా ఇందుకే!!

  1.              శ్రీమన్నామ ప్రోచ్చ నారాయణాఖ్యం

                   కేన ప్రాపుః వాంఛితం పాపినోపి

                   హా! నఃపూర్వం వాక్ప్రవృత్తాన తస్మిన్‌

                   తేనప్రాప్తం గర్భవాసాది దుఃఖమ్‌

          కృారాత్ముడజామీళుడు, నారాయణయనుచు నాత్మనందను బిలువన్‌,

          ఏ రీతినేలు కొంటివి! ఏరీ నీసాటి వేల్పులెందును కృష్ణా!

          ఎంతటి పాపాత్ములైనా శ్రీమన్నారాయణ నామాన్ని ఉచ్ఛరించి పాపాలు  పోగొట్టుకుని, తమ కోర్కెలు తీర్చుకున్నారు కదా! అయ్యో! నా వాక్కు గతంలో ఆ నామాన్ని ఉచ్ఛరించింది కాదు. అందుకే నాకీ జన్మము, ఈగర్భవాసాది దుఃఖమునూ అంటూ బాధపడుతున్నారు భగవానుని సర్వవ్యాపకత్వాన్ని తేలియజేసే నామాల్లో. విష్ణు, వాసుదేవ, నారాయణ నామాలు ముఖ్యమైనవి.

          ఈ నామాల్లో నారాయణ నామం సర్వేశ్వరుని వ్యాపకత్వాన్ని సంపూర్ణంగా వివరించేది. నారములు అంటే సర్వపదార్థములు, అయన ` ఆధారముగా కలవాడు నారాయణుడు. ఈ విధంగా సర్వపదార్థములలోనూ అంతర్భహిర్వ్యాప్తిని పొందిన పరతత్వాన్ని తెలియజేసే నారాయణ శబ్దం భగవానునికి ప్రధానమైన నామము.

          ఉపనిషత్తులలో ‘‘నారాయణః పరబ్రహ్మ తత్వం నారాయణః పరః’’ అని చెప్పబడిన పరబ్రహ్మ, పరంజ్యోతి, పరమాత్మ అన్నీ ఆ నారాయణుడే!

                   నారాయణేతి నామాస్తి వాగస్తి వశవర్తీనీ

                   తథాపి నరకే ఘోరే పతంతీతికిమద్భుతం

          ఉచ్ఛరించడానికి తగిన వాక్కుంది. ఉచ్ఛరించడానికి నాలుకుంది. సులభంగా ఉచ్ఛరించదగిన నారాయణ నామముంది. అయినా నరకంలో పడుతున్నారే జనాలు. ఇంతకంటే చిత్రమేముంది! అని వ్యాసుడు బాధపడ్డారట.  ‘‘సంకీర్త్యనారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాస్సుఖనోభవన్తి॥ నారాయణ’’ అన్న శబ్దం ఉచ్చరించినంత మాత్రానికే అన్ని దుఃఖాలనుండి విముక్తి గలిగి సుఖించగలరు. అని విష్ణు సహస్రనామ స్తోత్ర ఫలశృతిలో చెప్పబడిరది. అందుకే, ఇప్పుడిలా గర్భవాసాది దుఃఖం పొందాము అంటే గతజన్మలో నారాయణుని స్మరింపలేదని తెలుస్తోంది కదా? కనీసం ఇప్పుడైనా ఆ నారాయణుని స్మరణ చేసి, మరుజన్మ లేకుండా చేసుకుందాం. ఎంతటి పాపాత్ములైనా నారాయణ నామోచ్ఛారణం వల్ల సమస్త పాపాలూ పోగొట్టబడి కోరికలు తీరి జన్మరాహిత్యం పొందగలరు. ఇప్పటికైనా అలా చేద్దాం అంటున్నారు కులశేఖర మహారాజు.

శ్లో॥      పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం

          ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహిమురారే ॥

          స్వామీ! ఈ జనన మరణ చక్రం నుండి కృపతో కాపాడవా తండ్రీ!

 

          చాలదా హరినామ సంకీర్తనం మీకు

          జాలెల్ల నడగించు సంకీర్తనం ॥         అంటారు అన్నమయ్య.

 

          నారాయణా నిన్న నామదస్మరణెయ

          సారామృత వెన్న నాలిగె బరలి ॥ అంటారు పురందరదాసు.

          నారాయణా! తండ్రీ! నీ నామస్మరణమనే అమృతాన్ని నా నాలుక రుచిచూసి తరించనీ॥ అంటారు పురందరదాసులవారు.

             ప.    రామరామయన రాదా రఘుపతి రక్షకుడని వినలేదా

                   కామ జనకుని కధ విను వారికి కైవల్యంబే కాదా ॥ రామ ॥

                   పాపంబులు పరిహారమొనర్చెడి పరమాత్ముండే కాదా

                   నీరజాక్షుని నిరతము నమ్మితే నిత్యానందమేకాదా ॥ రామ ॥

(ప్రయాగ రంగదాసు)

                   ‘‘రా’’ కలుషంబు లెల్లబయలంబడ ద్రోచిన, ‘‘మా’’ కవాటమై

                   ఢీకొనిప్రోచు నిక్కమని ధీయుతులెన్న దదీయవర్ణముల్‌

                   గైకొని భక్తిచే నుడువ గానరుగాక విపత్పరంపరల్‌

                   దాకొనునే జగజ్జనుల దాశరధీ కరుణాపయోనిధీ!!

          ‘రా’ అనే అక్షరం పలకడానికి నోరు తెరువగానే, గతంలో చేసిన పాపాలన్నీ బయటకు  నెట్టివేయబడుతున్నాయి. బయట సిద్ధంగా ఉన్న పాపాలు ‘మ’ అన్న అక్షరం పలకడానికి పెదవులు మూతపడటం వల్ల లోనికి ప్రవేశింపకుండా నిరోధింప బడడంతో కలుషాలన్నీ నశించిపోతున్నాయి.  ఈ విధంగా రామ అన్ననామం ఉచ్ఛరించినంత మాత్రానికే సమస్త పాపాలూ నశించగలవనీ, ఆపదలు తీరగలవనీ విజ్ఞులు చెప్పినా, మూఢులు రామనామాన్ని జపింపకున్నారు కదా! అంటూ బాధ  పడుతున్నారు కంచర్లగోపన్న తన దాశరధీ శతకంలో. ఆ నామ మహిమను తెలిసిన వాడు కనుక.

          దుర్లభమైన మానవజన్మనెత్తినందుకు, మోక్షమార్గ పయనంలో దానిని సద్వినియోగపర్చుకోవాలి. అదే ఉత్తమజన్మ లభించినందుకు కర్తవ్యం. ఆ జగద్గురుడైన శ్రీకృష్ణుని నిజతత్వాన్ని అవగతం చేసుకున్న భక్తవరేణ్యుల అడుగుజాడల్లో నడవడం వల్ల, వారి సేవ చేసుకోవడం వల్ల ఈ కోరిక నెరవేరుతుంది.  తాము ఏ ప్రయత్నాలతో (సాధనాలతో) పరమాత్మను అవగతం చేసుకుని, పొందగలిగారో చెప్పి, సాధకులను కూడా ఆ మార్గాన నడిపించగల గురుమూర్తులీ భాగవతులు.

          ‘‘సతరతి, సతరతి, లోకాంస్తారయతి’’. వాడు తరించును. వాడే తరించును. లోకాలను తరింపజేయును. అంటారు. నారదభక్తిసూత్రాల్లో భాగవతుల గురించి చెబుతూ. కనుకనే అటువంటి భక్తవరేణ్యుల పాదసేవనమే భగవత్ప్రాప్తికి సరైన దారి అంటూ వివరించారు మహారాజు.

  1.               మజ్జన్మనః ఫల మిదం మధుకైటభారే

                   మత్ప్రార్ధనీయ మదనుగ్రహ ఏష ఏవ

                   త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య

                   భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ ।

          భగవంతుని ఉనికి భాగవతుల హృదయసీమలలోనట ‘‘సారెకు శ్రీహరి పద సారసముల ధ్యానించుచు నారాయణ నామములను పారాయణ మొనరించే’’ పరమభాగవత శిఖామణులు వీరు. సదా నారాయణ నామోచ్ఛారణలో హరిగుణ కీర్తన చేస్తూ స్వామిని సదా హృదయంలో నిల్పుకుని ఉండే అదృష్టవంతులు!

          అద్వేష్టాసర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ

          నిర్మమోనిరహంకార స్సమదుఃఖసుఖఃక్షమీ

          అని భగవద్గీత భక్తియోగంలో చెప్పబడిన లక్షణాలు కల్గిన భక్తులు.

          ‘‘సిద్ధిర్భవతివానేతి సంశయో-చ్యుతసేవినాం

          నతుతర్పరిచర్యా రతాత్మనామ్‌

          భగవంతుని సేవించేవారికి సిద్ధికలదో లేదో సంశయమేమో కానీ, భగవద్భక్తులను సేవించిన వారికి మాత్రం సిద్ధి కల్గడంలో సంశయమేమాత్రము లేదు!

          నారదుల వారు తమ భక్తి సూత్రాల్లో అంటారు ‘‘తస్మిన్‌స్తజ్జనే భేదాభావాత్‌’’  భగవంతునికీ భగవద్భక్తులకూ మధ్య ఏమాత్రం భేదమన్నది లేదు! అని.

          ‘‘పుట్టుభోగులము మేము భువి హరిదాసులము’’ అంటారు అన్నమయ్య. అటువంటి భాగవతోత్తములైన హరిదాసులకు నన్ను భృత్యుని చేయిస్వామీ! అంటారు కులశేఖరులు.

          నామమహిమను చెప్పాక, ఆ నామాన్ని సదా జపిస్తూ, నామాన్ని హృదయంలో నిలుపుకున్న భక్తుల గొప్పదనాన్ని చెప్పి, వారికి దాసుడయ్యే భాగ్యానికి ఉత్సాహపడుతున్నరు కులశేఖరులు.

          భగవానుడెవరిని క్షణకాలము విడువలేడో, ఎవరు భగవద్దర్శనానికై భోగమోక్షాలను కూడా త్యజిస్తారో, అటువంటి మహాత్ముల దర్శనం, వారి వాత్సల్య పూరిత దృష్టీ తనపై ఉండేలా అనుగ్రహించమని కోరుకుంటారు యామునాచార్యుల వారు.  భగవద్భక్తులను సేవించడం వారి అనుగ్రహం పొందడం జీవితానికి సాఫల్యం.  తద్వారా పరమేశ్వరానుగ్రహ వాల్లభ్యం! ఇదీ జన్మనెత్తినందుకు ఫలం.

 

తరువాయి వచ్చే సంచికలో……

 

——–   ( 0 ) ——-

Please visit this page