ప్రస్తావన
మనిషి జీవితంలో రోజు రోజుకీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా మన సంప్రదాయాలు, ఆచారాలలో కూడా కాలానుగుణంగా అనేక మార్పులు వస్తూనే ఉన్నాయి. మన సంప్రదాయాలను ప్రతిఫలించే వేడుకలు, పండుగలు జరుపుకునే పద్ధతులలో కూడా మార్పులు వస్తూనే ఉన్నాయి. సంప్రదాయం, ఆచారాలతో బాటు ప్రతి వేడుకకి, పండుగకు ఉన్న ఉద్దేశ్యాలు, లక్ష్యాలలో కూడా అనేక మార్పులు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క పండుగకి ఒక ప్రయోజనం ఉంటుంది. అలాగే మన జీవితంలో జరుపుకునే వేడుకలకు కూడా ఒక్కొక్కదానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఆయా క్రతువులు జరుపుకుంటూ ఉంటాము.
ఏ మార్పు అయినా కాలానుగుణంగా జరుగుతూ ఉంటుంది. ప్రజల అభిరుచులు, అవసరాలు, అవకాశాలు వంటి అనేక అంశాల ఆధారంగా ఈ మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు ప్రజల జీవన విధానం మీద ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. అది మంచికి దారి తీస్తే ఏ సమస్యా ఉండదు. ఒకప్పుడు పెళ్లి వేడుక సంప్రదాయం ప్రకారం ఉన్న కొన్ని తంతులు జరిపించడం మీదే దృష్టి పెట్టేవారు. తర్వాత కాలంలో కన్యాశుల్కం, వరకట్నం వంటివి కూడా సంప్రదాయాలుగా మారిపోయాయి. ప్రస్తుతం హంగులు, ఆర్భాటాలే సంప్రదాయాలు అన్నంతగా మార్పులు వస్తున్నాయి. సాధారణంగా ‘ సంప్రదాయం ’ అనేది ఒక సంఘానికో, ప్రాంతానికో, జాతికో, వర్గానికో వర్తించేదిగా ఉంటుంది. వాటికి చెందిన వారందరూ వాటినే విధిగా పాటిస్తారు. అయితే సంఘానికి అంతటికీ వర్తించే సంప్రదాయాల ప్రాముఖ్యత తగ్గిపోయి, వ్యక్తిగత సంప్రదాయాలు ( ? ) జొరబడుతున్నాయి. ఉదాహరణకి కొంతకాలం క్రితం వరకూ పెళ్లి ఫోటోలు, వీడియోలు భవిష్యత్తులో జ్ఞాపకాలుగా మాత్రమే పరిగణించేవారు. అందుకే పెళ్లి తంతు కి అవి ఏ విధంగానూ అడ్డు రాకుండా నిర్వహించేవారు. కానీ ఇటీవలి కాలంలో అసలు పెళ్లితంతు కంటే వీటికే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. ఒకప్పుడు పెళ్ళిచూపుల్లో తప్ప వధూవరులు ఒకరినొకరు చూసుకునే సౌలభ్యం ఉండేది కాదు. దీనివలన ఒకరి గురించి మరొకరికి కుతూహలం పెరిగేదని చెప్పవచ్చును. ఇప్పుడు ప్రేమ వివాహల్లోనే కాదు… పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో కూడా పెళ్లికి ముందే కలుసుకోవడం వంటివి సర్వ సాధారణం అయిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి సినిమాల ప్రభావంతో ‘ ప్రీ వెడ్డింగ్ ’ షూట్ పేరుతో అనేక భంగిమలలో ఫోటోలు, వీడియోలు తీయించుకోవడం జరుగుతోంది. గతంలో పెళ్లి చేసుకుంటున్న జంట ని ‘ క్రొత్త జంట ’ గా పిలిచేవారు. మరి ఇప్పటి జంటలు పెళ్లి నాటికి పాతబడి పోతున్నారు గనుక ‘ పాతజంట ’ అని పిలవవచ్చేమో !
పండుగల విషయంలో కూడా ఇదే పరిస్థితి. ఒకప్పుడు ‘ సంక్రాంతి ’ అంటే ఇంటిల్లపాదికే కాకుండా ఊరందరికీ ఉషారుగా ఉండేది. పంటలు చేతికొచ్చి గాదెల నిండా ధాన్యం, చేతి నిండా డబ్బులు ఉండేవి. సంవత్సరమంతా తమ తమ వృత్తుల ద్వారా ప్రజల అవసరాలను తీర్చిన వారందరికీ, రాబోయే కాలానికి పనికి వచ్చేలా ధాన్యం వంటివి కొలిచే సంప్రదాయం ఉండేది. జానపద కళాకారులందరికీ కూడా ఈ కాలం కలిసొచ్చే కాలంగా ఉండేది. పండుగ సరదా కోసం ఎన్నో ఆటలు, పోటీలు కూడా జరిగేవి. జూదం అనేది కొంతమందికే పరిమితం అయ్యేది. ప్రస్తుత కాలంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. జానపద కళల మీద ఆసక్తి తగ్గిపోయింది. జూద క్రీడల మీద, వ్యసనాల మీద ఆసక్తి పెరిగింది. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒకచోట కలిసి కబుర్లు చెప్పుకొని, కలిసి భోజనం చేసి, ఊళ్ళో జరిగే పూజలు, ఉత్సవాలు, పోటీలలో పాల్గొని కాలక్షేపం చేసే పరిస్థితి తగ్గిపోయింది. ప్రస్తుతం ఎవరి కాలక్షేపం వారిదిగా ఉంది. ఒకప్పుడు సరదా పోటీలుగా మాత్రమే ఉన్న కోడి పందేలు, పశువులతో బండ లాగుడు లాంటివి ఇప్పుడు పూర్తిగా జూద క్రీడలుగా మారిపోయాయి. సంబరం స్థానంలో డబ్బు ప్రభావం పెరిగిపోయింది. అలాగే సమిష్టిగా చేసుకునే పిండివంటలు స్థానాన్ని రెడీమేడ్ పిండివంటలు ఆక్రమించాయి. ఒకప్పుడు బంధుమిత్రులతో కలకలలాడిన పల్లెటూళ్ళు ఇప్పుడు జూద ప్రియులతో కిటకిటలాడుతున్నాయి. అలాగే ఇతర పండుగల విషయంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకి దీపావళి కి దీపాలు పెట్టడం కంటే బాణాసంచా హడావిడికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.
సనాతన సంప్రదాయాల స్థానంలో ఆధునికత చేరుతోంది. ఇది విపరీత పోకడలకి పోనంతవరకు మంచి పరిణామమనే చెప్పాలి. ప్రస్తుత కాలంలో విస్తరించిన సాంకేతికత కారణంగా ఒక ప్రాంతంలోని వేడుకలు, పండుగల సంప్రదాయాలు ఇతర ప్రాంతాలకు కూడా సులువుగా చేరుతున్నాయి. దీనివలన సాంస్కృతిక మార్పిడి జరుగుతుందని చెప్పవచ్చు. ఒకరి సాంప్రదాయాలను మరొకరు గౌరవించుకునే అవకాశం కూడా పెరుగుతుంది. అయితే ఇందులో వికృత చేష్టల ప్రభావం లేకుండా ఉండడం ఎప్పటికీ వాంఛనీయం.
గమనిక : ఇప్పటివరకు పక్ష పత్రికగా వెలువడుతున్న ‘ శిరాకదంబం ’ వచ్చే నెల నుంచి మాసపత్రిక గా అనివార్య పరిస్థితుల్లో మార్చవలసి వస్తోంది. ప్రస్తుతం ‘ అక్షర రూప సంచిక ’, ‘ దృశ్య శ్రవణ సంచిక ’ లుగా నెలకి రెండు సంచికలు వెలువడుతున్నాయి. ఇకపైన రెండూ కలిపి ఒకే సంచికగా వెలువడుతుందని గమనించ ప్రార్ధన.
***********************************************************************************************
మనవి : చందా గడువు ముగిసిన మిత్రులు దయచేసి తమ చందాను వీలైనంత త్వరగా పునరుద్ధరించి సహకరించవలసిందిగా మనవి.
***********************************************************************************************
కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.
***********************************************************************************************
మనవి : ప్రతి పేజీలో ‘ అమెజాన్ పేజీ ’ లింక్ ఉంటుంది. అందులో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు.
మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించవచ్చును.
Please Subcribe & Support
మీ చందా Google Pay UPI id : rraosistla-1@okicici ( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.
అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.
వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com
‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –
Or use G Pay UPI ID : rraosistla-1@okicici ( Please note this isn’t a url link )
or Click here –> paypal.me/sirarao
********************************************************
http://Please visit this page