12_008 అమెరికా అమ్మాయి నృత్య నీరాజనం

ప్రముఖ నాట్యకళాకారిణి, ‘అమెరికా అమ్మాయి ‘ తెలుగు చలన చిత్ర నాయిక కుమారి దేవయాని తో ఇంటర్వ్యూ ( ముఖాముఖీ )

ముందు మాట

శాస్త్రీయ నృత్యానికి పట్టం కట్టిన తెలుగు సినిమాలు రాశిలో తక్కువైనా, వాసికెక్కినవి లేకపోలేదు. ఇలాంటి సినిమాలలో పరిపాటిగా ఉండే నృత్య సన్నివేశం ఆ సినిమా విజయానికి దోహదకారి అవడాన్ని మనం ఎన్నో సందర్భాలలో గమనించాము. ’70 దశకం లో విడుదలైన ” అమెరికా అమ్మాయి “, ’80 దశకం లో విడుదలైన ” స్వర్ణకమలం ” చిత్రాలను ఇందుకు కొన్ని ఉదాహరణలు గా చెప్పవచ్చును. ఈ రెండు సినిమాలలోనూ ప్రముఖ పాత్రలను పోషించిన నృత్య కళాకారిణులు, భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని గురుముఖంగా ఆసక్తి తో అభ్యసించి, విశ్వవ్యాప్తంగా ప్రదర్శనలను ఇచ్చి పేరు ప్రఖ్యాతులను గడించినవారే ! నిజానికి, వారు పుట్టుక రీత్యా విదేశీయులే అయినా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అత్యంత ఆసక్తిని, గౌరవాన్ని కలిగి పట్టుదలతో కృషిచేసి ఆ నాట్య రీతులను నేర్చుకొనడం ఎంతో ముదావహం, ప్రశంసనీయం ! ” స్వర్ణకమలం ” చిత్రంలో నటించిన శ్రీమతి షెరాన్ లోవెన్ అమెరికా దేశీయురాలు. కాగా, ఆమె భారత దేశానికి వచ్చి ఒడిస్సి నృత్యాన్ని గురు శ్రీ కేలూచరణ్ మహాపాత్ర గారి వద్ద శిక్షణ పొంది నేర్చుకుని ఇక్కడే స్థిరపడ్డారు. అలాగే ‘అమెరికా అమ్మాయి ‘ చిత్రం లో అమెరికా అమ్మాయి అక్కడ ఉన్న‌‌‌ ఒక భారతీయుని ప్రేమించి పెళ్లి చేసుకుని భారతదేశానికి వచ్చి ఇక్కడి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను గౌరవించి, ఆచరించి, తెలుగు ను నేర్చుకుని ‘తెలుగు అమ్మాయి’ అయి శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకుని ప్రదర్శనలను ఇవ్వడం ఈ చిత్ర కథాంశం. చిత్ర కధానాయిక గా, దేవయాని ఆ పాత్రలో మమేకమై దానికి పరిపూర్ణ న్యాయం చేయడం విశేషం ! ఆమె జన్మించినది ఫ్రాన్స్ రాజధాని నగరమైన పారిస్ లో. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు అన్నిక్ చమోట్టి. 

షెరాన్ లోవెన్, దేవయాని – ఇద్దరూ కూడా ఢిల్లీ లో స్ధిరపడి వారి రంగాలకు సంబంధించి డాన్స్ అకాడెమీ లను స్థాపించి వాటిని చాలా సమర్ధవంతంగా నిర్వహిస్తూ, అనేక నాట్యకళాకారులకు శిక్షణను ఇస్తూ, ఎంతో కాలంగా అవిరళ కృషి చేస్తున్నారు.

అమెరికా లో తాను తలపెట్టిన నాట్య ప్రదర్శనలకు సంబంధించిన కొంత స్థానిక సమాచారం విషయమై దేవయాని గారు ఇటీవల నన్ను సంప్రదించిన సందర్భం గా వారి నాట్య కళానుభవం, తత్సంబంధమైన విశేషాలను వారి మాటలలో, వారి నుండి వినాలని నాకు ఆసక్తి కలిగి, ఇంటర్వ్యూ రూపంలో వారిని కొన్ని ప్రశ్నలను అడగగా, వాటికి ఆమె ఎంతో సౌజన్యం తో సానుకూలంగా స్పందిస్తూ, చాలా ఆసక్తికరమైన సమాధానాలను ఇచ్చారు.

ఆ ఇంటర్వ్యూ కి ఇలా ఒక వ్యాస రూపాన్ని ఇచ్చి మన శిరాకదంబం రాబోయే సంచికలో మీ ముందు ఉంచుతున్నాను. మీరు దయచేసి, ఈ నా ప్రయత్నాన్ని ప్రోత్సహించి, ఆ వ్యాసాన్ని చదివి మీ అమూల్యమైన స్పందనను సవివరంగా తెలియజేయవలసినదిగా మిమ్మల్ని మనసారా కోరుతున్నాను.  . ఆ మీ సుస్పందన దేవయాని గారికి కూడా స్ఫూర్తిదాయకం కావాలని, కాగలదని విశ్వసిస్తున్నాను.

ధన్యవాదాలు ~

శుభాకాంక్షలతో .

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

 

Please visit this page