12_008 చేతికొచ్చిన పుస్తకం 11

చేతికొచ్చిన పుస్తకం-51:

సి. రాఘవాచారి సంపాదకీయాలు

గత శతాబ్దంలో చివరి మూడు దశాబ్దాల పాటు ‘విశాలాంధ్ర’ దినపత్రిక సంపాదకులుగా ఆ సంస్థకు గౌరవాన్ని, పేరును ఇనుమడింప చేసిన సి రాఘవాచారి తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్,హింది భాషలతో పాటు జర్నలిజం, లా, సాహిత్యం, సామాజిక విషయాలలో అపారమైన నిష్ణాతులు! రాఘవాచారి బాగా చదువుకోవడమే కాదు అంతరార్థం, అసలు అర్థం పట్టుకోవడంలో; ఆకళింపు చేసుకున్న విషయాన్ని అలవోకగా, సమయోచితంగా చెప్పడంలో; పరిమితంగా రాయడంలో దిట్ట!! ఇదే లక్షణం ఆయనను ఇతర తెలుగు సంపాదకుల నుంచి వేరు చేస్తుంది!!!

వారు ‘విశాలాంధ్ర’ దినపత్రికకే పరిమితం కావడం, తన రచనలను సంకలనాలుగా వేసుకోక పోవడంతో విజయవాడకు దూరంగా పెరిగిన నా లాంటి వారికి రాఘవాచారి దాదాపు అందకుండా ఉండిపోయారు. నేను 1996-2002 కాలంలో విజయవాడలో ఉద్యోగం చేయడం వల్ల వారిని జాగ్రత్తగా పరిశీలించాను, ఓ రకంగా నాకు వారు రోల్ మోడల్!

సి.రాఘవాచారి ట్రస్ట్, విజయవాడ 2020 అక్టోబర్ లో ‘సాహిత్యం, సంస్కృతి, కళలు’ పేరుతో 91 సంపాదకీయాలను 266 పుటలతో మొదటి సంపుటిని వెలువరించింది. వివిధ సందర్భాలలో ‘నివాళి’ గా రాసిన 112 సంపాదకీయాలను రెండో సంపుటంగా జూన్ 12 న హైదరాబాద్ లో జరిగిన సభలో ఆవిష్కరించారు. ముగ్ధుం భవన్ లో జరిగిన సమావేశంలో సురవరం సుధాకర రెడ్డి, ఆర్వీ రామారావ్, కె శ్రీనివాసరెడ్డి, కె నారాయణ, చాడా వెంకటరెడ్డి ప్రముఖులు అతిథులుగానూ; ఎంతో మంది జర్నలిస్టులు సభికులుగా పాల్గొన్నారు.

రాఘవాచారి రాసిన సుమారు తొమ్మిది వేల సంపాదకీయాల నుంచి ఎంపిక చేసి ఇలా మరి కొన్ని సంపుటాలను ముందు ముందు ట్రస్ట్ వెలువరించనుంది. 150₹, 200₹ విలువైన ఈ సంపుటాలు విశాలాంధ్ర, నవచేతన, ప్రజాశక్తి బుక్ హౌస్ లలో లభిస్తున్నాయి.

రాఘవాచారి శ్రీమతి జ్యోత్స్న గారు తీసుకుంటున్న శ్రద్ధ అభినందనీయం!

 

చేతికొచ్చిన పుస్తకం-52:

నవ్వుల పువ్వుల చంద్ర (ప్రతాప) హాసం!

సి. రాఘవాచారి చివరి కంటా కమ్యూనిస్టు దినపత్రిక ‘విశాలాంధ్ర’ లో కొనసాగారు. కేవలం పేరులోనే వైరుధ్యం, నిలువెల్లా పాండిత్యం, ప్రతిభా!

చంద్రప్రతాప్ లో కూడా వైరుధ్యం పేరులోనే కనబడుతుంది. సూర్యుడికి ప్రతాపం కానీ, చంద్రుడికి ప్రతీక రొమాన్స్ కదా! అయితే ఈ ‘చతుర’ చంద్రహాసుడు ‘విపుల’ంగా హాస్య వ్యంగ్యం చిందించడం వైరుధ్యపున్యాయం!

చంద్రప్రతాప్ గారిని 2007లో మద్రాసులో తెలుగు మహాసభల్లో ఇద్దరి తర్వాత అదే వరుసలో కూర్చున్న మిత్రుడిగా తొలి పరిచయం! అప్పటికే వారు జంట మాసపత్రికల ఎడిటర్. తర్వాత మేము కలుసుకున్న దాఖలాలు లేవు, కానీ పదవులు వదిలిన తర్వాత మేమిద్దరం ఫేస్బుక్ ద్వారానూ, ఫోను గుండాను తరచు కలుసుకుంటునే ఉన్నాం.

2017 మే మాసం నుంచి ఓ 45 సంచికలలో ‘చంద్రహాసం’ కాలమ్ రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం! ‘విపుల’ కు రాసినా రెండు పేజీల్లో కుదించి హాస్య వ్యంగ్యాలను చిలకరించారు. లేకపోతే (తనే ఎంచుకున్న అందమైన శీర్షిక) ‘రసాభాసాలంకారం’ కాగలదని ఎరుక ఉన్న ఎడిటరోత్తములు వీరు!

అందమైన ముఖచిత్రం, బొమ్మలతోపాటు 45 వ్యాసాలు, పన్గన్ నారాయణ ముందుమాట కలిసిన 160 పేజీల ఈ పుస్తకం వెల₹150. వలయువారు మొబైల్ 8008143507 లేదా, ఈ మెయిల్ pratap.chandra08@gmail.com ను సంప్రదించవచ్చు! శృతి మించకుండా, గతి తప్పకుండా చంద్రప్రతాప్ తన హాస్య కలం నడిపినందులకు అభినందనలు!

 

చేతికొచ్చిన పుస్తకం –53:

అవధానం అమృతవల్లి బువ్వపూలు

 

బువ్వ పూలు ఏమిటి అని తొలిసారి గమనించినప్పుడు ఆశ్చర్యం కల్గిస్తుంది ఈ సంపుటి నామకరణం!

అదే కవయిత్రి అవధానం అమృతవల్లి ప్రత్యేకత!

నీ కంచంలో బువ్వ పూలు

పూయించేందుకు రోజంతా

నేలను చెమటతో తడుపుతుంటాడు

అని సంపుటి తొలికవితలోనే పలకరించే పాదాలు రైతుబిడ్డ శ్రమ జీవితాన్ని చిత్రిక పడుతాయి. రెండు నెలల క్రితమే చేతికందిన వంద పేజీల ‘బువ్వపూలు’ కవితా సంపుటిలో 63 కవితలున్నాయి.

ఆకాశవాణి నికార్సైన శ్రోతగా పరిచయం అయిన కడప ప్రాంతపు టీచరమ్మ అవధానం అమృతవల్లి మంచి కవయిత్రి అని ముందుమాట రాయమని పంపినపుడే బోధపడింది.

వెలుగు, వెన్నెల, మధువు, మధుపం ఇంకా ఖేదం, దుఃఖం,నిరాశ, నిర్వేదం కలిగలిసిన ఈ కవితా పొదరిల్లు జీవితపు విషాదాల్ని తార్కికంగా, తాత్వికంగా పట్టిచూపుతోంది.

కిచకిచమంటూ సవ్వడి చేస్తూ

కిటికీ చువ్వలపై బారులు తీరి

అదేపనిగా సవ్వడి చేస్తూ

చూరుకు కట్టిన కంకుల పైచేరి

…వంటి రమణీయమైన దృశ్యాలను మలిచే పాదాలు మనసును తట్టి లేపుతాయి.

వర్చస్వీ అందమైన ముఖచిత్రంతో వెలువడిన ఈ (125₹) పుస్తకం కావాలంటే కవయిత్రి Amrutha Avadhanam గారిని ఫేస్బుక్ లోనే సంప్రదించవచ్చు.

 

చేతికొచ్చిన పుస్తకం-54:

చంద్ర ప్రతాప్ ‘టాంక్ బండ్ కథలు

 

‘…అలా వస్తున్నప్పుడు మెట్రో పిల్లర్ నెంబర్ 238 వద్ద లెఫ్ట్ తీసుకుని రెండో టర్న్ దగ్గరి కొచ్చి ఫోన్ చెయ్ … నేను వస్తాను… అక్కడికి వాకింగ్ డిస్టైన్స్ మా ఇల్లు…” అని భాగ్యనగరంలో చిరునామా చెప్పడం ఇప్పుడు కొత్త కాదు! మెట్రో నేడు హైదరాబాద్ నగర పరిణామ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు మిగిలిపోయింది. అలాంటి మరో కీలకమలుపే టాంక్ బండ్! ఇలాంటి వాటి ఆధారంగా జనజీవనం గణనీయంగా ప్రభావితం అయ్యింది! మరి అలాంటి విషయాలు సాహిత్యంలో సహజంగానే నమోదు అవుతాయి.

విపుల, చతుర మాస పత్రికల సంపాదకులుగా పేరుగాంచిన చంద్ర ప్రతాప్ 2016 లో ‘టాంక్ బండ్ కథలు” వెలువరించారు. ఈ 42 కథలూ అంతకు ముందు ‘చతుర’ లో ధారావాహికంగా వచ్చాయి. కాలమ్ కనుక నిడివిలో 3-4 పేజీలు అతిక్రమించని క్రమశిక్షణ గమనించవచ్చు. శైలి గురించి చెప్పనక్కర్లేదు, ఎందుకంటే జగమెరిగిన జర్నలిస్టు కదా!

ఇక కథావస్తువు అంటారా? టాంక్ బండ్ తో ముడిపడిన అన్ని జీవిత పార్శ్వాలు- ఆశ, ఆనందం, నమ్మకం, కోరిక, ప్రేమ, విషాదం వగైరా ఎన్నో కనబడు తాయి. ఆడపిల్ల తండ్రి, గెలుపు, ప్రాయశ్చిత్తం, ఇద్దరు మిత్రులు, మళ్ళీ అమ్మ దగ్గరికి, రక్తసంబంధం,తేనె ప్రవాహం,నాన్నా! నేను మారాను, త్యాగం, ఔదార్యం ఖరీదు, క్షమ, ఆకలి,ఆమె ఎందుకేడ్చింది? …వంటి నామకరణాలే ఆ కథల నేపథ్యంగా నడిచే జీవితాన్ని విశదం చేస్తాయి.

ఆసక్తి ఉన్న వారు Kantheti Chandra Pratap గారిని ఫేస్బుక్ లోనే సంప్రదించవచ్చు.

 

చేతికొచ్చిన పుస్తకం-55:

ఒక కల రెండు కళ్ళు

 

పాతికేళ్ళ క్రితం అనంతపురం ఆకాశవాణిలో పనిచేసేకాలంలో ఆ జిల్లాలో జగమెరిగిన కథారచయితలు చాలామంది ఉన్నారు, కానీ అదే స్థాయిలో కవిత్వం రాసేవారు లేదని పదే పదే అనిపించింది. అందువల్ల అక్కడ నుంచి ఏ కొత్త గొంతు వచ్చినా పరిశీలించాలనిపించేది. దీనికి ఫేస్బుక్ ఒక మంచి, సులువైన మార్గంగా ఇప్పుడు నాకు ఉపయోగపడుతోంది.అలా ఫేస్బుక్ లో పరిచయం అయిన కవయిత్రి రజిత కొండసాని

“కూరలు తరిగేందుకే కాక

మొగుడికి మొలిచిన

మగాడిననే కోరలు తరిగేందుకూ.”..అంటూ ఒక కవితలో అంటారు.

“వంటింట్లో పిండి రుబ్బేందుకు తిరిగే

మిక్సీ బ్లేడ్లు అరుగుతాయట..”

అంటూ సాగి

” …ఆమెకు మాత్రం ఏవీ అరగవట

మరీ విడ్డూరం కదూ?”

అంటూ ముగిస్తోంది కవయిత్రి మరౌ కవితను.

అనంతపురం జిల్లా కాదు కాదు, ఇప్పుడు సత్యసాయి జిల్లా కవయిత్రి కరువు, రైతు గురించి రాయకుండా ఉండరు కదా!

” … కనికరం లేని కారుమేఘం

కురవనని మొహం చాటేశాక …”

వంటి పాదాలు కూడా ఈ కవితల్లోనే కనబడుతాయి! అంతేకాదు

“… ప్రభాత వేళ నా హృదయాన్ని

నీ కోసం తూరుపు దిక్కును చేస్తాను…” అని కూడా రమణీయంగా అనగలరీ కవితా రజిత!

అయితే ఒక్క విషయం, ఎంత కొత్త కవయిత్రి అయినా ఐదు ముందుమాటలు చాలా ఎక్కువ. అవి కవిత్వం దగ్గరికి వచ్చిన పాఠకుడ్ని చికాకు పెడతాయి.

కొత్త కవయిత్రి కి స్వాగతం!

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

 

Please visit this page