ఈ రహస్యమెరిగిన కులశేఖరులు నీ భృత్యునకు భృత్యుడైన వాని పరిచారకునకు భృత్య భృత్య భృత్యుడనై సేవించుకునే అవకాశం, అదృష్టం కల్గనీ స్వామీ! అంటారు మహారాజు.
భగవద్భక్తులు సాధకులకు మార్గదర్శకులు. వారి అనుగ్రహం లభించడం అంటే గురుకటాక్షం లభించినట్లే అంటే భగవంతుని చేరే దారి సుగమమయి నట్లన్నమాట! వారితోడి సద్గోష్ఠి భగవంతుని పొందడానికి సన్మార్గం. అందుకే అన్నారు శంకరాచార్యుల వారు
శ్లో॥ సత్సంఙ్గత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం ।
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః ॥
అని. కనుక జీవన్ముక్తి నందే ప్రయత్నంలో సత్సంగానికున్న విలువ ఎంతో గొప్పది.
ప. అచ్యుతా మిమ్ము దలచే యంత పనివలెనా
ఇచ్చల మీవారే మాకు ఇహపరాలీయగా ॥
అ.ప. మిమ్మునెరిగినట్టి మీ దాసులనెరిగే
సమ్మతి విజ్ఞానమె చాలదా నాకు ॥
చ. అంది నీకు భక్తులైన అలమహానుభావుల
చందపు వారిపై భక్తి చాలదా నాకు
కందువ శ్రీ వేంకటేశ కడు నీ బంటు బంటుకు
సందడి బంటనవుటే చాలదా నాకు ॥
వేంకటేశా! మేం నిన్ను తలచేంత పని లేకుండానే నీ దాసులే మాకు ఇహపరాల నివ్వగల సమర్థులు. ఎందుకంటే నిన్ను సంపూర్ణంగా తెలుసుకున్న విజ్ఞానులు వారు. మరి వారిని తెలుసుకుని అనుసరిస్తే నిన్ను తెలుసుకున్నట్లే కదా! అందుకే నీ బంటు బంటుకు బంటునయినా చాలు. నీకు దాసుడనై తరించినట్లే! అంటారు అన్నమయ్య దాసోహపద్ధతిని వ్యక్తపరుస్తూ.
శ్రీ వైష్ణవ అభినివేశంలో ఇది సహజమైనదే కదా! ఈ భావమే కులశేఖరులది కూడా!
‘‘నీ పాద కమల సేవయు నీపాదార్చకులతోడినెయ్యము
నితాంతాపార భూతదయయున్ తాపసమందారనకు దయ చేయగదే’’
అదీ జన్మనెత్తినందుకు ఫలం.
- నాథే నః పురుషోత్త మే త్రిజగతా
మేకాధి పే చేతసా
సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే
నారాయణే తిష్టతి
యం కంచి త్పురుషాధమం కతిపయ
గ్రామేశ మల్పార్థదం
సేవాయై మృగయామహే నరమహో
మూకావరకా వయం
ముల్లోకాలకూ ఏకైకనాధుడు, పురుషోత్తముడు, మనసుమాత్రంతో సేవించితే తనదైన పరమపదాన్నైనా ఇవ్వజాలినవాడు పరమాత్ముడు. అటువంటి దేవతామూర్తి అయిన నారాయణుడుండగా, మనతో ఏవిధమైన సంబంధమూ లేని, మన వలెనే నరజన్మనెత్తిన, అదీ ఏదోకొన్ని ఊళ్ళకి రాజనీ, ఆతని సేవించాలని కోరుకుంటూ ఉంటాం. ఎంతటి అల్పమంతులం! అంటారు విచారంగా మహారాజు.
ఇక ఈ శ్లోకంలో భగవంతునితో మనకున్న సంబంధమూ, దాని ప్రాశస్త్యం గుర్తించలేని మానవుడు ఏవో కొన్ని ప్రాపంచిక భోగాలకై ఒక నరమాత్ర ప్రభువుకి ఊడిగం చెయ్యాలనే స్వభావం కలిగి ఉండటాన్ని ఎత్తి చూపి దాన్ని నిరసిస్తూ ఇరువురికీ ఉన్న భేదం గురించి వివరించి చెప్పి, మనం దేనిని నమ్మి తరించాలో చెబుతున్నారు మహారాజు.
ఇదే విషయాన్ని అన్నమయ్య ఇలా అంటారు.
ప. మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా॥
చ. జుట్టిడు కడుపుకై చొరనిచోట్లుజొచ్చి
పట్టెడు కూటికై బ్రతిమాలీ
పుట్టినచోటికే పొరలి మనసువెట్టి
వట్టిలంపటము వదలనేరడుగాక ॥ మనుజు ॥
చ. అందరిలో పుట్టి అందరిలో పెరిగి
అందరిరూపములు అటుతానై
అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి
అందరాని పదము అందెనటుగాన ॥ మనుజు ॥
నారాయణుని సేవింపక నరుని సేవించాలనుకునే వారికి, వారికున్న తారతమ్యాలను స్పష్టంగా వివరిస్తున్నారు. సర్వాంతర్యామియై ఉండి, నడిపించే నారాయణుడు నరులకు ఆశ్రయించదగినవాడు. అతడు మనకు ప్రభువు. ఆ స్వామి కృప లేనిదే క్షణకాలమైనా మనలేనివాడు ఈ మానవుడు. ఈ సంబంధం ఆ జన్మసిద్ధం. భగవద్గీతలో (14`4)…
సర్వయోనిషు కొంతేయ మూర్తయః సంభవంతియాః
తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా ॥
శరీరాలన్నిటికీ ప్రకృతే తల్లి. బీజాన్నీ నాటే తండ్రిని నేనే’’!
అంటూ తానే తండ్రినని చెప్పారు.
ఆ స్వామి మనకు తండ్రి, రక్షకుడు, శేషి, భర్త, జ్ఞేయుడు, ఆధారము, స్వామి, భోక్త, ఆత్మయై ఉన్నాడు. అందువల్ల ఆ స్వామి సహజంగానే మనల్ని రక్షిస్తాడు. కానీ ఈ నరమాత్రుని, అభిమానం చంపుకుని మరీ సేవించాలి. వారిలో లేని గుణాలను పదేపదే పొగడాలి. ఇంత చేసిన మనకు దక్కేది అల్పప్రయోజనమే. అదీ ఐహికమూ, తాత్కాలికమునూ!! అందుకే అల్పుల సేవమాని అనంతుని సేవించి తరించమని హితవు చెబుతున్నారు మహారాజు.
నరనారాయణ బంధం తొలగించుకోవాలన్నా తొలగేది కాదు. ఒక నరమాత్రునితో మనకున్న సంబంధం పరిమితమైనది. తాత్కాలికమైనది. పోనీ, అలాగని విశిష్ఠ సంపదల నీయగల్గిన వాడా! అంటే, అదీలేదు! కాని సర్వ ప్రాణులలో అంతర్యామియై ఉండి, నడిపించేవాడు నారాయణుడు. నమ్మి సేవించామా! తనదైన పరమపదాన్నే మనకీయ జాలినవాడు! ఈ రాజులో… కొన్ని ఊళ్ళకధిపతులు!!
మహా అయితే కొంత ధనం ఈయగలరంతే. అందుకోసం ఎంతో కష్టపడి ఊడిగం చేయాలి కూడా. ఆ స్వామి త్రిజగన్నాధుడు, పురుషోత్తముడు. వీడో పురుషాధముడు. ఆతడు దివ్యుడు. ఇతడు మర్త్యుడు. కొండంత భేదం కన్నులకు కనబడుతున్నా, ఈ నరమాత్రులకు ఊడిగం చేసి ధనం సంపాదించాలనే బుద్ధికి ఏమనుకోవాలి! అంటున్నారు మందలింపుగా మహారాజు. తాను సమృద్ధుడై ఉండి, శక్తిమంతుడై ఉండి తన శక్తిని సమృద్ధిని ఇతరులకోసం వినియోగంచే వాడు పురుషోత్తముడు. అటువంటి స్వామిని కాదని తనకోసమే తను జీవించి, ఇతరులచేత ఊడిగం చేయించాలనుకునే పురుషాధములను సేవించాలనుకోవడం ఎంత అవివేకం.
ప॥ మోసహోదెనల్లో నాను ` మోసహోదెనల్లో
అ.ప. శేష శయననిగె సేవక నాగద
వాసుదేవనిగె దాసన నాగద ॥ మోసహోదెనల్లో ॥
భగవంతునికి సేవకుండను. వాసుదేవుని దాసుడను కాకుండా ఇంతకాలము వృధా చేసుకుని మోసపోయానయ్యో! అంటారు పురంధరదాసు.
30 సంవత్సరాల వరకు నవకోటి నారాయణుడనిపించుకోవాలనే తృష్ణతో పరమలోభిగా, ధనం కూడబెట్టడమే ధ్యేయంగా బతికిన సీనయ్య, భగవదనుగ్రహంతో, భగవద్భక్తిలోని ఆనందాన్ని మొదటిసారి చవిచూశాక, తనకున్న సంపదంతా బీదలకు పంచిపెట్టి, తంబూరచేత పట్టుకుని
తంబూరిమీటి దవ భవాబ్ధిదాటిదవ అంటూ పరవశంలో పాడుతారు.
త్యాగరాజస్వామి తన గౌళరాగ పంచరత్నకృతిలో… సమాజం పోకడను చూచి, వేదనతో ‘‘దుడుకుగల నన్నె దొరకొడుకు బ్రోచురా’’ అంటూ పాడారు. ఈ కృతిలో సమాజంలో తాను చూస్తున్న విషయాలను, జరుగుతున్న సంఘటనలను, తనపై ఆరోపించుకుని పాడతారిలా!
ప॥ దుడుకు గల నన్నె దొరకొడుకు బ్రోచురా
అ.ప॥ కడుదుర్విషయాకృష్ణుడై,
గడియ గడియకు నిండారు ॥దుడుకు॥
చ. పరధనములకొరకు నొరాల మదికరగబలికి
కడుపునింప తిరిగినట్టి ॥దుడుకు॥
చ. మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానందముదలేకా
మదమత్సర కామలోభ మోహులకు దాసుడై మోసపోతి గాక॥
అంటారు. నిజానికి పరమభాగవత శిఖామణి త్యాగరాజు. ఆదుడుకు వారిది కాదు. తాను చూసే కొందరి పోకడను గమనించి, తనపై ఆరోపించుకుని పాడారన్న మాట! జగన్నాధుడు, త్రిజగద్వందితుడూ అయినా, సుశీలుడూ సులభుడూ అయినవాడు స్వామి. నరాధములైన భూపతులను సేవించుట ఎంతో కష్టం. శరీరాన్ని శ్రమ పెట్టి సేవించాలి. మాటలతో వారిని పొగడుతూ ఉండాలి. ఇంత చేసినా అన్నిసార్లూ వారు తృప్తి పడతారా! అంటే సందేహమే! కానీ భగవానుడో! కేవలం మనసులో సేవిస్తే చాలు.
‘‘దేవాన్ దేవయజోయాంతిమద్భక్తాయాంతిమామపి’’ అని, తన్ను సేవించిన వారు తప్పక తననే పొందగలరని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పారు. అందుకే అవివేకంతో అల్పుల సేవమాని, ఆ అనంతుని అంతరంగంలో నిల్పి సేవించుకోమని హితవు చెబుతున్నారు శ్రీ కులశేఖరులు.
రాజులను సేవించి భంగపడిన అనుభవమేనేమో ధూర్జటి మహాకవి వేదనతో కాళహస్తీశ్వరుని ఇలా వేడుకుంటున్నారు.
శ్లో॥ రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చునం
భోజాక్షీ చతురంతయాన తురగీభూషాదులా త్మవ్యధా
బీజంబుల్, తదపేక్షచాలు, పరితృప్తింబొందితిన్, జ్ఞానల
క్ష్మీ జాగ్రత్పరిణామమిమ్ము, దయతో శ్రీకాళహస్తీశ్వరా!
- మదన పరిహర స్థితిం మదీయే
మనసి ముకుంద పదారవింద ధామ్ని
హరనయనవృశానునా కృశోసి
స్మరసి న చక్ర పరాక్రమం మురారేః ।
చక్రధారిని సేవించుకోగలిగే మనసుకు కామాదుల వలన భయం ఉండదు. ఈశ్వరుని సమీపించి ఆ కామారి కంటి మంటకు భస్మమైన ఓ మదనా! నేను శ్రీ మహావిష్ణువును శరణుజొచ్చిన వాడిని. నీ ప్రతాపం నా మీద చూపనెంచితే సుదర్శన చక్ర పరాక్రమాన్ని చూడవలసివస్తుంది సుమా! అందుకే ముకుంద పాదారవింద నివాసస్థానమైన నా మనసులో నిలవడానికి ప్రయత్నించకు అని మదనుణ్ణి హెచ్చరిస్తున్నారు. అంటే కామాదులు మనసులో చొరనీయకుండా ముందే ముకుందుని అంతరంగంలో నిలుపుకోవాలి అన్నమాట!
అన్నింటిని కంటే ప్రధానమైన శత్రువు కామం. దానికి అధిదేవత మదనుడు. మదనుడు లక్ష్మీపుత్రుడే కానీ, మహా విష్ణువు చక్రపు భయంతో చక్రధారిని స్మరించిన వారి భక్తుల జోలికి మాత్రం వెళ్ళడు. పూర్వం పరమశివుని దగ్గరకు వెళ్ళి ఆ ముక్కంటి కంటి అగ్నిహోత్రానికి భస్మమైనాడు. శివుని దగ్గరకు వెళ్ళడానికైనా సాహసించాడేమో కానీ, మహావిష్ణువే కాదు, విష్ణుభక్తుల సమీపానికి కూడా రావడానికి సాహసించలేడు. ఆ మాటతోనే మదనుణ్ణి హెచ్చరిస్తున్నారు. ‘‘మన్మదా! నా మనసులో ఉండాలని ప్రయత్నించకు. నా మనసు ముకుంద పాదారవిందాలకు స్థానమై, నిలయమై ఉంది.
తరువాయి వచ్చే సంచికలో……
——– ( 0 ) ——-
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Please visit this page