ప్రస్తావన
సమాజంలో అనేక మార్పులు వస్తూనే ఉన్నాయి. మార్పు సహజం కూడా. సాంకేతికత రోజు రోజు కీ కొత్త కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. ఆ వేగం ఇప్పటి తరాలు అందుకోవడానికి పరుగులు పెడుతున్నాయి. ఈ సాంకేతిక అభివృద్ధి ఫలితం ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయింది. ఎన్నెన్నో కొత్త పరిచయాలు, సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఇవి నిజానికి ఇవి వ్యక్తిగత పరిచయలేనా అంటే కాదనే అనిపిస్తుంది. ఒకప్పుడు కుటుంబ సభ్యుల మధ్య, ఒక ప్రాంతంలో లేదా ఒక ఊరిలో ఉండే వ్యక్తుల మధ్య ఉండే మానవీయ సంబంధాలు ప్రస్తుతం తగ్గుతున్నాయనే చెప్పుకోవాలి. నిజానికి ఇప్పటి తరం, తోటి మనుష్యులతో సంబంధం కంటే ఎలెక్ట్రానిక్ పరికరాలతోనే సంబంధం ఎక్కువగా పెట్టుకుంటున్నారు. వాటితోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఆ యంత్రాల ద్వారా పరిచయమైన, ఎక్కడో దూరంగా ఉన్న పరిచయస్థులనే మిత్రులుగా భావిస్తున్నారు. కానీ పక్కనే ఉన్న స్నేహితులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ స్నేహాలలో ఎక్కువ భాగం ఎక్కడికి దారితీస్తున్నాయో మనం రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాము. ఈ రకం స్నేహాల్లో అధిక భాగం బాధితులు అమ్మాయిలే ! ఏది నిజమైన ప్రేమో తెలుసుకోలేక పోతున్నారు. నిజానికి ఆ స్నేహానికి వారధి అయిన పరికరం ( కంప్యూటరో, మొబైల్ ఫోనో ) మీద మాత్రమే వారికి నిజమైన ప్రేమ. స్నేహాన్ని, ప్రేమని, పెళ్లి లాంటి సంబంధాలనయినా వదులుకుంటున్నారు గానీ ఆ పరికరాలను, దాని ద్వారా వచ్చే ఇతర స్నేహాలను మాత్రం వదులుకోలేకపోతున్నారు. ఫలితంగా భావోద్వేగాలకు, వ్యక్తిగతమైన అభిమానాలకు, ఆప్యాయతలకు దూరమైపోతున్నారు.
ఎక్కడో ఉన్న మిత్రులకు ఇచ్చిన ప్రాముఖ్యత పక్కనే ఉన్న నిజమైన మిత్రులకు, బంధువులకు ఇవ్వడం కష్టమైపోతోంది. ఫలితంగా కుటుంబ సభ్యుల మీద, స్నేహితుల మీద చిరాకు, అసహనం పెరిగిపోతున్నాయి. ఈ అసహనం వటవృక్షంలా పెరిగి సమాజం మీద, మనుష్యుల మీద ద్వేషంగా మారుతోంది. సహజంగా ఉండాల్సిన భావోద్వేగాలు, స్పందనలు లేకుండా పోతున్నాయి. మనుష్యులే కాకుండా మనసులు కూడా యాంత్రికమైపోతున్నాయి. పూర్వం మనుష్యుల్లో కొంతమందికి ఈర్ష్యాసూయలనేవి ఉండేవి. ప్రక్కవాడు జీవితంలో ఎదిగితే చూసి ఓర్వలేనితనం ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని అసహనం ఆక్రమిస్తోంది. ఎదుటివాడి ఎదుగుదల గురించి కంటే తన ఎదుగుదలకు ఎవరూ ఎదురు రాకూడదనే ఆలోచనతో అసహనం పెరుగుతోంది. ఆ క్రమంలో ఎవరి పొడ గిట్టటం లేదు. అందరూ తన దారికి అడ్డు వస్తున్నారేమో అనే అనుమానం కంటే అడ్డు వస్తున్నారనే ఆలోచన బలపడుతోంది. అందుకే ఎవరినీ సహించలేని స్థితి వస్తోంది. మనం తప్పు చేసినా ఎవరూ వేలెత్తి చూపకూడదు అనే ధోరణితో బాటు, ఆ తప్పు ఎదుటివారి వల్లే జరిగిందనో, లేకపోతే తనసలు ఆ తప్పు చెయ్యలేదనో బలంగా నమ్మే స్థితిలోకి వెడుతున్నారు. ఇంకా కొంతమంది తానసలు తప్పే చేయనని, తన చుట్టూ ఉండేవాళ్లందరూ తప్పులు చేసేవాళ్లేననే భ్రమలో ఉంటున్నారు. అందుకే అందరి మీద అసహనం. సమాజం అంటే చిరాకు. తన లోకంలో తాను ఉండడం, తన ఒంటరితనమే తనకి ఆనందంగా మారుతోంది. ఆ ఒంటరితనానికి ఎవరు భంగం చేసినా అంగీకరించే పరిస్తితి ఉండడం లేదు.
ఇప్పటికే ఈ అసహనం అనేది ఇప్పటి తరంలో వేళ్లూనుకుంది. రాబోయే తరాల్లో ఇది వటవృక్షంగా ఎదిగి సమాజంలో అన్ని సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పటి తరం మేల్కొని దీనికి అడ్డుకట్ట వేసి రాబోయే తరాలను కాపాడవలసిన బాధ్యత ఉంది. ఫోన్ గాని, కంప్యూటర్ గాని, ఇంకే పరికరం గానీ అవసరమైనంత వరకే, అవసరమైన సమయం వరకే ఉపయోగిస్తే అవన్నీ మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అతిగా అలవాటు చేసుకుంటే వినాశనానికి దారి తీస్తాయి. త్రాచు పాము విషం ప్రాణాలు తీస్తుంది, కొన్ని సందర్భాలలో ప్రాణాలు పోస్తుంది. కొన్ని రకాల జబ్బుల నివారణకు వైద్య రంగంలో దీనిని మందుల తయారీలో వాడతారు. సాంకేతికతను, సాంకేతిక పరికరాలను దేనికి వాడాలో, దేనికి వాడకూడదో నిర్ణయించుకోవాల్సిన తరుణం వచ్చేసింది. మనుష్యుల మధ్య సంబంధాలు పెంచాలి. మళ్ళీ మనందరిలో ప్రేమాభిమానాలు వెల్లివిరియాలి. మానవత మొగ్గ తొడగాలి. మనుష్యులు యంత్రాలుగా కాకుండా నిజమైన మనుష్యులుగా మారాలి.
****************************************
మనవి : చందా గడువు ముగిసిన మిత్రులు దయచేసి తమ చందాను వీలైనంత త్వరగా పునరుద్ధరించి సహకరించవలసిందిగా మనవి. మీ మిత్రులను, బంధువులను ‘ శిరాకదంబం ‘ చందాదారులుగా చేర్చండి. వివరాలకు
చూడండి.
****************************************
మనవి : ప్రతి పేజీలో ‘ అమెజాన్ పేజీ ’ లింక్ ఉంటుంది. అందులో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. అలాగే ఆ పేజీలో లేని వస్తువులు మీరు సూచిస్తే అందులో కలుపుతాము. ‘ అమెజాన్ ’ లో మీ కొనుగోళ్ళు ‘ శిరాకదంబం ’ పేజీ ద్వారా కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ పత్రిక కు సహాయపడిన వారవుతారు. ఆ పేజీ లింక్ –
Please visit this page
Well conceived.