ఎవ రన్నారు ఎప్పటిలా ఆమని రాలే దని ?
ఎవ రన్నారు కోకిలకూజితాలు వినిపించడంలే దని ?
ఎవ రే మన్నా గుడ్డిగా నమ్మడం ఈదేశంగ్రహపాటు !
ఎవ్వరూ ఎదగడంలే దని చెబితే వెఱ్ఱిగా ఆనందించడం మన అలవాటు !
కనిపించడం లేదా వసంతం ఊరేగుతున్న పూలపల్లకి ?
వినిపించడం లేదా అనంగుడు మీటుతున్న అనురాగవల్లకి ?
ఇది సరికొత్తఉగాది !
శిశిరశిధిలాలమీద శిర సెత్తినఆశలపునాది !
ఇది – దక్షిణపుగాలి వింధ్య తలదన్ని దిక్కుల నేకం చేస్తున్నవేళ !
ఆ సేతుశీతాచాలమూ అధికారాన్ని చలాయిస్తున్నవేళ !
పూవుపూవునూ పులకింపజేస్తున్నషట్పది
అష్టపదులఆలాపనతో అవనిని అలరిస్తున్నవేళ !
అడవి కాచినవెన్నెలలా – అనాదృతనవవధువులా
సందడీ, స్వాగతాలూ లేనివిమానాశ్రయంలో అతిథిలా
రెక్కలు కట్టుకు వాలినవసంతం దిక్కులు చూస్తోంది !
పలకరించేనాథుడు లేక పడిగాపులు కాస్తోంది !
మర్యాద యెఱుగనిమనిషికోసం చిలుకలచేత చాటింపు వేయిస్తోంది !
మనిషిచిరునామా తెలియక – తనరాకకు గుర్తుగా
చెట్టుచెట్టుకూ చివుళ్ళచీటీలు కడుతోంది !
ఎఱ్ఱపూలబావుటాలు ఎగరేస్తోంది !
ఐనా జాడ లేదు – జాబు లేదు
ఎక్కడ ఈమానవుడు ?
వలచి వచ్చినవసంతానికి దూరంగా
ఏనిశాంతంలో చిక్కుకున్నాడు ?
ఎక్కడ ఈమానవుడు ?
అడు గడుగో ! మధుపాత్రలో విషాన్ని తాగుతున్న మానవుడు !
ఎప్పుడూ మధుహాసం చేసేవాడికి ఏడాది కోమధుమాసం ఎందుకు ? అంటున్నాడు !
వెండితెరమీద నీలినీలిదృశ్యాలను చూస్తున్ననేత్రాలకు
వసంతం – వేటకూర తిన్ననోటికి తోటకూరలాంటి దంటున్నాడు !
పువుబోణులను నగ్నంగా ఊరేగిస్తున్నపురుషప్రపంచంలో
పూలఋతువులూ పూవుబాణాలూ ఏయెదలను కదలిస్తా ? యంటున్నాడు
కాకులకాకాలకు వరాలవర్షం కురుస్తున్నలోకంలో
కోకిలపాటలు విని హర్షించేవా డెవడు ? పొ మ్మంటున్నాడు !
ఉగ్రవాదశార్దూలాలు స్నాన మాడుతున్ననెత్తుటిమడుగులకు
ఎన్నిమోదుగుపూలయెఱ్ఱదనం సరితూగుతుం ? దంటున్నాడు !
కీరవాణులు కిరసనాయిలుమంటల్లో ఆర్తనాదాలు చేస్తుంటే ఆనందించేవాడికి
చిలుకపలుకులు చివురించేచిత్త మెలా వుంటుం దంటున్నాడు !
“ అధికధరల ” నిప్పులమీద నడుస్తున్న నిప్పచ్చర మైనబ్రతుకులకు
ఆకుపచ్చనిపండుగ యెండమావిలాంటి దంటున్నాడు !
ఎన్నిసార్లు కరువుభత్యం పెరిగినా అరువూ పరువూ చాలనిమనిషి
ఏడాది కోసారి ఎంచక్కా కొత్తబట్టలు కట్టుకునేచెట్లను చూసి ఏడిచి చస్తున్నాడు !
“ నాదగ్గరే ముంది ? బూడిద ! ” అన్నా – వెన్నుపోటు తప్పనినాయకుడు
పాలవెల్లివంటిపాదపం పూలకళ్లతో నవ్వుతుంటే – ముఖం చాటేస్తున్నాడు!
రోజురోజుకీ చిక్కిపోతున్న రూపాయిపాపాయిని చూసి నిట్టూరుస్తున్నవాడు
ఏపుగా ఎదుగుతున్న అమనిమొక్కలను చూడలేకపోతున్నాడు !
అందుకే మనిషి రాలేదు – వసంతానికి స్వాగతం చెప్పడానికి !
కాని – అతనికి ధైర్యం లేదు – ఆనిజాన్ని ఒప్పుకోడానికి !
మైడియర్ మనిషీ ! వసంతం రాలే దనకు !
మానుకీ మట్టికీ వచ్చినకళను కా దనకు.
నిరాశాగీతాలను కాదు – నిన్నటినుంచి నేటిని రచించు !
మోళ్ళనూ బీళ్ళనూ మోసులెత్తించేవసంతసమీరాన్ని ఆహ్వానించు !
ముక్క లైననీముఠాని చూసి – ఎదుటివాడిమీద ఱా ళ్ళెయ్యడం మానుకో !
శిశిరంతాకిడిని ఎదుర్కొనేచెట్టూచేమలచేవను ఆదర్శంగా తీసుకో !
ప్రతిశిశిరంవెనుక ఓఆమని – ప్రతివిషాదంవెనుక ఒకవేడుక వేచి వుంటాయి !
చక్రారపంక్తిలో అడుగున పడ్డఆకులే తిరిగి ఆమనులై పూస్తుంటాయి !
అసహనానికీ ఆత్మవంచనకీ భరతవాక్యం పలికి ఆమనిని ఆవాహన చెయ్యి !
నవతకీ మానవతకీ నిండుమనస్సుతో పందిళ్ళు వెయ్యి !
( ఉగాది సందర్భంగా 1992 వ సంవత్సరం మార్చి 28 న ఆకాశవాణీ హైదరాబాద్ కేంద్రం చిక్కడపల్లి త్యాగరాజగానసభ భవనంలో నిర్వహించినకవిసమ్మేళనంలో చదివినకవిత యిది )
——- ( 0 ) ——-
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Please visit this page