నాట్య కళాకారిణి, ” అమెరికా అమ్మాయి ‘
తెలుగు చలనచిత్ర కథానాయిక
డా. పద్మశ్రీ కుమారి దేవయాని గారితో ముఖాముఖీ.
నిర్వహణ — ఓలేటి వెంకట సుబ్బారావు.
ప్రశ్న:
ప్రముఖ భరతనాట్య కళాకారిణులలో ఒకరిగా మీ వృత్తిపరమైన, ప్రవృత్తిపరమైన అనుభవాలను, అనుభూతులను మీ అభిమానులమైన మా అందరితోనూ పంచుకుంటూ, ఈ ఇంటర్వ్యూ లో పాల్గొనేందుకు అంగీకరించిన మీ సౌజన్యానికి ముందుగా నా మనః పూర్వకమైన కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను దేవయాని గారు.
దేవయాని :
ధన్యవాదాలు సుబ్బారావు గారు. భరతనాట్య కళాకారిణిగా, ‘అమెరికా అమ్మాయి’ చలనచిత్ర నటి గా నా అనుభవాలను మీ అందరితోనూ ఈ విధం గా పంచుకోవడం నాకూ చాల ఆనందం గా ఉందండి.
ప్రశ్న :
దక్షిణ భారతావని లోని దేవాలయాలతో దగ్గరి సంబంధాన్ని కలిగిన భరతనాట్యానికి 3,000 సంవత్సరాలకు మించిన చరిత్ర ఉందని చెబుతారు. కాగా, నృత్య కళాకారిణి అయిన మీకు జాతీయపరంగా మూడు రకాల అనుబంధం ఉండడం మరో ఆసక్తికరమైన విషయం అండీ…
ఆ మూడు రకాలు ఏమిటి అంటే….
1. మీరు పుట్టిన దేశం ఫ్రాన్స్ కనుక ముందుగా మీరు’ఫ్రెంచ్ అమ్మాయి’.
2. మీకు తెలుగు చలనచిత్ర రంగం పెట్టిన పేరు’ అమెరికా అమ్మాయి ‘ ( మీరు తొలిసారిగా నటించిన చిత్రం పేరు !)
3. ఇక పాత్రపరం గా ఆ సినిమా లో మీరు తెలుగు అమ్మాయి – అంటే ‘ ఇండియా అమ్మాయి’ అన్నమాట!
ఏమంటారు ?
దేవయాని :
అవునండీ .. మీరన్నట్లు మూడు దేశాల జాతీయతలు నాలో గూడు కట్టుకున్నాయి. నిజానికి ఇది చిత్రమే !
ప్రశ్న:
మీరు పుట్టిన దేశం ఫ్రాన్స్ అని, మీ అసలు పేరు అన్నిక్ చెమోట్టే అని విన్నాను. మరి మీ పేరు దేవయాని గా మారడానికి నేపధ్యం ఏమై ఉంటుందా అన్న నా చిన్న సందేహాన్ని నివృత్తి చేయరూ, ప్లీజ్ ?
దేవయాని :
దేవయాని అనే పేరులో ధ్వనించే మధురనాదం పట్ల నేను ఆకర్షితురాలనయ్యాను. చెన్నైలో నాట్యగురువుల శిక్షణలో నేను భరతనాట్యాన్ని నేర్చుకుంటూన్న ఒక సందర్భం లో వారు ఒకనాడు నాతో ఈ పేరును ప్రస్తావించారు. విషయమేమంటే, దక్షిణ భారతావని లోని ప్రముఖ దేవాలయాలలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు అనేకం ఉన్నాయి. తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి చూడగా సుబ్రహ్మణ్య స్వామి ఇరు పత్నుల పేర్లు వల్లి, దేవయాని. అందులో దేవయాని అన్న పేరు నాకు అనువుగా ఉంటుందని మా గురుదేవులకూ, నాకూ అనిపించి వెంటనే ఆ పేరునే ఎన్నుకుని దానిని నా పేరుగా స్థిరపరచడం జరిగింది. ఇదండీ నా పేరు మార్పు వెనుక దాగిన రహస్యం.
ప్రశ్న:
చాలా బాగుందండీ. మీ ఈ వివరణ తో నా సందేహం పూర్తిగా నివృత్తి అయింది.
ఇక ‘అమెరికా అమ్మాయి’ మీరు కథానాయిక గా ప్రధాన పాత్ర వహించి నటించిన తొలి చలనచిత్రం. ఏకైక చిత్రం కూడా… కదా ? ఈ చిత్రం విడుదలై ఎన్నో ఏళ్ళు గడచినా నాటికీ, నేటికీ ప్రేక్షకుల అపారమైన అభిమానాన్ని చూరగొన్న చిత్రాలలో ఒకదానిగా దీనిని పేర్కొనవచ్చును. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలను మీ మాటలలో వినాలని ఉందండి.
దేవయాని :
అవునండీ ! నిజంగా ఇది ఒక గొప్ప చిత్రం. ఇందులో తెలుగు నేర్చిన అమ్మాయి, భారతీయ సంప్రదాయాలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ వైవిధ్యం తో అమృతోపమానంగా పాడిన పాట ” పాడనా తెనుగు పాట “. ఈ పాట సాహిత్యం ప్రముఖ కవి శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిది, ప్రముఖ నేపధ్య గాయని శ్రీమతి పి. సుశీల గారు పాడగా శ్రీ జి. కె. వెంకటేష్ గారు సంగీతం సమకూర్చారు.
శ్రీ గొల్లపూడి మారుతీ రావు గారు సంభాషణలు అందించారు. నవత ఆర్ట్స్ పతాకం పైన నవతా కృష్ణంరాజు గారు నిర్మించిన ఈ చితానికి దర్శకులు మాన్యులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు. నా పాత్రకు డబ్బింగ్ చెప్పిన వారు నేపధ్య గాయకుడు శ్రీ జి. ఆనంద్ గారి సతీమణి శ్రీమతి సుజాత గారు, ఈ పాట ప్రేక్షకశ్రోతలందరి విశేషాభిమానాన్ని చూరగొని, ప్రశంసలను పొందినది. శాస్త్రీయ నృత్య కళారీతులకు అనుగుణంగా చిదంబరం లోని శ్రీ నటరాజస్వామి వారి దేవాలయ ప్రాంగణం లో నాట్య గురువు శ్రీ వెంపటి చిన సత్యం గారి కొరియోగ్రఫీ లో చిత్రీకరణ జరిగిన నా నాట్య ప్రదర్శన కు ఆధారమైన పాట డాక్టర్ శ్రీ సి. నారాయణరెడ్డి గారి రచన ” ఆనంద తాండవమాడే…శివుడు అనంతలయుడు ..”. ఈ పాట, తదనుగుణంగా శాస్త్రీయ నృత్యం నా పాత్ర కు జీవం పోసాయి అని ఘంటాపధం గా చెప్పవచ్చును.
ప్రశ్న:
అమ్మా- మీరందించిన పై విశేషాల స్పూర్తితో మిమ్మల్ని మరి కొన్ని ప్రశ్నలను.. అంటే మిమ్మల్ని ఈ రంగం లో ప్రభావితం చేసిన అంశాలకు, ఈ మీ వ్యాసంగం యొక్క పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించినవి అడగాలని ఉంది. మీ బాల్యం, కుటుంబం, విద్యాభ్యాసం, భారతీయ సంగీత, నృత్య రంగాలలో ప్రవేశించాలన్న మీ ఆలోచనకు స్ఫూర్తి.. వీటిని గురించి చెప్పండి.
దేవయాని :
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో నేను పుట్టానండి. Chateaux de la Loire ( Castles of the Loire Valley ) కి సంబంధించిన ప్రాంతీయ వారసత్వమునకు అనుగుణంగా మా తల్లిదండ్రుల పెంపకం లో నేను పెరిగాను. నాకు బాల్యం నుండే చిత్రకళ, సంగీతము, నృత్యము వీటిపట్ల ప్రత్యేక ఆకర్షణ, ఆసక్తి ఏర్పడ్డాయి. French Romanticism, Poetry of Shelly. Philosophy of Plato లకు సంబంధించిన సాహిత్యం పట్ల అభిరుచి ఉండేది. అంతే కాకుండా క్రమం తప్పకుండా Theatre Shows, నృత్య కార్యక్రమాలు, సంగీత కచ్చేరీలు, కళా ప్రదర్శనలు.. వీటికి హాజరయేదానిని.
Red and Gold Collections లో భాగమైన ” The Green Ballerina Shoes ” చదువుతున్నప్పుడు నృత్యం పట్ల ఆకర్షణలో నాకు ఒక విధమైన మైకం వంటిది కమ్మింది. అయితే, అప్పటికి నా వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ! కాగా నృత్యం అంటే చెప్పలేని ఆకర్షణ, ఆసక్తి పుట్టుకొచ్చాయి అన్నమాట. కాల గమనం లో, నాకు యుక్తవయసు వచ్చేనాటికి పారిస్ నగరం లో ఆధునిక, సమకాలీన రీతులకు చెందిన Classical Ballet, Flamenco Dance శిక్షణా తరగతులలో చేరి, వాటిని గురుముఖం గా నేర్చుకునేదానిని.
ప్రశ్న:
బాగుందమ్మా…
ఊహకు అందకుండా తటస్థపడిన అడ్డంకులను అధిగమించేందుకు పట్టుదలతో నిరంతర పోరాటాన్ని సలిపి, చివరకు సానుకూలమైన ఫలితాలను రాబట్టుకోవడం మీ ధ్యేయం అని ఋజువు చేసారు. అయితే, మీ ఈ జీవనయానం లో కష్టతరమైన ఈ ముళ్ళబాటను ఎన్నకొనడం వెనుక మీ తపన, కృషి గురించి వివరించండి .
దేవయాని :
నా తపన, దాని వెనుక దానికి అనుబంధం గా నాలో అంతర్గతంగా ఉన్న నేర్పు, దృఢ నిర్ణయం, సానుకూల దృక్పధం, కృషి – ఇవే నాకు విజయాన్ని చేకూర్చిపెట్టాయి.
Sorbonne University, Paris లో సాగిన నా చదువుతో బాటుగా లలిత కళలు సంగీతము,
నృత్యం పట్ల నా అనురక్తి వికసించడం ఆరంభమయింది. French Film Director Louis Malle దర్శకత్వం వహించిన చిత్రాలు భరతనాట్యం, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలపట్ల అవగాహన, ఆసక్తి ని నాలో మరింతగా పెంపొందింపజేసాయి. ఆ చిత్రాలలో భరతనాట్య సన్నివేశాలను చూసిన నాకు కలిగిన ప్రేరణతో గురువుల వద్ద శిక్షణ కై ప్రయత్నం సలిపి అమలాదేవి గారి వద్ద, తరువాత మాళవిక గారి వద్ద భరతనాట్యం నేర్చుకున్నాను. ఆ పైన Indo French Cultural Exchange Scholarship తో చెన్నై కి వచ్చి అక్కడ హేమాహేమీలనదగ్గ గురువుల శిక్షణలో భరతనాట్యం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. ఈ గురువులవద్ద శిక్షణ పొందడం నాకొక మరువరాని, మరువలేని మధురానుభూతి. వారందరు నాకు అత్యంత శ్రద్ధతో ప్రాచీన, సాంప్రదాయ శాస్త్రీయ నృత్య రీతులను నేర్పుతూ, నాలోని అభిరుచిని, కళాతృష్ణ ను, కౌశలాన్ని గుర్తించి నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఇందుకు, నేను వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలను తెలుపుకుంటూ వారికి నా జీవితాంతం ఋణపడి ఉంటాను.
( తరువాయి వచ్చే సంచికలో…. )
*****************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
సుబ్బారావు గారు భరతనాట్య కళాకారిణి దేవయాని గారితో మీ ముఖాముఖి అత్యంత ఆసక్తిగా అద్భుతంగా ఉంది అండివచ్చే భాగం కోసం ఎదురుచూస్తున్నానుదేవయాని గారికి,మీకు,శిరా కదంబం బాబాయ్ గారికి నా అభినందనలతో నమస్సులులేళ్ళపల్లి శ్రీదేవిరమేష్, చెన్నై
It looks nice but as I don t understand the telugu script it is difficult to comment on the content of the interview