కూచిపూడి వనంలో కొత్త విరిబాల “కమలోద్భవ కౌత్వం”
తరతరాల తెలుగు కళ మన కూచిపూడి నాట్యం. సమకాలీన గురువులు, నిపుణులు ఎప్పటికప్పుడు చేరుస్తూ వచ్చిన ప్రయోగాత్మక నృత్య రచనలతో విశాలమై నిత్యనూతనంగా వెలుగులీనుతోంది. ఈ నాట్య ప్రక్రియలోని ప్రాథమిక అంశాల నుంచి నృత్య నాటికలవరకు అవసరమైన మార్పులు చేసి, సంగీతసాహిత్యాలను మథించి మరికొన్ని కొత్త అంశాలను చేర్చి అందమైన పూదోటగా తీర్చిదిద్దినవారిలో పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం ఒకరు. ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఆయన శిష్యురాలు, చెన్నైకి చెందిన దేవరకొండ సత్యప్రియ రమణ కూడా ఇటీవలే ఈ నాట్యతోటలోకి మరో నృత్య రచనను చేర్చారు. “కమలోద్భవ కౌత్వం” అన్న ఈ అపురూపమైన ప్రక్రియ రూపకల్పనకు కలిగిన స్ఫూర్తి, అమలులోకి తెచ్చేందుకు చేసిన కృషి తదితర వివరాలను ‘ శిరాకదంబం ’ కు సత్యప్రియ తెలిపారు:
మాది గుంతకల్. అమ్మ జయలక్ష్మి టెలిఫోన్స్ లో పనిచేసేది. నాన్నగారు పీఆర్కే రావుగారు రైల్వె ఉద్యోగిగా ఉండేవారు. నాకు ఇద్దరన్నయ్యలు. నా ఐదో ఏట కూచిపూడి నాట్యంలో చేర్పించారు అమ్మానాన్న. ఆరేళ్ళ నుంచే ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టాను. ఒక ఏడాదిలోనే అంచెలంచెలుగా…. ఊరు, జిల్లా, రాష్ట్రస్థాయిల పోటీలలో మొదటి బహుమతి తెచ్చుకున్నాను. పోస్టల్ అండ్ తెలిగ్రాఫ్స్ డిపార్టుమెంటు నిర్వహించిన జాతీయపోటీలో కూడా మొదటి బహుమతి రావడంతో ఆ తరువాత ఏంటి.. అని ఆలోచించారు అమ్మానాన్న. నా భవిష్యత్తు నాట్యంలోనే ఉందని గ్రహించి వెంపటి చినసత్యంగారి శిక్షణ అయితే బాగుంటుందని మద్రాసు తీసుకొచ్చి “కూచిపూడి ఆర్ట్ అకాడెమీ” హాస్టల్లో చేర్పించారు. ఆ విధంగా ఏడున్నర సంవత్సరాల వయసులో మద్రాసుకొచ్చి ఇక్కడే ఉండిపోయాను. మాస్టర్ గారు, ఆయన శ్రీమతి గారు సొంత కూతురికన్నా ఎక్కువగా చూసుకున్నారు. పదహారు, పదిహేడేళ్ళు నాట్యం నేర్చుకున్న తరువాత 1989లో మాస్టర్ గారితో రష్యా పర్యటన చేసొచ్చాక ఒకరోజు అనుకోకుండా శిష్యులకి పాఠం నన్ను చెప్పమన్నారాయన. అలా శిష్యురాలినైన చోటే శిక్షకురాలిగా మారాను. 1993లో “నర్తనశాల” పేరుతో సొంతగా పాఠశాల నెలకొల్పాను. ప్రారంభోత్సవమే కాకుండా వార్షికోత్సవాలు కూడా చాలావరకు మాస్టర్ గారి చేతులమీదుగా జరగడం నా సుకృతమే. నేను రూపొందించిన “గంగావతరణం” బ్యాలే కూడా చూసి ప్రోత్సహించారాయన. మాస్టర్ గారి శిష్యుడు, నా సహాధ్యాయి రమణతోనే నా పెళ్ళి జరిగింది. మాకొక అబ్బాయి. పేరు నిఖిల్ శరణ్.
ఇక చదువు పరంగా ముందు టీ నగర్ లోని పార్క్ మాంటిసరి స్కూల్లో చదివాను. ప్రైవేటుగా బి.ఏ చేశాను. నా బాల్యం, కౌమారం, యవ్వనం మొత్తం నాట్యానికీ, సాధనకే ధార పోశాను.
కలాపాలు, యక్షగానాలు, నృత్యనాటికలతోపాటు కూచిపూడి నాట్యంలో కొన్ని ప్రత్యేకమైన
ప్రక్రియలున్నాయి. వాటిలో సింహనందిని, మయూర కవుత్వం లాంటివి దేవాలయ నృత్యాలు. దేవాలయ ఉత్సవాలలో దేవుడికి అర్పించే క్రతువులివి. ముగ్గుపిండిని ఒకచోట పోసి దానిమీద ఒక క్రమపద్ధతిలో నర్తిస్తే సింహం ఆకారం ఏర్పడడం సింహనందినీ నృత్యం. నెమలి ఏర్పడేట్టు చేసే ఇంకొక ప్రక్రియ మయూర కవుత్వం. చిన్నప్పుడే అవి నా మనసులో చెరగని ముద్ర వేశాయి. వాటి చుట్టూ ఆలోచనలు తిరిగేవి. ఎంత బాగున్నాయి…అన్న అబ్బురం, అయినా ఎప్పుడూ ఆ బొమ్మలే వెయ్యాలా… వేరేవి వేయకూడదా… అన్న సందేహం, వేరే వేస్తే ఏం వెయ్యాలి, ఎలా వెయ్యాలి అన్న ఆలోచన. కాల ప్రవాహంలో ఆ ఉత్సుకత కనబడకుండాపోయినా తరువాతి కాలంలో కొత్తదనం కోసం ఎంతో మథనపడ్డాను. అనంతమైన ఆలోచనలు, మనసులో గజిబిజిగా మెదిలే రూపాలు, నాట్యంలో నా సుదీర్ఘ అనుభవం కలగలిసి తప్పకుండా ఏదో చెయ్యగలనన్న ఆశాదీపాన్ని మాత్రం నాలో సజీవంగానే ఉంచాయి. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక ఆలోచన మెరిసింది. కూచిపూడి నాట్యంలో ఉపయోగించే పళ్ళేనికి మధ్యలో ఒక గిన్నెను బిగించి, దాని మధ్యలో రంధ్రం చేయించి, అందులో ముగ్గు వేసి ఎన్నో ప్రయోగాలు చేశాను.
వెంపటి మాస్టర్ గారు “పళ్ళెంపై నృత్యం” తరంగంలో ప్రవేశపెట్టిన “మరకతమణిమయ”లో వచ్చే “జతి, తరువాత దానికనుగుణమైన పళ్లెంపై నృత్యం” స్ఫూర్తిగా సాధన చేశాను. ముందు ఏర్పరచుకున్న జతులతో మూడు రేకుల పద్మం ఏర్పడింది. దాన్ని ఐదుకి పెంచాను. ఆకులుంటేనేకదా పద్మానికి పూర్ణత్వం అని ఆకులకోసం మరింత నిడివి పెంచాను. మొత్తానికి, ఏడు తాళాలలోని అన్ని జతులు, తరువాత రెండు జతులు, చివరగా మూడు కాలాల్లో తీర్మానం పూర్తయ్యేసరికి ఐదు రేకుల తామర, కాండం, కాండానికి రెండు ఆకులు ఏర్పడే చిత్రం పూర్తి చేశాను. మన పురాణాలలో, నాట్యాలలో కృష్ణుడికి మించిన ఆరాధ్య దైవం ఇంకెవరున్నారు? అందుకే నేను సృష్టించిన ఈ ప్రక్రియకీ కృష్ణుడినే నాయకుడిగా ఎంచుకున్నాను. “నందనందన” అన్న నారాయణతీర్థ తరంగాన్ని ముందు అభినయించి, అందుకు కొనసాగింపుగా ఈ ప్రక్రియ వచ్చే ఏర్పాటు చేసుకున్నాను. సుమారు పావుగంట సాగే ఈ అంశంలో “పద్మం” భాగం ఎనిమిది నిముషాలు. ఈమధ్యే ఈ నృత్యానికి “కమలోద్భవ కౌత్వం” అని పేరు పెట్టారు ప్రముఖ చిత్రకారులు కూచి సాయిశంకర్.
ఏడాది కాలం శ్రమించి రూపుదిద్దిన “కమలోద్భవ కౌత్వం” సంతృప్తినివ్వడంతో నా శిష్యురాళ్లకు నేర్పాను. వాళ్ళంతా ఎంతో ఉత్సాహంతో నేర్చుకున్నారు. మాస్టర్ గారు కాలం చేసిన ఏడాది తరువాత 2011లో ఆయన నెలకొల్పిన “కూచిపూడి ఆర్ట్ అకాడెమీ”లోనే ఆయన పెద్దబ్బాయి వెంకట్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ప్రదర్శన ఏర్పాటైంది. ఆరోజు వినాయకచవితి పర్వదినం. ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారి కుమార్తె, నా శిష్యురాలు అయిన మాధవీ నంబూద్రి ఈ తొలి అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఆ తరువాత మరికొంతమంది కూడా వేర్వేరు ప్రాంతాల్లో ప్రదర్శించారు. డా. జ్యోత్స్న మాధురి మస్కట్ లో, అఖిల రమేష్ తిరుపతిలో ప్రదర్శించారు. నా జర్మనీ శిష్యురాలు సిల్వియా, మలేషియా శిష్యురాలు వర్ష కూడా నేర్చుకొని వాళ్ళ దేశాలలో ప్రదర్శించారు. హైదరాబాద్, బెంగళూరు తదితర దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా “కమలోద్భవ కౌత్వం” ప్రదర్శన జరుగుతూనే ఉంది. మరోవైపు ఈ ప్రక్రియలో పద్మంతోపాటు మరిన్ని అంశాలనూ చేర్చే ప్రయత్నం కూడా ఉన్నాను. ముందుముందు ఈ ప్రక్రియ మరింత ప్రాచుర్యం పొంది వేదికలమీద విలసిల్లాలని, దేవాలయ క్రతువులలో భాగం కావాలన్నది నా ఆశ. భరతముని ఊపిరి పోసిన, సిద్ధేంద్ర యోగి జవసత్వాలందించిన, మహామహులైన గురువులెందరో కొత్తదనాన్ని అద్దుతూ పెంచిపోషించిన ఈ కల్పతరువుకి నేనూ ఒక చిన్న చిగురుటాకును అమర్చానన్న ఆనందాన్ని పొందడమే నా జీవితలక్ష్యం.
**************************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
Please visit this page