12_009 ముకుందమాల – భక్తితత్వం

ఈ కామాన్ని గురించి భగవద్గీతలో కృష్ణపరమాత్మ పదేపదే హెచ్చరిస్తూ ఉంటారు.

శ్లో॥ ఆవృతం జ్ఞాన మేతేన జ్ఞానినో నిత్యవైరిణా

కామ రూపేణ కౌన్తేయ దుష్పురే ణానలేనచ॥ (భ.గీ. 3-39)

            జ్ఞానానికి శతృవైన అజ్ఞానమే అగ్నికి సైతం కాల్చరాని ‘కామ’ రూపంలో జ్ఞానాన్ని కప్పేస్తుంది. అప్పుడు ఇంక తృప్తి అన్నది లేక క్రమంగా పాపాలు చేయిస్తూ ఉంటుంది. అందుకే దాని విషయంలో జాగరూకత వహించమని చెబుతున్నాను అంటారు. మదనుణ్ణి మనసులోనికి రానీయకుండా చూసుకోవడం కర్తవ్యం. కామానికి అధిదేవత మదనుడు కదా!

            ఒకప్పుడు హరుడున్న చోటికి వెళ్ళి, అతడు కన్ను తెరిచే వరకయినా బ్రతికావు. కానీ ఇక్కడ శ్రీ మహావిష్ణువు చూడనవసరం లేకుండానే, ఆ స్వామి చక్రమే నిన్ను తుత్తునియలు చేస్తుంది. చక్రపరాక్రమ మెంతటిదో నీకు తెలియనిది కాదు అంటున్నారు. శ్రీ కృష్ణుడు సదా కొలువై ఉండే హృదయంలో కామానికి చోటు ఉండదు. అందుకే సదా ఆ ముకుందుని మదిలో నిల్పుకోమని సలహా ఇస్తున్నారు మహారాజు.

            హృదయంలో కామాదులకు చోటునివ్వకపోతే ‘భవభయబాధ’లుండవు. ఈ విషయాన్నే త్యాగరాజు :-

శివ శివ శివయనరాదా ఓరీ! భవభయబాధల నణచుకోరాదా ॥

కామాదులదెగగోసీ ముజ్జగదీశ్వరుల నీ మదినెంచి

త్యాగరాజసన్నుతుడనియెంచి                    ॥ శివ శివ ॥

అంటూ పాడారు.

31.శ్లో॥ తత్త్వం బృవాణాని పరంపరస్మా

        న్మధుక్షరంతీవ సతాం ఫలాని

        ప్రావర్తయ ప్రాంజలి రస్మిజిహ్వే

        నామాని నారాయణ గోచరాణి॥

            ఈ మనసుందే!? మాట వినినట్లే ఉంటుంది. కానీ సంకల్పాల వల్ల పుట్టిన కోరికలతో ఇంద్రియాల వెంటబడి నిశ్చయం నుండి జారిపోతుంది. నిజమే ఈ మనసు నిగ్రహించడానికి వీలు లేనంత చంచలమైనదే!

‘‘ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః’’ ॥

‘‘అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహంచలమ్‌’’ ॥

అలాగని చూస్తూ ఊరుకోరాదుకదా! మరి ఏది దారి ? (శివానందలహరి). అంటే ‘‘అభ్యాసేనతు కాన్తేయ, వైరాగ్యేణచ గృహ్యతే॥ అంటారు కృష్ణస్వామి! వైరాగ్యం అలవాటు చేసి.

శ్లో॥ శనైశ్శనై రుపరమే ర్బుద్ధ్యా ధృతిగృహీతయా

    ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్‌ ॥  (భ.గీ. 6-25)

            శనైఃశనైః = మెల్లమెల్లగా, వినియమ్య = నిగ్రహించడం అలవాటు చేసి, (బాగా నిగ్రహించి), ఆత్మసంస్థం = ఆత్మయందు కుదురుకునేలా చేసి, ఉపరమేత్‌ = విశ్రాంతి నొందించాలి. అందుకు ముందుగా నామజపం ఉపయోగపడుతుంది సుమా!

            నిజానికి మనసు ఆత్మకే వశవర్తినియై ఉండాలి. కానీ ఇంద్రియాలు (జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు) తమ ప్రభావాన్ని మనసుపై ఎక్కువగా చూపి, ప్రలోభపరచి, ఆత్మకు కాక తమకే వశం చేసుకోవడం వల్లనే ఇంత డోలాయమానం! ఆ ఇంద్రియాల ద్వారానే అంతకంటే ఎక్కువ ఆనందం, శాశ్వత ఆనందం అలవాటు చేస్తే ?! అప్పుడు మనసు స్ధిరంగా ఉండగలదు కదా ? అలా భగవద్విషయంలో మనసు స్థిరంగా ఉండటానికే ముందుగా తన నాలుకను భగవన్నామాన్ని జపించమని దోసిలియొగ్గి మరీ కోరుకుంటున్నారు మహారాజు.

            నామస్మరణమే భవతరణం. నామికి నామానికీ భేదం లేదు. పరతత్వ జ్ఞానం దుర్లభం అనుకున్నా నామం సులభమే కదా ? శ్రీ కృష్ణపరమాత్మ ఎంత దూరంలో ఉన్నా నామంతో పిలిచి ప్రార్ధించిన ద్రౌపదిని రక్షించలేదూ ? ప్రహ్లాదుని కాపాడినదీ, గజేంద్రుని బ్రోచినదీ, ఈ నామమే కదా? నామంతో పిలిస్తే నామి ఎక్కడున్నా వచ్చి రక్షిస్తాడు. గోవిందా, అనంతా, హరీ! కృష్ణా! నామాలు ఎన్నో!!

            ప్రకృతి కంటే, జీవుని కంటే పరుడైన పరమాత్మను ప్రతిపాదించే నారాయణ నామాన్ని పదేపదే పలకమని జిహ్వను కోరుకుంటున్నారు.

శ్లో॥ యజ్ఞేశాచ్యుత గోవిందా! మాధవానంత కేశవ ॥

    కృష్ణవిష్ణో హృషీకేశ ॥ వాసుదేవనమోస్తుతే ॥

            మహాభక్తుల శ్రేణికి చెందిన ధృవుని వంశంలో పుట్టిన పరమభాగవ తోత్తముడు శ్రీ భరతుడు. ఈ మహారాజు అనుక్షణం శ్రీకృష్ణ ధ్యానంతో కాలం గడిపేవాడు. వైభవోపేతమైన దివ్యనామ స్మరణ ప్రభావ జనిత ప్రశాంత జీవనమూ శ్రీ భరతుని దివ్య దర్శనానుభూతీ విష్ణుపురాణంలో చెప్పబడిరది.

            యజ్ఞేశ = యజ్ఞోవై విష్ణుః అను శృతి వాక్యము ప్రకారము యజ్ఞేశ అంటే సర్వభూతహితం కోరి, ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడు సత్కర్మల రూపంలో ఉండే స్వామి! అచ్యుత = చ్యుతము లేనివాడు, కాలాతీతుడు, పరమాత్మ. గోవింద = గోవులను రక్షించే గోపాలుడు. మనలో పశు ప్రవృత్తిని అదుపు చేసే పరమ పురుషుడు. మాధవ = మా లక్ష్మీదేవి ధవ = స్వామి. లక్ష్మీనాథుడు. మౌనాద్‌ ధ్యానాచ్చ యోగాచ్చవిద్ధి మాధవమ్‌’’ మౌన ధ్యానయోగాదుల వలన గ్రహించుటకు శక్యమైన వాడు. అనంత = ఈ విశ్వమంతయు తానైయుండి, ‘‘అత్యతిష్ఠ ద్దశాంగుళమ్‌’’ ఇంకా పది అంగుళాలు అంతకు మించి ఉన్నవాడని వేదం చెబుతోంది. అటువంటి స్వామి అంతులేని ఉపాధులతో విశ్వరూపుడైయున్నాడు. కేశవ = క+అ+ఈశ = క అంటే బ్రహ్మ, అ అంటే విష్ణువు, ఈశ అంటే ఈశ్వరుడు. ఈ విధంగా త్రిమూర్తి స్వరూపుడు. కేశి అనే రాక్షసుని వధించడం వల్ల కూడా కేశవ అనే నామం కల్గింది స్వామికి. కృష్ణ = నీలమేఘ శరీరుడు, నిత్యానంద ప్రదాయి, పాపాలను పోగొట్టి ఎల్లప్పుడూ దివ్యానందాన్నివ్వగలవాడు. విష్ణు = సర్వత్ర వ్యాపించి యున్నవాడు విష్ణువు. ‘‘ఇందు గలడందులేడని సందేహము వలదు సర్వోపగతుడు’’ ఆ స్వామి. హృషీకేశ = సర్వేంద్రియములకు అధిపతియైన వాడు, వాసుదేవ = విశ్వమంత నిండియున్న వాడు. ‘సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే’.

            పరతత్వం బంగారం ముద్ద అయితే నామము తయారుకాబడిన నగ వంటిది. ఇది మనకు అలంకారమై రక్షిస్తూంటుంది. ఆ పరత్వాన్ని తెలియజేయు నామాల్లో ప్రధానమైనది నారాయణ నామం. నార = సర్వపదార్థములలోనూ, అయనాయ = నిండియున్న వాడనీ, నార = ప్రాణాధారమైన నీరు, స్థానముగా గలవాడనీ చెప్పబడే నారాయణ నామాన్నే, పై నామాలన్నీ కూడా ప్రతిపాదిస్తున్నాయి. అందుకే

‘‘నామస్మరణా దన్యోపాయం నహిపశ్యామో భవతరణే

రామహరే కృష్ణహరే తవనామ వదామి సదానృహరే ॥ ఈ భవసాగరాన్ని తరించే శక్తినిచ్చేది నామమే! నామమేదైనా పరతత్వం ఒక్కటే! అందుకే ఓ నాలుకా! నారాయణుని ప్రతిపాదించే నామస్మరణ చేయమని (మానకుమని) దోసిలి యొగ్గి మరీ ప్రార్థిస్తున్నారు కులశేఖరులు.

‘‘రామనామమే జీవనమూ, భక్తావనమూ, పతితపావనమూ, సీతారామ నామవే ॥ అంటారు తూము నరసింహదాసు. నామస్మరణ తప్ప జీవుడు తరించడానికి, చిత్తశుద్ధిని పొందడానికి అన్యమైన ఉపాయం మరొక్కటి లేదు అని నొక్కి వక్కాణిస్తారు భక్తులైనవారంతా!

32.శ్లో.  ఇదం శరీరం పరిణామ పేశలం

        పత త్యవశ్యం శ్లథసంధి జర్ఘరం

        కిమౌషధైః క్లిశ్యసి మూఢ దుర్మతే ।

        నిరామయం కృష్ణ రసాయనం పిబ ॥

            తాను ఈ శరీరం మాత్రమేననే మూఢబుద్ధితో కేవలం శరీర రక్షణే కర్తవ్యంగా జీవితాన్ని గడపడం తగదు. పరిణామ పేశలమైన ఈ శరీరం జరావ్యాధి మృత్యువులతో ఒకనాడు పతనం కాక తప్పదు. అందుకే మనసునైనా రోగగ్రస్తం కాకుండా, ముందుగానే శ్రీకృష్ణరసాయనాన్ని తాగడం అలవాటు చేసుకోమంటారు మహారాజు. ఓరీ మూఢా! దుర్మతీ! ఇంత చెబుతున్నా అర్థం చేసుకోవేం! అంటూ మందలిస్తూ మరీ చెబుతున్నారు.

            ఆ కృష్ణనామ రసాయనం రసస్వరూపుడైన ఆ పరమాత్మతో నిత్యం మనను  చేర్చి ఉంచుతుంది. ఇదే ఇహపరసాధనం. ఈ శ్రీకృష్ణ రసాయనాన్ని గతంలో రేపల్లెలోని గోపికలు సేవించినట్లు నారాయణతీర్ధులు చెప్పారు.

శ్లో॥ సంసార రోగ సంతప్తాః కృష్ణ బ్రహ్మ రసాయనమ్‌ ।

    గోప్య పిబంత్య స్తన్ముక్తా రమంతే హ్య భయం గతాః ॥

            సంసారరోగంతో బాధపడుతున్న గోపికలు, కృష్ణబ్రహ్మ రసాయనం సేవించి, ఆ పరమేశ్వరతత్వం తెలియరావడంతో ఆరోగ్యవంతులై భయరహితులై సుఖాన్ని అనుభవిస్తున్నారు.

            నామరసాయనం నీకు శక్తినిస్తుంది. ఆ నామస్మరణ భగవంతునికి దాసుని చేస్తుంది. అంటే ఇంక ఈ చంచలమైన మనసుకు నీవు దాసుడవు కావు అన్నమాట! అప్పుడే పరమాత్ముని గురించిన జ్ఞానం పరమాత్మకు దగ్గర చేస్తుంది. ఈ రసాయనం లోపలి కల్మషాన్ని కరిగించి బలాన్నిస్తుంది. అంతటి శక్తివంతమైనది నామ రసాయనం. నామం ఉంటే నామి ఉన్నట్లే. నామి తోడుంటే మనసుకు బలం, ధైర్యం. విష్ణు కథలు వింటే అర్ధం అవుతుంది. ఆ స్వామి అండ ఎంత బలమో! ఆ విషయం తెలిసే అన్నమయ్య ఇలా పాడారు.

‘‘వినరోభాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణు కథా!’’ అంటూ… నారదాదులు, వ్యాసవాల్మీకాదులు, ‘‘నుడివిన’’ విష్ణుకథలు వినడం ఎంతో పావనం! ప్రహ్లాదుని, గజేంద్రుని, ద్రౌపదిని, పాండవులను రక్షించిన పావననామం జపించడం కొండంత అండ.

పిబరే రామరసం రసనే పిబరే రామరసం

జనన మరణ భయశోకవిదూరం

సకలశాస్త్ర నిగమాగమ సారం                      ॥ పిబరే ॥

శుక శౌనక కౌశిక ముఖ పీతం                     ॥ పిబరే ॥

            జనన మరణ భయశోకాల్ని పోగొట్టేది ఈ రామ రసం! సకల వేద శాస్త్రాల సారం కూడానూ! శుకశౌనకాది మునిశ్రేష్ఠులు ఆ స్వాదించి, ఆనందించినది. నువ్వూ తాగు నాలుకా! అంటారు సదాశివబ్రహ్మేంద్ర!

            శరీరం ఏదో ఒకనాడు రోగగ్రస్తమై శిధిలమవక తప్పదని తెలిసపుడు, కేవలం దానికోసమై పాకులాడటం మాని, ఆరోగ్యంగా ఉండగానే ఆ శరీరం సహాయం తోనే కృష్ణ రసాయనాన్ని త్రాగి మనసుకు శక్తిని కూర్చుకో. మాధవుని చేరేదారిలో ప్రయాణాన్ని సుగమం చేసుకో. అంటారు శ్రీ కులశేఖరులు.

శ్లో॥ ‘‘ తేధన్యా భువిపరమార్థ నిశ్చితేహాః

    శేషాస్తు భ్రమనిలయే పరిభ్రమంతః

            పరమాత్మను వాంఛించే భక్తులు ధన్యులు కాగా, ప్రపంచం వెంట పరుగులు పెట్టేవారు భ్రమలో చిక్కుకుని పరిభ్రమిస్తున్నారు అంటారు శంకరాచార్య స్వామి.

            కృష్ణ రసాయనంగా మనభవరోగాలణనిగించే పరమాత్ముని యొక్క బంధుకోటిని, పరివారాన్ని కూడా స్మరించి, ఆ స్వామి వైభవాన్ని గుర్తుకు తెచ్చి, పొగడడం వల్ల మనసుకు మరింత ధైర్యాన్ని చేకూరుస్తున్నారు రాబోయే శ్లోకంలో. ఆ స్వామి వైభవం ఎంతటిదో!

  1. శ్లో॥ దారావారాకరవరసుతా తే తనూజో విరంచిః

         స్తోతా వేదస్తవ సురగణో భృత్యవర్గః ప్రసాదః

         ముక్తిర్మాయా జగ దవికలం తావకీ దేవకీ తే

         మాతా మిత్రం బలరిపుసుతః త్వయ్యతోన్యం నజానే॥

            కృష్ణా! నీకంటే వేరే దైవం నే నెరుగను స్వామీ! జలధిమధించగా జన్మించిన క్షీరసాగర తనూజ లక్ష్మీదేవి నీ భార్య. సర్వజగాలనూ సృష్టించిన బ్రహ్మకు నీవు తండ్రివి. అనాదీ, అపౌరుషేయా లయిన వేదాలు నిన్ను స్తోత్రం చేస్తాయి. ఇంద్రాది దేవతారణమంతా నీ భృత్యకోటి. నీ అనుగ్రహమే ముక్తి! ఇంద్రసుతుడైన అర్జురనుడు నీకు మిత్రుడు. నీ సంకల్పమాత్రమే ఈ జగత్తుకు కారణం అవుతూంటే కార్య జగత్తులో, దేవకీదేవి నీకు తల్లి. ఈ విధంగా లక్ష్మీపతివి, సర్వ జగత్కారణుడవు, వేద వేద్యుడవు, మోక్షప్రదుడవు అయిన నీ వైభవమెంతటిదని! పరదైవమవైన నీవు మాలాంటి వారి కోసం సులభుడివై దివినుండి భువికి దిగివచ్చావా తండ్రీ! నీ వాడను నేను. నీకంటే అన్యులను నేనెరుగను. రక్షించుదేవా! అంటూ, శ్రీ దేవుని వైభవాన్ని తలచి ఆనందిస్తూ అర్థిస్తున్నారు కులశేఖరులు.

తరువాయి వచ్చే సంచికలో……

 

——–   ( 0 ) ——-

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Please visit this page