12_009 శ్రీలక్ష్మి – కథ

హరిమూర్తికి జీవితం ఒక్కసారిగా ఆగిపోయినట్టుంది. తన ఇల్లులాగే, మనసంతా ఖాళీగా బోసిగా ఉంది. ఏదో చెప్పలేని దిగులు, బాధా వాటి వెనకాల తప్పు చేసానన్న పశ్చాత్తాపం హరిమూర్తిని వెంటాడుతున్నాయి. భార్య పోయిన దుఖం కన్నా ఆమె రాసిన ఉత్తరం హరిమూర్తి గుండెల్లో ఎక్కడో కలచివేస్తోంది. శ్రీలక్ష్మి చనిపోయిన తర్వాత గాని శ్రీలక్ష్మి విలువేమిటో..ఆమె చేసిన పనులేమిటో… ఆమె ఎంతమందికి ఆత్మీయురాలో హరిమూర్తికి తెలిసి రాలేదు. నలభై ఐదేళ్ళ దాంపత్య జీవితంలో శ్రీలక్ష్మి ఎన్నడూ భర్తకు ఎదురుచెప్పలేదు. ఎప్పుడూ హరిమూర్తి మాటే చెల్లేది. అడగవలసిన అవసరం లేకుండా అతనికి కావాల్సినవన్నీ అమరుస్తూ, అతన్ని మౌనంగా భరిస్తూ శ్రీలక్ష్మి తనకు ఇష్టమైన ప్రపంచాన్ని సృష్టించుకుని, ఆ ప్రపంచంలో తనదంటూ ఓ ముద్రవేసి వెళ్ళింది.

ఏడాది కిందట మైల్డ్ గా హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు శ్రీలక్ష్మి విషయంలో కాస్త శ్రద్ధ తీసుకుని బుద్ధిగా ఉన్నా, ఆ తర్వాత ఆమె కోలుకుని మామూలుగా తిరుగుతుంటే హరిమూర్తి తన బాధ్యత తీరిపోయిందనుకుని మళ్ళీ మామూలు అయిపోయాడు. కానీ ఇంత త్వరగా తనని వదిలి వెళ్లిపోతుందని ఊహించలేదు. రాత్రి ఎంతో పొద్దుపోతే కాని నిద్రపోని హరిమూర్తి… అలాగే బారెడు పొద్దెక్కితే కాని నిద్ర లేవని హరిమూర్తి ఆరోజు కూడా తన మామూలు టైముకు లేచి కిందకొచ్చాడు. కిందకు రాగానే  వంటింట్లో నుంచి వంట తాలూకు కమ్మని వాసనలు, పూజ గదిలోనుంచి వచ్చే అగరుబత్తి పరిమళం హరిమూర్తికి బాగా అలవాటు. అటువంటిది ఆ రోజు ఏ వాసనలు, ఎటువంటి అలికిడి లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది హరిమూర్తికి. శ్రీలక్ష్మి కోసం లివింగ్ రూములో…అక్కడ కనిపించక టీవీ రూములో…అక్కడా లేకపోవడంతో ఏ మొక్కలమధ్యో ఉండి ఉంటుందని బ్యాక్ యార్డ్ లోకి వెళ్ళి చూసాడు. శ్రీలక్ష్మి కారు గరాజ్ లోనే ఉండటంతో,  పైన ఏ గదిలోనో కూర్చుని ఫోన్ లో పుట్టింటి వాళ్ళతో కబుర్లు పెట్టుకుని ఉంటుందని పైకి వచ్చాడు హరిమూర్తి. పైన ఉన్న గదులన్నీ వెతుకుతూ చివరకు భార్య తరచు పడుకునే బెడ్ రూము తలుపు తెరిచాడు. అర్ధరాత్రి దాకా టీవీ చూసే భర్తని ఏమి అనలేక పక్కగదిలోకి వెళ్ళి పడుకోటం శ్రీలక్ష్మి కి మామూలే. తొమ్మిది గంటలైనా భార్య ఇంకా పక్కమీదే ఉండటం చూసి హరిమూర్తి ఆశ్చర్యపోతూ దగ్గరకు వెళ్ళాడు. చదువుతున్న పుస్తకం పక్కనే ఉండటంతో రాత్రంతా చదువుతూ ఏ తెల్లవారుజామునో పడుకుని ఉంటుందనుకున్నాడు. “సరే…పడుకోనీలే” అని ఒక క్షణం అనిపించింది కానీ, లేవగానే కాఫీ తాగందే హరిమూర్తికి అడుగు ముందుకు పడదు. పోనీ కిచన్ లోకి వెళ్ళి చేసుకుందామా అంటే చేతకాదు. అందులో నిన్న రాత్రి కాస్త మందు ఎక్కువైందేమో, తలంతా దిమ్ముగా ఉంది. పైగా ఈ రోజు ముఖ్యమైన క్లయింటుని కలవాలి. శ్రీలక్ష్మి ఇచ్చే కమ్మటి స్ట్రాంగ్ కాఫీ పడితేగాని “హేన్ గోవర్” తాలూకు తలనొప్పి పోదు. అందుకే భార్యను లేపటానికే నిశ్చయించుకున్నాడు. ఆమెను తాకి తట్టి లేపుతున్నప్పుడు చేతికి చల్లగా మంచుముద్దలా అనిపించి హరిమూర్తి షాక్ తిన్నాడు. ఒక్క క్షణం అతని మనస్సు స్తంభించి పోయింది.

సదా తన మనసెరిగి ప్రవర్తిస్తూ తన అలవాట్లను..తన బలహీనతల్ని..తన అహంకారాన్నీ..దురుసుతనాన్నీ భరిస్తూ వచ్చిన శ్రీలక్ష్మి, తనను వదిలి వెళ్ళిపోయి అప్పుడే పన్నెండు రోజులైంది అంటే హరిమూర్తి కి నమ్మశక్యంగా లేదు. శ్రీలక్ష్మి ఇక లేదు అన్న సత్యాన్ని, ఆమె సంపాదించుకున్న పేరును ఈ రెంటిని హరిమూర్తి జీర్ణించుకోలేక పోతున్నాడు. ఫ్యూనరల్ టైములో శ్రీలక్ష్మి పట్ల అందరూ చూపించిన గౌరవం, ప్రేమ, దుఖం చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు చూసినా వంట చేసుకుంటూ..పుస్తకాలు చదువుకుంటూ….మొక్కలమధ్య తిరుగుతూ….అల్లుకుంటూ…ఫోనులో మాట్లాడుతూ కనిపించే శ్రీలక్ష్మికి ఇంతమంది తెలుసునని, ఆమెకు ఇంత బలగం ఉందని హరిమూర్తికి అప్పుడే తెలిసింది. ఇంట్లో అందరి అవసరాలు చూసాక అక్కడికీ ఇక్కడికీ వెళ్తుందని తెలుసు గాని, ఇన్నేళ్ళుగా సమాజానికి ఆమె ఎన్నో రకాలుగా సేవ చేస్తోందన్న విషయం శ్రీలక్ష్మి పోయిన తర్వాత గాని  హరిమూర్తికి తెలీలేదు. ఎందుకంటే హరి మూర్తికి ఎప్పుడూ  బిజినెస్..డబ్బు సంపాదన…డిన్నర్లు..క్లబ్బులు..పబ్బులు ముఖ్యం కనుక.  

శ్రీలక్ష్మికి “భర్తగా” ఆమె కనివిని ఎరుగని జీవితాన్ని, హోదాని ఇచ్చానని గర్వపడే హరిమూర్తి ఆమెను పోగొట్టుకున్న రోజున తెలుసుకున్నాడు శ్రీలక్ష్మికి బయట ఎంత గుర్తింపు, పేరు ఉందో. ఎంతోమంది ఫోన్లు చేసి, ఈ మెయిల్స్ పంపించి ఆమె హటాత్ మరణానికి విచారం వ్యక్తం చేస్తూ తనకు తెలియని శ్రీలక్ష్మి గురించి చెప్పారు. ఆమె గొప్పతనాన్ని, మంచితనాన్ని పొగిడారు. ఫ్యూనరల్ రోజున ఆమెకు శ్రద్ధాంజలి ఘటించటానికి వచ్చిన వాళ్ళను చూసి ఆశ్చర్యపోయాడు హరిమూర్తి. లోకల్ హాస్పిటల్ నుంచి…సూప్ కిచన్ నుంచి…రెడ్ క్రాస్ నుంచి… ఇండియన్ అసోసియేషన్ తరుపునుంచి…దేవాలయం నుంచి వచ్చిన వాళ్ళందరూ శ్రీలక్ష్మి తో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

అప్పుడే పుట్టిన పసికందులకి స్వెట్టర్లు, టోపీలు అల్లి ఇస్తుందని, వారానికి రెండు రోజులు సూప్ కిచన్ కు వెళ్తుందని…వాళ్ళ కోసం కూరలు పండించి ఇస్తూ ఉంటుందని…రెగ్యులర్ బ్లడ్ డోనర్ అని…లోకల్ కాన్సర్ ఫౌండేషన్ కు హెల్ప్ చేస్తుందని అందరూ అంటుంటే ఆ విషయాలన్నీ ఆరోజే తెలుసుకున్నాడు హరిమూర్తి.  తన పిల్లలు పెద్ద కాలేజీలకు వెళ్ళటానికి, వాళ్ళు వృద్ధిలోకి రావడానికి తను, తన సంపాదన కారణం అనుకునే హరిమూర్తికి, పిల్లలు కూడా కంగు తినిపించారు. ఆమె నిష్కల్మషమైన ప్రేమ గురించి ..తల్లి వ్యక్తిత్వాన్నిగురించి…ఆమె సహనం గురించి….చదువు పట్ల తల్లికి ఉన్న ఇష్టం గురించి పిల్లలు ముగ్గురు గొప్పగా మాట్లాడారు. తాము తప్పుదోవలు పట్టకుండా ఎలా కాపాడిందో, తమ అభిరుచులను గుర్తించి ఎలా ప్రోత్సహించిందో…తమ శక్తిసామర్ద్యాలను ఎలా వెలికి తీసిందో, పెద్ద చదువులు చదువుకోకపోయినా తల్లి ఎంత విజ్ఞానవంతురాలో అందరితో చెప్పుకున్నారు. పెద్దవాడు సుహాస్ తను పీడియాట్రిక్ అంకాలజిస్టు అవడానికి కారణం తల్లే అని, స్పెషల్ ఎడ్యుకేషన్ లో పీ ఎచ్ డి చెయ్యమని తల్లే తనను ప్రోత్సహించిందని కూతురు సునీత గుర్తుచేసుకున్నారు. చిన్నవాడు సుధీర్ తల్లిమీద ఇంగ్లీషులో కవిత రాసి తన ప్రేమను చాటుకున్నాడు.

హరిమూర్తి నలభై ఏళ్ళ కిందట పీ ఎచ్ డి పేరుతో అమెరికా వచ్చాడు. గవర్నమెంట్ కాలేజీలో చేస్తున్న ఉద్యోగం వదులుకుని ఎక్కడో దేశం కాని దేశం వెళ్లటం హరిమూర్తి తల్లిదండ్రులకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఎప్పుడూ ఎవరి మాట వినని హరిమూర్తి అప్పుడు కూడా తల్లిదండ్రుల మాట వినకుండా అమెరికా వచ్చాడు. తల్లిదండ్రుల మాటే వినని వాడు అత్తమామల మాటేం వింటాడని శ్రీలక్ష్మి అమ్మానాన్న ఏం మాట్లాడలేదు. హరిమూర్తి బయలుదేరే రోజు, శ్రీలక్ష్మి ఎలాగో గొంతు పెగల్చుకుని “నన్నూ మీతో తీసికెళ్ళ౦డి” అని అడిగింది. తన ఆశయం ఏమిటో, అమెరికా వెళ్లటం వల్ల ఉపయోగం ఏమిటో లాంటి విషయాలు వివరించి చెప్పకపోయినా, ఆమెను వంటరిగా వదిలి వెళ్తున్నాని, ప్రేమగా మాట్లాడి ఆమెకు ధైర్యం ఇవ్వాలని అతని లెక్కల బుర్రకు తట్టలేదు. “తర్వాత వద్దువులే” అంటూ ఒక్క మాటలో సమాధానం చెప్పి విమానం ఎక్కేసాడు హరిమూర్తి.

హరిమూర్తి యూనివర్సిటీ లో ఎం ఎ మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు శ్రీలక్ష్మి తో పెళ్లయిపోయింది.  దానధర్మాలతో ఆర్ధికంగా చితికిపోయిన తన చిన్ననాటి స్నేహితుడు, ఆఖరి కూతురు పెళ్ళి కోసం చెప్పులరిగేలా తిరుగుతుంటే, లక్ష్మి కళ ఉట్టిపడుతున్న ఆ పిల్లను తమ ఇంటి కోడలిగా చేసుకుంటే అన్నివిధాల బావుంటుందని హరిమూర్తి తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం అది. పెళ్ళికి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ పెళ్ళి కూతురు చాలా అందంగా ఉందని కామెంట్ చేసినప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాడు కానీ, అమెరికా వచ్చాక శ్రీలక్ష్మి ఉట్టి పల్లెటూరి గబ్బిలాయి అని తన చదువుకు, స్టేటస్ కు, తన అభిరుచికి తగిన భార్య కాదన్న అసంతృప్తి హరిమూర్తికి బాగా ఉండిపోయింది.

తనని ఓ దైవంలా ఆరాధిస్తూ తన మాటకు ఎదురు చెప్పకుండా, అణకువగా అన్నీ అమర్చే శ్రీలక్ష్మి ని చూసి లోలోపల సంతోషపడే వాడు కానీ, పైకి మాత్రం ఎప్పుడూ అసలైన మొగుడి లాగే బిహేవ్ చేసేవాడు. శ్రీలక్ష్మి కి చీరలు కొన్నా, నగలు చేయించినా, అత్తవారికి సహాయం చేసినా అందులో ప్రేమ కన్నా ఆడంబరం, అహంభావమే ఎక్కువగా ఉండేది. శ్రీలక్ష్మి మాత్రం ఇవేవి పట్టించుకోకుండా ఎప్పుడూ సంతోషంగానే ఉండేది. అతని మనస్తత్వాన్ని అర్ధం చేసుకున్న శ్రీలక్ష్మి, హరిమూర్తి తన మీద ఎంత దాష్టీకం చెలాయించినా, పీకల దాకా తాగి వచ్చినా, పిల్లల్ని గడగడ లాడించినా అన్నింటినీ భరిస్తూ, సమర్ధించుకుంటూ తనపని తాను చేసుకుంటూ పోయేది. పిల్లలు స్కూళ్ళ కెళ్ళటం మొదలు పెట్టాక ఓ కంపెనీలో కొన్నాళ్ళు డేటా ఎంట్రీ ఉద్యోగం చేసింది. శ్రీలక్ష్మి పని చేసినన్నాళ్ళు హరిమూర్తి ఆమెను గేలి చేస్తూనే ఉన్నాడు. “బూబు సంపాదన కుట్టుపూలకు సరి!” అన్నట్టు మా ఆవిడ సంపాదన కారులో గాస్ కు, పిల్లల బేబీ సిట్టింగ్ కు సరిపోతుంది!” అంటూ అందరి ముందు అనేవాడు! భర్త ఎప్పుడూ క్లెయిన్ట్స్ ..బిజినెస్ ట్రిప్పులు…క్లబ్బులు..డిన్నర్లు అంటూ ఇంటిపట్టున ఉండకపోవడం, పిల్లల్ని పట్టించుకోక పోవడం చూసి శ్రీలక్ష్మే ఉద్యోగం మానేసింది.

ఇల్లు నిర్వహణ..పిల్లల ఆలనాపాలనా… చదువులు..అనారోగ్యాలు..ఆటలు, పాటలు..ఎక్సట్రా యాక్టివిటీస్..కాలేజీ చదువులు వీటన్నిటి కారణంగా శ్రీలక్ష్మి ఎన్నో నేర్చుకుంటూ ఎన్నెన్నోవిషయాలు తెలుసుకుంది. ఈ ప్రక్రియలో శ్రీలక్ష్మికి రకరకాల వారితో పరిచయాలు, స్నేహాలు ఏర్పడ్డాయి. ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే వారిని ఎంతో మందిని చూసింది. అప్పుడే శ్రీలక్ష్మికి తను ఏం చెయ్యచ్చో, సమాజానికి తను ఎలా ఉపయోగపడచ్చో, తన సమయాన్ని ఎలా వినియోగించుకోవచ్చో తెలిసింది. “మానవ సేవే మాధవ సేవ” అంటూ అప్పుచేసి మరీ ఎందరికో సహాయం చేసిన తండ్రి ఆమెకు గుర్తుకొచ్చాడు. పిల్లలు చదువులు ముగించుకుని వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడటం మొదలు పెట్టాక శ్రీలక్ష్మి ఎక్కువ సమయం వాలంటీర్ సర్వీస్ చేస్తూ నలుగురికీ సహాయపడుతూ వచ్చింది.

అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వెళ్ళే ముందు, పిల్లలు తమ దగ్గరకు వచ్చి ఉండమని తండ్రిని అడిగారు. అల్లుడు, కోడలు కూడా అడిగి చూసారు. హరిమూర్తి ఎక్కడికీ రానన్నాడు. రోజు రోజుకు శ్రీలక్ష్మి లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇన్నాళ్ళు ఆమె ఉనికిని అంతగా పట్టించుకోని హరిమూర్తికి, ఇప్పుడు ఇంట్లో ఎక్కడి కెళ్ళినా, ఏం చూసినా శ్రిలక్ష్మే కనిపిస్తోంది. ఆమె చేతి వంట, ఆ కమ్మటి కాఫీ ఇక తనకు లేవనుకుంటే బాధగా ఉంది. హరిమూర్తికి ఏం చెయ్యాలో తోచడం లేదు..పిచ్చెక్కినట్టుగా ఉంది. ఆరోజు మరింత స్ట్రాంగ్ డోస్ పడితేగాని లాభం లేదని లిక్కర్ కాబినెట్ తెరిచి స్పెషల్ అకేషన్స్ కోసం తను ప్రత్యేకంగా వెనకగా దాచుకునే విస్కీ బాటిల్ అందుకోబోయాడు హరిమూర్తి.  అప్పుడే శ్రీలక్ష్మి రాసి పెట్టిన ఉత్తరం చూసాడు. ఆ లిక్కర్ కాబినెట్ హారిమూర్తి తప్ప ఇంకెవ్వరు ముట్టుకోరు, ముట్టుకోడానికి వీల్లేదు కూడా. శ్రీ లక్ష్మి అయితే ఈ చాయలకే రాదు. అలాంటిది ఈ కవరు ఇక్కడకెలా వచ్చింది? అక్కడెలా పెట్టింది? అనుకుంటూ గ్లాసులోకి విస్కీ వొంపుకుని సోఫాలో కూర్చుని కవర్ ఓపెన్ చేసి చూసాడు.

అది శ్రీలక్ష్మి కొద్ది రోజులకిందట హరి మూర్తికి రాసిన ఉత్తరం. అందులో కొన్ని ముఖ్యమైన వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టిందీ…తనకు తెలియని పిల్లల సంగతులు కొన్ని…తన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని రాస్తూ చివరిగా ముత్యాల్లాంటి పిల్లల్ని, ఇంతటి సౌభాగ్యాన్ని పొందిన తను ఎంతో అదృష్టవంతురాలినని… హరిమూర్తి కారణంగా అమెరికా దేశం వచ్చి బయట ప్రపంచాన్ని చూడగలిగానని….తన మనసుకు ఇష్టమైన పనులు చేసే గొప్ప అవకాశం తనకు దొరికిందని రాస్తూ…భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని సార్ధకం చేసుకున్నాననే తృప్తి-ఆనందం తనకు ఉన్నాయని “నా గుండెల్లో నిండుగా ఉన్న ఈ సంతోషాన్ని మీకు తెలియచెయ్యాలని ఈ ఉత్తరం రాస్తున్నాను” అంటూ ముగించింది.

అహంభావంతో ఆమె వ్యక్తిత్వాన్ని తను నొక్కేయాలని చూసినా, ఆమెకు ఇవ్వవలసిన గౌరవాన్ని తను ఇవ్వకపోయినా, ఎక్కడా తనను తప్పుపట్టకుండా…నిందించకుండా పైపెచ్చు మీ వలనే నాకెంతో మేలు జరిగింది అంటూ తనను అందలం ఎక్కించింది శ్రీలక్ష్మి.

తనకెంతో ఇష్టమైన విస్కీ గొంతులోకి నెమ్మదిగా జారుతున్నప్పుడు, మధ్య మధ్యలో సిగరెట్  దమ్ము లాగుతున్నప్పుడు, ఎప్పుడూ ఉండే “కిక్” ఆ రోజున హరిమూర్తికి రాలేదు. తన జీవితంలో అసలైన కిక్ “శ్రీలక్ష్మే” అని ఆరోజే తెలుసుకున్న హరిమూర్తి, సీసాలో ఉన్న విస్కీని సింకులో వొంపేసి…సిగరెట్లు గార్బేజ్ లో పడేసి లోపలికి వెళ్ళిపోయాడు.

************************

తొలి ప్రచురణ “కౌముది” 2021­­­­

వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది ఉత్తమ రచనల పోటీలో ప్రశంసాపత్రం పొందిన కథ.

 

శ్రీలక్ష్మి- నేపధ్యం

నేను 1976 లో అమెరికా వచ్చాను. ఆ రోజుల్లో భార్యాభర్తల మధ్య చదువు పరంగా ఉన్న వ్యత్యాస కారణమో ఏమో తెలీదు కానీ కొంతమంది మొగవాళ్ళు “నిన్ను అమెరికా తీసుకొచ్చి ఇప్పటికే చాలా ఇచ్చేసాను..ఇంకేంటి?” అన్న ధోరణి లో భార్యలతో ప్రవర్తించడం గమనించాను. అలాగే ఈ వివాహ వ్యవస్థలో అవతలి వ్యక్తితో ఎంత ఇబ్బంది ఉన్నా, ఓపికగా తట్టుకుంటూ తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా ఎత్తుకు ఎదిగిన ఆడవాళ్ళనూ చూసాను! ఆ తరువాత  బాధ్యతలు తీరిపోయి, రిటైర్ అయిన మొగవాళ్ళు లైఫ్ ని ఎంజాయ్ చేసే మార్గం వైపు వెళ్తుంటే, చాలామంది ఆడవాళ్ళు తమ సమయాన్ని వివిధ రకాలుగా సమాజ సేవకు వినియోగించడం చూస్తున్నాను. నేను గమనించిన....తెలుసుకున్న ఈ మూడు విషయాలను ఇల్లాలి ముచ్చటగా కాకుండా కథగా రాయాలని చేసిన ప్రయత్నమే “శ్రీలక్ష్మి”!

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page