12_010 అమెరికా అమ్మాయితో ముఖాముఖీ 02

 

నృత్య నీరాజనం- నాట్య కళాకారిణి

” అమెరికా అమ్మాయి ” తెలుగు చిత్రనాయిక కుమారి దేవయాని తో ముఖాముఖీ.

 

( గత సంచిక తరువాయి…. )

 ప్రశ్న :

( దేవయాని గారి వెబ్ సైట్ www.devayanidance.com నుండి ఆమె ధృడమైన విశ్వాసము, కళాత్మకపరమైన నాట్య విన్యాసము గురించి 1, 2 విషయాలను సేకరించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

” విశ్వవ్యాప్తమైన భరతనాట్యము పట్ల నాకున్న ప్రగాఢనమ్మకము, ఆసక్తి, గురువుల వద్ద శిక్షణ, నా నాట్యరీతులకు రూపుదిద్ది, వాటికి ఎన్నో సొగసులను అందించింది. నాట్యానికి భౌగోళికమైన సరిహద్దులు, ఎల్లలు వంటివి లేనేలేవు. నిజం చెప్పాలంటే సమైక్యత, శాంతి, సౌందర్యము కేవలం ఏ కొద్దిమందికో పరిమితం కావు. కళ అన్నది ఒక పరికరము. అది విశ్వవ్యాప్తం. ప్రపంచాన్ని గురించిన విశాల అవగాహన ను కలిగి, జీవితంతో ముడిపడి ఉండడం దాని లక్షణము. లక్ష్యము ..” )

విద్యార్థిని గా మీ జీవితమూ, ప్రఖ్యాత గురువుల వద్ద మీరు పొందిన నాట్య శిక్షణ, వారు మిమ్మల్ని ప్రోత్సహించిన విధానము… వీటిని గురించి వివరించండి.

 

దేవయాని :

నేను సామాన్య జీవితాన్ని గడుపుతూ రోజుకు దాదాపు 6 గంటల సేపు నాట్యగురువుల ప్రత్యక్ష శిక్షణలో భరత నాట్యాన్ని అభ్యసించాను. ప్రప్రధమంగా శ్రీ కాంచీపురం ఎల్లప్ప మొదలియార్ గారి వద్ద, వారు కాలం చేయడంతో, శ్రీమతి కళానిధి నారాయణ్ గారి వద్ద అభినయము, కర్ణాటక సంగీతం – గాత్రం పద్మవిభూషణ్ డాక్టర్ శ్రీ మంగళంపల్లి బాలమురళికృష్ణ గారి వద్ద, నాట్యం లో శిల్పకళారీతులను దర్శింపజేసే కరణ రీతులను కుమారి స్వర్ణముఖి గారి వద్ద, యోగాభ్యాస పద్ధతులను శ్రీ దేశికాచారియర్ గారి వద్ద నేర్చుకున్నాను. శ్రీమద్భగవద్గీత ను, కొన్ని వేద వేదాంత గ్రంధాలను, టాగోర్ కవితలను, సూర్ దాస్, కాళిదాస్, ఒమర్ ఖయ్యామ్, జలాలుద్దీన్ రూమీ, ఖలీల్ జీబ్రాన్ తదితర ప్రముఖుల రచనలను చదువుతూ ఉండేదానిని. అంతే కాకుండా చెన్నై లో స్థిరపడ్డ రాష్ట్రేతరులతోనూ, ఇతర విదేశీయులతోనూ స్నేహసంబంధాలను ఏర్పరచుకుని విశ్వవ్యాప్తమైన భారతీయతను నా జీవితానుబంధం గా కొనసాగిస్తూ వస్తున్నాను. ఉదాహరణకు – ప్రఖ్యాత నర్తకీమణి శ్రీమతి లక్ష్మీ విశ్వనాధన్ గారు నాకు అభినయం ( నృత్యం ) లో ఉచితం గా శిక్షణను ఇచ్చిన సహృదయురాలు, స్నేహశీలి. వారు నాకు నేర్పిన విద్యను నేను మైలాపూర్ ( చెన్నై ) లో నా స్నేహితురాలు లలిత గారి ఇంట్లోని వంటగదిలో మిత్రులందరి సమక్షం లో ప్రదర్శించేదానిని. భరతనాట్యం పట్ల నాలోని తృష్ణ ను గుర్తించి, గురుదేవులు నన్ను ఈ రంగం లో ఎంతగానో ప్రోత్సాహపరచి, ఆదరించి, నా ఔన్నత్యానికి కారణభూతులయ్యారు. ఈ శిక్షణ నామనసు కు నేర్పిన పాఠం ఏమంటే ” నీలోని ఈ విద్య రాణింపు కు రావాలంటే గురువుల ప్రోత్సాహంతో బాటుగా నువ్వు ఒక ఉత్తమ కళాకారిణిగా రూపు దిద్దుకుని, నువ్వు ఎంచుకున్న ఈ మార్గం లో నీ ప్రయాణాన్ని పట్టు వీడకుండా, కృషికి వెరవక ముందుకు సాగించాలి “. నా భావన కూడా ఇదేనండీ ! 

 

ప్రశ్న :

చాలా బాగుందండీ. ఇక మరొక ప్రశ్న. చలన చిత్ర నటిగా మీరు నటించిన ఏకైక చిత్రం ‘ అమెరికా అమ్మాయి’. అది అంతర్జాతీయంగా గుర్తింపును, ప్రశంస ను. మన్ననను పొందిన చిత్రం. సంఖ్యాపరంగా చూస్తే ఒక్కటే అయినా, ఆ ఒక్కటీ, నటనపరం గా మీరు వేసిన అడుగుకు జాడ అయి మీకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టిందనడంలో అణు మాత్రం కూడా సందేహం లేదు. ఈ చిత్రంలో మీ పాత్రకు సంబంధించిన అనుభవాలను, అనుభూతులను చెప్పండి. 

 

దేవయాని :

సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావడానికి ముందు, నాట్యరంగానికి కాస్తంత భిన్నంగా వేరే వ్యాసంగం లోనికి వెళ్లి ఒకసారి తొంగిచూడాలన్న ఆలోచన నా మనసులో మెదిలింది. బహుశా: భవిష్యత్తులో నా ఉన్నతి కి ఇది ఒక సోపానం కావచ్చునేమో మరి ! ఇదుగో.. అలా చూస్తూ ఉండగానే, అవకాశం తనకు తానుగా వచ్చి నా తలుపు తట్టింది. నా మనసులోని కోరిక కు అలా స్పందన రావడం ఒక విశేషమనే చెప్పాలి. ఎలాగంటే అమెరికా అమ్మాయి – చిత్ర నిర్మాత, దర్శకుడు – ఇరువురు వచ్చి నన్ను కలుసుకొనడం జరిగింది. ఈ చిత్రం లో నేను నటించిన హీరోయిన్ పాత్రలో నృత్య ప్రదర్శన సన్నివేశం చోటు చేసుకొనడానికి ప్రధాన కారకులు, నాటి ప్రముఖ నృత్య దర్శకులలో ఒకరైన కూచిపూడి నాట్యాచార్యులు, పూజ్యులు శ్రీ వెంపటి చిన సత్యం గారు. వారి వద్ద నాకు శిక్షణ లభించడం నాట్యకళాకారిణి గా నా జీవితం లో తారసపడిన మరువలేని, మరపురాని అనుభవం. అది జీవితాంతం నా వెన్నంటే ఉంటుంది. అమెరికా అమ్మాయి చిత్ర దర్శకులు. శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి మార్గదర్శకత్వం, నాట్యాచార్యులు శ్రీ వెంపటి చిన సత్యం గారి నాట్య శిక్షణ నాకు లభించిన సువర్ణావకాశాలు. వీటిని నాకు ప్రసాదించిన ఆ భగవంతునికి నేను సర్వదా కృతజ్ఞురాలినై ఉంటాను. ప్రముఖ చిత్రదర్శకుని పర్యవేక్షణ లో విడిగానూ, ఇతర నటీనట బృందంలో ఒకరిగానూ నటించడం నాకు ప్రతిష్టాత్మకమైన కొత్త ప్రయత్నం. ఇది నా భవిష్యత్ ప్రణాళిక కు దోహదపడింది. శ్రీ సింగీతం శ్రీనివాస రావు గారు ఎంతో సహృదయతతో నన్ను దక్షిణ భారత సినీరంగ ప్రముఖ నటీమణులలో ఒకదానిగా తీర్చిదిద్దారు. ఈనాటికీ ఇది నన్ను ఎంతో అబ్బురపరిచే సంఘటన !.. ఊహాతీతం కూడాను. ఇటువంటి మధురానుభవాలు నాకు జీవితం లో మరొకమారు లభించాలని మనసారా కోరుకుంటున్నాను.  

 

ప్రశ్న :

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మీ కళాభిజ్ఞత తో తీవ్ర కృషి సలిపి, గుర్తింపును సంపాదించి సన్మానాలను, బిరుదులను, బహుమతులను గెలుచుకున్న సంగతి, సందర్భాలకు మీరు ఎలా స్పందిస్తారు ?

 

దేవయాని :

90 వ దశకంలో అటు ప్రేక్షకుల నుండి, ఇటు ప్రసార మాధ్యమాలనుండి నా అభినివేశానికి తగిన గుర్తింపు లభించడం – తరువాత 2000 సంవత్సరంలో నూతన శతాబ్ది మొదలయ్యాక నాకు Great Opera Singer Luciano Pavarotti and the Star of the Kirov Opera Olga Borodina తో సమానంగా top -billing కళాకారిణిగా గుర్తింపు లభించింది. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి అదనంగా భరతనాట్యం కూడా తోడు కావడం తో వాటితో నా అనుబంధం, అనుభవం పెరిగి నా కల నిజమైనట్లుగా భావిస్తాను. 2004 వ సంవత్సరం లో సియోల్ ( కొరియా) లో జరిగిన The World Culture Open లో పాల్గొనేందుకు భారతదేశపు ఏకైక ప్రతినిధి గా ఎంపికై భారతీయ సాంప్రదాయ నృత్యాలన్నీ అభినయించే కళాకారిణి గా ఆహ్వానింపబడ్డాను.

అంతర్జాతీయ నృత్యవేడుకలలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 144 దేశాలనుండి ప్రతినిధులు ఎంపిక చేయబడ్డారు. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ వారు Incredible India, Campaign titled ‘ REAL PEOPLE ‘ పధకం లో ఇది భాగం. దీని ప్రచారం కోసం మహాబలిపురం వద్ద దేవాలయం నేపధ్యం లో నా భరతనాట్య భంగిమ ను ఉపయోగించి poster తయారు చేశారు. ఈ పోస్టర్ ఆనాడు The Time, NEWSWEEK పత్రికలలో 2009 లో ప్రచురింపబడడమే కాకుండా 2010 సంవత్సరం లో న్యూయార్క్ లోని Times Square వద్ద ప్రదర్శించబడింది. ప్రపంచ దృష్టిలో అంతర్జాతీయంగా సముచితమైన గుర్తింపు అంటే ఇది అని నా అభిప్రాయం. తరువాత దాదాపు 20 సంవత్సరాల కాలంలో ఇటు భారతదేశం, అటు వేరే వేరే ఇతర దేశాల నుండి నృత్యాభినయ కార్యక్రమాలలో, నాట్యమందిరాలలో పాల్గొనేందుకు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు, నేను 2009 లో భారతదేశ అత్యున్నత జాతీయ పురస్కారాలతో ఒకటి అయిన ‘ పద్మ శ్రీ ‘ సత్కారం లభించడానికి దోహదపడ్డాయి. నాటినుండి నేటివరకు ఇలా పుంఖానుపుంఖాలుగా దైవ కృప, గురుదేవుల ఆశీస్సులతో ఇటువంటి అనేక కార్యక్రమాలలో నేను పాల్గొనే అవకాశాలు ఒకదాని తరువాత మరొకటి వస్తూనే ఉన్నాయి. తాజా గా నాకు అక్టోబర్ 11, 2022 న డాక్టర్ సరోజినీ నాయుడు అంతర్జాతీయ పురస్కారం లభించింది. కోవిడ్ కాలం లో కూడా – అంటే 2021, 2022 సంవత్సరాలలో 5 పురస్కారాలు నాకు లభించాయి. అందులో ఒకటి ప్రతిష్టాత్మకమైన Honorary Doctorate in Bharata Natyam.  

ప్రశ్న :

దేవయాని గారూ ! మీ కళాసేవకు ఇలా జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో తగిన గుర్తింపు లభించి ప్రశంసలు, సత్కారాలు పొందడం ఎంతో శ్లాఘనీయం… అంతే కాదు, హర్షదాయకం కూడా.! ఈ వేడుకలు, గుర్తింపుల నేపధ్యం లో ఈ రంగానికి సంబంధించి మీరు ఎన్నుకున్న మీ భవిష్య ప్రణాళికలు, ధ్యేయాలలో అత్యంత ప్రధానమని మీరు భావించే కొన్నిటిని దయచేసి వివరించండి.  

 

దేవయాని :

నా భావి కార్యక్రమాలలో అంశాలను ఎప్పటికప్పుడు పునః సమీక్షించుకుంటూ, నాలోని కళాకారిణిని మేల్కొలిపి ఉంచడం నా లక్ష్యం… ఏమంటే, కోవిడ్ కారణంగా గత రెండేళ్లు గా బయటి కార్యక్రమాలకు చాలామటుకు అంతరాయం కలగడంతో నేను Artistic Director గా నెలకొల్పిన నా అకాడెమీ నిర్వహణ లో మరింతగా శ్రద్ధవహించవలసిన అవసరం ఏర్పడింది. ఈ విషయంలో బహుళంగా ప్రచార మాధ్యమాలను కూడా ఆశ్రయించడం జరిగింది. ఫలితంగా, అకాడెమీ నిర్వహణ లో కలిగిన ఆటంకాలను ఎదుర్కుంటూ విజయసాధన దిశగా కృషిసలిపాను. శాస్త్రీయ నృత్యం లో శిక్షణ పొందగోరే కళాకారులెందరికో ఈ అకాడెమీ ఆశ్రయాన్ని కల్పించిందని సవినయంగా చెబుతున్నాను. శ్రీ త్యాగరాజస్వామి వారు చెప్పినట్లు ” ఎందరో మహానుభావులు ..” వారందరూ నాకు అందిస్తూన్న స్ఫూర్తి ఆధారంగా అకాడెమీ కార్యకలాపాలను విస్తృతపరచేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. ఆ కృషి ఫలించి ఇందులో శిక్షణ పొందగోరే విద్యార్థినీవిద్యార్థులకు మరిన్ని అవకాశాలు, ప్రోత్సాహాలను కల్పించాలని నిర్ణయించుకున్నాను.. వదలని విక్రమార్కునిలా (రాలిగా) నా కృషి ని నిరంతరం కొనసాగిస్తూ ఉన్నాను. 

కళాప్రదర్శనలను ఇచ్చే నృత్య కళాకారిణిగా నా మూల వ్యక్తిత్వాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అందరికీ ఎరుక పరచడం నా ప్రాధమిక కర్తవ్యం గా భావిస్తున్నాను. అలాగే ప్రేక్షకులు, నేను వేదికపైన చేసే నృత్య ప్రదర్శనలకు సానుకూలంగా స్పందించే రీతిలో నా వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేయాలి. నా వ్యక్తిగత జీవితంతో ముడిపడిన కళా జీవితాన్ని సుసంపన్నం చేయాలి. అందునిమిత్తం నేను కళాసంస్థలకు, ప్రేక్షకులకు అందుబాటులో ఉండడం అవసరం. అది నా అభివృద్ధికి దోహదకారి అవుతుంది. కొవిడ్ మహమ్మారి దృష్ట్యా ఈ అవసరం మరింత బలపడింది. ఈ సమస్యను చిత్తశుద్ధి తో ఎదుర్కొని, పరిష్కారాలను కనుగొని, ఆచరించడం తో పరిస్థితులు చక్కబడి, నా వ్యక్తిగత జీవితం కూడా మెరుగులు దిద్దుకోగల అవకాశం లభిస్తున్నాయి. వాటిని సద్వినియోగపరచుకోవడానికి నేడూ, రేపూ కృషి చేయడమే నా కర్తవ్యం, ధ్యేయం ! 

 

ప్రశ్న :

ఆసక్తికరమైన అనేక అంశాలను ప్రస్తావించి, వాటిని చక్కగా విశ్లేషించారు దేవయాని గారూ ! ఈ ఇంటర్వ్యూ విజయవంతం కావడానికి మీరందించిన సహకారానికి మీకు మరీ మరీ ధన్యవాదాలు. కృతజ్ఞతలమ్మా !

 

దేవయాని :

మీ ప్రశ్నలన్నిటికీ సమగ్రంగా, మీకు సంతృప్తికరమైన సమాధానాలను ఇచ్చాననే నేను భావిస్తున్నాను సుబ్బారావు గారూ ! నా వ్యాసంగం గురించి, జీవితానుభవాల గురించి ఎంతో ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగించే ప్రశ్నలను వేసారు. చాలా సంతోషం.

నా తల్లిదండ్రులకు, గురుదేవులకు, నన్ను అభిమానించి ఆదరించి, ప్రోత్సాహాన్ని అందిస్తూ, ఆశీర్వదిస్తూన్న మీ అందరికీ పేరు, పేరునా నా నమస్కారములు, కృతజ్ఞతలు. ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు… మరొకమారు నా నమస్కారములు. 

 

ప్రశ్న : దేవయాని గారు — ధన్యవాదాలండీ. నమస్కారములు. 

 

                         <><><>  ధన్యవాదాలు~ నమస్కారములు <><><>

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page