ఏప్రిల్ 16కు ఒక ప్రత్యేకత ఉంది. అది…. “తెలుగు నాటక దినోత్సవం”. తొలి తెలుగు నాటక ప్రయోక్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే తెలుగు నాటక దినోత్సవాన్ని, అదే రోజు వెనకటి తరం ప్రముఖ రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ వర్ధంతినీ పురస్కరించుకొని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పాలంగికి చెందిన షణ్ముఖి నాట్య మండలి “కళా మందారం” పేరిట నృత్య, గీత, పద్య, నటనతో కూడిన మాలికను సమర్పించింది.
శనివారం సాయంత్రం అంతర్జాలం ద్వారా ప్రసారమైన ఇందులో ప్రముఖ రంగస్థల కళాకారులతోపాటు ఔత్సాహికులు కూడా పాల్గొన్నారు. “షణ్ముఖి” జయ విజయ కుమారరాజు పద్యాలతో అలరించారు. కళాప్రియులైన తెలుగువారి నోళ్ళలో నానిన, తిరుపతి వేంకట కవులు రచించిన “జెండాపై కపిరాజు”, “చెల్లియో చెల్లకో” పద్యాలను విస్తృతమైన ఆలాపనతో రసరమ్యంగా ఆలపించారు.
“దుర్యోధన” ఏకపాత్రాభినయంలో…. దంపూరి దుర్గా ప్రసాద్ రాజసం, అహంకారం, ప్రతీకార వాంఛ వంటి ప్రతినాయక లక్షణాలు ఉట్టిపడేలా నటించి రక్తి కట్టించారు.
వాడ్రేవు సుందర రావు “శిఖండి” ఏకపాత్రాభినయంలో అనేక రసానుభూతులను పండించారు. తను అంబగా ఉన్నప్పుడు స్వయంవర సభ నుండి అపహరింపబడిన సంఘటనను గుర్తు తెచ్చుకొనే సన్నివేశం కళ్ళ నీళ్ళు తెప్పిస్తుంది. యడవల్లి రమణ హార్మోనియం వాదన పద్యాలాపనకు, ఏకపాత్రాభినయాలకు ఎంతో వన్నె చేకూర్చింది.
“భామనే సత్యభామనే” అంటూ ప్రముఖ సినీ గాయని ఎస్. జానకి అజరామరంగా ఆలపించిన సిద్ధేంద్రయోగి విరచిత కూచిపూడి భామా కలాపానికి యశస్వినీ కామ్య చేసిన ఉత్సాహభరత అభినయం అభినందనీయం. అక్కిరాజు ఆదిత్య అన్నమాచార్య కీర్తనను వినిపించాడు. దంపూరి చంద్రకళ చక్కని చిరునవ్వుతో కార్యక్రమానికి స్వాగతం పలికి కళాకారులను పరిచయం చేశారు.
ఈ కార్యక్రమం…. ఈ క్రింది వీడియో లో చూడవచ్చు.
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
Please visit this page