చేతికొచ్చిన పుస్తకం: 61
రీవిజిటింగ్ రామ్ మనోహర్ లోహియా
భారతదేశాన్ని, సమాజాన్ని పూర్తి అర్థం చేసుకోవాలంటే తప్పక సంప్రదించాల్సినది లోహియా ఆలోచనలను వివరించే గ్రంధావళి! మామూలుగా అయితే నాన్ ఫిక్షన్ పుస్తకాలు బాగా అమ్ముడు పోయాయి. వాస్తవం తెలియదు గానీ తెలుగు పరిస్థితి బోధబడటం లేదు. కానీ తెలుగులో నాన్-ఫిక్షన్ లో విలువైనవి వస్తున్నాయి అడపాదడపా. అయితే తెలుగు వారు రాసే ఇంగ్లీష్ పుస్తకాలు బాగా తక్కువ.
లోహియా అభిమానులు, పెద్దలు రావెల సోమయ్య ద్వారా నాలుగేళ్ళ క్రితం పరిచయం అయిన అవధానం రఘుకుమార్ తాజా గ్రంథమిది. గతంలో గాంధీజీ గురించి ఇంగ్లీష్ లో ఒక పుస్తకం రాశారు కూడా.
ఆకార్ బుక్స్ 2023 లో వెలువరించిన ఈ 236 పేజీల పుస్తకం వెల రూ. 795. ఐదు అధ్యాయాలలో రామ్ మనోహర్ లోహియా ఆలోచనలను, రాజకీయ జీవితాన్ని పరిచయం చేస్తూ క్యాపిటలిజం, కమ్యూనిజం, గాంధేయ మార్గం గురించి ఏమంటారో వివరిస్తారు. అలాగే చరిత్ర, వర్గం, కులం గురించి కూడా ఆయన ఏమంటారో క్లుప్తంగా మళ్ళీ చెబుతూ వారి సిద్ధాంతాలేమిటో వివరించే ప్రయత్నం చేశారు.
అయితే లోహియా అనగానే గుర్తుకు వచ్చి మనల్ని జడిపించే మధ్య భారతదేశపు రాజకీయరంగంలో ఐదారు మంది ఇటీవల నాయకులున్నారు. దీనికి విరుగుడు గానూ, స్థానిక సమాజం తీరు గమనించకుండా సూత్రీకరణలు పాటిస్తే ఎదురయ్యే సమస్యలేమిటో ఇటువంటి పుస్తకాలు ద్వారా కొంత తెలుస్తుంది.
చేతికొచ్చిన పుస్తకం – 62 :
కవితా హృదయం ఎలా పరిణమిస్తుంది?
మూడు దశాబ్దాల క్రితం ‘పొయట్రీ వర్క్ షాప్ ‘ అనే శీర్షిక చూసి తెగ ఆశ్చర్య పోయాను! లోపల చూస్తే చాలా మంది కవుల చేతి రాతలతో పద్యాలు, కవితలు!! తొలిసారిగా ఏటుకూరి ప్రసాద్ గారి పేరు నా బుర్రలో స్థిరపడింది బహుశా ఈ సంకలనం కారణంగానే కావచ్చు.
ఇది ఖచ్చితంగా విభిన్నమైన సృజనాత్మక కృషి! 2022 అక్టోబర్ లో ఈ సంకలనం ప్రవర్ధిత ముద్రణ 182 మంది కవుల చేతి రాతలతో 644 రంగుల పేజీలతో మిరుమిట్లు గొలిపే రీతిలో వెలువడింది. తమ అభిమాన కవి రాత ఎలా ఉందో చూసుకుని కొందరు ఆనందపడతారు. ఒకే ప్రతి గనుక వీలైనంత స్థాయిలో ఆ ఫలానా కవిత ఎంత, ఎలా పరిణామానికి లోనైందో మరికొందరు అర్థం చేసుకోవచ్చు!
ఈ సంకలనం ఎందుకో, ఏమిటో, ఎలా మొదలైందో ఏటుకూరి ప్రసాద్ విపుల సంపాదకీయంలో వివరించారు. 1862 లో జన్మించిన గురజాడ మొదలు ఇప్పటి దాకా కవులున్నారు! ఫలానా కవి ఎందుకు అని కొందరనుకుంటే; తన కవిత లేదని మరీ కొందరు అభియోగం చేయవచ్చు. నిజానికి ఇలాంటి ప్రయత్నాలకు ముగింపు గానీ, సంపూర్ణత్వం గానీ సాధ్యం కావు.
ఈ రెండో ప్రచురణ ప్రత్యేకతలు ఏమిటంటే మరింత మంది కవులు, రంగుల్లో ముద్రణ, మిత్రులు యామిజాల ఆనంద్ సంపాదకుడుగా కలవడం ! కవిత్వాన్ని ఇష్టపడే వారంతా కలకాలం దాచుకునే అపురూపమైన సంకలనం ఇది! సంపాదకద్వయానికి అభినందనలు!!
విశాలాంధ్ర, నవచేతన లలో లభించే ఈ సంకలనం ఖరీదు 500 రూ.
చేతికొచ్చిన పుస్తకం- 63
అనదర్ ఫేస్ ఆఫ్ స్కై
ప్రపంచ భాషలలో బి నర్సింగ్ రావు కవిత్వం
ఒక్కసారి ఈ ఫోటో చూడండి… చెయ్యి తిరిగిన మొనగాడైన చిత్రకారుడు మలచిన పెయింటింగ్ లా కనబడుతోంది కదా! నిజానికి సినిమా దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన బి నర్సింగ్ రావు ఇటీవల (2021) వెలువరించిన రెండు కవితా సంకలనాలు కలిపి చూస్తే ఈ దృశ్యం సాక్షాత్కరించింది.
బాగా చదువుకున్న వ్యక్తి, మృదువైన మాటకారి, సొగసైన నటుడు, ఆలోచింపచేసే చిత్రకారుడు, నిత్యం శ్రమించే సాధకుడు…ఇవి నేను నర్సింగ్ రావు లో గమనించిన కొన్ని విషయాలు. వారి వాట్సాప్ గ్రూప్ లో నిత్యం యాభై, అరవై దాకా ఫోటోలు, ఇమేజస్, వీడియోలు, తాను రాసే ఆంగ్ల కవితలు, పుస్తకాల పిడిఎఫ్ లు, సినిమాలు పోస్ట్ చేసే తీరూ , ఎంపిక చేసిన పోకడా గమనిస్తే వారి పనితనంలో ప్రత్యేకత ఏమిటో బోధపడుతుంది.
కొంతకాలంగా ఈ కవితా ప్రయత్నం గురించి చెబుతున్నారు. వారి పాతిక ఆంగ్ల కవితలతో పాటు తొలి సంపుటంలో ఫిలిఫినొ, చైనీస్, జపనీస్, అరబిక్ భాషల్లో వాటి అనువాదాలున్నాయి. రష్యన్ కవి, రచయిత ఎల్డర్ అఖదోవ్ (Elder Akhadov) రాసిన ముందు మాట రష్యా, ఆంగ్ల భాషల్లో ఆకర్షిస్తోంది. ఈ ప్రథమ భాగానికి Eden Soriano Trinidad సంకలన, సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు.
ఇక రెండో భాగంలో పోలిష్, జర్మన్, ఇటాలియన్, స్పానిష్ అనువాదాలున్నాయి. దీనికి సంపాదకులు Alica Maria Kuberska.
తెలుగు కవి రాసిన 25 ఆంగ్ల కవితలు ఎనిమిది భాషల్లోకి అనువాదింప బడటం, సంకలనాలు గా రావడం అపురూపమే కాదు, తొలిసారి కూడాను!
సర్వకళల సమాహారంగా భాసించే సొగసైన నర్సింగ్ రావు గారికి ఎన్నెన్నో అభినందనలు!!
చేతికొచ్చిన పుస్తకం: 64
మనిషి యుగాదికి ఆసరా ‘అవని‘
వసంతాగమనానికి సంకేతం ఉగాది రాక! చాలా పుస్తకాలు ఉండిపోయాయి కళ్ళు, చేతులు సోకకుండా నా వద్ద. ఈరోజు ప్రత్యేకమైన సందర్భం కనుక విభిన్నమైన రచనను పరిచయం చేయాలని భావన.
మార్చి 9న ‘పర్యావరణం- సాహిత్యం’ గురించి సిటీ కాలేజీలో సదస్సులో కీలకోపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మిత్రులు, ప్రకృతి కవి జయరాజు తన పుస్తకం ‘అవని’ ఇచ్చారు చదవమని!
గొంగళి, ఆరుద్ర, వేణువు, పట్టు, పూలకు రంగులు, నిప్పు, వడ్లపిట్ట, జలసమాజం, దూదిపింజ, శిలాజాలు, రతి, బొగ్గు, అసూయ, చల్లని గూడు వంటి 135 ప్రకృతి అద్భుతాలను క్లుప్తంగా ఒక పేజీ లో వివరించారు. అదికూడా సగం పుట ఫోటో, పావు పేజీ మ్యాటర్! మంచి ఆర్ట్ పేపరుతో రంగుల్లో ముద్రణ. అందమైన, విలువైన, బాధ్యతను పెంచే పుస్తకం ఇది. చాలా రకాలుగా అంధత్వానికి లోనైన ప్రస్తుత తెలుగు సమాజానికి అమోఘమైన ఔషదం వంటి పుస్తకం అందించిన మిత్రులు జయరాజుకు మరోసారి అభినందనలు హృదయ పూర్వకంగా తెలియజేస్తున్నాను!
180 పేజీల పుస్తకం వెల 500₹. ఏ పుస్తకాల షాపులోనైనా లభిస్తుంది! అదే పేరుతో ఇంగ్లీష్ అనువాదం కూడా అదే ధరకు దొరుకుతుంది!
చేతికొచ్చిన పుస్తకం: 65
ఆకాశవాణి ఉగాది ‘యువశోభ’ కవిసమ్మేళన సంచిక
ఏటా సంక్రాంతి, ఉగాది, దీపావళి సందర్భంగా ఆకాశవాణి కేంద్రాలు కవిసమ్మేళనాలు జరపడం అందరికీ తెలిసిందే!
2023 ఉగాదికి మార్చి 15 న హైదరాబాద్ ఆకాశవాణి 22 మంది ఉభయ తెలుగు రాష్ట్రాల యువ కవులతో తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ‘యువశోభ’ కవిసమ్మేళనం నిర్వహించింది.
ఆకాశవాణికి నా సేవలకు అభినందన చిహ్నంగా చిరు సత్కారం చేయాలనే కోరిక ఉందని నా చిరకాల మిత్రులు, ఇంకా హైదరాబాద్ ఆకాశవాణి ప్రోగ్రాం హెడ్ వి ఉదయ శంకర్ ఆహ్వానించడంతో నేనూ వెళ్ళాను!
ఈ ‘యువశోభ’ ప్రత్యేకత ఏమిటంటే ఈ 22 కవితలతో 72 పేజీల సంకలనం వెలువరించడ! దానికి మిత్రులు వి గోపీచంద్ కృషిని అభినందించాలి!
విభిన్న రంగాల్లో రాణిస్తున్న యువనవకవుల తోపాటు మెర్సీ మార్గరెట్, పల్లిపుట్టు నాగరాజు, తగుళ్ళ గోపాల్, చామర్తి మానస వంటి లబ్ధ ప్రతిష్ఠులు కూడా ఇందులో ఉన్నారు.
80 రూపాయల విలువైన ఈ సంకలనం కావాలంటే ఈ ‘యువశోభ’ ను సమన్వయం చేసిన Mallegoda Ganga Prasad (మల్లెగోడ గంగా ప్రసాద్) ను సంప్రదించండి.
***************************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
Please visit this page