12_010 ముకుందమాల – భక్తితత్వం

 

లక్ష్మీపతివి, సర్వ జగత్కారణుడవు, వేద వేద్యుడవు, మోక్షప్రదుడవు అయిన నీ వైభవమెంతటిదని! పరదైవమవైన నీవు మాలాంటి వారి కోసం సులభుడివై దివినుండి భువికి దిగివచ్చావా తండ్రీ! నీ వాడను నేను. నీకంటే అన్యులను నేనెరుగను. రక్షించుదేవా! అంటూ, శ్రీ దేవుని వైభవాన్ని తలచి ఆనందిస్తూ అర్థిస్తున్నారు కులశేఖరులు.

            ఆ స్వామి వైభవాన్ని తలచి, ఆనందంతో ఈ కృష్ణస్వామినీ, కుటుంబాన్నీ తలచి ఆనందిస్తూ, స్వామి నన్నూ నీ వాడిని చేసుకో, రక్షించుస్వామీ అంటున్నారు శ్రీ కులశేఖరులు.  అన్నివిధాల పరమాత్మతోనే సంబంధం కోరి స్తుతిస్తున్నారు రాబోయే శ్లోకంలో.

            నామస్మరణ తప్ప అన్యమైన ఉపాయం ఏదీ లేదని నొక్కి చెప్పి, పాపాలను పోగొట్టుకోవడానికీ, సుఖాలు పొందడానికీ కూడా నామ పారాయణమే సులభమైన మార్గం అంటూ ఇంకా ఆ స్వామి బంధువర్గాన్ని వైభవాన్ని స్మరించి, మహారాజు ఈ శ్లోకంలో ఆ స్వామితోడిదే సర్వం అంటూ అన్నివిధాలైన సంబంధాలనూ శ్రీ కృష్ణ శబ్దంలో నిర్దేశించి స్తుతిస్తున్నారు.

34.శ్లో॥  కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యా మ్యహం

         కృష్ణే నామర శత్రవో వినిహతాః కృష్ణాయ తస్మైనమః

         కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసో స్మ్యహం

        కృష్ణే తిష్ఠతి సర్వ మేత దఖిలం హే కృష్ణ రక్షస్వమాం ॥

            ఈ శ్లోకంలో చమత్కారంగా, విభక్తులన్నిటిలోనూ అంటే ప్రధమా విభక్తి మెదలు, సప్తమీ విభక్తి వరకు సంబోధన ప్రధమా విభక్తి సహా, కృష్ణ శబ్దాన్ని నిర్దేశించి స్తుతిస్తున్నారు.

            కృష్ణుడు జగత్రయ గురువు. మమ్ములను రక్షించుగాక, కృష్ణుని నేను నమస్కరిస్తున్నాను. కృష్ణుని చేత రాక్షసులు చంపబడిరి. కృష్ణుని కొరకు నమస్కరి స్తున్నాను. కృష్ణుని నుండి ఈ జగత్తు బయల్వెడలింది. కృష్ణునకు నేను దాసుడను. కృష్ణుని యందే సర్వమూ నిలిచి యున్నది. ఓ కృష్ణా! నన్ను రక్షించు. శ్రీ కృష్ణునితోనే అన్ని విధాలైన సంబంధాలూ కలిగి ఉండటమే మనం కోరదగినది. అని తెలియ జేయడానికే కృష్ణ శబ్దాన్ని అన్ని విభక్తులలోనూ నిర్దేశించి స్వామితో మనకు గల సంబంధాన్ని నిరూపిస్తున్నారు.

            కృష్ణః – కృష్ణుడు ప్రధమా విభక్తి, కృష్ణః రక్షతునః జగత్రయ గురుః ముల్లోకాలకూ జ్యోతిస్వరూపుడై, గురవువైన శ్రీ కృష్ణుడు మనలను రక్షించుగాక. తండ్రిగా, రక్షకుడుగా స్వామితోడి మన అనుబంధం, సహజసిద్ధమైనది. అందుకే మననుండి ఏవిధమైన ప్రతిఫలాన్ని కోరకుండానే తానై మనకు రక్షణ కల్పిస్తాడు.

            కృష్ణం – కృష్ణుని : నేను కృష్ణుని నమస్కరిస్తున్నాను. మనం చేసే ప్రతీ పనీ ఈ కృష్ణునిదే. అతడే మనను తన దాసులుగా, తన పనులలో నియమించి, చేయించుకుని, ప్రతిఫలంగా మనలను పోషిస్తున్నాడు. అటువంటప్పుడు మనం ఎవరివల్ల పోషింపబడుతున్నామో, ఎవరికి దాసులమో వానికి నమస్కరించాలి కదా! అందుకే నేను కృష్ణునికి నమస్కరిస్తున్నాను.

            కృష్ణేన = కృష్ణుని చేత – తృతియావిభక్తి.  కృష్ణేన అమరశత్రవో వినిహతాః కృష్ణుని చేత దేవతలకు శత్రువులైన వారు చంపబడ్డారు. దేవతలు సర్వఫలప్రదులు. వారి శత్రువులు రాక్షసులు. వారిని చంపి కృష్ణుడే దేవతలను కాపాడాడు. ఇంద్రాది దిక్పాలురకు ఆయా ఆధిపత్యాలనిచ్చి, వారికి ఆపదలు కల్గించే రాక్షసులను చంపి, వారికి స్థైర్యాన్ని కల్గించినవాడు స్వామి.

            మనలోని అహంకారకామాది అసురచిత్తవృత్తులే ఈ రాక్షసులు. భగవంతుని తోడి నిత్య సాన్నిధ్యమే అమరత్వం. అందుకు అవరోధం కల్పించేవి ఈ అసురవృత్తులు వాటిని అణచి మనకు తనతో నిత్యసాన్నిధ్యాన్ని ప్రసాదించే వాడు శ్రీకృష్ణపరమాత్మే!

            కృష్ణాయ – కృష్ణుని కొరకు – చతుర్థీ విభక్తి.  కృష్ణాయతస్మై నమః – కృష్ణుని కొరకు నమస్కారము. భగవత్ప్రాప్తికి విరోధులగు అహంకార మమకారాలు – నేను చేస్తున్నాను. నన్ను నేనే రక్షించుకోగలను. నేను అనుభవిస్తున్నాను. అనే భావనలను కల్గిసాయి. వాటిని దూరం చేసి, చేయించేది స్వామి. ఈ అనుభవాలూ ఆయనవే. నన్ను రక్షించగల్గేది ఆస్వామే. అనేభావన వృద్ధి పొందాలంటే దేహాభిమాన త్యాగం ఒక్కటే దారి. నమః – శబ్దమే శరణము. మః = నాది, న = కాదు. అంటూ సర్వం భగవానునికే అర్పించాలి.

            కృష్ణాత్‌ – కృష్ణుని వలన – పంచమీ విభక్తి. కృష్ణాత్‌ ఏవ సముత్థితం జగత్‌ – ఎవ్వనిచే జనించి, ఈ జగమెవ్వని లోపల నుండి, ఎవ్వని యందు లీనమగుచున్నదో, అతడే పరమేశ్వరుడూ, పరబ్రహ్మమూ అని చెబుతోంది ఉపనిషత్తు. అతడు శ్రీకృష్ణుడే! విత్తులో అణిగి వున్న చెట్టులా, సూక్ష్మంగా పరమాత్మలో అణగి ఉండి, సృష్టికాలంలో ఆ పరమాత్మ సంకల్పంతో, లేచి, విస్తరించేలా, శ్రీకృష్ణుని యందే ఈ సర్వజగత్తు ఉన్నది. ఆ కారణతత్వమే శ్రీకృష్ణ పరబ్రహ్మ.

            కృష్ణస్య – కృష్ణుని యొక్క – షష్ఠీ విభక్తి. కృష్ణస్య దాసోశ్మ్యహమ్‌.  కృష్ణుని యొక్క దాసుడను నేను – జీవులందరూ పరమాత్మకు శేషభూతులు అంటే ఆ స్వామికే చెంది ఆ పరమాత్మ కొరకే వినియోగింపబడదగిన వారు అని అర్ధం.

            కృష్ణే – కృష్ణుని యందు – సప్తమీ విభక్తి. కృష్ణేతిష్ఠతి సర్వమేతదఖిలం. కృష్ణుని యందే ఆధారపడి ఈ సమస్త జగత్తూ నిలిచి ఉంది. సర్వభూతాలకూ, చరాచరమైన సర్వవిశ్వానికీ, ఆ కృష్ణపరమాత్మే ఆధారం. సప్తమీ విభక్తికి ఆధారం అనే అర్థం. ఈ విషయమే ‘‘మత్థ్సానిసర్వభూతాని’’ నాయందే సర్వభూతములూ ఉన్నవి అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. సర్వజగదాధారభూతుడు శ్రీ కృష్ణ పరమాత్మ.

            హే కృష్ణ! ` సంబోధన ప్రధమా విభక్తి ` హే కృష్ణ రక్షస్వమామ్‌ ఓ కృష్ణా నన్ను రక్షించు, అంటూ ఈ విధంగా. జగద్రక్షకుడుగా, గురువుగా, విరోధి నాశకుడుగా, జగత్కర్తగా, జగద్భర్తగా అన్నివిధాలా స్వామి సంబంధం కోరుతూ నమస్కరిస్తున్నారు శ్రీ కులశేఖరులు. ఈ విధమైన శరణాగతే భగవంతుని యందు అనుక్షణం భక్తుడు కోరవలసినది.

35.శ్లో।  తత్త్వం ప్రసీద భగవన్‌ కురు మయ్యనాథే

         విష్ణో కృపాం పరమకారుణికః కిల త్వం

         సంసార సాగర నిమగ్న మనంత దీన

         ముద్ధర్తు మర్హసి హరే పురుషోత్తమోసి ॥

            ఎంతగా భగవానుడు దయామయుడనీ, తన్ను కాపాడగలడనీ భరోసా ఉన్నా, తానున్నది సంసార సాగరమనీ, తనమనసు మధ్య మధ్యలో వశం తప్పి చరిస్తుందనీ భయం. అందుకే

‘‘సంసార సాగర విశాలకరాళ కాల నక్రగ్రహగ్రసననిగ్రహ విగ్రహస్య

వ్యగ్రస్యరాగ రసనోర్మిని పీడితస్య లక్ష్మీనృసింహమమ దేహి కరావలంబం॥

            అంటూ… ఈ సంసార సాగరం నుండి నీ చేయూత నొసగి ఉద్ధరించుస్వామీ అంటున్నాడు భక్తుడు.

            అనాధుడనైన నా యెడ దయచూపి అనుగ్రహించు. నువ్వు పరమదయా మూర్తివి. సర్వవ్యాపివైన విష్ణుదేవా! నా బాధలను పోగొట్టి ఆర్తుడనైన నన్ను అనుగ్రహించు. జ్ఞానశక్తి బల ఐశ్వర్యవీర్యతేజస్సులు పరిపూర్ణంగా ఉన్న షడ్గుణ పరిపూర్ణుడవు నీవు. కరుణామయుడవైన నీకు నా వేదన అర్ధం కాకపోదు. కాలంచేత కాని, దేశం చేత కాని, వస్తువు చేతకాని పరిచ్ఛిన్నుడవు కాని ఓ అనంతా! ఈ సంసారసాగరంలో మునిగిపోబోయే నాలో మాత్రం నీవు లేవూ? నన్నీ అగాధం నుండి ఉద్ధరించ గలవాడవు నువ్వొక్కడివే! పురుషోత్తమా పాలించు తండ్రీ!!

            అందుకే…

శ్లో॥  కృష్ణ కృష్ణ కృపాసింధో భక్తసింధు సుధాకర

     మాముద్ధర జగన్నాధ మాయా మోహమహార్ణవమ్‌ ॥

            అంటూ వేడుకుంటాడు భక్తుడు. ఈ విధంగా, సులభమైన నామోచ్ఛారణతో భగవంతుని పిలిచి, ఆ స్వామి కృప పొందవచ్చనీ, శరీరం నశించకముందే సర్వేశ్వరుని పొందడానికి కృష్ణ నామ రసాయనాన్ని తాగమనీ అందువల్ల మనసుకు బలం చేకూరి కృష్ణ ధ్యానంలో నిలవగలదనీ, చెబుతూ, శ్రీకృష్ణుని వైభవాన్ని పొగడి శరణువేడి, సర్వాత్మనా భావిస్తున్నా. మధ్యమధ్యలో మనసు వశంతప్పినా, ఉద్ధరించగలవాడవు నీవేనంటూ భారాన్ని భగవంతునిపై వేస్తారు ఈ శ్లోకాలలో.

36.శ్లో॥  నమామి నారాయణ పాదపంకజం

         కరోమి నారాయణ పూజనం సదా

         వదామి నారాయణ నామ నిర్మలం

         స్మరామి నారాయణ తత్వమవ్యయం

            భగవత్ప్రాప్తిని కోరే భక్తుడు ఏం చేయాలో ఇలా చెప్పారు భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ. మన్మనాభవ, మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు. మనసును నా యందే లగ్నంచేయి. నా యందు భక్తికలవాడవు కమ్ము. నాకే నమస్కరించు అన్నారు గీతాచార్యులు. దీనినే ఆచరించారు కులశేఖరులు. నారాయణ పూజనమే సదా చేయడం. పవిత్రమైన ఆ నారాయణ నామమే సదా జపించడం, నాశ రహితమూ, శాశ్వతమూ అయిన నారాయణ తత్వాన్నే స్మరించడం. సర్వవ్యాపారాలూ నారాయణార్పణంగా చేయడం ఇదే జీవిత పరమార్థం అంటారు మహారాజు. భక్తి బాటలో పయనించగోరే వారి చేతలు ఈ విధంగా ఉండాలన్నది శ్రీ కులశేఖరుల వారి ఉపదేశం.

            శ్రీ శంకర భగవత్పాదులు తమ శివానందలహరిలో కూడా ఈ విధమైన సాధనలనే చెబుతారు.

శ్లో॥  వచసా చరితం వదామి శంభో

      రహముద్యోగ విదాసుతే-ప్రసక్తః ।

      మనసా-కృతి మీశ్వరస్య సేవే

      రసాచైవ సదాశివం నమామి।

            ప్రభూ విశిష్టమైన సాధనలు తెలియనివాడను. వాక్కుతో నీచరితాన్ని చెబుతూ, పరవశంతో నీ గాధలను అందరికీ చెబుతాను, నీ రూపాన్నే ధ్యానిస్తాను. శిరసుతో నీ పాదాలకు నమస్కరిస్తున్నాను అంటారు. సదా ఆ దైవభావనలో జీవితం గడపాలన్నదే ఏ భక్తుని కోరిక అయినా అదే కర్తవ్యం కూడా!

37.శ్లో॥  శ్రీనాథ! నారాయణ! వాసుదేవ!

         శ్రీకృష్ణ! భక్తప్రియ! చక్రపాణే!

         శ్రీ పద్మనా భాచ్యుత కైటభారే!

         శ్రీరామ పద్మాక్ష హరే మురారే

         అనంత వైకుంఠ ముకుంద కృష్ణ!

         గోవింద! దామోదర! మాథవేతి

         వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిత్‌

         అహో! జనానాం వ్యసనాభిముఖ్యం!!

            శ్రీ కులశేఖరులు చక్రవర్తిగా ప్రజల హితాన్నే సదా కాంక్షించేవారు. ఎంతగా చెప్పినా భగవన్నామాలను పలకక వ్యసనాలచే ఆకర్షింపబడి భగవద్విముఖులై ఉండటం చూచి కులశేఖరులు బాధపడుతున్నారు.

            ఏమి ఈ ప్రజల వ్యసనానురక్తి. భగవన్నామోచ్ఛారణమయినా చేయకున్నారు కదా? వాక్కు నొసగిన వాసుదేవుని శ్రీనాధ, నారాయణ, పద్మనాభ, అనంత, మురారి అంటూ మనసారా పలుకక భగవద్విముఖులవడం ఎంత దయనీయం! అంటూ విచారిస్తున్నారు లోకం పోకడ చూసి.

 

తరువాయి వచ్చే సంచికలో……

 

——–   ( 0 ) ——-

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page