12_010 ప్రగాఢ భక్తికి ప్రతీక

 

ప్రగాఢ భక్తికి ప్రతీక శ్రీ ఆంజనేయస్వామి

ఈ సృష్టిలో ఈనాటివరకు ఆంజనేయస్వామిని మించిన భక్తాగ్రగణ్యుడు, తన్మయాత్ముడు మరొకడు ఉండడంటే ఆశ్చర్యం లేదు. యుగయుగాలలోనూ ఆయన భక్తిపారవశ్యతకు సాటి లేదు.

శ్రీ తులసీదాసు రామాయణం రచించే రోజులు. జనం ఆయన రామాయణ కావ్య కథనాన్ని వినడానికి ప్రతిరోజూ ఆయన ఉన్న చోటికి చేరేవారు. ఒకరోజు ఒక భక్తుడు “ అయ్యా ! తమరింత భక్తి స్ఫోరకంగా రామాయణ రచన చేస్తున్నారు. అసలు రామశబ్దం వింటే చాలు, రామాయణ కథ ఎవరైనా చెప్పుకొంటున్నా చాలు, శ్రీ ఆంజనేయుడక్కడికి వేంచేసి ఆ కథ వింటూ వుంటాడట ! మీరింత భక్తి రసఝరులు ప్రవహించే విధంగా కథనం చేస్తున్నారు. శ్రీ ఆంజనేయుడు ప్రతిరోజూ మీ కథాగానాన్ని అలకించటానికి ఇక్కడే ఎక్కడో ఏదో రూపంలో తప్పకుండా వుంటాడు ’ అన్నాడు. తులసీదాసుకి “ అయ్యో ! అటువంటి భక్తాగ్రేసరుణ్ణి దర్శించలేకపోయానే ! ఎలా ఆయన్ని గుర్తించడం ? ఏం చేయాలి ? ” అని మధనపడసాగాడు.

మర్నాడు యథాప్రకారం కథాగానం ప్రారంభమైంది. శ్రీ ఆంజనేయుడు సీతమ్మ తల్లిని దర్శించే ఘట్టం. తులసీదాసిలా చెప్పాడు. “ శ్రీ హనుమంతుడు లంకంతా వెతికి చివరికి సీతమ్మ తల్లిని అశోకవనంలో శింశుపా వృక్షం కింద చూచాడు. ఆనందంతో గంతులు వేస్తూ వెళ్ళి ఆ తల్లికి నమస్కరించి ఒక ఎఱ్ఱగులాబీ పూవునామెకు సమర్పించుకొన్నాడు”.  తులసీదాసు ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. ఉన్నట్లుండి సభలో ఆఖరి వరుసలో కూర్చున్న ఒక వ్యక్తి లేచి “ ఎఱ్ఱగులాబీ కాదు… తెల్ల గులాబీ పుష్పం సమర్పించుకొన్నాడు ” అన్నాడు.

“ నీకెలా తెలుసు ? ” తులసీదాసు రెట్టించాడు.

“ ఎలా తెలుసేమిటి ? నేనే గదా ఆ పుష్పాన్ని తల్లికి సమర్పించుకొన్నాను ” అన్నాడు.

తులసీదాసు పరుగున వెళ్ళి ఆయన కాళ్ళు వాటేసుకొన్నాడు.

“ స్వామీ ! ఈ దీనుడి మీద దయచూపవా ప్రభూ ! ఇన్నాళ్ళు ప్రచ్ఛన్నంగానే వున్నావా ? నాపై కరుణ కలగలేదా తండ్రీ ? ” అంటూ వాపోయాడు. తులసీదాసు స్వామికి ప్రణామం చేసి “ దేవా ! నీవు తెల్ల గులాబీ అంటున్నావు గానీ అది ఎఱ్ఱగులాబీనే ! ఎందుకంటావా ? చక్రవర్తి కుమార్తె చక్రవర్తి కోడలు, చక్రవర్తి భార్య అయిన ఆ సీతమ్మ తల్లి ఆ అశోక వృక్షం కింద దీనురాలై, దుఃఖితురాలై కూర్చుని వుంటే నీ కళ్ళు క్రోధంతో ఎఱ్ఱబడిపోయాయి. ఆ ఎఱ్ఱని కళ్ళకి తెల్ల గులాబీ కూడా ఎఱ్ఱ గానే తోచింది ” అన్నాడు.

శ్రీ ఆంజనేయుడు ప్రసన్నుడై తులసీదాసుని లేవనెత్తి “ నాయనా ! నీ ఈ రామాయణ కావ్యం పంచమ వేదంగా ప్రసిద్ధి కెక్కుతుంది ” అని ప్రశంసించాడు. కర్ణాకర్ణిగా నేను విన్న ఈ కథ అంటే నాకిష్టం. అందుకే మీ ముందు ఉంచుతున్నాను.

 

*******************************

 

.

  👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

 

Please visit this page