ప్రథమాశ్వాసము
శ్రీరమణీయ మై విబుధసేవిత మై పతిదేవతాక మై
ధీరమణీయ మై శిబిదధీచులఁ గాంచినత్యాగభూమి యై
వీరరసప్రధాన మయి విజ్ఞత కాస్పద మై పవిత్ర మౌ
భారతధాత్రి యొప్పు కకుబంతనితాంతయశోవిరాజియై
సీ. కుత్తుకన్ తెగటార్చు క్రూరాత్మునికినైన
కమ్మనౌపా లిచ్చుగంగిగోవు
గునపాల నొప్పించుక్రూరకర్ములకైన
సస్యమ్ము లందించుక్ష్మాతలమ్ము
తీండ్రించి తను గూల్చుగండ్రగొడ్డలికైన
సౌరభ మ్మందించుచందనమ్ము
గుండె సూదుల గ్రుచ్చుకుటిలాలకలకైన
ఉల్లాసమును గూర్చు మల్లెపూలు
తే. గీ. మనసులోమాట తెలుపంగ మాట నోట
రాణిజీవులు ఇచ్చోటిప్రత్యణువును
పరుల కుపకార మొనరింపు బ్రతుకుచుండు
పరమ మౌత్యాగభూమి యీభారతభూమి !
తే. గీ. మనుజమనుజేతరప్రాణు లనెడుభేద
మింత కననీక పతిదేవునెడద కెక్కు
ప్రణయమును త్యాగశీల మీభరతభూమి
పుట్టుతిర్యక్కులకుకూడ పట్టువడును !
సీ. నాల్గు మోముల వేదనాదాలు పచరించు
బ్రహ్మనుతలదన్ను పండితాళి
రసనిర్భరమ్ముగా ప్రతిపాదమ్మును కూర్చు
శిల్పాభిరామ విశిష్టకవులు
విష్ణువిగ్రహసదావిర్భూతగంగోద
కణస్రష్ట లౌకళాకారవరులు
రతిరాజుమిత్రు డౌఋతురాజురాకకు
ప్రీతి స్వాగత మిచ్చుపికగణమ్ము
తే. గీ. కలిగి శ్రీరమపాదముద్రాలకు నోచి
కోటికోటిరంభలతోడ కులుకు లొలికి
స్వర్గమున్ తలదన్ను ప్రశాంతసీమ !
కులుకుజితనందనారామ కోనసీమ !
తే. గీ. భారతక్షోణి దక్షిణభాగమందు
కుదురుకొన్నది అందాలకోనసీమ !
వేదవేదాంగవిద్యలన్ వేధనైన
కుఱుౘ చేయగ జాలెడుకోనసీమ !
తే. గీ. కోటికోటిరంభలతోడ కులుకు లొలిక
స్వర్గమునె తలదన్ను నీసవనభూమి !
గరుడపచ్చలు కెంపులు కనులముందు
పఱచిన ట్లుండు నిచ్ఛటిపంటచేలు !
తే. గీ. ‘ కల్పభూజము పుడమికి కాపు వచ్చె
నో ! ‘ ఆనంజేయురామర్సు లున్నచోటు !
ఆకుబేరుని కొనగల్గునంతధనము
లిండ్ల మూల్గెడుశ్రీమంతు లెసగుతావు !
తరువాయి వచ్చే సంచికలో……
*********************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
Please visit this page