12_010

ప్రస్తావన

మిత్రులందరికీ వందన పారిజాతాలు.

ఎన్నెన్నో ఒదుదుడుకులు… అడ్డంకులు దాటుకుంటూ రాబోయే ఆగష్టు 15వ తేదీకి ‘ శిరాకదంబం ’ ప్రారంభించి పుష్కర కాలం ( 12 సంవత్సరాలు ) పూర్తి అవుతుంది. మధ్యలో ఎన్నో అవరోధాలు కూడా వచ్చాయి. అయినా రచయితలు, పాఠకులు సహకరిస్తూనే ఉన్నారు  ఆశీర్వదిస్తూనే ఉన్నారు. సహృదయ మిత్రులెందరో ప్రోత్సహిస్తూనే ఉన్నారు.

12 సంవత్సరాలకు ముందు అప్పుడప్పుడే అంతర్జాలం విస్తరిస్తూ ఉన్న సమయంలో, అంతర్జాలంలో తెలుగు అందరికీ చేర్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో….  సాంకేతికంగా అంతర్జాలం ఇంత వేగం గానీ, ఇంత విస్తృతి గాని లేని రోజుల్లో….  పత్రిక ప్రారంభించడం జరిగింది.

వనరులు తక్కువ. ఆశయాలు ఎక్కువ. భవిష్యత్తులో అంతర్జాల వేగం పెరుగుతుందని, విస్తృతి పెరుగుతుందని అంచనా వేసి…. అప్పటికి పూర్తి స్థాయిలో దృశ్య శ్రవణ ( Audio visual ) పత్రిక గా తీర్చిదిద్దాలనే ఆశయంతో ఆర్థిక వనరులు లేకపోయినా ముందడుగు వేయడం జరిగింది. ఆ క్రమంలో అంతర్జాలంలో తొలిసారిగా ‘ ఉగాది స్వరాలు ‘ పేరుతో శ్రవ్య ( ఆడియో ) కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక సంచికలు తీసుకురావడం జరిగింది. అలాగే చిన్న పిల్లలకోసం కథల పోటీల నిర్వహణ, పద్య పఠన పోటీలు, దేశభక్తి గీతాల పోటీలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ శొంఠి దంపతులు ( అమెరికా ), స్నేహ వారధి శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు గారు, నా ప్రియ బాల్య మిత్రుడు కీ. శే. జి. బి. వి. శాస్త్రి వంటి వారెందరో మిత్రులు అండగా నిలిచారు. 

రచయితలైన మిత్రులు, మిత్రులుగా మారిన రచయితలు తమ అమూల్యమైన రచనలతో పత్రికను ఆదర్శవంతమైన పత్రికగా తీర్చిదిద్దారు. పుష్కర వార్షికోత్సవానికి పూర్తి స్థాయిలో దృశ్య శ్రవణ పత్రికగా తీర్చిదిద్దే క్రమంలో గత సంవత్సరం నెలలో ఒక సంచిక అక్షర రూప సంచికగాను, మరో సంచిక దృశ్య శ్రవణ సంచికగాను వెలువరించే ప్రయత్నం జరిగింది. దానికోసం కొన్ని ప్రత్యేకమైన వీడియో / ఆడియో ల రూపకల్పనకు ఆలోచన జరిగింది.

ఈ ప్రక్రియ ద్వారా మన పురాణకథలు, గత తరం కథలు, సంప్రదాయ కళలు, జానపద  కళలు మొదలైన వాటికి దృశ్య, శ్రవ్య రూపం తీసుకురావడం, పత్రిక ద్వారా పాఠకులకందరికీ, ముఖ్యంగా భవిష్యత్తు తరాలకు వీటిని అందించడం ఈ ఆలోచన వెనుక ఉన్న లక్ష్యం.

అయితే ఇదంతా కార్యరూపం దాల్చాలంటే ఆర్థిక వనరులు అవసరం. రాబోయే పుష్కర వార్షికోత్సవం లోగా ఈ పత్రికను పూర్తి స్థాయిలో ’ దృశ్య శ్రవణ ( Audio Visual ) పత్రిక ’ గా తీసుకురావాలంటే వదాన్యులైన దాతలు ముందు రావాలి. ఏ మాధ్యమానికి లేని శక్తి దృశ్య, శ్రవణ మాధ్యమానికి ఉంది. ఏ విషయమైనా ఈ మాధ్యమం ద్వారా శక్తివంతంగా చెప్పవచ్చు. మీ అందరి సహాయ సహకారాలతో ఇది సాధ్యమవుతుందనే ఆశ. ఈ యజ్ఞం లో పాల్గొని తమ వంతు సహాయం చెయ్యాలనుకునే వారు తమకు తోచిన విరాళాన్ని పంపించవచ్చు. మొదట పుష్కర వార్షికోత్సవ సంచికను పూర్తి స్థాయి ప్రత్యేకమైన Audio Visual సంచిక గా రూపొందించాలని ప్రయత్నం. ఆ వివరాలు త్వరలో తెలియజేయబడును. మీ స్పందనను బట్టి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించబడుతుంది.

దయచేసి గడువు పూర్తి అయిన చందాదారులు తమ చందాను పునరుద్ధరించుకోవలసిందిగా మనవి.        

***************************************     

గమనిక : ఇప్పటివరకు పక్ష పత్రికగా వెలువడుతున్న ‘ శిరాకదంబం ’ వచ్చే నెల నుంచి మాసపత్రిక గా అనివార్య పరిస్థితుల్లో మార్చవలసి వస్తోంది. ప్రస్తుతం ‘ అక్షర రూప సంచిక ’, ‘ దృశ్య శ్రవణ సంచిక ’ లుగా నెలకి రెండు సంచికలు వెలువడుతున్నాయి. ఇకపైన రెండూ కలిపి ఒకే సంచికగా వెలువడుతుందని గమనించ ప్రార్ధన.

మనవి : చందా గడువు ముగిసిన మిత్రులు దయచేసి తమ చందాను వీలైనంత త్వరగా పునరుద్ధరించి సహకరించవలసిందిగా మనవి.

***************************************