నీవే తల్లివీ తండ్రివి
నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు
నీవే గురుడవు, దైవము
నీవే నా పతీయు గతీయు నిజముగ కృష్ణా !
మన ఆర్ష సంప్రదాయములో అవతార తత్వము చాలా ముఖ్యమైనది. అది కాలమాన పరిస్థితులకు, యుగావసరములకు అనుగుణముగా నిరాకార నిర్గుణ తత్వము మానవరూపము దాల్చి దిగివచ్చి ధర్మ రక్షణ చేసి, శాంతిభద్రతలను నెలకొల్పి, మానవజాతిని పునరుద్ధరిస్తుంది.
ఇప్పటివరకు అనేక అవతారములు భువికి దిగివచ్చి వారు సంకల్పించిన కార్యము నేరవేర్చి నిష్క్రమించడము జరుగుతున్నది. రామ, కృష్ణ అవతారాలు పూర్ణావతారాలు. ఈ రెండు అవతారాలు దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేశాయి. వారు చేసిన విధానాలలో వైవిధ్యము వున్నా యావత్ మానవజాతిని రక్షింపడానికే సమకట్టాయి. రామో విగ్రహవాన్ ధర్మః అయితే శాంతి, ప్రేమ పంచిన జగద్గురువు కృష్ణావతారం.
కృష్ణుడు తన రాకతో దివ్యత్వాన్ని ప్రదర్శించాడు. తలితండ్రులైన దేవకీ వాసుదేవులను ఊరడించి, తానెవరో తన జన్మకారణము తెల్సి, నందయశోదల ఇంట్లో పెరుతానని, అక్కడికి తీసుకువెళ్లమని ఆదేశించాడు. కృష్ణావతారము అధ్యంతము విశిష్టమైనది. పరమోత్కృష్టమైన అవతారము. దానిని వర్ణించుట, విశ్లేషించుట అసాధ్యమైన పని.
అత్యంత సుందరాకారుడు రూపలావణ్యము, గానమాధుర్యము వ్రేపల్లెవాసులను మంత్రముగ్ధులను చేశాయి. ఆ బాలుడెవరో – ఆ తత్వమేమిటో వారికి ప్రశ్నార్ధకముగా నిలిచిపోయింది. ఆయన ఆ బాలుని క్షణము విడువ లేకపోయేవారు. ప్రాణసమానంగా చూసుకునేవారు. కృష్ణుని మురళీనాదం విని గోప స్త్రీలు అన్నీ మరచి కృష్ణుని వెంట పరుగెత్తేవారు. ప్రేమ, భక్తి ముడివడి వారికొక దివ్యానుభూతిని కలిగించేది.
తనను నమ్ముకొన్న వారిని కృష్ణుడు ఏనాడూ వదిలివేయలేదు. పాండవులకి హితుడుగా, బంధువుగా, పరిరక్షకుడిగా, మిత్రుడిగా, గురువుగా వుండి కాపాడాడు.
దివ్యమంగళసుందర స్వరూపుడు, మృదుమధుర భాషి, నాదప్రియుడు. ఆ రూపాన్ని చూసి ఆకర్షితులు కానివారు లేరు. పశువులు భక్తితో ఆనందంతో మ్రొక్కేవి. కృష్ణావతారము మాటలకందనిది.
*******************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
Please visit this page