12_011 సాక్షాత్కారము 02

తే. గీ.     జానకిని కూర్మితో జలక మాడించి

భక్తితో రామయ్యపాదాలు కడిగి

బ్రతుకు ధన్యత గాంచి పరవళ్ళు త్రొక్కు

తల్లి గోదారి యీధర చుట్టి యుండు !

 

తే. గీ.     అమలగోదావరీస్నాన మాచరించి

            భక్తితో తన్నుసేవింపవచ్చుప్రజకు

            క్షణములో ముక్తి నొసగ నిౘ్చటనె వెలసె

            ఇౘటిముక్తీశ్వరమున ముక్తీశ్వరుండు !

 

మ.        క్షణముక్తీశ్వరునంతవా డగజకుక్ గారాబుపుత్రుం డవా

            రణవిఘ్నమ్ములు పారద్రోలుటకు కొల్వౌ ఐనవిల్లిన్ మహా

            గణనాథుండు మనోహరాకృతి మహాకారుణ్యదృష్టిన్ ప్రజా

            గణమున్ కాచుచు వారిడెందములు పొంగన్ కొంగుబంగారమై

 

తే. గీ.     కోనసీమకు దాతృత్వగుణము కలదు

            కోనసీమకు సద్భక్తిగుణము కలదు

            రాజకీయాలగాలికి రాలిపోని

            ఉత్తమోత్తమగుణము లీయుర్వి గలవు !

 

తే. గీ.     ఆకలింగొన్నవారికి అన్నపూర్ణ

            యైన దిచట డొక్కాసీతమాంబ ! ఆమె

            పుట్టువుం గన్నయీపుణ్యభూమిలోన

            భళిర ! క్షుద్బాధతో ౘచ్చువాఁడు లేఁడు !

 

తే. గీ.     కోనసీమ కాభరణాయమాన మైన

            కడలిగ్రామమె ఒకనాటిఅడవి యంట !

            అపవిత్ర మైనఅరణ్యమందు పుట్టు

            పిట్టపిట్టకు ఒకపుణ్యవృత్త మంట !

 

సీ.         ఇచ్చోటిమట్టిలోనే పుట్టి పెరిగెడు

                        జీవు లేపుణ్యము చేసినారొ !

            ఇచ్చోట ప్రవహించుఈపవిత్రజలాలు

                        గ్రోలుప్రాణుల దెంతగొప్పదనమొ !

            ఇచ్చోట ప్రసరించుఈగాలి పీల్చెడు

                        జీవు లేమితపమ్ము చేసినారొ !

            ఇచ్చోటప్రత్యణు వెంతయదృష్టమ్ము

                        గాంచి యిం చుండుభాగ్యమ్ము గనెనొ !

 

తే. గీ.     ఇౘటిపశుపక్షిజాతులు ఇౘటిఱాలు

            ఇౘట పూచెడు పూలును ఇట జలాలు

            శివునిదయ నెంతపుణ్యము చేసికొనేనొ !

            కడలిగ్రామము పుణ్యాలకడలి కాదె ?

                        పుష్పవతు లై వింతపోడుములు వికసింప

                        పౘ్చపౘ్చనిబ్రతుకు పరిమళించుచు నుండ

                        అభ్యంగనస్నాన మాడి హుషారుగా

                        తల లారబోసికొనుతలిరుబోణులవోలె

                        ఆరుబయిటను నిలిచి అట వెడగుగాలులకు

                        ఆకుపయ్యెద తొలిగి హారికుచకుంభముల

                        పోలు లేలేతబొండాలు కనువిందు లై

                        ముౘ్చటలు గొలుపగా మురిసి చేరగ వచ్చు

                        ఆగంతకుల కెల్ల ఆకుచేతుల నూపి

                        స్వాగతము పచరించు నట నారికేళములు !

 

తరువాయి వచ్చే సంచికలో…..

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

 

Please visit this page