12_011 ఆనందవిహారి

” రాగ ధార ”

అమెరికాలోని చికాగో లో 23 వ అంతర్జాతీయ వీణ ఉత్సవం 

సంధానకర్త, నిర్వహణ : డా. శారదాపూర్ణ శొంఠి 

 

అమెరికా చికాగో నగరం లో ఉధృత మైన మంచు తుఫానుల ఋతువు సమాప్త మవటంతోనే భారతీయమైన కర్ణాటక సంగీత సమీరాలు హాయి కొలుపుతూ ఆనంద  వసంతానికి ఆహ్వానం పలుకుతాయి. వసంత పంచమి, శోభకృతు క్రొత్త సంవత్సరాది, ఆపైన శ్రీ రామ నవమి ఆరాధనలకి వెచ్చని కంబళ్ల మాటునున్న సరస్వతీ వీణలూ, సునాద వినోదిని వీణలూ తీగల బిగింపు తో సుస్వర శ్రుతులతో ఉత్సాహాన్ని పెంపుచేస్తూ సిద్ధమవుతాయి. 

చికాగో లో 2009 లో ఆరంభమైన అంతర్జాతీయ వీణ ఉత్సవాలు దాదాపు ఐదు నెలలు ఇంటిపట్టున ఉండి సాధనలో మునిగి తేలిన సంగీత కళాకారులనీ, విద్యార్థులని మనోహరం గా వేదికలపైకి ఆహ్వానిస్తాయి.

వీణా గ్లోబల్ కౌన్సిల్, సప్నా సంస్థ, ఇండియా క్లాసికల్ మ్యూజిక్ సొసైటీ సంయుక్తంగా ” రాగ ధార” 23 వ వీణా ఉత్సవానికి నాంది  పలికింది. దత్త పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద ముని వారి ఆశీపూర్వక వచనాలతో, శ్రీ శ్రీ శ్రీ గురుదేవ రవిశంకర స్వామి Art of living Yoga వారి దీవెనలతో దివ్యారంభం జరిగింది. 

మే నెల 6/7 తారీఖులు ” International Veena Day ” అని American Congressional Records Washington DC  పత్రాలలో స్థానం పొందిన చికాగో వీణోత్సవాలు 2023 మూడు రోజుల కార్యక్రమాలు ఆరంభయ్యాయి. ఈ సంగీత మహోత్సవాలకు నాందిగా ” సునాద సుధ” సంగీత వాగ్గేయ కారుల తైల వర్ణ చిత్రాల మందిరం అనేక కార్యక్రమాలు నిర్వర్తించింది. 2023 ఫిబ్రవరిలో విద్వాన్ జో రూఎన్ గిటార్ పై కర్ణాటక సంగీత కచేరీ తో మొదలై, శ్రీకళా పూర్ణ వీణ విదుషి రాజేశ్వరి పరిటి, శ్రీ కళాపూర్ణ గురు సరస్వతి రంగనాథన్, శ్రీ కళా పూర్ణ, వీణావిద్యావినోదిని Dr. ఈమని కళ్యాణి, కచేరీలు, Ensemble of Ragas సంగీత సంస్థ విద్యార్థులతో వీణా వాద్య ప్రదర్శనలు అద్భుతంగా సాగాయి. Flossmoor Illinois సునాద సుధ నిర్వహించిన కార్యక్రమంలో. విద్వాన్ విఘ్నేష్ మనోహరన్ – విద్వాన్  శ్రీ RK శ్రీరామ్ కుమార్ గారు హమీర్ కళ్యాణి రాగం లో స్వరపరచిన పరమహంస పరివ్రాజికాచార్య శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ విరచిత శ్రీ శారదాగీతాన్ని వీణ పై పలికించి శ్రోతల్ని ముగ్ధుల్ని చేసేరు.

 

********************************************

 

తెలుగు సాహిత్యంలో జానపద జీవిత చిత్రణ

 

ఆధునిక సాహిత్యంలోనే కాక ప్రాచీన సాహిత్యంలో కూడా జానపద మతాలు, గాథలు, చరిత్రలు, జీవన చిత్రణ జరిగిందని విశ్రాంత తెలుగు అధ్యపకురాలు, రచయిత్రి ఎర్రమిల్లి శారద పేర్కొన్నారు. తెనాలి రామకృష్ణుడు, దామరాజు లక్ష్మీ నారాయణ వంటి కవులు గ్రామీణ జాతరలు, అలంకారాలు, వస్త్రధారణ వంటి విషయాలను విపులంగా వర్ణించారని ఆమె “నెల నెలా వెన్నెల” కార్యక్రమంలో చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి సమర్పించిన ఈ “నెట్టింట్లో కార్యక్రమం” శనివారం సాయంత్రం అంతర్జాలం ద్వారా ప్రసారమైంది. ఎంతో శ్రమకోర్చి సేకరించిన సమాచారాన్ని ఆసక్తికలిగేలా ఆద్యంతం వివరించారు. మహాభారతంలో స్వయంగా వ్యాస మహర్షే గ్రామీణ జీవన చిత్రణ గావించారని వక్త అన్నారు.

ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో పాట రూపంలోనో కథల రూపంలోనో వివరించిన విషయాలు లిఖిత సాహిత్యం లేకుండానే తరువాతి తరాలకు అందుతూ వస్తున్నాయని, ఇదే దేశి సాహిత్యమని శారద వివరించారు. బండి తోలుకొనే మనిషి ప్రకృతిని చూసి పరవశించి, పశువుల కాపరి పశువులను మేపుతూ పాటలు సృష్టించి పాడగా, రైతులు, ఏతం కొట్టేవారు, మోత కొట్టేవారు, పిల్లల్ని పెంచే తల్లి, పెళ్ళిళ్ళలో పెద్దలు… ఇలా ఎవరికి వారు సృష్టించిన భావయుక్తం, రసవంతం అయిన పాటలను ఒకరు పాడుతుంటే మిగతావారు అనుసరిస్తారని, ఈ సాహిత్యం మౌఖికంగా, మౌలికంగా భాసిస్తుందని అనేక ఉదాహరణలు ఇచ్చారు. సాలవేకరి కదరీపతి తన “శుక సప్తతి” కావ్యంలో గంగాళమ్మ జాతర వర్ణన చేశారని అంటూ ఆ పద్యాన్ని వినిపించారు. 

ఏ విధంగానూ నివారించలేని “గాలి సోకుడు” వ్యాధి బారిన పశువులు పడినప్పుడు స్థానిక రాజు గ్రామ దేవతకి జాతర ప్రకటించాడని తెనాలి రామకృష్ణుడు వివరంగా రాశాడని చెప్పారు. ఆ సందర్భంలో స్త్రీలు ఆచరించిన విధానాలని “గోరు వెచ్చని చమురు అంటుకొనిరి మస్తకముల” అనే సీస పద్యంలో వర్ణించాడన్నారు. అదే విధంగా “సిడిమ్రాను” (సిరిమాను) ఉత్సవ వర్ణన చేస్తూ ఆ సందర్భంగా చక్కని పల్లె పడుచులు చేసిన నిప్పు మీద నడక, అరిటాకు చినిగిపోకుండా దాని మీద నృత్యం చేయడం, మారు కాలు (లోహంతో చేసిన కాలు) సమర్పణ, నోరి తాళం ఇవ్వడం (సంగీతంలో భాగమైన కొన్నక్కోల్) తదితర సేవలు, మొక్కుబడులను కళ్ళకు కట్టినట్టు వివరించాడని వక్త చెప్పారు. 

దామరాజు లక్ష్మీ నారాయణ రచించిన “బృందావన విహారం” కావ్యంలో దేవాలయ ఉత్సవ విగ్రహాల ఊరేగింపులోని బూరా, తప్పెట్లు తదితర జానపద సంగీత వాయిద్యాల, శాస్త్రీయ నృత్యాల విశేషాలున్నాయంటూ ఆ పద్యాన్ని చదివి వినిపించారు. ఇక జానపద సాహిత్యంలో, గేయాలలో గ్రామాల పండగల విశేషాలు, పంచభూత సేవలు, ఆయా సందర్భాలలో ప్రజలు పాటించిన నియమ నిష్ఠలు వగైరా అనేకం ఉన్నాయని శారద తెలిపారు. 

కొండజాతి ప్రజల దేవుడైన కొయ్యోడు (పోతరాజు)కి చేసే అర్చనలు, విన్నపాలు, ఇంకా… వాతావరణం, దాన్ని బట్టి చేసే పనులు, బుట్టబొమ్మల నృత్యం, వీర నాట్యం, కోలాటం, డప్పు నృత్యం, యక్షగానం, పగటి వేషాలు, వాలకం, ఒగ్గు కథ, భామా కలాపం, బుర్రకథ వంటి జానపద కళలు కూడా అక్షరబద్ధం కాబడ్డాయని చెప్పారు. తెల్లవారితే, సాయంత్రం అయితే కనిపించే నక్షత్రాలను పొడుపు చుక్క, సంది చుక్క అంటారని, సప్తర్షి మండలాన్ని గొరకొయ్యి అని, కృతికా నక్షత్రాన్ని పిల్లల కోడి అంటారని కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గాథా సప్తశతి తదితర సాహిత్యాలలోని విశేషాలు, గేయాల గురించి ప్రస్తావించారు. కప్పతల్లి, ఎరువాకొచ్చింది, వాడు వలచినాడమ్మ చందమామోయ్, లాలనుచు పాడరమ్మా (కృష్ణుడికి లాలి) పాటలను అలవోకగా పాడి ఆహ్లాదం కలిగించారు. ప్రభుత్వం, సాహిత్య సంస్థలు పూనుకొని జానపద సాహిత్య, సంగీత అంశాలను ముద్రిస్తే జనపదానికి కూడా శిష్ట సాహిత్యం వలె చిరస్థాయి కలుగగలదన్న ఆశాభావాన్ని శారద వ్యక్తం చేశారు. 

కార్యక్రమం ప్రారంభంలో సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకుడు తంత్రవహి శ్రీరామమూర్తి వక్తను పరిచయం చేశారు. ఆమె కోనసీమ కవికోకిలగా పేరుగాంచిన డా. వక్కలంక లక్ష్మీపతి రావు కుమార్తె అని వెల్లడించారు. ఆమె తెలుగు, సంస్కృత భాషలలో, ఎడ్యుకేషన్ అంశంలో ఎం. ఏ చేసిన ఉన్నత విద్యావంతురాలని, డిగ్రీ స్థాయి అధ్యాపకురాలిగా సేవలందించడమే కాక రచయితగా, సాహిత్య అంశాలలో వక్తగా కూడా రాణిస్తున్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమం వీడియో రూపంలో……

 

********************************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

 

Please visit this page