12_012 చేతికొచ్చిన పుస్తకం 15

చేతికొచ్చిన పుస్తకం:  71

ఏకైక పర్యావరణ విజ్ఞాన విపంచిక డౌవున్ టు ఎర్త్

ముప్పై ఏళ్ళగా నడుస్తున్న పక్ష పత్రిక ‘ డౌవున్ టు ఎర్త్ ‘

మొదట్లో సైన్స్, హెల్త్, ఎన్విరాన్మెంట్ కోసమని ప్రకటించుకునేది.ఇటీవల ఆ మేగజైన్ మకుటాన్ని డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, హెల్త్ కు సంబంధించిన రాజకీయాల ఆధారితం అని మార్చుకుంది. ఈ తేడాను బట్టి ఆ అంశానికి పెరిగిన విస్తృతి ఏమిటో మనం అవగతం చేసుకోవచ్చు. లోపల విషయసూచిక గమనిస్తే పత్రిక పేరు క్రింద Founded in 1992 to arm you with knowledge critical to shape a better word అని కనబడుతుంది!

1972 జూన్ 5 న జరిగిన తొలి ప్రపంచ పర్యావరణ సదస్సుకు హాజరైన ఐఐటి ఇంజనీరు అనిల్ అగర్వాల్ జర్నలిజం ఉద్యోగం వదిలి ఉద్యమబాట పట్టి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రారంభించారు. ఆయన ప్రారంభించిందే ఈ పత్రిక. ఇందులో ఏమి ఉంటాయని ఆసక్తి ఉన్న వారు పత్రిక చదవవచ్చు లేదా వెబ్ సైట్ చూడవచ్చు. ఈ సంస్థ అప్లోడ్ చేసే షార్ట్ వీడియోలు చాలా అర్థవంతంగా ఉంటాయి.

మీరు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే గాంధీజీ ఆలోచనల పట్ల కొత్తగా చూడాలని చాలా పరోక్షంగా ఈ పత్రిక 1998-1999 ప్రాంతంలో సూచించడం! అది సీరియస్ వర్క్ కావడానికి నాకు రెండు దశాబ్దాలు పెట్టింది!!

 

చేతికొచ్చిన పుస్తకం: 72

Studies In the History of Telugu Journalism

ప్రఖ్యాత సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు (1908-1985) షష్ట్యాబ్ధ పూర్తి సందర్భాన్ని పురస్కరించుకుని 1968 డిసెంబర్ 1 తేదీన కె ఆర్ శేషగిరిరావు సంపాదకత్వంలో Studies In the History of Telugu Journalism ఢిల్లీలో విడుదలయ్యింది.

తెలుగులో ముద్రణ, తెలుగు జర్నలిజం తొలి అడుగులు, గతకాలపు తెలుగు జర్నలిజం, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో జర్నలిజం, సామాజిక, మత సంస్కరణలో తెలుగు జర్నలిజం, పొలిటికల్ జర్నలిజం, లిటరరీ జర్నలిజం, వారపత్రికల, పిల్లల, మహిళల, సినిమా జర్నలిజం వంటి విషయాలు గురించి జె మంగమ్మ, ఆరుద్ర, దిగవల్లి వెంకట శివరావు, కొవ్విడి లింగరాజు, నండూరి రామమోహనరావు, వాకాటి పాండురంగారావు,డి ఆంజనేయులు మొదలైన ప్రముఖులు రాసిన విలువైన వ్యాసాలున్నాయి.

ఈ గ్రంథం వెలువడి 55 సంవత్సరాలయ్యింది. దీనికి కొనసాగింపుగా తెలుగు జర్నలిజం పోకడలను, పరిణామాలను సమీక్షించే మరే ప్రయత్నం జరుగనే లేదు!

 

చేతికొచ్చిన పుస్తకం 73

పోల్కంపల్లి శాంతాదేవి ఇటీవలి కథాసంపుటి ‘ఇల వైకుంఠపురం’

వనపర్తి రాజా వారి బంగాళా చూసొద్దామని డా ప్రభల జానకి పురమాయిస్తే వారి దంపతులు, మేమిద్దరం, గణేశ్వరరావు తో కలిసి ఏప్రిల్ 29 ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి మొదట తెలంగాణ ప్రముఖ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవిని కలిశాం. వేయి పున్నమలు చూసిన శాంతాదేవి ఎంతో సహజంగా, ఎంతో ప్రేమగా మిమ్మల్ని ఆదరించారు.

నేను వారు ‘చండిప్రియ’ నవల ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురణ కావడం బాగా గుర్తుంది. ‘నేను-నా రచనలు ‘ సంకలనంలో తను రాసిన వ్యాసం వారి గురించి తెలుసుకోవడానికి ముందు రోజే చదివాను. అరవై అయిదు నవలలు, వంద కథలు రాసిన శాంతాదేవి తాజా పుస్తకం ఇది. సినీగీత రచయిత భువనచంద్ర రాసిన ముందుమాట తో వెలువడిన ఈ మూడు వందల పుటలు గల పుస్తకం వెల 250 రూ.

 

చేతికొచ్చిన పుస్తకం 74

కవిత్వపు ద్వైమాస పత్రిక ‘కవిసంధ్య’

ప్రాసలతో క్రీడించే శీర్షికలు పెడుతూ సాహిత్యాన్ని దూరం పెట్టే తెలుగు సమాజంలో , కరోనా దాడికి తట్టుకుంటూ మిత్రులు శిఖామణి ‘కవిసంధ్య’ పేరుతో మూడేళ్ల క్రితం ద్వైమాసపత్రిక ప్రారంభించి కొనసాగించడం అభినందనీయం!

పాత్రికేయులలో, కవులలో సాహిత్య అక్షరాస్యత అడుగంటిన కాలంలో కవిత్వంతో ముడిపడిన పలు పార్వ్శవాలు స్పృశిస్తూ ప్రత్యేక సందర్భాలను సంచికలతో స్మరించుకుంటూ చిన్న విషయం కాదు! జ్యోతిర్మయమ్ వాజ్మయమ్ అంటూ కవితల ప్రచురణ తోపాటు విశ్లేషణలు, కవిత్వ సమీక్షలు, సమావేశాల సమాచారం, ఇంటర్వ్యూలు, విలువైన కవితల, వ్యాసాల పునఃప్రచురణ.. ఇలా కవిత్వపు సమగ్రతతో అలరారుతోంది.

పత్రిక లేఅవుట్, అలంకరణ విషయాల్లో శ్రద్ధ కనబడుతోంది.

కవిగా, అధ్యాపకుడిగా కృషి చేసిన శిఖామణికి ఈ సాహిత్య పత్రిక ద్వారా విభిన్నమైన సాధన సొంతమవుతోంది.

ఆల్ ది బెస్ట్ ‘కవిసంధ్య’ శిఖామణి!

 

చేతికొచ్చిన పుస్తకం 75

half way

The Golden Book

Presented to Sri V R Narla on his 50th birthday

నార్ల వెంకటేశ్వరరావు (1908-1985) ముప్పై మూడేళ్ళకే ఎడిటరైన ప్రతిభావంతుడే కాదు, మూడు దశాబ్దాల పాటు తెలుగు జర్నలిజానికి సిసలైన సారథి అయిన నేర్పరి కూడా! డిగ్రీ చదువు పూర్తి కాకుండానే ‘స్వదేశీ సంస్థానాలు’ అనే పుస్తకం రాయడమే కాక; ఎడిటర్ స్థాయికి రాని దశలోనే నేటి రష్యా, ఆస్ట్రియా ఆక్రమణ, జెక్ విచ్ఛేదం, పాలస్తీనా గురించి అంతర్జాతీయ వ్యవహారాలను వ్యాఖ్యానించే గ్రంథాలు కూడా రచించారు కనుకనే ఆ స్థాయికి సులువుగా వెళ్ళగలిగారు. తన 51 వ జన్మదినానికి చాలా మంది ప్రముఖులైన తెలుగు మిత్రులు 1959 లో బహుకరించినదీ రెండు వందల పుటల సంకలనమిది.

హేమాహేమీలైన కె వీ గోపాలస్వామి, కోలవెన్ను రామకోటీశ్వర రావు, కె ఈశ్వర దత్, తాపీ ధర్మారావు, కోటంరాజు రామారావు,ఆచంట జానకిరామ్, ఖాసా సుబ్బారావు వంటి వారు నార్ల రచనలను, వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ ఓ 15 వ్యాసాలు రాశారు. ఇక రెండవ విభాగంలో రాజాజీ, ఆర్థర్ ఐసన్ బెర్గ్, జి వి కృష్ణారావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, మామిడిపూడి వెంకటరంగయ్య, బూర్గుల రామకృష్ణారావు, కె స్వామినాథన్, కొత్త సచ్చిదానంద మూర్తి మొదలైన దిగ్ధంతులు రాసిన పాతిక వ్యాసాలు సకల రంగాలకు సంబంధించి సార్వత్రికమైన విలువగలవి!

 

****************************************

గమనిక :  ఆగష్టు నెల పన్నెండవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం తమ రచనలను, చిత్రాలను, శ్రవ్య  అంశాలను ప్రచురణ కోసం పంపించదల్చుకున్నవారు జూలై 25వ తేదీ లోగా పంపించవలెను. వాటితో బాటు అవి మీ స్వంతమేనని, దేనికీ అనుసరణ కాదని, ఇంతకుముందు ఏ ప్రింట్ పత్రికకు గాని, వెబ్సైట్ కు, అంతర్జాల పత్రికకు, మరే ఇతర మీడియా కు ప్రచురణ నిమిత్తం పంపి ఉండలేదని హామీ పత్రం కూడా జతపరచాలి. రచనలు యూనికోడ్ లో టైప్ చేసి MS Word ఫైల్ గా పంపించాలి. లేదా నిడివి తక్కువగా ఉంటే మెయిల్ లో type చేసి పంపించవచ్చును. ఆడియోలు, వీడియోలు సాధారణ ఫార్మాట్ లో మెయిల్ / డ్రైవ్ ద్వారా మాత్రమే పంపించాలి.

పంపించవలసిన మెయిల్ : editorsirakadambam@gmail.com ; చివరి తేదీ : 25 జూలై 2023

****************************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

అమెజాన్ లో మీకు కావల్సిన వస్తువులు ఈ పేజీ నుంచి కొనుగోలు చేయండి