జూలై 23వ తేదీ జాతీయ ప్రసార దినోత్సవ సందర్భంగానూ….
ఎన్నో దశాబ్దాల క్రిందట ‘ రేడియో ’ కి జన్మనిచ్చి ప్రాణం పోసిన మార్కొని మహాశయుని వర్థంతి ( జూలై 20 ) సందర్భంగా వారిని స్మరించుకుంటూ,
ఆయన స్మృతికి జోహార్లు పలికి, ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను.
మా చిన్నప్పుడు –
అంటే ఇప్పటికీ ఒక డబ్భై ఏళ్ళు కాలగమనంలో వెనక్కి వెడదాం !
**** **** ****
నేను హైస్కూల్లో చదువుకునే రోజులవి….
మాదో చిన్న పల్లెటూరు. పేరు చేబ్రోలు ( గుంటూరు జిల్లా ). మా ఊరికి ఒక రైల్వే స్టేషన్ గానీ, ఒక బస్ స్టేషన్ గాని లేవు. అప్పటికి ఆర్‌టిసి ఇంకా అవతరించలేదు. ప్రైవేట్ బస్సులదే రాజ్యం ! ఎక్కడబడితే అక్కడ డ్రైవరు తనకి తోచిన చోట బస్సును ఆపేవాడు. దానిని అందుకోవాలన్న తాపత్రయంతో ప్రయాణీకులు, పాపం, తట్టా – బుట్టా తో వెంట పరుగులు పెట్టేవారు.
మా నాన్నగారు స్కూలు టీచర్. ఆయన పనిచేసేది ఓ కమిటీ స్కూలులో. నెల నెలా సరిగ్గా జీతాలు ఇచ్చేవారు కాదు. మేము ఒక చిన్న పెంకుటింట్లో అద్దెకు ఉండేవాళ్లం. ఇంటికి కరెంట్ సౌకర్యం లేదు. ప్రతిరోజూ సాయింత్రం చీకటి పడే వేళకి లాంతర్లనూ – కోడిగ్రుడ్డు దీపాలనూ – చిమ్నీలతో సహా శుభ్రంగా తుడిచి, నిండా కిరసనాయిలు పోసి, వత్తులు సరిచేసి వెలిగించుకోవడం ఒక పెద్ద పని. మా ఇంటి వెనకాల మల్లాది పున్నయ్య శాస్త్రి గారని ఉండేవారు. వారి ఇంటికి కొత్తగా కరెంట్ వచ్చింది.
అంతేకాదు – వెలుగులను విరజిమ్మే విద్యుద్దెపాలకు అదనపు ఆకర్షణగా ఒక బుజ్జి మర్ఫీ రేడియో కూడా వారింట ఉండేది. సాయింత్రం స్కూలు నుండి ఇంటికొచ్చి కాళ్ళు, చేతులు, ముఖం చన్నీటితో కడుక్కుని – బట్టలు మార్చుకుని – స్కూలులో ఇచ్చిన హోమ్ వర్క్ చేసేసుకుని అప్పుడప్పుడు, పున్నయ్య గారింటికి అమ్మ పర్మిషన్ తీసుకుని పరుగెట్టేవాళ్లం నేనూ – ఒక్కొక్కసారి నాతోబాటు మా అన్నయ్య కూడా ! వాళ్ళ గుమ్మంలో గడప ముందు బెరుకుగా చూస్తూ నిలబడి పోయిన మమ్మల్ని “ అయ్యో ! అక్కడే నిలబడి పోయారేమిట్రా ? రండి-లోపలికి రండి ” అని ఆహ్వానించేవారు పున్నయ్య గారి భార్య నాకేసి, మా అన్నయ్య కేసి ప్రేమగా చూస్తూ… అప్పటికే వాళ్ళ రేడియో పలుకుతూ-పాడుతూ ఉండేది.
ప్రాంతీయ వార్తలు, బావగారి కబుర్లు, ఈ మాసపు పాట, ఠంచన్ గా ఏడు గంటలకి తెలుగులో జాతీయవార్తలు, సంగీత – సాహిత్య కార్యక్రమాలు…. ఇలాగ ! బావ గారి కబుర్లలో ప్రయాగ నరసింహశాస్త్రి గారు, సి. రామమోహనరావు గారు రాజకీయాలతో బాటు హాస్యోక్తులు పండించేవారు. జాతీయ వార్తలలో పన్యాల రంగనాధరావు, జే. మంగమ్మ, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి ల గళాలను వింటూ వుంటే – వినే వారిలో అనుకోకుండా రాజకీయ పరిజ్ఞానం, ఆసక్తి కూడా పెరిగేవి. అదేదో తెలియని ఆనందం – అంతులేని ఆనందం !!!
ఈ మాసపు పాట రచయితలుగా దాశరథి, మధురాంతకం రాజారామ్, రజని, ఇంద్రగంటి ప్రభృతులు – లలిత, శాస్త్రీయ, భక్తి సంగీత కార్యక్రమాలలో రజని, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, ఎం. వి. రమణమూర్తి, అన్నవరపు రామస్వామి, ఎన్. సి. హెచ్. కృష్ణమాచార్యులు, ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ, దండమూడి రామమోహన్రావు…. తరచుగా వినవచ్చే ప్రముఖులలో కొందరు. అసలు వీరివలన ఆ కార్యక్రమాలకే ఒక వన్నె వచ్చిందంటే అది అతిశయోక్తి కాదు.
భక్తిరంజని లొ ప్రసారమయ్యే సూర్యస్తుతి, లింగాష్టకం, సుందరకాండ, శ్రీ భద్రాచల రామదాసు కీర్తనలు, శ్రీ తూము నరసింహదాసు కీర్తనలు, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం…. అందరి అభిమానాన్ని చూరగొనేవి. ఇక నాటికలు, నాటకాలు, హరికథలు, బుర్రకథలు, సంగీత కచేరీలు, ప్రసంగాలు – ఒకటేమిటి – ఇలా వైవిధ్యమైన ఎన్నో చక్కటి కార్యక్రమాలను ఆకాశవాణి ప్రసారం చేసేది. ఏ కార్యక్రమాన్ని అయినా వదలకుండా వినాలనిపించేది. – కానీ ఎటొచ్చి – అందుకు ఒకటే ఒక ప్రతిబంధకం – ‘ సమయాభావం ’.
నేను ఎస్‌ఎస్‌ఎల్‌సి ( SSLC ) క్లాసులోకి వచ్చేసరికి, మేము వేరే అద్దె ఇంటికి మారాము. నాన్నగారు ఎలాగో అలాగ కష్టపడి తానే తన ఖర్చుతో ఇంట్లో కరెంట్ పెట్టించారు. ఒక కరెంట్ రేడియో కూడా కొన్నారు. ‘ సుప్రీం ’ దాని పేరు – మేడ్ ఇన్ ఇంగ్లాండ్ – ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమయ్యే – అంటే బిబిసి, VOA ( వాయిస్ ఆఫ్ అమెరికా ), రేడియో సిలోన్ కార్యక్రమాలు కూడా అందులో వచ్చేవి. రేడియో చూడ్డానికి ఒక పెద్ద భోషాణపు పెట్టె పరిమాణంలో ఉండేది. రేడియో పాడుతూ – మాట్లాడుతూ… ఇంటికి ఎవరయినా బంధువులు వచ్చారా అన్నంత సందడి చేసేది. విశేషమేమిటంటే, మా నాన్నగారు 1971 లొ రిటయిరయ్యే పర్యంతమూ అదీ ‘ సర్విస్ ’ లోనే ఉంది.
1963 లొ కాకినాడ లొ నా ఇంజనీరింగ్ చదువు పూర్తి ఆయాకా, శ్రీశైలం ప్రాజెక్టు లొ ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరాను. మా నాన్నగారు శ్రీశైలం ప్రాజెక్టు హైస్కూల్ లోనే లెక్కల మాస్టారుగా పని చేసేవారు. రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రసారాలను చేసే రేడియో స్టేషన్ లే కాకుండా – పొరుగు దేశం – శ్రీలంక నుండి ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలు, ఇంకా హిందీ విభాగంలో ‘ బినాకా గీత్ మాలా ’ కార్యక్రమాలు – శ్రోతల్ని ఒకరకంగా రేడియోకి కట్టిపడేసేవి అని చెప్పవచ్చును. ఇవి అంత ఆసక్తిదాయకంగానూ – ఆనందదాయకంగానూ ఉండేవన్నమాట !!!
మద్రాస్ ‘ బి ’ కేంద్రం తెలుగు కార్యక్రమాలలో ప్రముఖంగా ప్రస్తావనకి వచ్చేవి – రేడియో అన్నయ్య శ్రీ న్యాపతి రాఘవరావు గారు, అక్కయ్య శ్రీమతి న్యాపతి కామేశ్వరి గార్ల నిర్వహణలో బాలానందం, రేడియో తాతయ్యగా ఉమ ( శ్రీ మల్లంపల్లి ఉమామహేశ్వరరావు గారు ) నిర్వహించే నాటికలు, రేడియో సంక్షిప్త శబ్ద చిత్రాలు, మంచి మంచి నాటకాలు, సంగీత రూపకాలు, ఉగాదికి పంచాంగ శ్రవణము, కవి సమ్మేళనాలు, సంగీత కచేరీలు ప్రసారమయ్యేవి. దాశరథి, ఆరుద్ర, పినిశెట్టి, అనిశెట్టి, పాలగుమ్మి, గొల్లపూడి – ప్రముఖంగా వినవచ్చే కొందరి పేర్లు – అలాగే ఈ కోవలొ మరికొందరు – శారదా శ్రీనివాసన్, కోకా సంజీవరావు, చాట్ల శ్రీరాములు, గణేష్ పాత్రో, కే. వెంకటేశ్వరరావు, స్థానం, బందా ప్రభృతులు. మరి ధార్మిక ప్రసంగాలకు ( ధర్మ సందేహాలు ) మల్లాది చంద్రశేఖర శాస్త్రి, ఉషశ్రీ ప్రభృతులు పెట్టింది పేరు. వారంలో ఒకరోజు రాత్రి తమిళంలో మద్రాస్ కేంద్రం ‘ నీన్ గల్ కట్టవై ’ అని శ్రోతలు కోరిన పాటలు – మంచివి – ప్రసారం చేసేది. పండుగలు – శ్రీరామనవమి, శివరాత్రి వస్తే – ఆ సందర్భంగా భద్రాచలం, శ్రీశైలం నుండి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు ఉండేవి. అపుడపుడు క్రికెట్ కామెంటరీలు.
1968 లొ మా పెళ్లి సందర్భంగా పెళ్లి కానుకగా మా మామగారు మాకు నేషనల్ ఎకో – 4 బాండ్ కరెంట్ రేడియో కొని ఇచ్చారు. అది మరో 30 సంవత్సరాలపాటు మా ఇంట ఉంది. తన మాట – పాటలతో ఇంటిల్లిపాదినీ అలరింప జేసేది. మా ఇంట్లో దానిది మరో కుటుంబ సభ్యుని పాత్ర. ఆకాశవాణి, వివిధాభారతి వాణిజ్య విభాగం నుండి హిందీ – తదితర భారతీయ భాషలలొ చక్కటి పాటలు వీనుల విందు చేస్తూ ఉండేవి. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉందనుకోండి.
ఆ రోజులలో – ‘ వాణి ’ అన్న పేరుతో రేడియో కార్యక్రమాలు, తదితర ఆసక్తిదాయక వివరాలతో ఒక పక్ష పత్రికను ఆకాశవాణి ప్రచురించేది. ఇది అప్పట్లో చాలామందికి అభిమాన పత్రిక.
రేడియో కార్యక్రమాలు ఆధారంగా నాకు ఎంతోమంది ప్రముఖ రచయితలు – కళాకారులతో – నా పూర్వజన్మ సుకృతమా అన్నట్లు – పరిచయ భాగ్యం, ఆ పైన స్నేహం ఏర్పడ్డాయి. వీరిలో కొందరు దాశరథి, గొల్లపూడి మారుతీరావు, ఉమ, మధురాంతకం రాజారాం, ఎస్. శంకరనారాయణ, పన్యాల రంగనాధరావు, గణేష్ పాత్రో, ఎం. వి. రమణమూర్తి, ఓలేటి పార్వతీశం గారలు. వారి నుండి లభించిన ప్రేరణతో – నాకూ ఈ రేడియో కార్యక్రమాలలో పాల్గొనాలనే ఆసక్తి ఏర్పడి కాలక్రమేణా అది బలపడుతూ వచ్చింది.
ఫలితంగా ఎన్నో రచనలను చేసి ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ప్రసారం కోసం పంపుతూ ఉండడం—కానీ అలా పంపిన ప్రతిసారి అవి తిరిగి వస్తూండడం జరిగేది. అలా తిప్పి పంపుతూ రేడియో కేంద్రం వారు వ్రాసే ఉత్తరంలో మర్యాద పూర్వకంగా వారి వ్రాసే ఒక వాక్యం ప్రత్యేకించి నన్ను ఆకట్టుకునేది. “ ప్రసారం చేసే విషయంలో మీ రచనను వినియోగించుకోలేనందుకు విచారిస్తున్నాము ” అని వ్రాస్తూ ముగింపు వాక్యంగా “ This does not, In any way, reflect upon the merit of your work ” అని వ్రాసేవారు. ఇలా జరగడంతో ఇక నా రచనలకు రేడియో లొ ప్రసారమయే యోగం లేదు కాబోలు అని నిరుత్సాహం ఆవరించేది మనసులో. అయినా సరే – దానిని ప్రక్కకు తోసి, నా రచనల వెల్లువతో రేడియో కేంద్రాన్ని ముంచెత్తే ప్రయత్నాన్ని – పట్టు వదలని విక్రమార్కునిలా కొనసాగించాను.
—- హమ్మయ్య ! చివరికి 1984 లో అనుకుంటాను….
ఒక శుభ ముహూర్తాన భగవద్దత్తమయిన వరంలా – నేను పంపిన రచన “ కోణార్క – శిల్పకళా వైశిష్ట్యం ” ను ప్రసారం చేయడానికి అంగీకరిస్తున్నామని తెలియజేయడానికి ఆనందిస్తున్నామంటూ అగ్రీమెంట్ ఫామ్ జతపరుస్తూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు ఒక ఉత్తరం వ్రాసారు. ఆ ఉత్తరాన్ని అందుకుని ఉబ్బి తబ్బిబ్బయి, మా ఆవిడకి, పిల్లలకి ఈ శుభవార్తను చెవిన వేసి – అగ్రీమెంట్ ఫామ్ సంతకం చేసి ఖమ్మం నుండి రైలులో విజయవాడకి బయిలుదేరాను. స్టేషన్ లొ రైలు దిగి నేరుగా రేడియో స్టేషన్ కి రిక్షా మాట్లాడుకుని వెళ్ళాను. స్టూడియో లొ నన్ను నేను పరిచయం చేసుకుని సంతకం చేసిన అగ్రిమెంట్ ఫామ్ ఇవ్వబోతే “ అదేమిటండీ ! మీరు స్వయంగా వచ్చేశారు ? సంతకం చేసి అగ్రిమెంట్ ఫామ్ మాకు పోస్ట్ లో పంపితే సరిపోతుంది కదా ! మేము మీ ప్రసంగ పాఠం చదివి రికార్డు చేసి ప్రసారం చేసి వుండేవాళ్లం ” అంటూ – ఒక సెకనులో మళ్ళీ ఏమనుకున్నారో ఏమో “ సరే లెండి. ఎలాగూ వచ్చేశారు కదా – పదండి – మీ టాక్ రికార్డు చేసేద్దాం ” అన్నారు అక్కడ పని చేస్తున్న మాధవపెద్ది హనుమతరావు గారు. ఆదుర్దా తగ్గి ఆనందం, ఆశ్చర్యం కలిసి ఒకేసారి నాలో తలెత్తాయి.
30 నిముషాల నిడివి ఉన్న ‘ సంచికా కార్యక్రమం ’ ( Magazine Programme ) లో నా ప్రసంగానికి సుమారు పది నిముషాల సమయాన్ని కేటాయించారు. ఇదే కార్యక్రమంలో భాగంగా చిత్రకళ గురించి కార్టూనిస్ట్ బాలి గారు, కర్ణాటక సంగీత గురించి నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు కూడా ప్రసంగాలు చేశారు. ప్రసంగాన్ని రికార్డు చేసే ముందు – నేను మైక్ ఎదురుగా కూర్చొని చదవడంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి హనుమంతరావు గారు నాకు వివరించారు. ప్రసంగం రికార్డింగ్ ముగిసి – నేను వస్తూండగా పిలిచి నా చేతిలో 127 రూపాయలకు చెక్కు రూపంలో పారితోషికాన్ని ఉంచారు. ఆ సాయంత్రానికి నేను ఖమ్మం చేరాను. అదే రాత్రి ఈ కార్యక్రమం ప్రసారం కావడం, ఆ సమయానికి మా కుటుంబమంతా రేడియో ముందు వాలి, ఆ కార్యక్రమాన్ని వింటూ, అంతకు ముందే సిద్ధం చేసుకున్న నా బుల్లి సోనీ టేప్ రికార్డర్ లొ దానిని రికార్డ్ చేసుకుని అప్పుడప్పుడు ఆ కాసెట్ ని వింటూ ఆనందించే వాళ్ళం. ఇదినా జ్ఞాపకాల గ్రంథ పుటలలో….. ఒక ప్రత్యేక పేజీ అన్నమాట.
**** **** ****
కరెంట్ రేడియో, ట్రాన్సిస్టర్, టేప్ రికార్డర్, మ్యూజిక్ సిస్టమ్, సిడి ప్లేయర్…. ఇలా రూపాంతరం చెందుతూ, నేటికి రేడియో పూర్తిగా కనుమరుగై, కాల గర్భంలో కలిసి పోయే పరిస్థితికి చేరువవుతోందనే చెప్పుకోవచ్చు. అయినా సరే — ఆ తీపి గుర్తులు మాత్రం మస్తిష్కపు పొరలలో పదిలంగా, శాశ్వతంగా, నిత్య నూతనంగా నిలిచిపోయాయి.
( ఈ వ్యాసం వ్రాయడానికి నాకు స్పూర్తి నిచ్చిన ఆప్తమిత్రులు శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారికి ప్రేమతో… )
****************************************
గమనిక : ఆగష్టు నెల పన్నెండవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం తమ రచనలను, చిత్రాలను, శ్రవ్య అంశాలను ప్రచురణ కోసం పంపించదల్చుకున్నవారు జూలై 25వ తేదీ లోగా పంపించవలెను. వాటితో బాటు అవి మీ స్వంతమేనని, దేనికీ అనుసరణ కాదని, ఇంతకుముందు ఏ ప్రింట్ పత్రికకు గాని, వెబ్సైట్ కు, అంతర్జాల పత్రికకు, మరే ఇతర మీడియా కు ప్రచురణ నిమిత్తం పంపి ఉండలేదని హామీ పత్రం కూడా జతపరచాలి. రచనలు యూనికోడ్ లో టైప్ చేసి MS Word ఫైల్ గా పంపించాలి. లేదా నిడివి తక్కువగా ఉంటే మెయిల్ లో type చేసి పంపించవచ్చును. ఆడియోలు, వీడియోలు సాధారణ ఫార్మాట్ లో మెయిల్ / డ్రైవ్ ద్వారా మాత్రమే పంపించాలి.
పంపించవలసిన మెయిల్ : editorsirakadambam@gmail.com ; చివరి తేదీ : 25 జూలై 2023
****************************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
అమెజాన్ లో మీకు కావల్సిన వస్తువులు ఈ పేజీ నుంచి కొనుగోలు చేయండి