12_012 స్వర వీణాపాణి

ఇటీవల అమెరికా లోని చికాగో నగరంలో జరిగిన అంతర్జాతీయ వీణా ఉత్సవాలలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు వీణాపాణి ప్రదర్శన జరిగింది.

స్వర వీణాపాణి గా ప్రసిద్ధులైన వొగేటి నాగ వెంకటరమణమూర్తి జన్మస్థలం గుంటూరు జిల్లా రావెల గ్రామం. శ్రీ వొగేటి లక్ష్మి నరసింహశాస్త్రి, సీతా అన్నపూర్ణమ్మ లు ఆయనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ప్రాథమికంగా చదువుతో బాటు సంగీత పాఠాలు నేర్పిన గురువు వారి తండ్రి గారే ! ప్రపంచానికి ఆయన సంగీతాన్ని పరిచయం చేసింది రావెల గ్రామమే ! ఆ ఊళ్ళో 24 గంటల పాటు హర్మోనియం వాయించినందుకు తొలిసారిగా పది రూపాయల పారితోషికం అందుకున్నారు వీణాపాణి.

బి. కామ్., బి. ఎల్. చదివిన వీణాపాణి న్యాయవాది గా గుంటూరులో ఆరు సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు.

వీణాపాణి గారి అర్థాంగి శ్రీలక్ష్మి నరస, సంతానం సాయిలక్ష్మి, పూర్ణ స్వరమంజరి.    

శ్రీ విశ్వయోగి విశ్వంజీ గారి “ విశ్వ గీతమాల ” పేరుతో గుంటూరులో తొలి ఆల్బం విడుదల చెయ్యడం జరిగింది.

ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా వారి కోదండపాణి స్టూడియోలో తన తండ్రి గారి సమక్షంలో, తన మిత్రుడు అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి నిర్మాతగా  “ చెన్నకేశవ భక్తిమాల ” పేరుతో మద్రాస్ లో తొలి ఆల్బం విడుదల చేశారు. ఈ ఆల్బం లో పాడిన ప్రముఖ గాయని పి. సుశీల గారి చేతుల మీదుగా తొలి పారితోషికం అందుకున్నారు. ఈ ఆల్బం లోనే రెండు పాటలు పాడి తీసుకున్న పారితోషికాన్ని ఆశెస్సులుగా తిరిగి ఇచ్చేశారు మహా గాయని ఎస్. జానకి గారు.

తనికెళ్ళ భరణి గారికి సంగీతం నేర్పారు. ఆయన ప్రమేయంతోనే శివనాగేశ్వరరావు గారి “ పట్టుకోండి చూద్దాం ” చిత్రంతో సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. ప్రముఖ దర్శకులు, రచయిత జంధ్యాల చేతుల మీదుగా శతదినోత్సవ పురస్కారం అందుకున్నారు.

ఇంకా “ అల్ రౌండర్ ”, భరణి గారి “ మిథునం ” చిత్రాలకు కూడా సంగీతం అందించారు. జేసుదాసు గారి “ఆటగదరా శివా” చాలా ఆదరణ పొందింది.

రచయిత జనార్ధన మహర్షి దర్శకత్వం వహించిన “ దేవస్థానం ” చిత్రానికి పాటల రచయితగా, సంగీత దర్శకుడిగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలోని ‘ పలుకు తెలుపు తల్లివే ’ పాటకు గాను చిత్ర గారు సౌత్ ఇండియన్ బెస్ట్ సింగర్ పురస్కారం అందుకొన్నారు.  

ప్రపంచ సంగీత మూలాలైన భారతీయ కర్ణాటక శాస్త్రీయ సంగీత పునాదులుగా 72 మేళకర్త రాగాలను చెప్పుకుంటారు. ఈ పద్దెనిమిది సంవత్సరాల కృషి మేళకర్త రాగాలన్నిటినీ కలిపి ఆరున్నర నిముషాల పాటగా ఒకటి, మూడున్నర నిముషాల పాటగా మరొకటి రచించి, స్వరపరిచారు వీణాపాణి. ఈ ప్రక్రియ అతిరథ మహారధులైన సంగీతజ్ఞుల ఆశీస్సులతో బాటు మద్రాసు సంగీత అకాడమీ వారి ప్రశంసలు కూడా పొందింది.

గాంధీజీ లండన్ లో బారిష్టరు చదువుకునే రోజుల్లో నివసించిన వీధిలో, ఆయన ప్రార్థనలు చేసిన మందిరంలో ఈ 72 మేళకర్త రాగాలను నిరాటంకంగా 61 గంటల 20 నిముషాల సేపు కీబోర్డ్ పై పలికించి ప్రపంచ సంగీత చరిత్రలో భారత సంగీత ప్రత్యేకతను తెలియజేసే విధంగా నూతనాధ్యాయాన్ని నెలకొల్పిన తొలి భారతీయుడు… తొలి తెలుగువాడు. ఈ విషయం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయింది. జాతిపిత మహాత్మాగాంధి 150వ జయంతి సందర్భంగా ఈ ప్రదర్శనను గాంధీజీ కి అంకితం చేయడం జరిగింది.

గిన్నీస్ వరల్డ్ వారు వీణాపాణి గారిని ‘ మేళకర్త మాస్ట్రో ’ గా పేర్కొని భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని గౌరవించారు.

లండన్ పార్లమెంట్ దర్శించారు. ఇండియన్ హై కమిషనర్ నుంచి గౌరవ పురస్కారం అందుకున్నారు.

ఈ సంగీత సృష్టిని లక్షమందికి ఉచితంగా నేర్పించాలనే లక్ష్యంతో ‘ స్వరనిధి ’ అనే సంస్థను స్థాపించి దేశ విదేశాలలో పర్యటిస్తూ మన సంప్రదాయ సంగీత సాహితీ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు వీణాపాణి.

ఇటీవలే Personalised live streaming music therapy SMART అనే ప్రక్రియను ఆవిష్కరించారు.

అమెరికాలో జరిగిన అక్కినేని నాగేశ్వరరావు గారి 89వ జన్మదినోత్సవం సందర్భంగా 89 లైన్లలో అక్కినేని గారి పేరు, చిత్రాల పేర్లు లేకుండా… ప్రతి లైన్లో 8 అక్షరాలతో ఒక పద సమూహం, 9 అక్షరాలతో మరొక పద సమూహం రచించి వినూత్న ప్రయోగం చేశారు.

తెలుగు పత్రికారంగ ప్రముఖులు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారి చేతుల మీదుగా “ సప్తస్వర సామ్రాట్ ” బిరుదును అందుకొన్నారు. మరొక పత్రికారంగ ప్రముఖులు శ్రీ గుడిపూడి శ్రీహరిగారు ఆంగ్ల దినపత్రిక ‘ ది హిందు ’ లో “ “MUSUCAL ADVENTURE”  అనే వ్యాసం, సినిమా పత్రిక ‘ సితార ’ లో ప్రత్యేక కథనం, మరో పత్రికారంగ ప్రముఖులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారి నుంచి 72 మేళకర్త రాగాల ప్రయోగానికి ప్రత్యేక అభినందనలు అందుకొన్నారు.

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రముఖ దర్శకులు పద్మభూషణ్ శ్యామ్ బెనెగల్ గారి నుంచి, ప్రముఖ నటులు శ్రీ కమల్ హాసన్ ల నుంచి ప్రశంసలు అందుకొన్నారు. ప్రముఖ స్వర దిగ్గజాలు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీ జుబిన్ మెహతా, శ్రీ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ శంకర్ మహదేవన్, శ్రీ ఎల్. సుబ్రహ్మణ్యం గారలు తదితరుల ప్రశంసలు కూడా పొందారు.

భారత మాజీ ప్రధాని శ్రీ పి. వి. నరసింహారావు గారి కోసం ఒక పాట రాసి, స్వరపరచి వారి నుంచి మెప్పు పొందారు.

గిన్నీస్ విజయం తెలుగు సినిమా రచయితల సంఘం నుంచి సత్కారం, తెలుగు చిత్ర రంగ ప్రముఖులు చిరంజీవి, అల్లు అరవింద్ గారల ప్రశంసలు పొందారు.

సంగీతంలో ‘ సప్తస్వరావధానం ’ అనే క్రొత్త ప్రక్రియ కు శ్రీకారం చుట్టి దేశవిదేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు.

తన 72 మేళకర్త రాగాల సింఫోనీ ని లండన్ నగరంలోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో, ఢిల్లీ లోని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర నిర్వహించాలని వీణాపాణి గారి జీవితాశయం.

లక్షమందికి ఉచితంగా సంగీతం నేర్పించి రాబోయే తరానికి ఈ ప్రక్రియను చేరవేయాలనేది వీణాపాణి సంకల్పం. 

*****************************

గమనిక :  ఆగష్టు నెల పన్నెండవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం తమ రచనలను, చిత్రాలను, శ్రవ్య  అంశాలను ప్రచురణ కోసం పంపించదల్చుకున్నవారు జూలై 25వ తేదీ లోగా పంపించవలెను. వాటితో బాటు అవి మీ స్వంతమేనని, దేనికీ అనుసరణ కాదని, ఇంతకుముందు ఏ ప్రింట్ పత్రికకు గాని, వెబ్సైట్ కు, అంతర్జాల పత్రికకు, మరే ఇతర మీడియా కు ప్రచురణ నిమిత్తం పంపి ఉండలేదని హామీ పత్రం కూడా జతపరచాలి. రచనలు యూనికోడ్ లో టైప్ చేసి MS Word ఫైల్ గా పంపించాలి. లేదా నిడివి తక్కువగా ఉంటే మెయిల్ లో type చేసి పంపించవచ్చును. ఆడియోలు, వీడియోలు సాధారణ ఫార్మాట్ లో మెయిల్ / డ్రైవ్ ద్వారా మాత్రమే పంపించాలి.

పంపించవలసిన మెయిల్ : editorsirakadambam@gmail.com ; చివరి తేదీ : 25 జూలై 2023

****************************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-  

అమెజాన్ లో మీకు కావల్సిన వస్తువులు ఈ పేజీ నుంచి కొనుగోలు చేయండి