13_001 బాబ్జి బాకీ

 

నా చిన్నప్పుడు మా ఊరిలో సుబ్రహ్మణ్య షష్టి తీర్థం మంచి కోలాహలంగా ఉండేది. తీర్థానికి మూడురోజుల ముందునుండే గుడి దగ్గర హడావిడి మొదలయ్యేది. పందిళ్లు వేయడం, తోరణాలు కట్టడం, కాగితం పువ్వులు, బుట్టల అలంకరణ మంచి ఉత్సాహంగా మా చేతనైన సాయం మేమూ జేస్తూ పందిళ్లలో సందడిగా తిరిగేవాళ్ళం. గుడి దేవుడి దర్శనం ఆ విషయాలు వేరే ఇంకోసారి మాట్లాడుకుందాం.

 

తీర్ధానికి వెళ్ళే మా అందరికీ, తలో పావలా ఇచ్చేవారు. ఐదుపైసలతో పిల్లనగ్రోవి, మరో ఐదు పైసలతో రంగు కాగితాల కళ్ళజోడు, ఇంకో ఐదు పైసలతో కిర్రుకిర్రుమనే శబ్దం చేసే గిలక్కాయ, సన్నటి ఇనుప పుల్లమీద కిందకి పైకి ఎక్కి కోతిబొమ్మ కొనుక్కోగా ఐదుపైసలకి ఖర్జూరం కొనుక్కుతినేవాళ్ళం. ఇంకా ఈల, బొంగరం, బుడగలు వగైరా వగైరా బోలేడు ఆహ్లాదకరమైన వస్తువులు ఉండేవి, డబ్బులు సరిపోయేవికాదు. నువ్వదికొనుక్కో, నేనిది కొంటాను అని స్నేహితులం, అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం వస్తువులు మార్చుకుని ఆడుకునేవాళ్ళం.

 

తీర్థంలో అమ్మే గూడు బండి కొనుక్కోవాలని ఎంతో కోరికగా ఉండేది, మూడు చక్రాలతో చిన్న చక్కబండి, పైన గూడులా రేకుతో చూడటానికి భలేవుండేది. తాడుకట్టి లాగుతుంటే మేమే ఆ బండి ఎక్కినంత ఆనందపడేవాళ్ళం.  ఆ బండి ఖరీదు రెండురూపాయలు. మాకిచ్చేది పావలా మాత్రమే. రెండు రూపాయలు ఇవ్వండి బండి కొనుక్కుంటాను అని అడగడం మాకు తెలీదు. ఇంట్లో పిల్లలందరికీ పావలా మించి ఇచ్చేవారు కాదు. ఆ పావలా కోసం, ఆ తీర్థం కోసం రెండు నెలల ముందు నుండీ ఎదురుచూసేవాళ్ళం. ఎంతో విలువైన పావలాతో కొనుక్కున్న వస్తువులు రెండుమూడు రోజులు మించి వచ్చేవికాదు. కళ్ళజోడు రంగుకాగితం చిరిగిపోవడమో, పిల్లనగ్రోవి ఇతర వస్తువు విరిగిపోవడం, కనబడక పోవడం జరిగేవి. గూడు బండి కొనుక్కోవాలనే కోరిక చాలా బలంగా ఇంకిపోయింది.

స్కూల్ కి వెళ్తూ, వస్తూ ఆ గూడుబళ్ళు అమ్మేవాడి దుకాణం ముందు నించుని రెండు రూపాయలు దొరికితే బాగుణ్ణు, ఎవరైనా ఆ బండి కొనిస్తే బాగుణ్ణు. నిజంగా సుబ్రమణ్యేశ్వర స్వామి కనబడితే ఆ గూడు బండి ఒక్కటీ వరంగా ఇవ్వుచాలు, ఇంకేం అక్కర్లేదు అనే అమాయకత్వంలో బ్రతికేసాం.

 

రెండు మోటారు సైకిళ్ళు, మరో రెండు కొత్తకార్లు మార్చి మార్చి కొన్నా చిన్నప్పటి ఆ గూడుబండి ఆనందం కలగలేదు. ఇంకా చిన్నప్పుడు కొనుక్కుందాం అనుకున్న బుడగలు, మౌత్ ఆర్గాన్స్ ఒకటేమిటి అనేకరకాల ఆట వస్తువులు మా చిన్నప్పటి కలల్లో  రంగులరాట్నంలా తిరుగుతూ ఉండేవి. తీర్థం ఐపోయేది, తీర్థానికి పెట్టిన అంగళ్ళు కూడా వెళ్ళిపోయేవి, నేను కొనుక్కోలేకపోయిన గూడుబండి, రెండెడ్లబండెక్కి దుకాణం వాడు పట్టుకెళ్లిపోతుంటే నానుండి నాకు సంబందించింది ఎవరో పట్టుకుపోతున్నంత బాధగా, విషాధంగా, ఆ బండి వెనక ఊరి పొలిమేర వరకూ నడిచి వెనక్కి వస్తుండేవాడిని. పెరిగి పేద్దవాణ్ణయ్యి, ఉద్యోగస్థుడిని అయినా ఆకోరిక నాలో ఇంకి అలానే ఉండిపోయింది. ఇప్పుడు అవి కొనుక్కోగలిగిన శక్తి ఉన్నా ఆడుకునే వయసు దాటిపోయింది.

 

నాకిష్టమైన పని పిల్లలతో గడపడం, నాలుగు మంచి విషయాలు చెప్పడం, వాళ్ళకి అవసరమైన నోటుపుస్తకాలు, పెన్నులు కొనిపెట్టడం, ఇలా కాకినాడ చుట్టుపక్కల అనేక ఊర్లలో హైస్కూళ్ళు కి వెళ్ళి మోటివేషన్ క్లాసెస్ చెబుతుంటాను, ఆ సమయానికి ఆ స్కూల్ బయట బుడగలు, పిల్లంగ్రోవిలు అమ్మే వ్యక్తి ఎవరైనా ఉంటే అక్కడి పిల్లలకి అవి కొనిచ్చి వాళ్ళు ఆనందంగా గెంతులేస్తూ ఆడుకుంటుంటే నేనూ ఆనంద డోలికల్లో మా ఇంటికి చేరుకుంటాను. ఇలా ఓ స్కూల్ దగ్గర బాబ్జి అనే కుర్రాడు పరిచయం అయ్యాడు. పదేళ్ళుంటాయి వాడికి. బుడగలు, ఇతర చిన్నపిల్లల వస్తువులు సైకిల్ కి కట్టుకుని వచ్చి అమ్ముతుంటాడు. నాకు నాలుగైదు స్కూళ్ల దగ్గర తారసపడ్డాడు. కనబడ్డ ప్రతిచోటా పిల్లలకి వాడి దగ్గరున్న వస్తువులన్నీ కొనేసి ఇచ్చేసాను. కరోనాకు ముందర  ఓ స్కూల్ కి వెళ్ళాను.

 

నేను పిల్లలతో మాట్లాడి బయటకి వచ్చే టైమ్ కి బాబ్జి గేట్ దగ్గర ఉన్నాడు. స్కూల్ కాంపౌండ్ లో ఉన్న, నా కారుని చూసి “ఉండండి, ఉండండి ఈ లోపలున్న సారు మీ అందరికీ బుడగలు కొనిపెడతాడు, ఉండండి.” అని పిల్లలని చుట్టూ ఆపాడు. నేను స్కూల్ ఆవరణ బయటకి వచ్చేసరికి ఓ యాభైమంది పిల్లలు బాబ్జి చుట్టూ మూగి నాకది కావాలి, ఇది కావాలి అని అడుగుతున్నారు. తాను తెచ్చిన సరుకంతా ఆరోజు అక్కడే అమ్ముడైపోతుందన్న ఆనందంతో బాబ్జి “నమస్తే సర్!” అంటూ అలకరించాడు.

 

చుట్టూఉన్న పిల్లలు నాకు అదివ్వు, ఇదివ్వు అంటూ అతడిమీద ఎగబడుతున్నారు. నాకు ఎటూ చెప్పలేని పరిస్థితి, అంతకు ముందరే స్కూల్ లోపల హెచ్.ఎం గారు ఓ విద్యార్థికి ఉన్న ఆరోగ్యసమస్య చెబితే పర్సులో ఉన్న రెండువేలు ఆ అబ్బాయికి ఇచ్చి బయటకి వచ్చాను. పర్సు ఖాళీ. అదే విషయం బాబ్జితో చెబితే  “పర్వాలేదు సర్, మీరు డబ్బులు తరువాత ఇవ్వండి. ముందు ఈ పిల్లలకి ఇచ్చేస్తాను.” అంటూ వాడిదగ్గరున్న వస్తువులన్నీ పిల్లలకు పంచేసాడు. అలా బాబ్జికి వెయ్యి రూపాయలు బాకీ పడిపోయాను.

 

కరోనా కమ్ముకు వచ్చింది, స్కూల్స్ లేవు, పాఠాలు లేవు, ఉపన్యాసాలు లేవు, గత మూడు సంవత్సరాలనుండి, బాబ్జి కనబడలేదు. ‘అయ్యో! వాడి బాకీ తీర్చుకోలేకపోయానే’ అనే బాధ నాలో ఉండిపోయింది. ఈరోజు ఇన్నాళ్లకు ఇంకో స్కూల్ దగ్గర బాబ్జి కనిపించాడు. తప్పిపోయిన పిల్లాడు కనబడినంత ఆనందం అయ్యింది నాకు. “బాబ్జి! బాగున్నావా.” అంటూ పలకరించాను. “కరోనాలో నాన్న పోయాడు సర్!” అన్నాడు. కుటుంబం ఆంతా ఇదే వ్యాపారం, ఊరూరా తిరిగి అమ్ముకుంటారు. మళ్ళీ బాబ్జి చుట్టూ పిల్లలు. బాబ్జి బాకీ తీర్చుకోగలిగాను, రంగు రంగుల హరివిల్లులు నాకళ్లముందు నర్తిస్తూ ఇంటికి వెళ్తున్నాయ్.

 

*****************************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

మీకు amazon లో కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page