13_001 బాలకదంబం – సమయస్ఫూర్తి

 

అనగనగా ఒక అడవి. అందులో ఊడలతో, కొమ్మలతో నాలుగు దిక్కులా విస్తరించిన పెద్ద మర్రి చెట్టు.

మర్రి చెట్టు పైన ఒక కొండముచ్చు, చెట్టు క్రింద కొంచం దూరంలో ఒక బొరియలో కుందేలు నివసిస్తుండేవి.

కొండ ముచ్చు నల్లనైన ఆకారం చూస్తే కుందేలుకి హడలు. అందుకే అది చెట్టు మీదనుంచి క్రిందకి వచ్చినప్పుడల్లా బొరియనుంచి బయటకి వచ్చేది కాదు.  

కుందేలుకి తనంటే ఎందుకు భయమో తెలిసేది కాదు కొండముచ్చుకి. చాలాసార్లు దానితో స్నేహం చేద్దామని ప్రయత్నించింది. కానీ తనని చూడగానే తుర్రుమని బొరియలో దూరే కుందేలుతో ఎలా మాట కలపాలో తెలియక బాధపడేది.  

ఒకనాడు ఒక వేటగాడు అటుగా పోతూ చెట్టు క్రింద కూర్చుని ఏదో తింటున్న అందమైన తెల్ల కుందేలుని చూసి ‘అబ్బ ఇవాళ కదా నా అదృష్టం పండింది. ఎన్నాళ్ళోనుంచో కుందేలు మాంసం తినాలని అనిపిస్తోంది. ఇవాళ ఈ కుందేలుని పట్టుకుని ఆ కోరిక తీర్చుకుంటాను’ అనుకుని అటుగా కదిలాడు.

అలికిడి విని గబుక్కున బొరియలోకి దూరిపోయింది కుందేలు.

‘అయ్యో పట్టుకునేలోగానే పారిపోయిందే! ఇప్పుడేలా’ అనుకుని వెనుదిరిగాడు.

మర్నాడు ఉదయాన్నే వచ్చి కుందేలు నివాసం చుట్టూ నేల రంగులో ఉన్న వల పన్ని దూరంగా చెట్టు చాటున దాక్కున్నాడు.

ఎప్పటిలాగే కొండముచ్చు ఆహారం కోసం వెళ్ళగానే ‘అమ్మయ్య’ అనుకుని బయటకి వచ్చిన కుందేలు వేటగాడి వలలో చిక్కుకుంది. 

దూరంనుంచి అది గమనించిన వేటగాడు సంతోషంతో ఎగురుతూ కుందేలు వైపు రాబోతుంటే, ఎక్కడినుంచి వచ్చిందోగానీ కొండముచ్చు వాడి  పైకి దూకి గోళ్ళతో రక్కడం మొదలు పెట్టింది. 

ఏమాత్రం ఊహించని ఆ సంఘటనతో వేటగాడు భయంతో పరుగులు పెట్టాడు. వాడ్ని దూరంవరకూ తరిమి తిరిగి మర్రి చెట్టు వద్దకు వచ్చిన కొండముచ్చుకి వలలోంచి కుందేలుని ఎలా విడిపించాలో తెలియలేదు.

ఇంతలో అటుగా వెళుతున్న ఎలుక ఒకటి కనిపించింది.

“మిత్రమా నన్ను చూస్తే నీలాగే ఎలుక కూడా భయపడి పారిపోవచ్చు కనుక నువ్వే పిలిచి వలనుంచి విడిపించమని అడుగు” అని కుందేలుకి సలహా ఇచ్చి చెట్టు వెనుకకు వెళ్ళి దాక్కుంది.

అప్పటికే కొండ ముచ్చు చేసిన సహాయం చూసి దాన్ని తప్పుగా అనుకున్నానని పశ్చాత్తపపడుతున్న కుందేలుకి ఈ మాటలతో రూపం భయంకరంగా ఉన్నా అది చాలా మంచి మనసుగలదని అర్థమైంది.

ఎలుకను పిలిచి విషయమంతా చెప్పి వలనుంచి విడిపించమని  ప్రార్థించింది.

వలనుంచి బయటపడి “మిత్రమా ఇక నువ్వు రావచ్చు” అని కొండముచ్చుని పిలిచింది.

కొండముచ్చుని చూసి భయపడుతున్న ఎలుకకు “మిత్రమా భయపడకు. నీలాగే నేనూ కొండముచ్చుని   చూసి మొదట్లో చాలా భయపడ్డాను. కానీ అతడు ఎంతో మంచివాడు స్నేహశీలి. ఇవాళ మీరిద్దరూ చేసిన సాయంవల్లే నేను ప్రాణాపాయంనుంచి బయటపడ్డాను. మీ ఇద్దరికీ కృతజ్ఞతలు”

కుందేలు మాటలకి కొండముచ్చు ఎంతో సంతోషించింది. ఎలుక ఇద్దరితో స్నేహం కలిపింది.

“అది సరేగానీ మిత్రమా నువ్వు ఆహారం కోసం వెళ్ళావు కదా అప్పుడే ఎలా వెనక్కి వచ్చావు? వేటగాడు నన్ను పట్టుకోవడానికి వచ్చాడని ఎలా తెలుసుకున్నావు?” సందేహంగా అడిగింది కుందేలు.

“అవును వెళ్ళాను కానీ ఎందుకో ఏమీ తినాలనిపించక వెంటనే వచ్చేసాను. తీరా ఇక్కడికి వచ్చి చూద్దును కదా వలలో చిక్కుకుని నువ్వూ, నీవైపుగా వస్తున్న వేటగాడూ కనిపించేసరికి విషయం అర్థమై వాడి పన్నాగం పారనీయకుండా అడ్డుకున్నాను”

“నీ సమస్ఫూర్తికి నా జోహార్లు” మెచ్చుకుంది కుందేలు.

“సమయానికి సహాయపడే వాడే నిజమైన స్నేహితుడు” ఎలుక కూడా కొండముచ్చుని మెచ్చుకుంది. ఆరోజు నుంచి కుందేలూ, కొండముచ్చూ, ఎలుకా కలకాలం మంచి స్నేహితులుగా కలిసి బ్రతికాయి.

                                                ****

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

మీకు amazon లో కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page