13_001 చిన్న చిన్న ఆనందాలు

 

“ఆంటీ ! నా బాల్ మీ గార్డెన్ లో పడింది….అది ఇవ్వరూ…”
ఆరేడేళ్ళ కుర్రాడు  గేటు అవతలినుంచే అడిగాడు.
అటూ… ఇటూ… చూసా కింద….”ఏదీ ?”
“చెట్టు కొమ్మల్లో ఇరుక్కుంది.”
కర్ర ఏదైనా దొరుకు తుందేమో… అని వెతుకుతున్నానని వాడు గ్రహించాడు.
“ఆంటీ ! చెట్టుని పట్టుకు ఊపితే కింద పడుతుంది.” పెద్ద అనుభవం వున్న వాడిలా సలహా ఇచ్చాడు.
పిట్ట కొంచెం కూత ఘనంలా వుందే… అనుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్ళాను ఐనా… మర్యాదగానే అడిగాడులే పాపం…కుర్రాడు చిన్న వాడైనా…!!
మా ఇంటి పక్కింట్లో ఈమధ్యనే ఆంధ్రా నుంచి వచ్చి, నెల రోజుల క్రితం క్రొత్తగా అద్దెకి వచ్చి చేరిన పడుచు జంట ప్రధమ సంతానంట! అక్కడికి ఈ మధ్య కాలంలో చాలామందే.. తెలుగు వాళ్ళు తయారయ్యారు… ఈ కాలనీలో!

ఆరు నెలలుగా అమ్మాయి తో అమెరికా లో వుండి రావడంతో వీళ్ళతో ఇంకా పరిచయం పెరగ లేదు. తొమ్మిది ఏళ్ల బట్టి ఇదే తంతు. గ్రీన్ కార్డ్ తెప్పించడం కాదు కానీ… జీవితానికి స్థిరత్వం లేకుండా పోయింది. అటూ ఇటూ… కాకుండా.  అక్కడ తెలిసిన వాళ్ళని కలవాలంటే… సెలవు రోజే కావాలి. వెళ్లాలంటే పెద్ద ప్రయత్నం. ఎవరితో మాట్లాడాలన్నా…అంతా బిజీ. టైమే వుండదు. సోషల్ లైఫ్…  అన్నది అస్సలు లేకుండా పోయింది. అదే… ఇక్కడ  ఐతేనా… బోలెడంత కాలక్షేపం. చుట్టుపక్కల అంతా తెలిసిన వాళ్ళే. పరిచయాలు పెంచుకోవడం కూడా చాలా సులువు. రోడ్డు మీద వెళ్తున్న ఎవరినైనా పలకరిస్తే చాలు మాటలతో మనసును రంజింప జేస్తారు మరి. కూరలు పళ్ళు అమ్ముకునే వాళ్ళతో లోకాభిరామాయణం తో గప్పా గోష్టి చెయ్యవచ్చు. పని పిల్లతో దాని జీవిత సమస్యలు చర్చించ వచ్చు. కావాలంటే ఉచితంగా సలహాలు పారెయ్యచ్చు. వీధి గుమ్మం ముందు నించుని రోడ్డు మీద ఆడుకునే పిల్లల్ని గమనిస్తే చాలు మనసు నిండడానికి.

మా ఎదురింటి వాళ్ళ పదమూడేళ్ళ అబ్బాయి,  బాబీ సంగతి… అప్పుడప్పుడు వాడు  దొంగలా… ఏమాత్రం చప్పుడు కాకుండా మా గేటు గొళ్ళెం తీసి… ఎవర్నీ డిస్టర్బ్ చెయ్యకుండా…  సిక్సర్ రేంజ్ లో పడిన…తన క్రికెట్ బాల్ని….మా గార్డెన్ లో జొరబడి అడపా దడపా  తీసుకోవడం అనుభవమైన విషయమే. ఆ సంగతి నా కళ్ళ పడకనూ పోలేదు. వాడు గేటు ముయ్యకుండానే వదిలేసిన రోజులూ… లేకపోలేదు. వీధిలో ఊర కుక్క ఇంట్లో జొరబడి ఎండ పెట్టుకున్న  ఒడియాల ప్లేటు తిరగ దోసిన  సంఘటనా  లేకపోలేదు. చెప్పి చూసా… కానీ..  నాకు తెలీదాంటీ….  అంటూ …బుకాయిస్తాడు!  పిల్లలు ఆడుకోవలసిన సమయంలో ఆడుకోక …మానేస్తారా ? బాలు ఎక్కడ పడినా …తెచ్చుకోక… మానేస్తారా? అది కాదు మాట…కనీసం…గేటు  మూసి వెళ్ళాలనే ఆలోచనే వుండచ్చుగా.. . అసలు పట్టించుకోడు…చెప్పినా… వినిపించుకోడు. అందర్నీ అవలీలగా బుల్లీ చెయ్యగల సమర్ధుడు!  వీసమెత్తు డిసిప్లిన్ కనబడదు వాడిలో!

ముంబయ్ లాంటి సిటీలో… సాయంత్రాలు….సెలవు రోజుల్లో… పాపం పిల్లలు ఆడుకోవడానికి స్థలమే… ఏదీ… ఇళ్ళ మధ్యనున్న రోడ్డే గా ఆట స్థలం! మనం ఆమాత్రం సద్దుకోవాలని నాకూ తెలుసు. ఇవన్నీ సహజంగా జరిగే విషయాలే…చూసీ…చూడనట్లు  ఊరుకోక తప్పదు. కానీ… ఇలాంటి పిల్లల్తో వేగడం మహా కష్టం ! ఐనా వాడి అల్లరి తనం కూడా చూడ ముచ్చటగానే వుండేది. అప్పుడప్పుడు వాడితో వాదన వేసుకుని టైమ్ పాస్ చెయ్యడం కూడా… మజాగా వుండేది.

ఆ చిన్న కుర్రాడు అన్నట్టుగానే చెట్టుని పట్టుకు ఊపేను. ఫుట్బాల్ సైజ్ ఎర్ర  బాలు క్రింద పడి దొర్లుకుంటూ…గేటు దాకా వెళ్ళింది.
బాలు తో పాటు తెల్లని నందివర్ధనం పూలూ… రాలాయి జలజలా…
అది చూసి… వాడు నామొహం లోకి చూసి… అర విచ్చిన సన్నజాజి లాంటి …చిన్న చిరునవ్వు నవ్వాడు.
చిన్న చిన్న ఆనందాలకి… వాడూ నాలాగానే స్పందిస్తాడని ఆ క్షణం లో అనిపించింది!
మరి….ఇలాంటి ఆనందాలు ఎలా దొరుకుతాయి? ఎక్కడికీ వెళ్లఖ్ఖరలేకుండా… చిన్న పిల్లల్నీ… వాళ్ళ ఆటల్నీ… చూడగలగడం…. మన నసీబ్ లో లేకపోతే!!! అందుకే…. సాయంకాలం ఇంటి ముందున్న గార్డెన్ లో తిరుగుతూ ఆడుకుంటున్న పిల్లల్ని గమనించడం నాకు  దినచర్య అయి కూర్చుంది.

బాల్ పెద్దది కావడం వల్ల గేటు క్రింద ఉన్న ఖాళీ స్థలం లోంచి దొర్లితే తీసుకోగలిగిన ప్రసక్తి లేదు. బాల్ మూసి ఉన్న గేటు పైనుంచి విసురుదామని అటు వెళ్ళబోయా…. ” ఆంటీ…మీరుండండి… బాల్ విసరకండి. నేనే తీసుకుంటాను ” అన్నాడు.
సరే…వాడి మాటకి విలువ నిచ్చి … ఏం చేస్తాడో గమనిద్దాం….. అని…. చూస్తూ నించున్నా.
గేటు అట్టడుగు ఊచ కిందికి ఒక చెయ్యి దూర్చి, ఆ చేత్తో బాల్ ని నేలమీంచి పైకి లేపి… దాని పైనున్న గేటు ఊచ లోకి ఇంకో చెయ్యి దూర్చి… దాన్నందుకుంటూ… మళ్ళీ మొదటి చెయ్యి ఆ పై ఊచ లోనికి పోనిచ్చి… దాంతో ఆ బాల్ అందుకుని… అలా…గేటు చివరి అంచు దాకా … నెమ్మదిగా…. శ్రద్ధగా…పైకి  లేపడానికి ప్రయత్నం సాగించాడు.
” నీ పేరేంటి ? ”  అన్నాను.
“రఘు” కదలకుండా … తల కూడా ఎత్తకుండా…తన బాల్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ… జవాబిచ్చాడు.
సన్నగా… చిన్నగా… వున్నాడు ఆ కుర్రాడు. గేటేమో చాలా ఎత్తుగా వుంది.
” మరి గేటు చివరి దాకా… నీ చెయ్యి లేస్తుందా… నువ్వేమో అంత చింటూ.. వి? ” సందేహం వెలిబుచ్చా.
ఇంతలో…. ఫాట్… మని వాడి చేతిలో ఉన్న బాల్ మీద ఒక్క దెబ్బ పడి పైకి ఎగిరి అది బాబీ గాడి చేతిలోకి వెళ్ళింది!
తన ప్రయత్నం విఫలం కావడంతో రఘు ముఖం చిన్నబోయింది. ఐనా….తేరుకొని… ” బి. వై. ఒ. బి.” అని అరిచాడు.
” పాగల్ ! ఏం చెప్తున్నావు రా ? ” అన్నాడు వాడు.
” bring your own ball. ఆమాత్రం తెలీదా ? ” అని జవాబిచ్చాడు.
” టి. వై. ఒ. బి. .” అంటూ… బాబీ బంతిని గట్టిగా రఘు వైపు విసిరాడు.
బంతి వాడి బుర్రకి తగిలింది. వాడి ధాటికి…. అసలే అర్భకుడేమో నేలమీద పడ్డాడు. నుదురు ఎర్రబడి బొప్పి కట్టింది.
అయ్యో !! అంటూ…. నేను గేటు గొళ్ళెం తీసి, వెళ్ళి వాణ్ణి లేవనెత్తాను. కిక్కురు మనలేదు కానీ… కళ్ళనిండా నీళ్ళు!
” అదేంటి బాబీ! ఆ కుర్రాడు కొత్తగా ఇక్కడికి  వచ్చాడు కదా…  ఇంకా కొత్త ప్లేస్ లో అడ్జస్ట్  కూడా అవలేదు. కాస్త సరదాగా సహాయం చెయ్యొచ్చు కదా! అసలు నీకంటే చిన్నవాడి తో చక్కగా ఆడుకోడం మానేసి… అలా ఏడిపించడం తప్పు కాదూ…అంత మొరటు తనం…  ఏంటి నీకు? ” అన్నాను వాడితో. వెకిలినవ్వు నవ్వుతూ… పరుగెడుతూ… వెళ్ళిపోయాడు వాడు అక్కడినుంచి.
రక రకాల మనస్తత్వాలు !! పరిస్థితులా…. పెంపకాలా…. ఏది ఇలాంటి ప్రవర్తనకి మూలకారణం ?

హైస్కూల్ లో టీచర్ గా పనిచేసి రిటైర్ అయిన నాకు పిల్లల మనస్తత్వాలతో అంతో ఇంతో పరిచయం వుంది. కొందరు దూకుడుకు పిల్లలు అర్భకులైన తోటి వాళ్ళని, తమకంటే చిన్న క్లాసుల పిల్లల్ని ఆట పట్టించడం, బుల్లీ చెయ్యడం,  అవహేళన చెయ్యడం, వాళ్ళు ఏడుస్తూ ఇంట్లో తల్లిదండ్రులకో… స్కూల్లో టీచర్లకో… మొర పెట్టుకోవడం అన్నీ అందరికీ తెలిసిన విషయమే.
బాబీ అంటే అక్కడున్న పిల్లలందరికీ భయమే !! దూకుడుకు స్వభావం గలవాడు, కొడతాడన్న భయంతో అందరూ దూరంగా వుంటారు వాడికి. వాడివయసుకు మించిన శరీర పుష్టి వుండడం వల్ల పదమూడేళ్ళే ఐనా… పదహారేళ్ళ వాడిలా కనిపిస్తాడు.

మర్నాడు సాయంత్రం ఒక్కడూ తన బాల్ నేలకి కొడుతూ, హండ్రెడ్, నైన్టీ నైన్ అని బాక్వార్డ్ కౌంట్ చేస్తూ రఘు ఒక్కడే ఆడుకుంటున్నాడు. కౌంట్ పూర్తయ్యే వరకూ ఓపిగ్గా ఆగి, తర్వాత వాణ్ణి పిలిచి బాతాఖానీ మొదలు పెట్టా.

ఈలోగా రెండు చక్రాల హాత్ గాడీ…. అరటి పళ్ళు అమ్ముకునే చెక్క బండి మీద మూడేళ్ళ తమ్ముణ్ని కూర్చోబెట్టి, పరుగెడుతూ తోసుకుంటూ పోతున్నాడు ఓ తొమ్మిది ఏళ్ళ అన్న. కేరింతలు కొట్టుకుంటూ… సాగింది ఆట. తన్మయత్వం తో వాళ్ళనే చూస్తూ నించున్నాం ఇద్దరం. గతుకుల రోడ్డు మీద వేగానికి తట్టుకోలేక బండి కాస్తా…. గతి తప్పింది మా యింటి ప్రహరీ గోడ ముందే… !! గబుక్కున రఘు బండి మీద చెయ్యి వేసి ఆపడానికి ప్రయత్నించాడు. అమ్మో…!!! బండి వాడి మీద తిరగ బడితే…? అసలే చిన్న కుర్రాడు!! గబగబా ముందుకి వెళ్ళి బండిని పట్టుకుని ఆపాను….ఎదుటి వాళ్ళకి సహాయం చెయ్యాలని ఆలోచించే వాడి మనస్తత్వానికి సంతోషిస్తూ. బండి ఆగింది. ” ఆట చాలు. ఇంక ఇంటికి వెళ్ళండి. అదృష్టం బావుండి ఏమీ అవలేదు. ఏమైనా అయితే… మీకు కష్టం… రేపు మీ నాన్నకి అరటి పళ్ళు అమ్ముకోడానికి బండి కూడా వుండదు.” అని కాస్త మందలించి పంపించేసా.
 
శ్రావణమాసం… వర్షాలు… సాయంకాలం…. ఆఫీసులనించి యువత ఇంటికి తిరిగి వెళ్ళే వేళ. ఇద్దరు అమ్మాయిలు…. పూర్తిగా తడిసిపోయారు. గేటు దగ్గర చెట్టు కింద నించుని వున్నారు.” గేటు తీసుకుని లోపలికి రండి చజ్జా క్రిందికి. వర్షం ఉధృతం తగ్గాక వెళ్లి పోవచ్చు” అన్నాను. గబగబా లోపలికి వచ్చి షేడ్ కింద నించున్నారు. కాసేపు వాళ్ళతో సంభాషణ. వర్షం నెమ్మదించగానే వెళ్లి పోయారు.

ఇటువంటి సంఘటనలూ… పరిస్థితులూ… నలుగురి తో పిచ్చాపాటీ…. మన చేతుల్తో ఏర్పరచుకున్న పరిసరాలూ…. నా అనే భావన…ఈ చిన్న చిన్న ఆనందాలూ… ఇవన్నీ ఇక్కడే… దొరుకుతాయి మరి!!!!!

******** 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

మీకు amazon లో కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page