13_001 కదంబానుబంధం

 

కదంబంలో ఎంత అందం, చందం…

పూలదండగా అదో  పెద్ద ప్రబంధం

కథల కలువలు, లలిత కవితల కనకాంబరాలు

బహు మధురాక్షరాల మందారాలు

ముద్దుపలుకుబడుల ముద్దబంతులు

హృద్య గద్య పద్యాల గులాబీ మాలికలు

నవత, సమతల వికసిత నందివర్ధనాలు వెలుగు          

తెలుగు సొగసుల సంపెంగలు అన్నీ కలగలిసి     

పరీమళ గుబాళింపులు సారస్వత సమాజమూ కదంబమే            

ఏకత, సమరసత అందులో భాగమే!

భావాల, అనుభవాల, సదానుభూతుల

పరంపరల వేదిక నవ్య భవ్య భారతమే!

దివ్య భారతీయం అనగానే, వినగానే

అంతా సత్య ధర్మ శాంతి విరాజితమే…

ఇదిగో ఈ ఆగస్టు పదిహేను ఉత్సవాన

పుష్కర సాక్ష్యంగా వందనాల విరివాన!    

ఎన్ని వత్సరాలు వచ్చి వెళ్లినా 

కదంబానిది నిత్య నిరంతర తాజాదనం!       

వాడుకగా వేడుకగా ఇక్కడ అక్షరార్చన

దృశ్య, శ్రవ్య రూపాల్లో సమారాధన 

ఇంతటి శుభకాంతి ప్రభల తరుణాన            

మమతామయ భారతీ! నీకిదే హారతి!   

 

****************************  

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

 

మీకు amazon లో కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page