పుణ్యక్షేత్ర దర్శనం
తెలంగాణా రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలానికి చెందిన గ్రామము కాళేశ్వరం.
ఈ గ్రామంలో సుప్రసిద్ధమైన “కాళేశ్వర ముక్తేశ్వర” ఆలయం ఉంది. త్రిలింగమనే మూడు సుప్రసిద్ధమైన శైవక్షేత్రాల్లో కాళేశ్వర క్షేత్రం కూడా ఒకటి. త్రిలింగ దేశంలోని త్రిలింగాల నడుమన ఉండే ప్రాంతం ఇది.
ఈ దేవాలయంలో ఒకే పానవట్టంపై శివుడు, యముడు వెలిశారు. సుప్రసిద్ధ శైవక్షేత్రాలలో మహాపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం కాళేశ్వరం. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతమైన గోదావరి నది ఒడ్డున నెలకొని ఉంది. గోదావరి తీరాన ఒకవైపు కాళేశ్వరం, మరో వైపు ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలానికి 16 కి.మీ దూరాన, మహారాష్ట్ర సరిహద్దున “సిరొంచ” తాలూకాకు 4 కి.మీ దూరాన ఈ కాళేశ్వరం ఉంది.
అతి ప్రాచీనచరిత్ర గల కాళేశ్వరక్షేత్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలోని శైవక్షేత్రాలలో శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి ఆలయం, ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయం, కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయాలు ప్రసిద్ధిగాంచినవి. కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీనది ప్రవహించడం వలన ఈ క్షేత్రం త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది.
భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవట్టం మీద ఒకే లింగం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం విశేషం. ఒకటి కాళేశ్వరలింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ముక్తీశ్వరలింగానికి రెండు నాశికారంధ్రాలున్నాయి. ఆ రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు. త్రివేణిసంగమతీరంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. ఒకప్పుడు గోవిందరావు అనే కలెక్టరు ఒక ప్రయోగం చేశారు. ఈ నాశికారంధ్రాలలో నీరుపోస్తే త్రివేణీసంగమతీరంలో కలిసిందీ, లేనిదీ కనిపెట్టడం కష్టమని వెయ్యి బిందెల పాలు పోశారట. పాలు తెల్లగా ఉండటంతో త్రివేణిసంగమతీరాన చూడగా పాలు కనబడినట్లు గ్రామస్థులు చెబుతుంటారు. ఈ క్షేత్రం కాశీక్షేత్రం కంటే గొప్పదని ‘కాళేశ్వరఖండం’ ద్వారా తెలుస్తున్నది. ఈ క్షేత్రం గురించి స్కాందపురాణం, గౌతమీపురాణంలో కూడా పేర్కొన్నారు. ఈ దేవాలయంలోని కాళేశ్వరునికి ముందు పూజచేసి, అనంతరం ముక్తీశ్వరుని పూజిస్తే, స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.
కాళేశ్వరక్షేత్రం శిల్పకళానిలయం. ఇక్కడ ఇప్పటి వరకు బయటపడ్డ అనేకశిల్పాల వల్ల గతవైభవం తెలుస్తుంది. ఇక్కడ హిందూ- ముస్లింలు సోదరభావంతో జీవించినట్లు కాకతీయుల శిలాఫలకాల ద్వారా తెలుస్తుంది. మన దేశంలో ప్రముఖ సరస్వతీ ఆలయాలు మూడు ఉన్నాయి. కాళేశ్వరంలో మహాసరస్వతి, అదిలాబాద్ జిల్లా బాసరలో జ్ఞానసరస్వతీ, కాశ్మీరులో బాలసరస్వతీ ఆలయాలున్నాయి. అదే విధంగా సూర్యదేవాలయాలు కూడా మూడు ఉన్నాయి. కాళేశ్వరంలో ఒకటి కాగా ఒరిస్సాలోని కోణార్క్, శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యదేవాలయాలు ప్రముఖమైనవి. కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం, నరసింహతీర్థం, హనమత్ తీర్థం, జ్ఞానతీర్థం, వాయుతీర్థం, సంగమతీర్థం, ఇత్యాది తీర్థాలున్నాయి.
కాళేశ్వరంలోని ప్రధానాలయానికి పశ్చిమం వైపు యమగుండం నుండి సుమారు ఒక కి.మీ దూరంలో ప్రకృతి సిద్ధమైన అడవిలో “ఆదిముక్తీశ్వరాలయం” ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం.
కాళేశ్వర ఆలయం సమీపానే మహారాష్ట్ర భూభాగం ఉంది. అందువల్ల ఇటు తెలంగాణ భక్తులతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ భక్తులు కూడా అత్యధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
పురావస్తుశాఖవారు నిర్వహించిన తవ్వకాల్లో ఈ ప్రాంతంలో బౌద్ధవిహారాల గోడలు, పునాదులు, మహాస్తూపాలు, కంచుతో చేసిన బుద్ధుడి విగ్రహాలు లభించాయి. ఆలయంలో మొదట లోనికి వేళ్లే చోట యమకోణం ఉంది, ఇందులో నుండి బయటకి వెళ్ళినట్లయితే యమ దోషం పోతుంది అని భక్తులు విశ్వసిస్తారు, ఇందులో నుండి వెళ్లుటకు దిక్సూచి ఉంటుంది దానిని అనుసరించి వెళ్లాలి.
కార్తీక మాసం నెలరోజులు, అన్ని పర్వదినాల్లో ఇక్కడ అత్యంత విశేషమైన పూజలు చేస్తారు. కాళేశ్వరంలోని ముక్తేశ్వరుడికి శివరాత్రి పర్వదినం నాడు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో, వైదిక క్రతువులు, విశేషపూజలు నిర్వహిస్తారు. శివరాత్రి రోజు సాయంత్రం ముక్తేశ్వర రూపంలో ఉన్న శివుడిని, శుభానందా దేవి రూపంలో ఉన్న పార్వతీదేవిని అత్యంత సుందరంగా అలంకారం చేసి ఎంతో ఘనంగా కళ్యాణోత్సవం జరిపిస్తారు.
చుట్టూ పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం,అడవి మార్గంలో ప్రయాణం, అందమైన గోదావరి నదీ తీరం పర్యాటకులకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. భక్తి శ్రద్ధలతో కాళేశ్వర ముక్తీశ్వరులను పూజించి దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుంది.
***********************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
మీకు amazon లో కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page