13_001 కంటికంటి నిలువు…

 

శేషాచార్యులవారి వ్రాతప్రతి ద్వారా వెలుగులోకి వచ్చిన అన్నమాచార్య కీర్తన

 

ఇది. మన దురదృష్టవశాన ఇందులో ఒక చరణము *లుప్తమైనది. దానిని పూరించే శక్తికూడ మనవంటి సామాన్యులకు లేదంటే అతిశయోక్తి కాదు. “నిలువు చక్కని మేనుదండలు”… నిలువుగా నున్న చక్కని పుష్టిగల శరీరం – అని భావించాను.

అంటుజూపులు అంటే, స్నేహపూరితమైన చూపులు. నిలువెత్తునా స్వామిని వర్ణిస్తున్న కీర్తన ఇది. లుష్తమైన చరణాన్ని పూరించే “అర్హత నాకు లేకపోయినా, నా ఆత్మతృప్తికి చేశాను… యెందుకంటే ఈ కీర్తనలో అమ్మవారి ప్రసక్తి లోపించిందనిపించింది.. నాకు దాసుని తప్పులు దండముతో సరి…కదా!.

———————————————————

కంటికంటి నిలువు చక్కని మేనుదండలూను

నంటుచూపులు జూచే నగుమోదేవుని

కంటికంటి నిలువు చక్కని మేనుదండలూను

నంటుచూపులు జూచే నగుమోదేవుని

 

కనకపుపాదములూ ..

కనకపుపాదములు గజ్జెలూ అందెలునూ

కనకపుపాదములు గజ్జెలూ అందెలునూ

ఘన పీతాంబరముపై కట్టుకట్టారి

మొనసి వడ్డాణపు మొగపుల మొలనులు,

మొనసి వడ్డాణపు మొగపుల మొలనులు

ఉనరనభికమల ఉదరబంధములూ || కంటి ||

 

గరిమవరద హస్తా కటిహస్తములొనూ

సరసనతిల శంకచక్రహస్తములూ

ఉరముపై కౌస్తుభము ఒప్పగుహారములూ

ఉరముపై కౌస్తుభము ఒప్పగుహారములు తరుణీ అలమేలుమంగ ధరణిభామయునూ || కంటి ||

 

కట్టిన కంఠసరులు ఘనభుజకీర్తులూ

కట్టిన కంఠసరులు ఘనభుజకీర్తులు

కట్టాని ముత్యాల సింగారనామము

నెట్టని శ్రీవెంకటేశా నీకు కర్ణపత్రములు

నెట్టని శ్రీవెంకటేశా నీకు కర్ణపత్రములు

అట్టే శిరసుమీద అమరే కిరీటము || కంటి ||

 

రచన : తాళ్ళపాక అన్నమాచార్య 

భావము : శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు.

 

ఓ ప్రజలారా! నేను నిలువుగా నున్న చక్కని పుష్టిగల శరీరంతో శోభిల్లుచున్న

స్వామిని కంటిని (చూచితిని). అంటుజూపులను (స్నేహపూరితమైన దృష్టిని)

ప్రసరించుచున్న ప్రభువును కంటిని. ఆ దేవుడు నవ్వుల మోము జూపి మనలను ధన్యులను చేయుచున్నాడు.

ఈ స్వామి కనకపు (బంగారు) పాదములకు గజ్జెలు, అందియలు (కాలికి మువ్వల వంటివి) ధరించియున్నాడు. ఘనమైన పసుపు పచ్చని పట్టువస్తమును ధరించి దానిపై నడుమునకు కట్టుకొను కటారి (ఖడ్గము) ధరించియున్నాడు.ఈయనకు “ఒడ్డాణము” (నడుమునకు ధరించు పటకా… నేటికాలంలో బెట్టు) “ఒనసినది” బిగించబడియున్నది. మొగపుల మొలనూలు (పైకి కనిపించు మొలత్రాడు) అదిగో. ఆయన నాభిలోనుండి పుట్టిన కమలము కూడ ఒనరియున్నది (ఒప్పుచున్నది). ఉదరబంధనము (పొట్టకు బిగించిన వస్త్రము ) అందముగా కనిపించుచున్నది. ఏమి ఈ దివ్యమంగళ విగ్రహము!!!

గరిమ మధ్యభాగంలో ఒకవైపు స్వామి వరద హస్తము ఒకవైపు నడుముపై అభయ హస్తము కనుపించుచున్నవి. సరసన్‌, ఎత్తిన శంఖచక్రములున్న హస్తములు కనుపించుచున్నవి. (ఎదురు రొమ్ముపై) హారములు, కౌస్తుభమణి మెఱయుచున్నవి. [తరుణులు అధిరోహించిన గుండెలమీద శోభిల్లు చున్న మాలలు (పుష్పమాలలు, తులసి మాలలు) నయనానందకరముగా నున్నవి. చూచినవారిదే భాగ్యము కదా!!

ఈ శ్రీవేంకటేశ్వరునికి కంఠమున ‘కంటసరులు (కంఠసరులు) కట్టి ఉన్నవి.

భుజములకు గొవ్ప భుజకీర్తులు బిగించియున్నవి. కట్టాణి ముత్యాలు

(ముత్యాలహారములు), సింగారించబడిన చక్కటి నామము (నుదుటి బొట్టు) యెంతో అందంగా మెరుస్తున్నాయి. ఓ ప్రభూ! నీకు కర్ణపత్రములు (చెవి దుద్దులు) నెట్టన (తప్పకుండా) ధరింపబడియున్నవి. అట్టె (అదేవిధముగా) నీ సిరసు (శిరస్సు) మీద కిరీటము అమరియున్నది. నిన్ను జూచి మా జన్మ తరించింది తండ్రీ!

****************************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

మీకు amazon లో కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page