చేతిలో పుస్తకం పట్టుకుని ఏదో ఆలోచిస్తున్న శిరీష , ఫోన్ మోతకు ఉలిక్కిపడింది. ఇలా వంటరిగా ఉన్నప్పుడు ఏ చిన్న శబ్దమైనా ఏదో తెలియని భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది శిరీష . తన ఇష్టం వచ్చినట్లు కొట్టుకుంటున్న గుండెను అదుపులోకి తెచ్చుకుని “ హలో “ అంది శిరీష . వెంటనే అవతలి వైపు నుంచి “ శిరీషా . . . బావున్నావా? నేను రాజ్యాన్ని మాట్లాడుతున్నాను. నిన్ను నిద్ర లేపలేదు కదా ? ఎంతకీ ఫోన్ తియ్యక పోతే ఇంట్లో లేరేమో అనుకుంటున్నా..” అంటూ గలగలా మాట్లాడుతోంది రాజ్యం.
“ అబ్బే శనివారం పూట పదింటికే ఏం పడుకోవడం, మావారు కాన్ఫరెన్స్ వుందని వేరే ఊరికి . . . పిల్లలు పార్టీలంటూ బైటికి వెళ్లారు. ఎలా ఉన్నావు.. ఎక్కడినించి మాట్లాడుతున్నావు?” అంటూ లేని ఉత్సాహం తెచ్చుకుంటూ రాజ్యాన్నిఫోన్ లో పలకరించింది శిరీష . “ పద్మజ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను . . . చూసావా శిరీషా ! ఏనాడు మన ఊరి పొలిమేరలు కూడా దాటని నేను ఏకంగా సముద్రాలే దాటాను ! నా అమెరికా ప్రయాణం ఖాయం అనుకోగానే అమ్మనడిగి నీ ఫోన్ నెంబరు తీసుకున్నా. ఇక్కడికి రాగానే మా అమ్మాయికి చెప్పేసాను మా శిరీషను చూడాలని! నీకు ఎప్పుడు వీలో కనుక్కోమంటోంది పద్మజ. దానికే ఇస్తాను ఫోను. ఆ వివరాలు అవీ పద్మజకే చెప్పు. . . . .” అంటూ శిరీష సమాధానం కోసం ఆగకుండా ఫోను కూతురికి ఇచ్చింది రాజ్యం.
శిరీష “ హలో “ అనగానే “ నమస్కారం ఆంటీ . . . . .బావున్నారా? మిమ్మల్ని చూడాలని అమ్మతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను ఆంటీ!” అంది పద్మజ.
శిరీష వెంటనే “ నాకూ నిన్ను చూడాలని ఉంది. అమ్మను తీసుకుని మీరిద్దరూ మా ఇంటికి తప్పకుండా రావాలి సరేనా?” అంది .
“ఆంటీ… అమ్మ మీ గురించి భలేగా చెప్తుంది! “ అంది పద్మజ.
ఆ అమ్మాయి మాటలకు నవ్వుకుంటూ “ ఏం చెప్పింది మీ అమ్మ నీకు ?” అంటూ అడిగింది శిరీష.
వెంటనే పద్మజ “ మీరు చాలా అందంగా ఉంటారట! మీరు చాలా తెలివి గలవారుట! ఆ రోజుల్లో ఎం.ఎ. చేసింది మీరొక్కరేనట! పెళ్ళి చూపుల్లో అంకుల్ మిమ్మల్ని చూసీ చూడగానే ప్రేమించేసారుట కదా? మీరు అమెరికా వెళ్ళినప్పుడు ఊర్లో అందరూ వింతగా చెప్పుకున్నారని కూడా చెప్పింది! మా శిరీష పేరుతో సహా అన్నింట్లో ప్రత్యేకం అంటుంది అమ్మ” అంటూ పక పకా నవ్వింది పద్మజ!
శిరీష వెంటనే మొహమాటంగా “ అయ్యో అదేమీ లేదు పద్మజా, నా మీద ప్రేమతో అమ్మ అలా అంటుంది. నేనూ అందరిలాంటి దాన్నేనమ్మా“ అంది. “లేదు ఆంటీ…అమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అమ్మ ఇంతగా ఎడ్మైర్ చేసే మిమ్మల్నిఎప్పుడు చూస్తానా అని ఉంది! మీలాంటి గొప్ప ఫ్రెండు తనకే ఉందని మా అమ్మకు గర్వం అంటీ ! ” అంది పద్మజ.
రాజ్యం కబుర్లతోను, పద్మజ మాటలతో శిరీషకు తన ఒంటరితనం, భయం తగ్గి మనసు కాస్త కుదుటపడినట్టనిపించింది. బెడ్ మీద ఎత్తుగా అమర్చివున్న దిండు మీద తల ఆన్చి “ మా అమ్మకు గర్వం “ అన్న పద్మజ మాటలు గుర్తు చేసుకుని శిరీష నవ్వుకుంది. పాపం పిచ్చి పిల్ల, నేనేదో చాలా గొప్ప వ్యక్తిననుకొని ఏవేవో ఊహించుకుంటోంది. తనను ఎప్పుడూ చూడకపోయినా పద్మజ ఎంత చక్కగా మాట్లాడింది !
ఆ అమ్మాయికి తల్లి పట్ల ఉన్న గౌరవం, ఆ సంతోషం, మెచ్యూరిటీ మాటల్లోనే తెలిసిపోతోంది. తన సంధ్య కూడా ఇలా పెరిగితే ఎంత బావుండును. . .
రాజ్యం పిల్లల్ని ఎంత చక్కగా పెంచింది. సెకండు ఫారం కూడా చదవని రాజ్యం. . . .. ఇంటరు కూడా పూర్తి చెయ్యని వ్యక్తిని పెళ్ళాడిన రాజ్యం. . . . ఓ మారుమూల పల్లెటూరిలో ఉండే రాజ్యం జీవితం ఇంత నిండుగా, ఆనందంగా ఉంటుందని తను ఎప్పుడైనా ఊహించిందా? “అసలురాజ్యం” గురించి ఈ మధ్యనేగా తనకు తెలిసింది .
* * *
శిరీషకు రాజ్యం చిన్నప్పటినుంచి తెలుసు. శిరీష ఇంటికి రెండు ఇళ్ళ అవతలే రాజ్యం వాళ్ళ ఇల్లు. శిరీష హైస్కూల్ చదువు అయి పై చదువుకు విజయవాడ వెళ్లేంతవరకు రోజు రాజ్యాన్ని చూస్తూనే ఉండేది. శిరీష కంటే రాజ్యం ఒక్క ఏడాదే పెద్దది. హార్ట్ ఎటాక్ వచ్చి రాజ్యం తల్లి హఠాత్తుగా పోవడంతో చదువుతున్న సెకండు ఫారం అర్ధాంతరంగా ఆపేసి తండ్రిని, తమ్ముళ్ళను చూసుకుంటూ ఇంట్లో ఆరిందా అయిపోయింది. శిరీష విజయవాడ వెళ్ళిన సంవత్సరం లోనే రాజ్యానికి ఆ ఊళ్ళోనే ఉన్నవెంకట్రావ్ తో పెళ్ళి అయిపొయింది. శిరీష డిగ్రీ అయిన తర్వాత తండ్రిని ఒప్పించి హైదరాబాద్ వెళ్ళి ఎం. ఏ. లో చేరింది. అది పూర్తి అవుతుండగానే చదువు, ఆస్తి వున్న శ్రీకాంత్ తో శిరీష పెళ్ళి సెటిల్ అయింది .
ఆ సంవత్సరమే శిరీష, శ్రీకాంత్ అమెరికా వచ్చేసారు. తిరిగి నాలుగేళ్ల తర్వాత మొదటి సారి ఇండియా వెళ్ళే నాటికి శిరీష తండ్రి ఆ ఊళ్ళో తనకున్న భూములన్నీ అమ్మేసి విజయవాడకు మకాం మార్చడంతో శిరీషకు ఆ ఊరు వెళ్ళాల్సిన అవసరం లేకపోయింది. అలా శిరీషకు రాజ్యంతో ఉన్న పరిచయం, అనుబంధం ఆమె జ్ఞాపకాల పొరలో అట్టడుగుకు వెళ్ళిపోయాయి.
రాజ్యానికి శిరీష అంటే మొదటినుంచీ వల్లమాలిన ప్రేమ. శిరీష ఏం కట్టుకున్నా, ఎలా అలంకరించుకున్నా శిరీషకు మంచి మార్కు లొచ్చినా, పై చదువుల కెళ్ళినా, పెళ్ళి చేసుకున్నా, చివరకు అమెరికా వెళ్ళినప్పుడు కూడా రాజ్యం అవన్నీ తనకే జరిగినంతగా సంతోష పడిపోయేది! అందంగా కట్టిన పూల చెండ్లు శిరీష బారెడు జడలో పెట్టి ఆమె బుగ్గలు పుణికి పుచ్చుకునేది! పనులన్నీ అయ్యాక రాత్రి పూట కూర్చుని కర్చీఫుల మీద ఎంబ్రాయిడరీలు, పూసల బ్యాగులు , లేసులు అల్లి పుట్టిన రోజులకు, పండుగలకు శిరీషకు ఇచ్చి మురిసిపోతుండేది రాజ్యం!
తండ్రి గారాబంలో అల్లారుముద్దుగా పెరుగుతున్న శిరీషకు, తను ఆడింది ఆటగా పాడింది పాటగా జరుగుతున్న శిరీషకు, తన అందం – తెలివితేటలతో ఎప్పడూ అందర్నీ తన చుట్టూ తిప్పుకునే శిరీషకు, రాజ్యం ప్రేమగాని, దాని వెనుక ఉన్న ఆమె హృదయం కానీ కనిపించేదికాదు. బక్కగా, నల్లగా ఎప్పుడూ సాదా సీదా బట్టల్లో అతి సాధారణంగా వుండే రాజ్యాన్ని, శిరీష ఎప్పుడూ పట్టించుకునేది కాదు . రాజ్యం చదువుకోకుండా అక్కడి అబ్బాయినే పెళ్ళి చేసుకుని ఆ ఊళ్ళోనే ఉండిపోవడంతో శిరీషకు ఇంక రాజ్యాన్ని చూడాల్సిన అవసరం కానీ ఆమె గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ కనపడలేదు. రాజ్యం అంటే ప్రత్యేకించి కోపం, ద్వేషం లేకపోయినా ఆమె అంటే ఒక చిన్న చూపు, తేలిక భావన శిరీష మనసులో చోటు చేసుకున్నాయి. ఇంట్లో పూజలు. . . వ్రతాలు. . . . పేరంటాలు జరిగినప్పుడు వచ్చిన వాళ్లకు పసుపు – కుంకుమ ఇవ్వమని తల్లి శిరీషకు పురమాయించేది. నల్లగా, బిరుసుగా ఉండే రాజ్యం కాళ్ళకు పసుపు రాయాలంటే శిరీషకు ఇష్టం ఉండేది కాదు. రాజ్యం అనగానే శిరీషకు గుర్తుండిపోయిన సంఘటన ఇదే.
తను అడగకపోయినా తల్లి చెప్పే ఆ ఊరి సంగతులు, రాజ్యం కబుర్లు శిరీషకు ఎప్పుడూ విసుగ్గా అనిపించేవి.
చీకు, చింతా లేని బాల్యం. . . . . కాలేజీలు. . . . .సినిమాలు. . . . . స్నేహితులు . . . .. శ్రీకాంత్ తో పెళ్ళి. . . . .అమెరికా కాపురం. . . . కొత్త ఫ్రెండ్స్ . . . . పార్టీలు . . . . పిక్నిక్ లు… ఓహ్ జీవితం అంటే ఇదే అనుకుంది శిరీష . కానీ, క్రమేణా శిరీషకు తెలియకుండానే ఆమె ఆనందం హరించుకు పోవడం మొదలైంది. శ్రీకాంత్ కి, తన మీద ప్రేమ నెమ్మదిగా తరిగిపోతున్నదని గ్రహించింది శిరీష.
ఎప్పుడూ హాస్పిటల్, పేషెంట్లు అంటూ భర్త ఎందుకు తనకు దూరమై పోతున్నాడో శిరీషకు తెలిసేది కాదు. పిల్లలు తన మాటను లెక్క చెయ్యకుండా ఎప్పుడూ బయటికి పారిపోతూ వాళ్ళ ఆనందాన్ని, ఆలోచనల్ని, చివరికి వాళ్ళ సమస్యల్ని కూడా బైటవాళ్ళతోనే ఎందుకు పంచుకుంటారో శిరీషకు అర్ధం అయ్యేది కాదు. అసలు అన్నీ ఉన్న తనను తన వాళ్ళు ఎందుకు గుర్తించరో శిరీషకు అంతుబట్టని విషయం.
వృత్తి పరంగా బిజీగా ఉండే భర్తను, పాశ్చ్యాత్య వాతావరణంలో పెరిగే పిల్లల్ని ఎలా చూసుకోవాలో, వారికి కావాలిసినదేమిటో, వాళ్ళ దగ్గరనుంచి తను పొందవలసినదేమిటో తెలుసుకోలేక పోయింది శిరీష. తన జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఎలా బాలెన్స్ చేసుకోవాలో తెలియక తికమక పడింది. ఆ తికమక లో శిరీషకు తెలియకుండానే తనలో దాగి వున్న అహంభావం, నిర్లక్ష్యం, సోమరితనం బయటకు తన్నుకువచ్చేవి. దాంతో ఇంట్లో ఎప్పుడూ గొడవలు . . .పోట్లాటలు. . . కోపతాపాలు… మౌనం.
* * *
కిందటి ఏడాది శిరీష ఇండియా వెళ్ళినప్పుడు అనుకోకుండా ఎన్నో ఏళ్ల తర్వాత రాజ్యాన్ని చూడటం జరిగింది.
శిరీష తల్లికి, ఊర్లో ఉన్న అమ్మవారికి ప్రతి ఏటా పూజ చేయించటం అలవాటు. ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్న హడావిడిలొ శిరీష తల్లి కాలు జారి పడింది. చివరి నిముషంలో అనుకున్న ప్రయాణం ఆగిపోయిందని తల్లి బాధపడుతుంటే ఆ టైములో అక్కడే వున్న శిరీష “ నేను వెళ్ళి చేయిస్తాలే “ అంది . ఆ మాటకే శిరీష తల్లి ఎంతో ఆనందపడి పోయింది. “ అమ్మవారి చీర దగ్గరనుంచి అన్నీ శాస్త్రి గారికి చేరాయి. ప్రతి ఏటా చేసే ఆయనకు అన్నీ తెలుసు. అంతగా ఏమన్నా కావాలంటే రాజ్యం చూసుకుంటుంది. నీకేమి ఇబ్బంది ఉండదు. నువ్వు కారులో వెళ్ళి కారులో రావడమే” అంటూ శిరీషను పంపించింది తల్లి.
రాజ్యం పెట్టిన కమ్మని భోజనం తిని దొడ్లో ఆరుబయటకు వచ్చిన శిరీష , ఆకాశంలో మిలమిలా మెరుస్తున్న నక్షత్రాలను చూసి, చిన్నప్పుడు వాటిని లెక్కపెట్టటం గుర్తొచ్చి తనలో తాను నవ్వుకుంది. రాజ్యం అంతకు ముందే అక్కడ నవారు మంచాలు వాలుస్తూ “ఈ రోజు రాత్రి నీతో తనివితీరా మాట్లాడుకోవాలి! నీ కబుర్లు విని ఎన్నాళ్ళో అయింది!” అంది. మెత్తటి పరుపుల మీద పరచిన దుప్పట్లు చిరుగాలికి అల్లల్లాడుతున్నాయి. ఈ మట్టి . . .ఈ గాలి. . . .ఈ భోజనం శిరీషకు తనలో ఏదో కొత్త ప్రాణం పోసినట్లు అనిపించింది. మంచం మీద కూర్చుని తను ఎప్పుడో మర్చిపోయిన ఈ అందాల్ని గుర్తుచేసుకుంటూ… ఆస్వాదిస్తున్న శిరీష, వెంకట్రావు రావడం గమనించలేదు.
“ మీరు మా ఇంటికి వచ్చారని మా రాజ్యం మహా సంబరపడి పోతోందండి ! మా పిల్లలకు ఎప్పుడు మీ గురించి చెబుతూ, వాళ్ళు మీ అంత గొప్పవాళ్ళు కావాలంటుందండీ “ అంటూ నవ్వుతూ కొంచెం దూరంలో ఉన్న మంచం మీద కూర్చున్నాడు వెంకట్రావు. “ ఆ రోజుల్లో ఇక్కడ మంచి అవకాశాలు లేక మీరందరూ అమెరికా వెళ్లినట్టు, అప్పట్లో మా నాన్న హటాత్తుగా పోవడంతో తప్పని పరిస్థితుల్లో చదువు ఆపేసుకుని నా వాళ్ళను చూసుకోడానికి ఇక్కడే ఈ ఊళ్ళో ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు నా చదువు ఆగిపోయిందని భగవంతుడ్ని తిట్టాను. కానీ ఆ తర్వాత రాజ్యాన్ని భార్యగా ఇచ్చి భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు శిరీష గారు. రాజ్యం నా పక్కన ఉండబట్టే ముగ్గురు చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేసి నా బాధ్యతల్ని నెరవేర్చగలిగాను. . . . “ అంటూ నెమ్మదిగా చెప్పుకు పోతున్న వెంకట్రావ్ వంక ఆశ్చర్యంగా చూసింది శిరీష !
చదువుకోని వెంకట్రావ్ . . . . మట్టిపిసుక్కునే వెంకట్రావ్ . . . . . పల్లెటూరి గబ్బిలాయి వెంకట్రావ్ ఇంత బాగా మాట్లాడగలడని, భార్యని ఎంతో గౌరవంగా, ప్రేమగా చూడగలిగిన సంస్కారవంతుడని ఆ రోజే తెలుసుకుని ఆశ్చర్య పోయింది. రాజ్యం కూడా వెంకట్రావుకి ఏ మాత్రం తీసిపోలేదు. “ ఆ దేముడు నాకు అందం ఇవ్వలేదు, చదువుకునే అవకాశం ఇవ్వలేదు. కానీ బంగారం లాంటి భర్తనిచ్చాడే శిరీషా ! ఆయన “ మనిద్దరం పెళ్ళి చేసుకుందాం“ అన్నప్పుడు ముందు చాలా భయపడ్డాను. కానీ ఆయన అన్నట్లు మా ఇద్దరిదీ ఒకటే పరిస్థితి. ఆడ దిక్కులేని ఇల్లు మాదైతే, మగ దక్షత అవసరం ఉన్న ఇల్లు వాళ్ళది. “మన రెండు కుటుంబాలు నిలబడాలంటే ఇదే మార్గం“ అన్నారు.
ఆలోచిస్తే నిజమే అనిపించింది. పెళ్ళిచేసుకుని నా పాటికి నేను దూరంగా వెళ్ళి పోతే నా స్వార్ధం చూసుకున్న దాన్ని అవుతాను కాని ఆడదాన్ని ఎలా అవుతాను ? అందుకే “ సరే “ అన్నాను. ఆయన సహకారం ఉండబట్టే తమ్ముళ్ళు పెద్దవాళ్ళై, ఆ ఇంటికి కోడలు వచ్చేంతవరకు వాళ్ళను కనిపెట్టుకోగలిగాను ” అంది రాజ్యం.
పౌరోహిత్యం చేసుకుంటూ ఊళ్ళు తిరిగే రాజ్యం తండ్రి “గంతకు తగ్గ బొంత” అన్నట్టు రాజ్యాన్ని వెంకట్రావుకి కట్టపెట్టి చేతులు దులిపేసుకున్నాడని ఇన్నాళ్లుగా అనుకుంటున్న శిరీష మళ్ళీ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది!
పంచదార వేసిన గోరు వెచ్చని మీగడ పాలు గ్లాసులో పోసి శిరీష చేతికిస్తూ… “ ఆ రోజుల్లో అమ్మ సహాయమే లేకపోతే మేము ఏమైపోయేవారమో? ” అంది. “మీ పిల్లల్ని నేను కనిపెట్టుకుని ఉంటాను మీరు నిశ్చింతగా ఊరు వెళ్ళండి” అంటూ మా నాన్నకు ధైర్యం చెప్పేవారు అమ్మ. నాకు ఏది తెలియక పోయినా . . . . అనుమానం వచ్చినా. . . . భయం వేసినా . . . ఆనందం వచ్చినా . . దుఖం వచ్చినా అన్నింటికీ అమ్మ దగ్గరకు పరిగెత్తుకు వచ్చేదాన్ని! ఇప్పటికీ అమ్మ ఆశీర్వాదం తీసుకోకుండా ఏ పని చెయ్యను. అమ్మ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను” అంటూ కళ్ళు వత్తుకుంది రాజ్యం .
శిరీషకు అప్పుడు అర్ధమైంది రాజ్యం రోజూ తమ ఇంట్లో ఎందుకు కనిపించేదో. అమ్మ ఎప్పుడూ రాజ్యానికి ఏదో చేసి చూపించడం . . . ఇద్దరూ గుమ్మాల దగ్గరా. . . . . దొడ్లో చెట్ల కిందా ఏవో మాట్లాడుకోవటం . . . .శిరీష కళ్ళముందు కదలాడాయి.
ఆ రోజు పిల్లల గురించి కూడా రాజ్యం ఎంతో ఆనందంగా, గర్వంగా చెప్పుకుంది. శిరీష పక్కన కూర్చుని ఆల్బం చూపిస్తూ “ ఇదిగో ఇది మా పెద్దమ్మాయి పద్మజ . . . . నీలాగే చదువుల సరస్వతి ! పుస్తకాలు తప్ప దానికి వేరే ప్రపంచం లేదు. స్కాలర్షిప్పులు తెచ్చుకుని దాని చదువు అది చదువుకుంది మాకు శ్రమ లేకుండా. దాని పెళ్ళి కొడుకుని కూడా అదే వెతుక్కుంది! వాళ్ళది వైష్ణవ కుటుంబం. వాళ్ళ ఆచార – సంప్రదాయాలు వేరని, ఈ పల్లెటూళ్ళో అందరూ ఏమనుకుంటారో అని మావారు ముందు సందేహించారు. నేనే నచ్చచెప్పాను . . . ఈ రోజుల్లో ఇవన్నీ పెట్టుకుంటే ఎలాగే శిరీషా! ఇద్దరూ చదువుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు . . . అంతకంటే ఏంకావాలి నువ్వే చెప్పు?! ఇద్దరూ రేపో మాపో మీ దేశం వెళ్ళే ప్రయత్నంలో వున్నారు. ఏమౌతుందో చూడాలి” అంది.
ఇక రెండోది వనజ, చిచింద్రీ… వాళ్ళ నాన్న కూతురు! ఎప్పుడూ బట్టలు.. డిజైన్లు… ఫ్యాషన్లు అంటుంది. హైదరాబాదు లో వాళ్ళ అత్తయ్య దగ్గర ఉండి వాటికి సంబంధించినదే, ఆ పేరు కూడా నా నోటికి సరిగ్గా రాదు ఆ చదువు చదువుతోంది!
ఇది చదువు కాదు, వద్దంటాను నేను. “ దానికి ఏది ఇష్టమో అదే చదువుతుంది “ అంటారు వాళ్ళ నాన్న! ఇక నా కొడుకు వాసు, డాక్టరు చదువు చదువుతానంటాడు. మా శిరీష మొగుడి లాగా పెద్ద డాక్టరై పేరు తెచ్చుకోవాలని చెప్తుంటాను వాడికి ” అంటూ ఫక్కున నవ్వింది రాజ్యం! మొత్తం మీద రాజ్యమే ఎక్కువ మాట్లాడింది. ఎన్నో కబుర్లు చెప్పింది. తన దగ్గిర ఏమున్నాయి చెప్పడానికి. అందులోనూ రాజ్యం దృష్టిలో తను ఓ ఆదర్శ మహిళ !
ఆ ఇంట్లో గడిపిన ఇరవైనాలుగు గంటల్లో శిరీషకు కనువిప్పుతో పాటు అసలు రాజ్యం అంటే ఎవరో అప్పుడే తెలిసింది. చిరునవ్వుతో సౌమ్యంగా మాట్లాడుతూ, ఇంట్లో అందరి అవసరాలు చూస్తూ, పనివాళ్ళకు పనులు పురమాయిస్తూ వచ్చేపోయే వారిని పలకరించి తగిన సమాధానాలు ఇస్తున్న రాజ్యం సమర్ధత చూసి ఆశ్చర్య పోయింది శిరీష.
ఆమెలో తొణికిసలాడుతున్న ఉత్సాహం, ఆమె మాటలలోని నైపుణ్యం, అందరి పట్ల ఆమె ప్రవర్తించే తీరు చూసి శిరీష అబ్బురపడింది. తల్లి కళ్ళ నీళ్ళు తుడవటానికి అన్నట్లు, మొక్కుబడిగా ఇలా వెళ్ళి అలా వచ్చేయడమే అనుకుని చేసిన ఆ చిన్ని ప్రయాణంలోనే శిరీష మనసు నిద్ర లేచింది. ఈ రాజ్యం దగ్గరనుంచి తనలాంటి వాళ్ళు తెలుసుకునేది ఏమీ లేదనుకున్న శిరీష, తను నేర్చుకోవలసినదంతా ఈ రాజ్యం దగ్గరే ఉందని ఆ ప్రయాణంలోనే తెలుసుకుంది.
కుటుంబ వ్యవస్థకు ఆడదే మూలాధారం అని, దానిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తనమీదే ఉందని శిరీష ఆ రోజే గుర్తించింది. మనిషి ఎదగడం అంటే ఎదుటివాళ్ళు అన్నీ అమర్చి పెడుతుంటే ఆడంబరంగా పుట్టిన రోజులు జరుపుకోవడం కాదని, తన చుట్టూ ఉన్నవారితో కలిసి బతుకుతూ ఎదుటివారిని గౌరవిస్తూ వారి దగ్గరనుంచి నేర్చుకుంటూ పెరగటమే నిజమైన ఎదుగుదల అని శిరీష ఆ ప్రయాణంలోనే తెలుసుకుంది. అమెరికాలో పుట్టి, భిన్న సమాజంలో పెరుగుతున్న తన పిల్లల్ని పెంచడానికి ప్రేమ ఒక్కటే చాలదని తల్లిగా తనకు ఎంతో సహనం. . . ఓర్పు . . అప్రమత్తత ఉండాలని, వాళ్ళ ఇష్టాలను అభిరుచులను గుర్తిస్తూ జాగ్రత్తగా పిల్లల్ని ముందుకు నడిపించాలని ఆ రాజ్యం ఇంట్లోనే తెలుసుకుంది శిరీష.
భర్త హోదా, సంపాదన అనుభవించడం తన హక్కు అని అనుకునే శిరీషకు, రోగులకు సేవ చెయ్యడంలో ఆనందాన్ని పొందుతూ అలసిపోయి ఇంటికి వచ్చే శ్రీకాంత్ ని ఎలా చూసుకోవాలో, భార్యగా అతనితో కలిసి ఎలా నడవాలో ఈ పల్లెటూరి రాజ్యాన్ని చూసాక తెలిసింది శిరీషకు. ఇన్నేళ్ళుగా తను ఎక్కడెక్కడ తప్పటడుగులు వేస్తూ వచ్చిందో, రాజ్యంతో గడిపిన ఆ కొద్ది సమయంలో శిరీషకు తెలిసొచ్చింది. తన తల్లి ఎప్పుడూ ఎందుకు రాజ్యం గురించి మాట్లాడుతుందో శిరీషకు ఆ రోజే అర్ధం అయింది.
“ ఇప్పుడు నేర్చుకుంటే ముందు ముందు నీకే ఉపయోగం “ అంటూ తనకు పని – పాటలు, మంచి – చెడు నేర్పాలని తల్లి ఆ రోజుల్లో ఎందుకు అంత తాపత్రయపడేదో ఇప్పుడు రాజ్యాన్ని చూసాక తెలిసింది శిరీషకు . శిరీష తిరిగి అమెరికా వచ్చాక కూడా ఆ ప్రయాణం గురించి . . . ఆ దంపతుల గురించి ఆలోచిస్తూనే ఉంది. రాజ్యం – వెంకట్రావ్ ల నిండైన జీవితం చూసాక “నిజమైన రైతు బంజరు భూమిలో నైనా బంగారాన్ని పండించుకోగలడు“ అనే తండ్రి మాటల్లోని అర్ధం ఏమిటో తెలిసొచ్చింది. ఇప్పుడు శిరీష నెమ్మదిగా తనని తాను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ, తన కుటుంబాన్ని సరిదిద్దాలని తపన పడుతోంది.
హాలు మధ్యలో మెత్తని కుర్చీ వేసి అందులో రాజ్యాన్ని కూర్చోపెట్టి, ఒక చేత్తో రాజ్యం పాదం పట్టుకుని రెండో చేత్తో శ్రద్ధగా పసుపు రాస్తున్న శిరీష వంక రాజ్యం ఎప్పటిలాగే నవ్వుతూ ప్రేమగా చూసింది !!!!
**********************************
కనువిప్పు – నేపధ్యం
నా స్వీయ అనుభవం వల్లనేమో “మనిషి ఎదగాలి అన్నా, జీవితం అంటే ఏమిటో తెలియాలి అన్నా ఇల్లు వదిలి బయటి ప్రపంచంలోకి రావాలి” అని గాఢంగా నమ్మే వ్యక్తిని నేను. కానీ.. కొంతమంది అన్ని అవకాశాలు ఉన్నా, పెద్ద నగరంలో ఉన్నా కూపస్థమండుకంలా ఉన్నవాళ్ళని, అలాగే ఎక్కడో మారుమూల చిన్న ఊళ్ళలో ఉంటూ తమ కష్టంతో.. చాకచక్యంతో జీవితాల్ని పండించుకున్న వాళ్ళని చూడటం జరిగిన తర్వాత నా అభిప్రాయాన్ని కొంత మార్చుకోవాల్సి వచ్చింది. నేను గమనించిన..నేర్చుకున్న ఇంకొక విషయం మనం కొంతమందిని గురించి, కొన్ని విషయాల గురించి ఏమి తెలుసుకోకుండానే మనకు మనమే తీర్మానాన్ని ఇచ్చేస్తూ ఉంటాం. ఎవరైనా పెద్దగా చదువుకోకపోయినా, జీవితంలో గొప్ప స్థాయిలో ఉండకపోయినా వెంటనే వాళ్ళు తెలివితక్కువ వాళ్ళని, సమర్ధులుకారని నిర్ధారించేసి వాళ్ళను ఒక క్యాటగిరి లో పెట్టేస్తాం. వాళ్ళ ఇబ్బందులు ఏమిటో, అప్పటి వారి పరిస్థితి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. ఈ రెండిటిని సమన్వయం చేస్తూ ఓ కథ రాయాలని చేసిన ప్రయత్నమే ఈ “కనువిప్పు”. 2012 లో సుజనరంజని లో ప్రచురణ అయినప్పుడు ఈ కథకు పాఠకుల నుంచి మంచి స్పందన వచ్చింది!
**********************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
మీకు amazon లో కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page