13_001 లలిత సంగీత ధృవతార

 

నింగి కెగిసిన లలిత సంగీత ధృవతార

 

ఒక శకం పూర్తైపోయింది. ఆకాశవాణి స్వర్ణ యుగానికి సాక్షి, ఆ స్వర్ణయుగపు ఆఖరి ధృవతార నింగి కెగిసింది. లలిత సంగీత చక్రవర్తి – గాయకుడు, స్వరకర్త, సిద్ధాంత రూపకర్త ఇక సెలవంటూ భువిని వీడారు. డా. మహాభాష్యం చిత్తరంజన్ అనే శ్రీ అవధూత షణ్ముఖ చిత్తరంజన స్వామి తన అవతారం చాలించారు.

       “మీరు తలచుకుంటే మీ చరిత్రని ఒక కావ్యంగా మలిచడానికి ఎందరో రచయితలు, కవులు ముందుకొస్తారు, మాస్టర్ గారూ!” అన్నాను, “అమ్మలూ, నువ్వు నా జీవిత చరిత్ర రాయాలి.” అన్నప్పుడు. ఇది నీకే రాసిపెట్టి ఉంది, నువ్వే రాయి!” అని ఆదేశించారు. ఆ విధంగా, వేల పాటలు పాడి, వేల లలిత గీతాలకు స్వరాలద్ది, వేలమంది గాయనీగాయకులతో పాడించి, వేలమంది వాద్యకారులతో తళుకులద్దించిన నాద సుధామణి వెలుగులు లోకానికి విరజిమ్మే అవకాశం నాకే వచ్చింది.

        నెలన్నర కిందటి వరకూ కూడా నాతో నా ఫోనులోనే తన పాటలు రికార్డ్ చేయించుకున్నారు. కొన్ని స్వీయ అథ్యాత్మిక కీర్తనలకి వ్యాఖ్యానం కూడా చెప్పారు. “కాస్త ఒంట్లో బాగాలేదు, రెండ్రోజుల్లో మళ్ళీ ఫోన్ చేస్తాను” అని రెండుమూడు సార్లు మధ్యలో విరామం తీసుకొని ఇంక మూడోసారి నాకు శాశ్వత విరామమిచ్చారు.

        కేంద్ర సంగీత నాటక అకాడమీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన “అమృత్” పురస్కారం తనే స్వయంగా అందుకుంటారని నమ్మాను. ఆ అత్యుత్తమ పురస్కారం తరువాత ఇద్దాం, ముందు ఫెలోషిప్ ప్రకటించినవారికి అవి అందజేద్దాం, అన్నారట. మొదట్లో చాలా బాధ కలిగింది, ఎంతో కోపం వచ్చింది….. “ముందు డెబ్భైలు, ఎనభైలలో ఉన్నవారిని గౌరవిద్దాం, ఆ తరువాత చిన్నవారిని పిలుద్దాం” అన్న జ్ఞానం లేకపోయిందే… అని. నాలాంటి చిత్తరంజన్ అభిమానులు, శిష్యులు ఎంతో నిరాశ చెందారు. ఇంతకంటే ఎక్కువ మాటలు రావడం లేదు! కానీ, ఈ అనుభూతులను ఏనాడో దాటేసిన ఆ మహనీయుడు, “అంతా మన మంచికే జరుగుతుంది తల్లీ. సుబ్రహ్మణ్య స్వామి అలా నిర్ణయించారు.” అని చెప్పినట్టు అనిపించింది. ‘ఆయన సమభావాన్ని, నిర్లిప్తతని గౌరవించాలంటే ఆయనని గుర్తించి గౌరవించాలని అనుకున్నవారిని గౌరవించాలి.’ అనిపించింది. అందుకే, చిత్తరంజన్ గారిని “అమృత్” పురస్కారంతో సత్కరించాలని ఎంతో ఘనమైన కార్యక్రమాన్ని తలపెట్టిన కేంద్ర సంగీత నాటక అకాడమీకి నమస్సులు తెలుపుతూ….

ఒక శుభకార్యంలో చిత్తరంజన్ మాస్టర్ గారితో మా అమ్మానాన్న, నేను, అక్క, బావగారు, తమ్ముడు, మరదలు, వాళ్ళ పాప.

****************************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

మీకు amazon లో కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page