తే. గీ. ప్రాణపతి కంకిత మ్మైనబ్రతుకులోన
తత్ప్రఘాఢపరిష్వంగబంధ మింత
సడలుటకునైన నోర్వినిసకియప్రణయ
మధురిమలు చాటునో యన మల్లెపూలు
వలపు లెగజిమ్మి షట్పదిప్రకరములను
రిచ్చవడజేయు డెందముల్ రెౘ్చగొట్టి !
తే. గీ. దారిప్రక్కనె పూఛే మందార మదిగొ !
త్యాగవీరమ్మునకు చిహ్న మైనపూవు !
త్యాగవీరముమన సిట్టి దన్నయట్లు
స్వచ్ఛతను జాటు నదె నందివర్ధనమ్ము !
తే. గీ. ధరణి రాలియు వాడక పరిమళాలు
తఱగనిబొగడపూ లేమితపము చేసె !
ౘచ్చియును కీర్తి దేహాన శాశ్వతు లయి
బ్రతుకు త్యాగుల కివి ఒజ్జబంతు లేమొ !
కొమ్మమాటుకోకిలమ్మ
కుహు కుహు మని పాడగా
కోటికోటివీణీయలె
గుండెలలో మ్రోగెను !
విహంగాల కలరవాలు
వీనులవిం దొనరింపగ
అలరులు నవ్వగనె తీపి
వలపు తీవసాగెను !
తేటుల ఝమఝమగీతము
తీపితలపులను రేపగ
పండి నెల రాలుఆకు
వై రాగ్యము బోధించును !
తే. గీ. ఆకు లలములు మేసి కారడవులందు
తమబ్రతుకు తాము బ్రతికెడుతిబిసు లట్టి
సాధుమృగముల వేటాడి సంతసింత్రు
పుడమి కొందఱు తమపాడుపొట్టకొఱకు !
తే. గీ. అకట ! తమగూళ్ళు విడిచి దవ్వరిగి అరిగి
కాయకసరులు మెసపుచు గాలి పీల్చి
పరుల కేహాని తలపనిపక్షివితతి
కుచ్చులు బిగించుదుర్మార్గు లుంద్రు భువిని !
తే. గీ. బిడ్డలనె కన్ను లానక పెద్దపులులు
మెసపుః త్రాచులు తమగ్రుడ్లు మ్రింగు తామే ;
ఒహోహో ! సర్పమునోటిలో నున్నకప్ప
నాలుకను చాచు పురుగులన్ జంపుటకయి
ఆకలి అదెంతొ చిత్రమైనది కదోయి !
తే. గీ. స్పర్థలను పెంచుకొని పరస్పరము రోసి
కనలి ఘర్షించుమనుజసంఘమ్మువోలె
చెట్టు చెట్టును రాపాడి పుట్టునిప్పు
అడవికి మహాపకారి యౌ నప్పుడపుడు
తే. గీ. ఇతరతరువులసంగతి యింత లేక
దౌదవుల మఱ్ఱిపైన అందాలగూట
ప్రణయవులకితమధురభావప్రశాంత
జీవనము పావురాజంట చేయు నొకటి
తే. గీ. మక్కువలు మీఱ ముక్కును ముక్కు చేర్చి
మృదుల మౌమేను మేనును కదియజేర్చి
మమత పులకింప మనసును మనసు కలిపి
జంట నివసించు పెనుమఱ్ఱి సాక్షి గాగ
తరువాయి వచ్చే సంచికలో…..
***************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
మీకు amazon లో కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page