సంగీత కచేరీల్లో వైయోలిన్ ఒక భాగమైపోయింది. దక్షిణ భారతానికి చెందిన కర్ణాటక సంగీతంలో ఇదొక ప్రధాన పక్క వాయిద్యం పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి చేరి ఇక్కడి సంగీతంలో ఇమిడిపోయిందని మనం అంటున్నా అసలు ‘ రావణ హస్త వీణ ’ పశ్చిమ దేశాలకు పయనించి వైయోలిన్ గా రూపు మార్చుకొని తిరిగి వచ్చిందని అంటే అవునని చరిత్ర చెబుతోంది.
సంగీత పరికరాల చరిత్రలో పెనుమార్పులకు లోనైంది తంత్రీ వాయిద్యాలే. వీణ, వైయోలిన్, సితార్, సరోద్, తంబుర వంటి తీగలు కలిగిన వాయిద్యాలన్నీ ఈ కోవకు చెందినవే. ఒక్క తీగతో మొదలైన ఈ వాయిద్యాలు సాంకేతికత, సంగీత ప్రజ్ఞ కలిగిన వారి చేతుల్లో ప్రయోగాలకు లోనయ్యాయి. ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటూ అప్పటి సంగీతానికి అనుగుణంగా తయారయ్యాయి. ఆ విధంగా వైయోలిన్ కి మాతృక భారతదేశంలోని ‘ రావణ హత్త ’ లేక శ్రీలంక కు చెందిన ‘ రావణ హస్త ’ అని చరిత్ర పేర్కొంటోంది. అన్ని శాస్త్రాలతో పాటు సంగీత శాస్త్రం, వాయిద్యాల సృష్టిలో మన సంస్కృతే తలమానికం అవుతోంది.
శ్రీలంక చరిత్ర పురాణం
రావణాసురుడు లంకను పాలించినప్పటి హేలా నాగరికతకు చెందినది ‘ రావణ హస్త ’ అని శ్రీలంక ప్రజలు నమ్ముతారు. ఇక్కడ లభిస్తున్న వాయిద్యం సరిగ్గా మన దేశంలోని వాయిద్యాన్ని పోలి ఉంటుంది. రామాయణం ప్రకారం చూస్తే రావణాసురుడే ఈ వాయిద్యం తయారు చేశాడు. దీన్ని పలికించే తన ఆరాధ్య దైవమైన శివుడిని మెప్పించాడు. రామరావణ యుద్ధం తరువాత ఆంజనేయస్వామి అతని వీణను తీసుకొచ్చేశాడట.
తెలుగు వారి చరిత్రలో……
1262 లో రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యానికి రాజప్రతినిధిగా ఎంపికైన సందర్భంగా గణపతిదేవ చక్రవర్తి ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో ఆస్థాన నర్తకి నాగమదేవి నాట్యం చేసిందని, ఆ సందర్భంగా ఆమెకు వీణ, వేణువు, రావణ హస్త పై కళాకారులు సహకరించారని తెలుగువారి చరిత్ర చెబుతోంది. గణపతి దేవుని పెదనాన్న అయిన రుద్ర చక్రవర్తి ( 1158-95 ఏ. డి. ) తమ కులదైవమైన కాకతమ్మ గుడిని వరంగల్లు లో కట్టించారు. ఈ గుడిని నిర్మించినది అప్పటి ప్రఖ్యాత శిల్పి ఎర్రయ ఒజ్జ అని, గర్భగుడి ద్వారానికున్న ఫలకాల్లో ఒకదానిపై శంఖ, కాహళ, వేణువు, నాదస్వరం వంటి ముఖ వాయిద్యాలు, ఢమరు, మర్దళ, మృదంగం వంటి చర్మ వాయిద్యాలు, రావణ హస్తాది తంత్రీ వాయిద్యాలను కళాకారులు వాయిస్తూ నాట్యం చేసే దృశ్యాలను శిల్పులు మలిచారని కూడా చరిత్రలో ఉంది.
ఎప్పటి కాలానిదో…..
క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల నాటిది మన దేశంలోని ‘ రావణ హత్త ’ ఎటువంటి మార్పులూ లేకుండా అప్పటి ఆకార విశేషాలతోనే ఉన్న ఈ వాయిద్యం ఇప్పటికీ రాజస్తాన్, గుజరాత్ లలోని జనపదాల మధ్య మోగుతూ ఉండడం విశేషం. 22 అంగుళాల ఈ వాయిద్యం తయారీ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక కొబ్బరి చిప్పను మేక చర్మంతో కప్పి, వెదురుతో చేసిన దండితో కలుపుతారు. దీనిపై రెండు తీగలను బిగిస్తారు. ఒకటి గుర్రం వెంట్రుకతో చేసినది, ఇంకొకటి స్టీల్ తో చేసినది. అప్పట్లో నేటి రాజస్తాన్, గుజరాత్ లలోని రాజ్యాల యువరాజులకు మొట్టమొదట ఈ వాయిద్యం మీదే సంగీత శిక్షణనిచ్చేవారు. ఇదే వాయిద్యం తొమ్మిదో శతాబ్దంలో తూర్పు మధ్య దేశాలకు, యూరప్ కు చేరిందట. ఐరోపా దేశంలో దీన్ని ‘ రావణ స్ట్రాంగ్ ’ అని పిలిచేవారు. వైయోలిన్, వయోలా, గిటార్ వంటి పరికరాలు ఇందులో నుంచే క్రమంగా రూపుదిద్దుకున్నాయి.
ఇక ఆధునికానికొస్తే…..
శ్రీలంకకు చెందిన ప్రఖ్యాత వైయోలిన్ విద్వాంసుడు దినేష్ శుభసింఘ ఇటీవలే ‘ రావణ హస్త ’ కు కొన్ని మార్పులు చేశారు. తన కచేరీలలో తాను రూపొందించే గీతాలలో ( రావణ్ నాద, కరుణ నదీ వంటివి ) కూడా ఈ యువకుడు సదరు వాయిద్యాన్ని ఉపయోగిస్తూ పాత ఒరవడిని కొత్తగా దిద్దుతున్నారు. అంతేకాక, రాజపక్స శ్రీలంక అధ్యక్షుడిగా ఉండగా ఆయనకు ఒక వీణను బహుకరించారు కూడా.
******************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page