సతీష్ గడియారం వంక చూసుకొన్నాడు. భావన కోసం నిరీక్షిస్తున్నా ఈ రెండుగంటల సమయంలో గడియారం చూడటం ఇది ఎన్నోసారో ! అయినా భావన కోసం ఇలా ఎదురుచూడ్డం అతనికి కొత్తేమీ కాదు. ఆమెతో పరిచయమైన ఈ రెండు సంవత్సరాల కాలంలోనూ తను చెప్పిన సమయానికి ఎప్పుడూ రాలేదు. అయినా ప్రతిసారీ సంతోష్ ఈసారి అలా జరగదు, తను చెప్పిన సమయానికి తప్పకుండా వస్తుంది అని తెగ ఆశ పడిపోతూ, అనుకొన్న సమయానికి అరగంట ముందుగా వచ్చి కూచుంటాడు. భావనకి ఈ సంగతి బాగా తెలుసు. అందుకని తను రావలసిన సమయానికి అరగంట ముందుగా వస్తున్నానని చెప్పి అతన్ని ఆటపట్టిస్తూ వుంటుంది. సతీష్ కి ఇదంతా తెలిసినా పట్టించుకోడు. వయస్సులో వున్న వాళ్ళకు ముఖ్యంగా ప్రేమికులకు ఇలాటి చిలిపి చేష్టలు చిరుజల్లుల్లా ఒళ్ళు ఝల్లుమనిపిస్తాయి. చిరుగాలుల్లా సుమ సుగంధాలు మోసుకొస్తాయి. ఈ అందమైన అనుభవాలు భావి జీవితానికి మధురమైన జ్ఞాపకాలు. రెండు జీవితాలని శాశ్వతంగా కట్టిపడేసే వెన్నెల దారాలు.
సతీష్ వచ్చినపుడు అసలు జనం లేరు. కానీ సాయంకాలం ఆరుగంటలు కావడంతో బీచంతా జనంతో నిండిపోయింది. రంగు రంగుల బట్టలు ధరించిన పిన్నా – పెద్దా, బెలూన్లు, ఐస్ క్రీములు, వేరుశెనగపప్పు, ఉప్పు శెనగలు, పీచు మిఠాయిలు, ప్లాస్టిక్ సామాన్లు అమ్మేవాళ్లు వీరితో బీచ్ తిరునాళ్ళలా వుంది. కోలాహలంగా కళకళలాడుతూ వుంది. బీచ్ కి పోవడానికి టికెట్ కొననక్కరలేదు. వయస్సుతో సంబంధం అసలే లేదు. డబ్బుండాలి, స్టేటస్ వుండాలి. ఈ టైమ్ కి రావాలి, పోవాలి అనే కట్టుబాట్లు కూడా లేవు. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, పోవచ్చు. విశాలమైన సముద్రం. ఎవరినైనా, ఎప్పుడైనా చేతులు జాచి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది. ఆదరంగా సేద తీరుస్తుంది. అందుకే సంతోష్ కి సముద్రం అంటే ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా సముద్రపు ఒడ్డుకు వచ్చి కూర్చుంటాడు. అతనికి భావనతో పరిచయం కాక ముందు కూడా ఊర్లో ఉన్నప్పుడల్లా తఱచుగా సాయంకాలం బీచ్ కి వచ్చేవాడు. ఉత్తుంగ తరంగాలతో ఎగిసిపడే ఈ జలవాహిని చూస్తూ వుంటే కాలంతో పోటీగా పరుగెత్తాలని ప్రయత్నిస్తుందా అనిపిస్తుంది. పరవళ్ళు తొక్కుతూ పరుగెత్తుకొచ్చే అలలకు కూడా గమ్యం లేదు. నేను ముందంటే నేను ముందు అంటూ వచ్చి ఒడ్డును తాకే అలలు, ఆ అలలు మోసుకొచ్చే అల్చిప్పలు, సముద్రం మీద నుంచి వీచే స్వచ్చమైన గాలి, విస్టారంగా విశ్వమంతా పరుచుకొని ఎక్కడో కనుచూపుకి ఆననంత దూరంగా సముద్రాన్ని తాకుతున్నట్లున్న నీలాకాశం, ఆకాశంలో గుంపులు గుంపులుగా ఎగురుతూ గూళ్లను చేరుకొంటున్న పక్షులు ఇదంతా చూస్తూ వుంటే సృష్టి ఇంత అద్భుతమైనదా ? అని ఆశ్చర్యం కలుగుతుంది. రాత్రనక పగలనక హోరుమని శబ్దం చేస్తూ ఉండే ఈ జలరాశి ఇక్కడ ఎప్పటి నుంచి వుంది ? కొన్ని కోట్ల సంవత్సరాల నించి ఇలాగే వుందా ? కదలకుండా ఇక్కడే వుండమని ఎవరు శాసించి వుంటారు ? ఏది ఏమైనా సముద్రం వంక చూస్తూ వుంటే మనల్ని మనం మనం మర్చిపోతాం. ప్రపంచాన్ని మర్చిపోతాం. బాధలు, భయాలు, ఆశలు, నిరాశలు సమస్తం మాయమయి పోతాయి. ఉత్సాహంగా పరుగెత్తుకుంటూ వచ్చే తరంగాలు కలిగించే ఆనందం నిర్వచించలేనిది, నిష్కల్మషమైనది. బహుశా ఇలాంటి ప్రశాంతమైన అనుభవం కోసమేనేమో చాలామంది సముద్రం వంక చూస్తూ కాలం గడుపుతారు.
ఆలోచనల నుంచి బయిటపడి చుట్టూ చూశాడు సతీష్. నవంబరు నెల కావడంతో త్వరగా చీకట్లు ముసురుకొంటున్నాయి. కొద్దిగా చలి కూడా మొదలయింది. ఇక భావన రాదని నిర్ధారించుకొని లేచి నిలబడ్డాడు సతీష్. పాంట్ కి అంటుకొన్న ఇసుక దులుపుకొని బయిలుదేరుదామని అనుకొంటూ అలవాటుగా తలెత్తి దూరంగా గుంపుగా పడి వున్న బండల వంక చూచాడు. అక్కడ మామూలు ప్రకారం కొద్దిగా ఎత్తు వున్న బండ మీద కూర్చుని కనిపించిందామె. సతీష్ దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి బీచ్ కి వస్తున్నాడు. అతను ఒకరోజు యథాలాపంగా చుట్టూ చూస్తూ బీచ్ కి కొంచెం దూరంగా ఏదో చెట్టు కింద బెంచ్ లాగా వున్న ఒక బండమీద కూర్చున్న ఒక అమ్మాయిని చూశాడు. తరువాత కూడా అతను వచ్చినప్పుడల్లా ఆమెను చూస్తూనే వున్నాడు. ఆమె ఎన్ని గంటలకు అక్కడకు వస్తుందో అతనెప్పుడూ గమనించలేదు కానీ తను తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం అటు చూస్తే ఆమె అక్కడ కూర్చుని కనిపిస్తుంది. బీచి నుంచి బయిల్దేరేటపుడు తప్పకుండా అతడు చూస్తాడు. అతనికి అది ఒక అలవాటుగా అయిపోయింది. ఉన్నట్లుంది అతనికి ఆ అమ్మాయిని దగ్గరనుంచి చూడాలనే చిలిపి కోరిక కలిగింది. అది భావన కోసం రెండు గంటలపాటు ఎదురుచూసిన విసుగైనా కావచ్చు లేక సహజంగా మనిషిలో కలిగే ఉత్సుకత అయినా కావచ్చు, నిజానికి అతనికి ఆ వాంఛ కలగడానికి కారణం అతనికే తెలియదు. ఇంకేమీ ఆలోచించకుండా అటువైపు నడిచాడు సతీష్.
ఎదురుగా నిలబడ్డ వ్యక్తిని ఖంగారు గా చూసిందామె. పక్కనే వున్న బాగ్ తీసుకొని లేవబోయింది.
“ లేవకండి ! నేనేమీ చెయ్యను. నేను బీచికి వచ్చినప్పుడల్లా మీరు ఇక్కడ కూర్చుని వుండడం చూశాను. మీతో మాట్లాడాలనిపించింది ” అంటూ రాతి బెంచీ చివరగా కూర్చున్నాడు. అక్కడ వుండాలో లేచి వెళ్లిపోవాలో నిర్ధారించుకోనట్లు జరుగుతున్నదేమిటో అర్థం కానట్లు అయోమయంగా చూడసాగిందామె. వెలుతురు నెమ్మదిగా తగ్గిపోతూ వుంది. ఆ మసక చీకట్లో ఆమెను పరిశీలించసాగాడు సతీష్. ఆమె చామన ఛాయ కంటే ఒక వన్నె తక్కువగా అనిపించింది. అలాగని నల్లగా కూడా అనిపించడం లేదు. వయస్సు ఇంతని చెప్పడం కష్టం. పాతిక ముఫ్ఫయి మధ్య వుండొచ్చు అనుకొన్నాడు. చెవులకు ఒంటిరాయి దుద్దులు, ముక్కుపుడక పెట్టుకొంది. ఒక చేతికి ప్లాసిక్ గాజులు, ఒక చేతికి గడియారం, బిగించి వేసిన జడ నడుం కిందకి వేలాడుతూంది. జడ చివర తెల్లరంగు ఊలు రబ్బరు బాండ్.
“ మీరు రోజూ ఇక్కడే కూర్చుంటారు – ఈ స్పాట్ అంటే మీకు ఇష్టమా ? ”
ఒక అపరిచిత వ్యక్తి ఇలా వచ్చి తనకు పక్కగా కూర్చోవడం ఆమెకు నమ్మశక్యం కావడం లేదు. అది చాలనట్లు తనకే జవాబు తెలియని ఈ చిక్కు ప్రశ్న ?
నిజమే ! తను రోజూ బీచికి వచ్చి ఇక్కడే కూర్చుంటుంది. ఎందుకంటే ఏమో తనకే తెలియదు. అవును ఇక్కడే ఎందుకు కూర్చోవడం ? ఇంకొంచెం ముందుకు వెళ్ళి జనంతో కూర్చోవచ్చు కదా ? తనెప్పుడూ అలా ఎందుకు చేయలేదు ? ఏమో తెలీదు.
ఏదో జవాబు చెపుదామన్నట్లు అతని వైపు తలతిప్పింది ఆమె. వీధి లైటు కాంతిలో, వెన్నెట్లో నదిలో ఈదుచున్న చేపపిల్లల్లా మెరిసాయి ఆమె కళ్ళు.
“ మీరెక్కడైనా జాబ్ చేస్తున్నారా ? ” ఆమె పక్కనే పెట్టి వున్న ఆకుపచ్చ గుడ్డ సంచీలోంచి బైటకి కనిపిస్తున్న స్టీల్ కారియర్ వంక చూస్తూ అడిగాడతను.
“ అవును ఇక్కడికి దగ్గరలో వున్న గార్మెంట్ ఫ్యాక్టరీ లో పని చేస్తున్నాను ” ఇక తప్పదన్నట్లు ఎటో చూస్తూ సమాధానం చెప్పిందామె.
ఇంకా ఏం మాట్లాడాలి ? ఎలాటి ప్రశ్నలడగాలి ? ఆలోచించసాగాడతను. వస్తుతః సతీష్ సరదా అయిన వ్యక్తి. మంచి మాటకారి. ఎలాటి వారితోనయినా అవలీలగా స్నేహం చేయగలడు. పార్టీలు, పిక్నిక్ లు జరిగేటప్పుడు సతీష్ లేకపోతే లైఫ్ వుండదు అంటూ వుంటారు అతని స్నేహితులు. అసలు సతీష్ మూగవాళ్ళని కూడా మాట్లాడించగలడు అంటూ ఆట పట్టిస్తూ వుంటారు కూడా ! అలాటి సతీష్ ఈ మసక చీకట్లో ఒక సాధారణమైన అమ్మాయి ముందు మూగవాడయ్యాడు. చుట్టూ చూస్తూ కూర్చున్నాడు సతీష్. బీచి మెల్ల మెల్లగా ఖాళీ అవుతూంది. అటు పక్కగా వెడుతున్న ఐస్ క్రీమ్ బండి వాడిని చూస్తూ
“ ఐస్ క్రీమ్ తింటారా ? ” ఆశగా ఆమె వంక చూస్తూ అడిగాడు.
ఆమెకు నవ్వు వచ్చింది. అనవసరపు పరిచయం, అసందర్భపు పరిచయం. అనవసరమైన సంభాషణ. ఫక్కుమని నవ్వసాగిందామె.
సతీష్ కి కూడా నవ్వు వచ్చింది. లేచి వెళ్ళి రెండు ఐస్ క్రీమ్ కోన్ లు తీసుకు వచ్చాడు. ఒకటి ఆమెకందించాడు. చల్లని ఐస్ క్రీమ్ వీళ్ళిద్దరి మధ్య మంచులాంటి నిశ్శబ్దాన్ని కరిగించింది. వాళ్ళిద్దరూ ఎప్పుడు మాట్లాడటం మొదలు పెట్టారో, ఏం మాట్లాడారో ఇద్దరికీ గుర్తు లేదు. ఆమె తన గురించి చెప్పింది. వాళ్ళ ఊరు టౌన్ కు పది కిలోమీటర్ల దూరంలో వుంది. అక్కడికి వెళ్లవలసిన బస్ ఎనిమిది గంటలకు మెయిన్ రోడ్ మీద బస్స్టాప్ లో దొరుకుతుంది. అందుకని రోజూ ఫ్యాక్టరీ లో పని అయిన తర్వాత ఇక్కడకు వచ్చి కూర్చుంటుంది. ఊళ్ళో వాళ్ళకు చిన్న స్వంత ఇల్లు వుంది. తండ్రి ఆ ఊళ్ళో గవర్నమెంట్ హైస్కూల్ లో తెలుగు పండితుడిగా పనిచేసి రిటైర్ అయినాడు. రెండు సంవత్సరాల క్రితం చనిపోయినాడు. తనకు ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు. పెద్ద తమ్ముడు హైదరాబాద్ లో ఒక న్యూస్ పేపర్ ఆఫీసు లో పని చేస్తాడు. చెల్లెలు, చిన్న తమ్ముడు చదువుకొంటున్నారు. తండ్రి పెన్షన్ కొద్దిగా తల్లికి వస్తుంది. ఆయన రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు ముందు జాగ్రత్త కోసం బ్యాంక్ లో వేసి పెట్టుకొన్నారు. తను కూడా పన్నెండవ తరగతి వరకు చదువుకొంది. ఊరికె వుండకుండా ఏదో వేన్నీళ్ళకు చన్నీళ్లుగా వుంటుందని ఫ్యాక్టరీ లో పని చేస్తున్నది.
వాళ్ళ ఊరు నుంచి ఉదయం ఎనిమిది గంటలకు బస్సులో బయిలుదేరి వస్తుంది. తిరిగి రాత్రి బస్సులో వెళ్లిపోతుంది. సతీష్ బొంబాయి లో పుట్టి పెరిగాడు. ఐఐటి లో ఎం. టెక్ చేశాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఇలా ఒకరి వివరాలు మరొకరు తెలుసుకొన్నారు. చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, దేశపు రాజకీయాలు ఒకదానితో ఒకటి సంబంధం లేని విషయాలు చాలా మాట్లాడారు. ఇద్దరు అపరిచితులు పరిమిత సమయంలో ఎప్పటినుంచో తెలిసిన వాళ్లలా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఈ దేశంలో అరుదైన విషయం కాదు. అలా అయితే రైళ్లలోనూ, బస్సుల్లోనూ గంటల కొద్దీ ప్రయాణం చేసే వ్యక్తులు ఎప్పటినుంచో తెలిసిన వాళ్లలా ఏకధాటిగా మాట్లాడుకోవడం, ఒక్కొక్కప్పుడు జీవితాంతం స్నేహితులుగా మిగిలిపోవడం జరుగుతుంది. ఉన్నట్టుండి చేతి గడియారం వంక చూసుకోండి ఆమె.
“ అమ్మో ! పావుతక్కువ ఎనిమిది ! నా బస్సు ” అంటూ ఒక్క ఉదుటన బాగ్ తీసుకొని నిలబడింది. అతను కూడా ఖంగారుగా “ ఎంత చీకటి పడిపోయింది ? మాటల్లో పడి టైమే తెలియలేదు. పదండి. మిమ్మల్ని బస్స్టాప్ లో దింపుతాను ’ అంటూ రోడ్డు మీద ఆపిన కారు వైపు నడిచాడు.
“ అబ్బే ! ఎందుకండీ ? నడిచి వెళ్లిపోతాను. ఎక్కువ దూరం లేదు ” మొహమాటంగా అన్నది ఆమె.
“ భలేవారే ! నేను అంత సంస్కారం లేని వాడిలా కనిపించానా ? ” అన్నాడతను నవ్వుతూ.
“ అబ్బేబ్బే ! లేదు లేదు పదండి ” నొచ్చుకొంటూ అతన్ని అనుసరించిందామె.
బస్స్టాప్ దగ్గర కారాపి ఆమె మీద గౌరవంతో డోరు తెరిచాడతను. ఆమె దిగింది.
“ చాలా థాంక్సండీ ” డోరు వేస్తూ పలికిందామె.
“ అవును ఇంతకీ మీ పేరు చెప్పారు కాదు ” కారు కిటికీ లోంచి వంగి అడిగాడు.
“ అవును కదూ ! పేర్లు కూడా తెలుసుకొని పరిచయం. నా పేరు నీలోత్పల. కొద్దిగా నోరు తిరగడం కష్టం. మా నాన్న తెలుగు పండితులు, నేను నల్లనిదాన్ని ” నవ్వుతూ చెప్పింది.
“ నా పేరు సతీష్ ” అడక్కుండానే చెబుతూ “ వస్తాను. బై ! ” అంటూ ‘ నీలోత్పల ’ అని రెండు మూడుసార్లు తనలోనే తను అనుకొన్నాడు. చక్కని పేరు, అరుదైన పేరు అనుకొంటూ కారు స్టార్టు చేశాడు. తరువాత వారం రోజుల్లో సతీష్ ప్రాజెక్టు పనిమీద అమెరికా వెళ్లిపోయాడు. అయిదు నెలల తర్వాత తిరిగి వచ్చాడు. ఈ లోపల భావన రిసర్చ్ అయిపోయింది.
పెళ్లి నాలుగురోజులుంది. ఇద్దరూ కలిసి విజయవాడ వెళ్ళాలి. తరువాత ఇద్దరు తల్లిదండ్రులు. బంధువులతో కలిసి తిరుపతి ప్రయాణం. సతీష్ తండ్రిగారు నెలరోజుల క్రిందటే అన్నీ ఏర్పాట్లు చేసి వుంచారు. ఆరోజు సాయంకాలం లాస్ట్ మినిట్ షాపింగ్ ముగించి హోటల్ లో కాఫీ తాగి సతీష్, భావన – ఆమె ఇద్దరు స్నేహితురాళ్లతో బయిటకి వచ్చారు. సతీష్ ముందుగా కారు దగ్గరకి నడిచాడు. ఇంతలో వెనుకనుంచి ‘ హలో ! బావున్నారా ? ” అంటూ ఎవరో అడుగుతున్నారు. బాగ్ లు కారులో పెట్టి వెనక్కి తిరిగాడు సతీష్. నీలోత్పల ఎదురుగా కనిపించింది.
“ బీచ్ కి రావడం లేదా ? ఊళ్ళో లేరా ? ” అతన్ని చూసిన ఆనందంలో గుక్క తిప్పకుండా ప్రశ్నల వర్షం కురిపించింది.
సతీష్ ఆమెను చూసిన సంభ్రమాశ్చర్యాల నుంచి తేరుకోకముందే, జవాబు చెప్పే లోపునే “ ఎవరీవిడ ? నీకెలా తెలుసు ? నీ స్నేహితులు, పరిచయస్తులు అందరూ నాకు తెలుసునే ! ” అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన భావన నీలోత్పలను ఎగాదిగా చూడసాగింది.
“ సతీష్ కి ఇలాంటి స్నేహితులు కూడా వున్నారా ? మనకు తెలియదే ? ” అంటూ భావన పక్కనే వున్న ఆమె స్నేహితురాళ్ళు పక పకా నవ్వసాగారు. సతీష్ కి ఏం చెయ్యాలో తెలియక రాయిలా బిగుసుకుపోయాడు. ఏదో చెప్పాలని నోరు తెరిచాడు. ఇంతలో భావన “ ఆ అమ్మాయికి ఏదైనా సహాయం కావలేమో ? ఏదో కొద్దిగా చేతిలో పెట్టి పంపించు. లేకపోతే ఎవర్నో చూసి ఇంకెవరో అనుకొంటున్న బాపతేమో ! ” – ఇంకా ఏదో అనే లోపలే నీలోత్పల కళ్ళెత్తి సతీష్ వంక చూచింది. అవమానంతో ఆమె గుండెల్లో రగిలిన బాధ అగ్నికణాలుగా ఆమె కళ్ళల్లో ప్రతిఫలిచింది. అగ్ని ఆర్పడానికన్నట్లు రెప్పల్లో నీరు ఉబికి ఉబికి రాసాగింది. ఆ ప్రవాహం బయటికి రాకుండా పెదవులు బిగించి గిరుక్కున వెనక్కి తిరిగిందామె. నెమ్మదిగా ఏదో బరువు మోస్తున్నట్లు అడుగులో అడుగు వేసుకొంటూ జనంలో కలిసిపోయింది.
“ ఎవరో ఎలాంటివారో మనకేం తెలుసు ? సరేలే పద ! ” అంటూ కారెక్కింది భావన. సతీష్ కలలో వున్నట్లు కారు స్టార్ట్ చేశాడు.
ఇక విజయవాడ బయలుదేరాలి. ఆరోజు సాయంత్రం సతీష్ తన పెళ్లి కార్డు తీసుకొని బీచ్ కి వెళ్ళాడు. అక్కడ నీలోత్పలకి కార్డు ఇచ్చి క్షమాపణ చెప్పాలని.
భావన గురించి, ఆమె ఎంత మంచిదో కూడా కూడా చెప్పాలని ఆమెను గురించి చెడ్డ అభిప్రాయం కలిగితే అది పోగొట్టాలని అనుకొన్నాడు. అతను బీచికి వెళ్ళేసరికి ఆమె అక్కడ లేదు. ఇంకా రాలేదేమోలే కాసేపయ్యాక రావచ్చు అనుకొంటూ చాలా చీకటి పడేవరకు వేచి చూశాడు. అయినా ఆమె రాలేదు. నిరాశతో తిరిగి వెళ్లిపోయాడు.
పెళ్లి హడావిడి తర్వాత హానీమూన్. నెలరోజుల తరువాత తిరిగి వైజాగ్ వచ్చారు సతీష్, భావన. ఇల్లు ముందుగానే తీసుకుని కావలసినవన్నీ సర్దిపెట్టుకొన్నారు. హాయిగా కుటుంబ జీవనంలో కొద్దిగా స్థిరపడిపోయారు. సతీష్ కి ఏ లోటూ లేదు. భావన మంచి పిల్ల. సతీష్ ని ప్రాణంగా ప్రేమించింది. అన్ని విషయాలలోనూ మంచి నేర్పరితనం, సామర్థ్యం కలది. అతనికి కావలసిన ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ తీసుకొంటుంది. అతని సంతోషం తన జీవిత పరమావధిగా భావిస్తుంది. ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలూ ఒక్కటిగానే వుంటాయి. ఒకరోజు ఒక్క క్షణంగా నిశ్చింతగా గడిచిపోతున్నది. అయినా సతీష్ మనసులో ఏదో చెప్పలేని లోటు. ఒక పక్కన ముల్లులా బాధిస్తూ వుంటుంది. ఆరునెలలు గడిచాయి. ఈ ఆరునెలల్లో అతను చాలాసార్లు బీచికి వెళ్ళాడు. భావనతో కలిసి వెళ్ళాడు. కొన్నిసార్లు ఒక్కడే వెళ్ళాడు. అక్కడ నీలోత్పల కోసం నిరీక్షించాడు. ఆమె కలిస్తే భావనను పరిచయం చేసి ఆరోజు జరిగిన దానికి క్షమాపణ అడగాలనుకొన్నాడు. భావనకు ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్లు చెప్పాలనుకొన్నాడు. ఒకరోజు సాయంకాలం తను నీలోత్పలను పరిచయం చేసుకొన్న విషయం ఆమెకు వివరంగా చెప్పాలనుకొన్నాడు. కానీ ఆ కోరిక తీరకుండానే అతను ట్రాన్సఫర్ మీద బాంబె వెళ్లిపోయాడు.
అయిదు సంవత్సరాలు గడిచి పోయినాయి. ఈ అయిదారు సంవత్సరాలలోనూ అతను కంపెనీ పని మీద వైజాగ్ వస్తూనే వున్నాడు. వచ్చినప్పుడల్లా బీచికి తప్పకుండా వెడతాడు. అక్కడ అతని కళ్ళు నీలోత్పల కోసం ఆశగా వెతుకుతాయి. చీకటి పడేవరకు ఎదురు చూస్తాడు. ఆమె రాదు. నీలోత్పల విషయం భావన కి చెప్పాలని చాలాసార్లు అనుకొన్నా ఎందుకో చెప్పలేకపోయాడు.
కానీ తను మాత్రం సమయం దొరికినప్పుడల్లా బీచికి వెడతాడు. తన జీవితంలో అనూహ్యంగా గడిచిన ఆ సాయంకాలం, విచిత్రంగా ఒక అమ్మాయితో పరిచయం, ఆ అమ్మాయి అరుదైన పేరు గుర్తు తెచ్చుకోంటూ అమెకోసం అటు ఇటు చూస్తాడు. ‘ నీలోత్పలా ! ఒక్కసారి కనిపించు, నన్ను క్షమించు ’ అనుకొంటాడు. ఆమె రాదు. నిరాశా నిస్పృహలతో తిరుగు ముఖం పడతాడు. అతని కి సముద్రం ఇప్పుడు అందంగా కనిపించడం లేదు.
*********************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page