13_002 సాక్షాత్కారము 05

 

తే. గీ.     కలికిచూపుల చూపులు కలిపి కలిపి

            కులుకు లొలికెడు గొంతును గొంతు కలిపి

            కన్ను లరమోడ్చి అమితసుఖమ్ము లందు

            రమణితో కూడి అదిర ! పారావతమ్ము !

 

తే. గీ.     అబల ఒక్కింత కనుమఱు గయ్యెనేని

            ఆమగపులుంగు విలవిల లాడిపోవు ;

            రమణు డిలు చేరు టించు కాలస్య మైన

            తెరవ ఒడ లెల్ల కన్ను లై దిక్కు లరయు !

 

తే. గీ.     చూచు ప్రేయసిన్ మఱిమఱి చూచు విభుడు

            అమలినప్రేమ తొణకిసలాడుచుండ :

            ఆకపోతియు తనమనోహరునిరూపు

            తమకమున రెండుకన్నుల త్రాగివైచు !  

 

తే. గీ.     ఏమహాశక్తి త న్నావహించెనొ ? యన

            తరుణిపై పతి ప్రేమగీతాలు పాడు :

            అంత నెద పొంగి మగతోడు నరసియరసి

            కూర్మి గట్టిగా వాటేసికొను కపోతి !

 

తే. గీ.     సతియొడలిపైన పతి నఖక్షతము లుంచి

            చిలిపిచిలిపిగ నేమేమొ పలుకుచుండ

            “ గాలి వినునేమొ ? నాకు సి గ్గౌను బాబు !

            పలుక ” కని చెలి ముక్కుతో కలుపు ముక్కు !

 

తే. గీ.     రతుల బడలినతనకూర్మిపతిని గాంచి

            తా నమాంతము లంఘించి తమక మలర

            సతియు కసి తీర పేట్రేగి పతిని పొదివి

            కౌగలించును మఱిమఱి కౌగలించు.

 

తే. గీ.     ఎంతరాతిరి యైనదో – యెంతప్రొద్దు

            గడచిపోయేనొ యెఱుగ కేకాంతమందు

            ఆకపోతమిధునము బి ట్టగ్గలించు

            చివురువిల్కావియరదంపుచిలుక లనగ

 

తే. గీ.     ఆప్రణయబంధమందు తా నంతవఱకు

            నలిగి ఉక్కిరిబిక్కి రైనది మరత్తు !

            ఒడలు వేడెక్కి యిక అక్క డుండలేక

            ౘల్లగా జాఱుకొన్న దాౘల్లగాలి !

 

తే. గీ.     చెట్టులకు పుట్టలకు వానిచిలిపిచేష్ఠ

            లెల్ల చెవిలోన నూది తా నెట్టులొ అయి

            విరహబాధాతిరేకాన పొరలసాగె

            పవన మప్పుడు పూవులపాన్పుపైన !

 

తరువాయి వచ్చే సంచికలో…..

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page