13_003 ఆనందవిహారి

 

చెన్నైకి చెందిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, ప్రతి నెలా నిర్వహిస్తున్న ‘ నెల నెలా వెన్నెల ‘ 40వ కార్యక్రమం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. తెలుగు శ్రవ్య నాటక రత్నాలలో బహుళ ప్రచారంలో ఉన్న కొన్ని నాటకాల నుంచి కొన్ని ఘట్టాలను ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారుడు ఎస్. వి. సుబ్బారావు మిమిక్రీ ద్వారా వినిపించి అచ్చెరువొందించారు. సెప్టెంబర్ 16వ తేదీ శనివారం అంతర్జాలం ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో ముందుగా సుబ్బారావు మాట్లాడుతూ… “స్వరవంచని” అని కూడా పేరున్న ఈ కళకు మూలాలు పురాణకాలంలోనే ఉన్నాయని వెల్లడించారు. రామాయణంలో మారీచుడు రాముని గొంతును అనుకరిస్తూ ‘హా సీతా ! హా లక్ష్మణా !’ అంటూ ఆర్తనాదాలు చేసి సీతాపహరణానికి కారణం అయ్యాడని పేర్కొన్నాడు. ద్వాపర యుగంలో ‘కీచక వధ’ వృత్తాంతంలో భీముడు నర్తనశాలలో వేచి ఉండి, కీచకుడు రాగానే సైరంధ్రిగా ఉన్న ద్రౌపది గొంతును అనుకరిస్తాడని గుర్తు చేశారు. 

ఏ కాలంలోనైనా అమ్మానాన్నలు పిల్లలతో, పిల్లి, కుక్క వంటి రకరకాల జంతువుల గొంతులను, రైలు, కారు వంటి ఇతర శబ్దాలను వినిపిస్తారని అన్నారు. అంటే ప్రతి మనిషిలోను అంతర్లీనంగా ఒక మిమిక్రీ కళాకారుడుంటాడని,అవసరాన్ని బట్టి బయిటకు వస్తూ ఉంటాడని వ్యాఖ్యానించారు. అయితే, కొందరు మాత్రం సాధన చేసి పరిపూర్ణమైన కళాకారులుగా రూపుదిద్దుకుంటారని చెప్పారు.

ఈ కళను ఒక ప్రదర్శనగా తెలుగునాట పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి స్థిరపరిచిన వారిలో అగ్రతాంబూలం ఇవ్వవలసినది, ఎన్నెన్నో ప్రయోగాలు చేసి ఎందరికో మార్గదర్శకులైన ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ళ వేణుమాధవ్ అని గుర్తు చేశారు. 

అనంతరం చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన హాస్య నవల ఆధారంగా రూపొందించిన రేడియో నాటకం ‘గణపతి’లోని ఘట్టాలను కళ్ళకు కట్టారు. అలాగే మహాకవి గురజాడ అప్పారావు రచించిన ‘కన్యాశుల్కం’, కాళ్లకూరి నారాయణరావు ‘వరవిక్రయం ‘, సినీనటుడు నాగభూషణం నాటక రంగంలో ఉండగా ఆయన ప్రఖ్యాతికి కారణమైన ‘ ‘రక్త కన్నీరు ‘ నాటకాల ఘట్టాలను అద్భుతంగా వినిపించారు. ఆధునిక నాటక రచయిత మల్లాది విశ్వనాథ కవిరాజు రచన ‘ నాటికి నేడు ’తో కార్యక్రమాన్ని ముగించారు. 

ప్రముఖ తెలుగు సినీ రచయిత టి. సోమేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం పలికి కళాకారుడిని పరిచయం చేశారు.

ఈ కార్యక్రమం వీడియో…..

 

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

 

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page